
గణేశ్ నవరాత్రి ఉత్సవాలంటే పెద్ద సంబురమే. మారుమూల పల్లె మొదలుకుని పట్నం దాకా వేడుకలు అంబరాన్నంటుతాయి. అయితే, విగ్రహాల ఏర్పాటు మొదలుకొని నవరాత్రుల పాటు పూజలు, నిమజ్జన శోభాయాత్ర వరకు అపశృతులు దొర్లకుండా వీలైనంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది.. సప్త సూత్రాలను పాటిస్తూ అవగాహనతో ముందుకెళ్తే పండుగ ప్రశాంతతతో పాటు నవరాత్రి ఉత్సవాలు ఉత్సాహంగా జరుపుకోవచ్చు.
ఆచరణ
పర్యావరణానికి ఎలాంటి హాని కలుగకండా పండుగను ఎలా చేసుకోవాలో భావి తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇందు కోసం నేటి తరం ఆ సంప్రదాయాలు ఆచరించేలా, పర్యావరణ హితంగా ఉత్సవాలు నిర్వహిస్తే ఉత్తమ ఫలితాలు ఉంటాయి. వేడుకల నిర్వహణే కాదు… ప్రకృతికీ గౌరవమివ్వాలని తెలియజేయాలి.
విగ్రహ పరిమాణం
పెద్ద విగ్రహాలైతే ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి. భారీ కాయం ఉంటుంది కాబట్టి నిమజ్జనానికి తీసుకెళ్లే సమయంలో అవస్థలు ఎదురవుతాయి. విద్యుత్, ఇతర తీగలు తగలడమే గాకుండాగల్లీల్లో తీసుకెళ్లడం సాధ్యం కాదు. పైగా నిమజ్జనం సమయంలో వాటి బరువుకు ఎవరైనా అదుపు తప్పి నీటిలో, లేదా విగ్రహం కింద పడిపోయే ప్రమాదముంది. పైగా భారీ విగ్రహాలు కరగాలంటే నెలలు పడుతుంది. అందుకే పరిమితి సైజు విగ్రహాలు ఏర్పాటు చేస్తే మేలు.
పర్యావరణ హితం
రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్, ప్లాస్టిక్, ధర్మాకోల్ వంటి హానికర రసాయనిక పదార్థాలతో తయారు చేసిన విగ్రహాలు వాడకపోవడమే మంచిది. సహజంగా నీటిలో త్వరగా కలిసిపోయే సామగ్రితో రూపొందించిన విగ్రహాలను ఎంచుకోవాలి. వీటిని నీటిలో నిమజ్జనం చేసినప్పుడు నీరు, పరిసర ప్రాంతాలు కలుషితం కావు. మట్టి, పీచు, సహజ సిద్ధ రంగులతో తయారైన విగ్రహాలు పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించవు.
విద్యుత్ పొదుపు
అత్యంత ఆర్భాటంగా మండపాలను అలంకరించేందుకు విద్యుత్ బల్బులను వాడుతుంటారు. గంటల తరబడి సౌండ్ బాక్స్‌లు మోగిస్తుంటారు. రాత్రివేళలో కాకుండా తెల్లవార్లు విద్యుత్ దీపాలు వెలిగిస్తారు. ఇలా చేయడం వల్ల ఎంతో విలువైన విద్యుత్ వృథా అవుతుందనే విషయాన్ని గమనించి సాధ్యమైనంత వరకు వాడకాన్ని తగ్గించాలి.
ప్లాస్టిక్ నియంత్రణ
ప్లాస్టిక్ సంచుల్లో పూజా సామగ్రిని మండపాలకు తెచ్చిన తర్వాత ఆ హడావిడిలో చెల్లాచెదురుగా పడేస్తారు. దీంతో పర్యావరణ కాలుష్యం జరుగుతుంది. దీని గురించి ఎవరూ అంతగా ఆలోచించరు. అందుకే పర్యావరణానికి హాని చేయనటువంటి పేపర్, వస్త్రం, నారతో చేసిన సంచులను ఉపయోగించాలి. పూజ కోసం నవరాత్రి ఉత్సవాల్లో ఉపయోగించిన పూజలు, ఆకులు ఎండిన తర్వాత కాగితపు సంచుల్లో నుంచి పారవేస్తే మంచిది. ప్లాస్టిక్ సంచులైతే మట్టిలో కలవక పర్యావరణానికి హాని చేస్తాయి. అంతేగాకుండా ప్రసాదాల వినియోగానికి ప్లాస్టిక్ కప్పులు, ప్లేట్లకు బదులుగా అరటి, మోదుగు ఆకులు, మట్టి పాత్రలు ఉపయోగిస్తే మంచిది.
పరిమిత సంఖ్యలో మండపాలు
25ఏండ్ల కిందట ఊరికి ఒక విగ్రహాన్ని మాత్రమే పెట్టేవారు. పెద్ద ఊర్లయితే 2లేదా 3 విగ్రహాలు ఉండేవి. కానీ ఇప్పుడు గ్రామాలతో పాటు పట్టణాల్లో గల్లీ, గల్లీకి పదుల సంఖ్యలో విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో వాటి ఏర్పాటుకై ఇష్టారీతిగా మండపాలను వేయడంతో పాటు పోటీ పడి మైక్‌లు, సౌండ్‌బాక్స్‌లు ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల స్థలం తగ్గి ఆ బజార్లు ఇరుగ్గా తయారవడంతో శబ్ద కాలుష్యం నెలకొంటుంది. కొన్ని సందర్భాల్లో గల్లీలో ప్రజలు వెళ్లలేక ఇబ్బందులు పడటంతో స్వల్ప అల్లర్లు సైతం జరిగే అవకాశం ఉంది. మున్సిపల్ అధికారులు, వార్డు ప్రతినిధులతో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు మండపాల సంఖ్యను నియంత్రించడంలో భాగస్వామ్యమైతే బాగుంటుంది.
సంప్రదాయబద్ధంగా శోభాయాత్ర
నవరాత్రి ఉత్సవాల అనంతరం గణపతిని నిమజ్జనం చేయడం ఆనవాయితీ. నిమజ్జన శోభాయాత్ర అంటేనే ఎంతో హంగూ, ఆర్భాటాలుంటాయి. 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో గణపతిని పూజించి నిమజ్జనోత్సవానికి బ్యాండు బాజాలు, డీజేలు, డప్పు చప్పుళ్ల మధ్య డ్యాన్స్ చేస్తూ తీసుకెళ్తారు. ఈ క్రమంలో కొంత మంది ఆకతాయిలు సమస్యలు సృష్టిస్తుంటారు. ఇలాంటి వాటికి స్వస్తి పలికి సంప్రదాయబద్ధంగా నిమజ్జనానికి తరలించే ఏర్పాట్లు చేసుకోవాలి. ఏవైనా సమస్యలు వస్తే పోలీసులను సంప్రదించాలి.