Kattangur Market | కట్టంగూర్ : పేరుకు అది వార సంతే.. కానీ, అక్కడ దొరకని వస్తువంటూ ఉండదు. గుండుసూది నుంచి గునపాల వరకు.. పక్కపిన్ను నుంచి పాడి పశువుల దాకా.. అన్నీ సరసమైన ధరలకు లభిస్తాయి. ఈ సంతకు చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి సైతం ప్రజలు పెద్దఎత్తున వస్తుంటారు. వారానికి కావాల్సిన సరుకులు కొని తీసుకెళ్తుంటారు. అటు కొనుగోలుదారులు.. ఇటు వివిధ వస్తువుల విక్రేతలతో చిన్నపాటి జాతరను తలపిస్తుంది.
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న కట్టంగూర్ వారసంతకు ఆదరణ పెరుగుతూనే ఉంది. ఇక్కడ దొరకని వస్తువంటూ ఉండదు. తక్కువ ధరలతోపాటు నాణ్యతగా ఉండడంతో 70 ఏండ్లు దాటినా ఏ మాత్రం ఆదరణ తగ్గడం లేదు. 1950లో ఏర్పడిన ఈ సంతలో మొదట్లో చిన్న దుకాణాలు మాత్రమే ఉండేవని గ్రామ పెద్దల మాట. ఇప్పుడు రానురాను దుకాణాల సంఖ్య పెరుగడంతో సంత రూపురేఖలే మారిపోయాయి. వేలాది పశువులు, గొర్రెలు, మేకల క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. హైదరాబాద్‌తోపాటు వివిధ జిల్లా నుంచి చిరువ్యాపారులు తెచ్చిన వస్తువులు, పని ముట్లను విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నారు.
సంతలో పశువుల క్రయవిక్రయాలు అధిక మొత్తంలో జరుగుతాయి. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి దాదాపు 100 పైగా గ్రామాల నుంచి రైతులు పశువులు, గొర్రెలు, మేకల క్రయవిక్రయాల కోసం వస్తుంటారు. ముఖ్యంగా రైతులకు కావాల్సిన పనిముట్ల కోసం సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఒక్కరోజే 10 వేలకు పైగా పశువులు, గొర్రెలు, మేకల క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. కూరగాయల మార్కెట్ కూడా జోరుగా సాగుతుంది. పశువులు, కూరగాయల క్రయవిక్రయాల కోసం వేలాది మంది వస్తుంటారు. ఈ సంతతో కట్టంగూర్ గ్రామ పంచాయతీకి ఏటా రూ.40 లక్షల దాకా ఆదాయం సమకూరుతుంది.
వ్యాపారపరంగా కట్టంగూరు సంతకు మంచి ఆదరణ ఉంది. శనివారం ఒక్కరోజే రూ.కోటికి పైగా లావాదేవీలు జరుగుతాయి. పశువుల సంత, కూరగాయల మార్కెట్ జోరుగా నడుస్తాయి. చిరువ్యాపారులతోపాటు రోడ్లపై కూరగాయలు విక్రహించే వారే సంత రోజు ఐదు వేల వ్యాపారం చేస్తారు. ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు వేలాది మందితో కట్టంగూరు మండల కేంద్రం కిక్కిరిసిపోతుంది.
నాకు ఈ అంగడితో 10 ఏండ్ల అనుబంధం ఉంది. ప్రతి శనివారం సంతకు గొడ్డళ్లు, కత్తులు, ఇతర ఇనుప సామగ్రి తీసుకొచ్చి వ్యాపారం చేస్తున్నా. సంతకు అధిక శాతం మంది గ్రామాల నుంచి రావడంతో మా వ్యాపారం బాగా జరుగుతుంది. ఇక్కడ వచ్చిన ఆదాయంతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నా.
-రాజు, చిరువ్యాపారి, నార్కట్‌పల్లి
15 ఏండ్లుగా ప్రతి శనివారం కట్టంగూరు సంతకు వచ్చి బట్టలు అమ్ముతున్నా. మా అమ్మ కూడా ఇదే సంతలో 30 సంవత్సరాలుగా బట్టలు అమ్మేది. గ్రామీణ ప్రజలతోపాటు ఒడిశా వలస కూలీలు మా వద్ద ఎక్కువగా బట్టలు కొనుగోలు చేస్తుంటారు. మా లాంటి చిరువ్యాపారులకు ఈ అంగడి ఎంతో ఉపాధి కల్పిస్తుంది. ఇక్కడ చిరు వ్యాపారులకు షెడ్లు నిర్మిస్తే బాగుంటుంది.
-వాడపల్లి రాము, బట్టల వ్యాపారి, నకిరేకల్