సూర్యాపేట, మార్చి 20 (నమస్తే తెలంగాణ) :‘సూర్యాపేటలో కార్యకర్తల సమావేశానికి వస్తే ర్యాలీలో ఎక్కడికక్కడ ప్రజలు బారులుదీరి… ఎన్నికల రోడ్‌షో మాదిరిగా చేతులు ఊపుతూ.. మళ్లీ మీరే వస్తారు.. తప్పకుండా గెలువాలి అని ఆశీర్వదించారు. 15 నెలలు తిరుగకుండానే ఈ పరిస్థితి వచ్చిందంటే అది కార్యకర్తల పోరాట పటిమ. ప్రతి తెలంగాణ బిడ్డ గుండె ధైర్యం గులాబీ జెండా. రేపు స్థానిక సంస్థలు కావచ్చు.. ఉప ఎన్నికలు కావచ్చు.. రాబోయే శాసనసభ ఎన్నికలు కావచ్చు.. అన్నింటిలోనూ తిరిగి గులాబీ జెండా ఎగురాలి అంటే ప్రతీ కార్యకర్త ఒక కేసీఆర్‌లాగా కథనాయకులై ఉద్యమించాలి.
ప్రజా ప్రయోజనాల కోసం గొంతెత్తుతున్న ఏకైక పార్టీగా రజతోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్న వేళ వచ్చే నెల 27న వరంగల్‌లో నిర్వహించే బహిరంగ సభకు ప్రతి గ్రామం నుంచి ప్రతి గులాబీ సైనికుడి భాగస్వామ్యం ఉండాలి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నిజామ్నే ఉరికించిన చైతన్యవంతమైన గడ్డ సూర్యాపేట. నాడు బండి యాదగిరి పాట రాసినట్టు.. బండెనక బండి కట్టి బయల్దేరాలి. గులాబీ జెండా చేతబట్టి కాంగ్రెస్, బీజేపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా కదం తొక్కాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ పార్టీ 25 వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా రజతోత్సవాల ప్రారంభ సూచికగా వరంగల్‌లో నిర్వహించ తలపెట్టిన సభ సక్సెస్ కోసం సూర్యాపేటలో ఆ పార్టీ జిల్లా స్థాయి ముఖ్య నాయకులతో గురువారం ఏర్పాటుచేసిన సన్నాహక సమావేశానికి మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డితో కలిసి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ‘ఉమ్మడి నల్లగొండ జిల్లాను చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కేసీఆర్ బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు. టెయిలెండ్ గ్రామాలకు నీళ్లు రాకపోతుంటే కాళేశ్వరం కట్టి కోదాడ చివరి మడి వరకు గోదావరి జలాలను తెచ్చి రెండున్నర లక్షల ఎకరాలకు రెండు పంటలకు నీళ్లు ఇచ్చారు.
ఒక్క మెడికల్ కళాశాల లేని నల్లగొండకు మూడు మెడికల్ కళాశాలలు ఇచ్చారు. తెలంగాణలోనే ఎక్కడా లేనివిధంగా దామరచర్లలో అద్భుతమైన విద్యుత్ కేంద్రం కట్టారు. ఆలేరు, భువనగిరిలో ధార్మిక క్షేత్రమైన యాదాద్రిని అద్భుతంగా తీర్చిదిద్దారు’ అని గుర్తుచేశారు. అయినా గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ పని అయిపోయిందని.. పార్టీ మూత పడుతదని ఎందరో మాట్లాడారని, కానీ ఫీనిక్స్ పక్షిగా బీఆర్ఎస్ పార్టీ పోరాట పటిమతో తిరిగి నిలబడిందని తెలిపారు. అందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పని చేస్తున్నారని అభినందించారు. హామీలు అమలు చేయకపోవడం, నీళ్లు ఇవ్వకుండా పంటలు ఎండ బెట్టడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై జనంతో కలిసి తిరుగబడుతున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమంలోనూ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొందని, అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా ప్రజల మేలు కోసం పోరాటం చేస్తుందని చెప్పారు. నాడు జై తెలంగాణ అంటేనే అసహ్యంగా చూసి, అవహేళన చేశారని.. జగదీశ్‌రెడ్డి వంటి ఉమ్మడి నల్లగొండ జిల్లా మిత్రులు కొందరిని కలుపుకొని కేసీఆర్ ఉద్యమ ప్రయాణం ప్రారంభించారని గుర్తు చేశారు.
నాడు వచ్చిననీళ్లు ఇప్పుడెందుకు రావు
బీఆర్ఎస్ హయాంలో సూర్యాపేట జిల్లాకు వచ్చిన జలాలు కాళేశ్వరం కాదు శ్రీరాంసాగర్ నుంచి అని ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రులు వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారని, మరి ఇవ్వాల ఎందుకు రావట్లేదని కేటీఆర్ ప్రశ్నించారు. కేవలం కేసీఆర్ ఆనవాళ్లను ప్రజలు మర్చిపోవాలని ఒక పిల్లర్‌ను రిపేరు చేయకుండా కుట్ర పన్నారని మండిపడ్డారు. యాసంగిలో సాగు నీళ్లు ఇవ్వకుండా సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడలో పంటలు ఎండబెడుతున్నారని, ఆ పాపం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఈ జిల్లాకు చెందిన మంత్రులదేనని అన్నారు. కేసీఆర్ ఉన్పప్పుడు 36శాతం కృష్ణా నీళ్లను వాడుకున్నామని, ప్రస్తుతం 20శాతం కూడా వాడుకునే తెలివి లేక పొలాలను ఎండబెడుతున్నారని దుయ్యబట్టారు.
మన పార్టీ 25వ యేడులోకి అడుగు పెడుతున్న సందర్భంలో వరంగల్‌లో నిర్వహించే బహిరంగ సభకు ఏ వాహనం దొరికితే ఆ వాహనంలో రావాలని కార్యకర్తలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. సూర్యాపేట, కోదాడ, తుంగతుర్తి, హుజూర్నగర్ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. సమావేశంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు, బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, గాదరి కిశోర్ కుమార్, నల్లమోతు భాస్కర్‌రావు, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కంచర్ల భూపాల్‌రెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, నోముల భగత్‌కుమార్, తిప్పన విజయసింహారెడ్డి, బూడిద భిక్షమయ్యగౌడ్, బీఆర్ఎస్ హుజూర్నగర్ సమన్వయకర్త ఒంటెద్దు నర్సింహారెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్లు గుజ్జ దీపికాయుగేందర్‌రావు, ఎలిమినేటి సందీప్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర నేతలు సోమ భరత్‌కుమార్, కంచర్ల కృష్ణారెడ్డి, కంచర్ల రామకృష్ణారెడ్డి, డాక్టర్ చెరుకు సుధాకర్, మేడే రాజీవ్‌సాగర్, దూదిమెట్ల బాలరాజుయాదవ్, రాంచందర్‌నాయక్, అన్నపూర్ణ, చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, మారిపెద్ది శ్రీనివాస్, నిమ్మల శ్రీనివాస్ పాల్గొన్నారు.
జనరల్ స్థానంలో దళిత మహిళను
చైర్పర్సన్ చేసిన జగదీశ్‌రెడ్డి దళిత వ్యతిరేకా?
ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో అనని మాటను అన్నట్లు ఆపాదించి, రికార్డులను పరిశీలించకుండా, దళిత స్పీకర్‌ను అవమానపర్చారని నెపం మోసి ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని సెషన్స్ నుంచి సస్పెండ్ చేయడం పట్ల కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో 103 మున్సిపల్ కార్పొరేషన్లు ఉండగా జనరల్‌లో స్థానంలో దళిత మహిళను పెట్టిన చరిత్ర ఉందా..? అని అడిగారు. సూర్యాపేట జనరల్‌లో ఒక దళిత మహిళను పెట్టిన జగదీశ్‌రెడ్డి దళిత వ్యతిరేకా అని అన్నారు. జగదీశ్‌రెడ్డి అసెంబ్లీలో ఉంటే వారి బట్టలు ఊడిపోతాయనే కాంగ్రెస్ పాలకులు కుట్ర చేశారని దుయ్యబట్టారు. సూర్యాపేట ప్రజల స్పందన చూస్తుంటే నిజంగా జగదీశ్ అన్న అక్కడ లేకున్నా ఇక్కడనే ఉంటే బాగుంటుందన్నారు.
తెలంగాణ భవిష్యత్ ఆశా కిరణం కేటీఆర్
సూర్యాపేటకు కేటీఆర్ వస్తే బ్రాహ్మాండంగా భారీ ర్యాలీ జరిగింది. పులి కడుపున పులే పుడుతుందని, కేసీఆర్ తనయుడిగా కేటీఆర్ నిరూపించుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేటీఆర్ ఐటీ మంత్రి తెలంగాణకు పని చేశారా లేక భారతదేశానికి అనుకునే రీతిన ప్రపంచ దేశాల్లో పేరుప్రఖ్యాతులు సంపాదించారు. వేల కోట్ల తెచ్చి ఐటీకి వన్నె తెచ్చారు. తెలంగాణ భవిష్యత్ ఆశా కిరణం కేటీఆర్. కేసీఆర్ ఉద్యమం చేయకుంటే, బీఆర్ఎస్ పెట్టకుంటే సూర్యాపేట జిల్లా అయ్యేదా? జగదీశ్‌రెడ్డి సహకారంతో సూర్యాపేట జిల్లా కావడం మనందరి అదృష్టం. జిల్లా కాబట్టే ఇంటిగ్రేటెడ్ మార్కెట్, కలెక్టరేట్, మెడికల్ కళాశాల వచ్చింది. పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా ముందుకు తీసుకెళ్లే దమ్ము బీఆర్ఎస్ కార్యకర్తలకు ఉంది. అధికారంలో ఉన్నప్పటి కంటే ఇప్పుడు ప్రజలకు బీఆర్ఎస్ విలువ తెలిసింది. ప్రస్తుత రేవంత్ సర్కార్ అన్ని రంగాల్లో విఫలమైంది. ప్రజలంతా మళ్లీ కేసీఆర్ నాయకత్వం రావాలని కోరుకుంటుండ్రు. వరంగల్‌లో జరిగే సభకు వచ్చేందుకు కార్యకర్తలు, ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
– బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎంపీ,బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు
కేసీఆర్ ముమ్మాటికీ తెలంగాణ జాతిపితే
పార్టీ స్థాపించి 14 ఏండ్లు నిర్విరామంగా ఉద్యమాన్ని ముందుకు నడిపి, దేశంలోని అన్ని పార్టీలను ఒప్పించి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అంగీకార పత్రాలు తీసుకొని ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ రాష్ర్టాన్ని తెచ్చిన కేసీఆర్ తెలంగాణ జాతిపితే. హామీలను మరిచి, ప్రజలను మోసం చేయడంతో కాంగ్రెస్ నాయకులు జనంలోకి వచ్చేందుకు భయపడుతున్నారు. ఒకవేళ మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వస్తే జనమే గుడ్డలూడదీసి కొడుతారు. ఎవరైనా కేసీఆర్, బీఆర్ఎస్పై అడ్డగోలుగా మాట్లాడితే గర్జించాలి. ఈ నెల 27న వరంగల్‌లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తుంగతుర్తి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున జనం తరలిరావాలి. తెలంగాణ జాతిపిత నాయకత్వాన్ని కాపాడుకోవాలి. ఆ దిశగా మనమంతా ముందుకు సాగాలి. 2012లో సూర్యాపేట నుంచే సమరభేరితో ఒక ఉద్యమానికి కేసీఆర్ నాంది పలుకగా నేడు మరో ఉద్యమానికి నాంది పలుకుతున్నందున సభ సక్సెస్ కావడం ఖాయం. ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుట్టడం ఖాయం.
-గాదరి కిశోర్‌కుమార్, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే
బీఆర్ఎస్తోనే ప్రభుత్వం దిగివస్తుందంటున్న జనం
నమ్మి ఓటేసి మోసపోతున్న జనం కష్టాలు తీరాలంటే గొంతెత్తి మాట్లాడే కేటీఆర్ జనంలోకి రావాలని, ఆయన వేసే ప్రశ్నలకు ప్రభుత్వం దిగి వస్తుందని ప్రజలు నమ్ముతున్నారు. మీరు ఎండిన పొలాల్లోకి రావాలి మీకు రామబంటు సైన్యంగా మేమంతా ఉంటాం. కోదాడ, హుజూర్నగర్ ఈ రెండు నియోజకవర్గాలకు మాత్రమే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రస్తుతం మంత్రిగా వ్యవహరిస్తున్నాడు. కోదాడ, హుజూర్నగర్ దాటి ఏ నియోజకవర్గంలో అడుగు పెట్టడు. ఆయన రావాలంటే హెలికాప్టర్ రావాలి. ప్రజల కోసం పని చేస్తామని హామీ ఇచ్చిన ఈ నాయకుడి మెడలు వంచి పని చేయించాలని బీఆర్ఎస్ కోరుతుంది. తెలంగాణ సాధించిన పార్టీగా, ఉద్యమ నాయకుడిగా ప్రజల బంగారు భవిష్యత్తు కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పని చేసిన కేసీఆర్‌కు అండగా ఉంటాం. హనుమంతుడి సైన్యం కంటే అధికంగా రజతోత్సవ సభకు తరలివస్తాం.
– బొల్లం మల్లయ్యయాదవ్, కోదాడ మాజీ ఎమ్మెల్యే
జనం కోసం ఆలోచించే ఏకైక నాయకుడు కేసీఆర్
ఇతర రాజకీయ పార్టీల నాయకులు అధికారం కోసం ఎగబెడితే, కేసీఆర్ మాత్రమే జనం కోసం ఆలోచించే నాయకుడు. ఉన్న పదవులన్నీ చంద్రబాబుకు ఇచ్చి త్యాగాలపై పార్టీని ఏర్పాటు చేశారు. 2001 నుంచి నిరంతర ఉద్యమాలతో రాష్ర్టాన్ని సాధించి పదేండ్ల పాటు ప్రజలకు కావాల్సినవన్నీ చేశారు. మాయమాటలు, మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నిజస్వరూపం తెలిసి జనం ఇప్పుడు మదన పడుతున్నారు. ప్రజలంతా ఈ రాక్షస పాలనను చూస్తూ ఇంకా మూడేండ్లు భరించాలా అంటుండ్రు. జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నా జనానికి అందుబాటులో ఉండరు. మా మంత్రి రాత్రి తొమ్మిది దాటితే ఫోన్ ఎత్తడు, ఉదయం 6గంటలకు ఎత్తుతాడని అధికార పార్టీవారే చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి అందరికీ అర్థమైంది.
-ఒంటెద్దు నర్సింహారెడ్డి, బీఆర్ఎస్ హుజూర్నగర్ నియోజకవర్గ సమన్వయ కర్త