సూర్యాపేట : పద్మశాలి కుల సంఘం ఎన్నికలపై వాట్సాప్‌లో పెట్టిన మెసేజ్‌కు స్పందించిన వివాదం ఒక వ్యక్తి దారుణ హత్యకు దారి తీసింది. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యాపేట పట్టణానికి చెందిన మానుపురి కృపాకర్ (48) చెప్పుల వ్యాపారం నిర్వహిస్తుంటారు. వచ్చే నెల 3 తేదీన నిర్వహించ నున్న పద్మశాలి కుల సంఘ ఎన్నికలకు సంబంధించి ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పం శ్రీనివాస్ తన కుల సంఘానికి సంబంధించి వాట్సప్ గ్రూపులో ఓ మెసేజ్ పెట్టగా దానికి కృపాకర్ క్లాప్స్ కొడుతూ ఎమోజి పెట్టారు.
దీన్ని జీర్ణించుకోలేని అదే కులానికి చెందిన మరో వర్గం నాయకుడు శ్రీరాముల రాములు నువ్వు అలా ఎందుకు స్పందించావంటూ సోమవారం రాత్రి కృపాకర్ కి ఫోన్ చేసి బండ బూతులు తిట్టి చంపుతానని బెదిరించారు. ఈ విషయంపై తమ కుల పెద్దలకు ఫోన్ లోనే ఫిర్యాదు చేశాడు. అదేవిధంగా కుల సంఘం ఎన్నికల ఇంచార్జికి, కుల పెద్దల సమక్షంలో సమస్యను పరిష్కరించు కునేందుకు మంగళవారం ఉదయం కుల సంఘ భవనానికి వెళ్లాడు.
అప్పటికే పద్మశాలి భవనం వద్ద ఉన్న శ్రీరాముల రాములు అతని కుమారుడు ధనుంజయ్ లతో పాటు మరో నలుగురు వ్యక్తులు కృపాకర్ పై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన కృపాకర్‌ను సూర్యాపేట ఏరియా హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆయన ప్రాణాలు కోల్పోయారు. మృతునికి భార్య విజయలక్ష్మి కూతురు అమూల్య, కుమారుడు అజయ్ ఉన్నారు. కాగా, నిందితులను కఠినంగా శిక్షించాలి అని అప్పం శ్రీనివాస్ డిమాండ్ చేశారు.