Kodada : సబ్బండ వర్గాలను ఏకం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానేత కేసిఆర్‌ను, ఉద్యమ నేతలు హరీష్ రావు, కేటీఆర్‌లపై జగుప్సాకర వ్యాఖ్యలు చేసిన దగుల్బాజీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తక్షణమే భర్తరఫ్ చేయాల్సిందేనని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆదివారం కోదాడ బస్టాండ్ ఎదుట ప్రధాన రహదారిపై వందలాదిమంది బీ ఆర్ఎస్ కార్యకర్తలతో కలసి ఆయన మహాధర్నా నిర్వహించారు. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం.. దోపిడి రాజ్యం దొంగల రాజ్యం,, రేవంత్ హఠావో.. తెలంగాణ బచావో అంటూ పెద్ద పెట్టున పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు.
మహా ధర్నాలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ కేసీఆర్, హరీశ్ రావు, కేటీఆర్‌లను కోసి.. రక్తంతో పంటలను తడపాలని హేయంగా దుర్భాషలాడిన రేవంత్ రెడ్డి నాలుక కోసి కారం పెడితేనే పాప పరిహారం అవుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రం అన్ని రంగాలలో అధోగతిపాలై కుక్కలు చింపిన విస్తరిలా తయారైందని, ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చలేక ఈ దిగజారుడు వ్యాఖ్యలు ఏంటీ?అని ప్రశ్నించిన ప్రతి వర్గాన్ని వీధి రౌడీలా సీఎం రేవంత్ బెదిరిస్తున్నారని మల్లయ్య యాదవ్ ఘాటుగా విమర్శించారు.

వర్షాభావంతో సాగునీరు అందనీ పరిస్థితిలో అన్నదాతలు గగ్గోలు పెడుతుంటే.. కాళేశ్వరంలో నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ రైతులపై కక్షగట్టి సాగునీరు అందించని రేవంత్ రెడ్డిని సైకో ముఖ్యమంత్రి అని మాజీ ఎమ్మెల్యే అభివర్ణించారు. కరువు నేపథ్యంలో కాళేశ్వరం నుండి సాగునీరు విడుదల చేయవచ్చని విశ్రాంత ఇంజనీర్ల సంఘం స్పష్టం చేస్తే వారిని బొక్కలో వేయాలని, థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలని అవాకులు చవాకులు పేలుతున్న ముఖ్యమంత్రికి మతిభ్రమించిందని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పంటలకు ఎలా నీరందిస్తారు? అని ప్రశ్నించిన జర్నలిస్టులను కూడా రేవంత్ వదలలేదని బొల్లయ్య యాదవ్ తెలిపారు.రాష్ట్రంలో పోలీసుల ఇష్టారాజ్యం నడుస్తోందని, శాంతిభద్రతలు కరువయ్యాయని, ఇందుకు ముఖ్యమంత్రి బాధ్యులు అని బొల్లయ్య యాదవ్ అన్నారు.
నాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ రైతులకు సాగునీరు అందించి కోటి ఎకరాలను సస్యశ్యామలం చేస్తే.. నేడు రైతుల ద్రోహి రేవంత్ రెడ్డి కళ్ళెదుటే 9 టీఎంసీల నీటిని సముద్రం పాలు చేస్తున్నారని, ఇంతకన్నా దుర్మార్గం ఏమన్నా ఉంటుందా? అని ఆయన మండిపడ్డారు. ప్రతి సమావేశంలోనూ ఉద్యమ నేత పేరు తలవడమే కాకుండా.. ప్రజలను రెచ్చగొట్టడంతో పాటు, బీఆర్ఎస్ పార్టీ దిమ్మెలు కూల్చాలని నిర్దేశిస్తున్న ముఖ్యమంత్రిపై హత్యా నేరం మోపాలని మల్లయ్య యాదవ్ డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్న రేవంత్ పాలనపై అన్ని వర్గాల ప్రజలు విరక్తి చెంది ఎప్పుడు గద్దె దింపుదామా.. అని ఎదురుచూస్తున్నారని మాజీ ఎమ్మెల్యే వెల్లడించారు.

అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఉద్యమ నేత కేసిఆర్‌కు క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ – ఆంధ్ర సరిహద్దు కోదాడ నుండే ఉద్యమాన్ని షురూ చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ మహా ధర్నాలో మండల పట్టణ బాధ్యులు రమేష్ సుంకర అజయ్ కుమా, ప్రదీప్, శివాజీ, జానకి, రామాచారి, తాళ్లూరు శ్రీను, నర్సిరెడ్డి, ఆంజనేయులు, శీల సైదులు, ఏలూరు వెంకటేశ్వర్లు, యుగంధర్ రెడ్డి, అప్పారావు, ఎస్.కె నయీం, చీమ నరేష్, తుమ్మలపల్లి భాస్కర్, కరీముల్లా బాబా, అబ్బు, ఉపేందర్ గౌడ్, చలిగంటి వెంకట్, భాగ్యమ్మతో పాటు వందలాదిమంది బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.