ఆలేరు టౌన్ , మార్చి 10: ‘ రాష్ట్రంలో ప్రజాపాలన కాదు. సీఎం రేవంత్‌రెడ్డి బుల్డోజర్ పాలన కొనసాగిస్తున్నారు’ అని డీసీసీబీ మాజీ చైర్మన్, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆలేరు పట్టణ కేంద్రంలోని ఏజీఎస్ ఫంక్షన్ హాల్లో ్ల ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంగళవారం ఆయన మాట్లాడారు. ‘రాష్ట్ర ప్రభుత్వం జీవోను 22 అక్టోబర్ 2025న తీసుకొచ్చి సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల ముందు దాచిపెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వ దొంగ నాటకాలు ఆడింది’ అని మండిపడ్డారు. ఇదే జాబితాను కాంగ్రెస్ ప్రభుత్వ ఎన్నికల ముందు విడుదల చేయకుండా అటు అధికారులు, ఇటు కాంగ్రెస్ నాయకులు డ్రామాలు ఆడారని ఆరోపించారు. అదే ఎన్నికల ముందు విడుదల చేస్తే సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో ఘెర పరాభవం చవిచూసేవారని విమర్శించారు.
ఆలేరు మండలంలో 839 మంది రైతుల భూములు నిషేధిత జాబితాలో పెట్టడమే కాకుండా ఆలేరు పట్టణంలో 547 ఇండ్లను నిషేధిత జాబితాతో పెట్టడంపై ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలేరు నియోజకవర్గంలో సుమారు 7 వేల ఇండ్లు , వేల ఎకరాల్లో రైతుల భూములను, 5 వేల మంది రైతుల భూములను నిషేధిత జాబితాలో పెట్టడంతో ప్రజలు కాంగ్రెస్ పాలనను చూసి అసహించుకుంటున్నారని విమర్శించారు. మొన్న యాదగిరిగుట్టలో కాంగ్రెస్ నాయకుడు బాల్‌రెడ్డి మాట్లాడుతూ ‘ మేం లోను తీసుకోవాలి. మా బిడ్డ పెండ్లి ఎలా చేయాలి’ అని సోషల్ మీడియా ముఖంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. గుట్టలో మార్నింగ్ వాక్ అంటూ బీర్ల అయిలయ్య అందరిని కలిసి మీది గుంట భూమి పోనియ్మ అని చెప్పడం కాదు.. అయిలయ్యకు దమ్మూ, ధైర్యం ఉంటే నిషేధిత జాబితా నుంచి వాటిని తొలగించాలని సవాల్ విసిరారు.
వందల సంవత్సరాలను నుంచి ఉంటున్న ఇండ్లను, భూములను నిషేధిత జాబితాలో పెట్టడం రేవంత్‌రెడ్డి నీ అయ్యా జాగీరా.. భూమిని ఆక్రమించారా అని ప్రశ్నించారు. గుట్టలో, ఆలేరులో బుల్డోజర్ దింపితే ప్రజలు గునపాలు అందుకొని కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఐదు, ఆరుగురి చేతులు మారిన భూములు, ఇండ్లను నిషేధిత జాబితాలో పెట్టే హక్కు రేవంత్‌రెడ్డికి ఎవ్వరిచ్చారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేకు దమ్ముంటే శాసన సభలో సీఎంతో మాట్లాడి నిషేధిత జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. నిషేధిత జాబితా నుంచి తొలగించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బాధితులతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ వస్పరి శంకరయ్య, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేశంగౌడ్, పట్టణ మాజీ అధ్యక్షులు మొరిగాడి వెంకటేశ్వర్లు , సీనియర్ నాయకులు ఆడెపు బాలస్వామి, కౌన్సిలర్లు పాకాల మౌనికహరీశ్, బీజన కళ్యాణిమధు, యాట శివకుమార్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.