Bopparam : ఐకేపీ కేంద్రంలో తరుగు పేరుతో 25 క్వింటాళ్ల ధాన్యం కాజేశారని ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని, ఆపై ధాన్యం బస్తాలపై పెట్రోల్ పోసి నిప్పంటించుకునేందుకు యత్నించాడు. అతడిని గమనించిన రైతులు అప్రమత్తమై అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆత్మకూరు ఎస్ మండల పరిధిలోని బొప్పారం గ్రామంలో గురువారం ఈ సంఘటన జరిగింది.
బొప్పారం గ్రామానికి చెందిన బొల్ల శేఖర్ రెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రంలో 15రోజుల క్రితం 505 బస్తాల ధాన్యం అమ్మాడు. అయితే.. మిల్లర్లు, కొనుగోలు కేంద్ర నిర్వాహకులు తరుగు పేరుతో బస్తాకు ఐదు కేజీల చొప్పున.. 25 క్వింటాల ధాన్యం కాజేశారని శేఖర్ రెడ్డి ఆందోళన చెందాడు. ఆరుగాలం చెమటోడ్చి పండించిన పంటలో తరుగు పేరిట కోల్పోవాల్సి రావడంతో తట్టుకోలేకపోయాడు. తరుగు పేరుతో రైతులను మోసం చేస్తున్న నిర్వాహకులు తీరుపై ఆగ్రహించిన శేఖర్ రెడ్డి.. ఒంటిపై, ధాన్యం బస్తాలపై పెట్రోల్ పోసి నిప్పుంటించుకునేందుకు ప్రయత్నం చేశాడు. అతడిని గమనించిన రైతులు అడ్డుకొని సముదాయించారు.
బోళ్ల శేఖర్ రెడ్డి తనకున్న 20 ఎకరాల్లో వరి సాగు చేయగా మొదటి విడతగా 15 రోజుల క్రితం 505 బస్తాలను ఐకేపీ కేంద్రంలో విక్రయించాడు. కానీ, ధాన్యంలో తాలు ఉందన్న సాకుతో మిల్లర్లు, కొనుగోలు కేంద్ర నిర్వాహకులు తనకు 25 బస్తాల డబ్బులు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. 10 రోజులుగా మరో 600 బస్తాలకు పైగా అమ్మాలని చూసినా కాంటాలు వేయడం లేదని ఆందోళన చెందిన శేఖర్ రెడ్డి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్లు రైతులు తెలిపారు. బొప్పారం ధాన్యం కొనుగోలు కేంద్రంలో నిర్వాహకులు భారీగా అవకతవకలకు నిర్వాహకులు పాల్పడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.