Arvapalli Accident | అర్వపల్లి జనవరి 18 : శనివారం అర్వపల్లి మండల కేంద్రం NH -365బి హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఉపాధ్యాయురాలు మృతి చెందగా.. మరో ఇద్దరు ఉపాధ్యాయులు తీవ్రంగా, డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డారని తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో ప్రమాదానికి కారు డ్రైవర్ అతివేగం అజాగ్రత్త కారణమని పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రమాదతీరును పరిశీలిస్తే..
కారు ముందు భాగం ఎడమ వైపు టైరు పేలిపోయింది. దీనికి తోడు నకిరేకల్ – తానంచర్ల జాతీయ రహదారిపై జాజిరెడ్డిగూడెం నుండి తుంగతుర్తి, నకిరేకల్ వైపు సీసీ రోడ్డు కిరువైపులా దారి పొడవున ఇసుక పేరుకుపోయింది. నిత్యం వందలాది ట్రాక్టర్లు, లారీలలో ఈ రహదారి పైనుండే ఇసుక రవాణా జరుగుతుంది. ఇలా ఇసుక సరఫరా చేసే వాహనాల నుండి కొద్దికొద్దిగా ఇసుక కిందికి జారుతూ రోడ్డుపై పడిపోతుంటుంది. శనివారం జరిగిన కారు ప్రమాద స్థలంలో కూడ రోడ్డుపై ఇసుక పేరుకపోయింది. ఇసుకను ఎప్పటికప్పుడు తొలగించి ఉంటే ప్రమాదం జరగకపోయేదని.. ఇది కూడా ప్రమాదానికి ఒక కారణం కావోచ్చని ప్రయాణికుల మనసులో మాట.
గతంలో కూడా ఒక్కరిద్దరూ ఇసుక కారణంగా బైక్ పైనుండి జారి కింద పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. హైవే అధికారుల అలసత్వం నిర్వహణ సరిగా లేకపోవడంతో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఇసుక వ్యాపారం చేసి కొంతమంది ఇష్టానుసారంగా ట్రాక్టర్లలో ఓవర్ లోడ్ తో ఇసుకను సరఫరా చేస్తూ అతివేగంతో నిత్యం మండల కేంద్రం నుంచి నాలుగు వైపులా ట్రాక్టర్ డ్రైవర్లు అజాగ్రత్తతో ట్రాక్టర్ లను నడుపుతున్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజల నుండి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా వాహనాల వేగాన్ని తగ్గించడానికి సూచికలు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని హైవే సిబ్బంది, అధికారులు ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ఏది ఏమైనప్పటికీ డ్రైవర్ అతివేగమో, నిర్లక్ష్యమైన డ్రైవింగ్ కావొచ్చు. రోడ్డుపై పేరుకుపోయిన ఇసుకనైనా ప్రమాదానికి కారణం కావచ్చు కానీ నాలుగు కుటుంబాల్లో తీవ్రమైన విషాదాన్ని నింపింది. రెండు కుటుంబాల్లో ఇద్దరు వ్యక్తులను కోల్పోగా.. మరో రెండు కుటుంబాల్లో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలై మర్చిపోలేని సంఘటనగా వారి కుటుంబాల్లో మిగిలిపోయింది.
ఐదుగురు టీచర్లు కారులో వెళ్తుంటే..
సంక్రాంతి సెలవుల అనంతరం ఇవాళ పాఠశాలలు పున:ప్రారంభం కావడంతో నల్గొండ నుంచి ఐదుగురు ఉపాధ్యాయులు కారులో తుంగతుర్తిలోని స్కూల్‌కు బయల్దేరారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉండగా, ఇద్దరు పురుషులు ఉన్నారు. వీరు వెళ్తున్న కారు అరవపల్లి వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కస్తర్బా పాఠశాలలు ఎస్‌వోగా పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు కల్పన అక్కడికక్కడే దుర్మరణం చెందింది. రావులపల్లి హెడ్మాస్టర్గా పనిచేస్తున్న పోరెడ్డి గీతారెడ్డి, తుంగతుర్తి హెడ్మాస్టర్ అల్వాల ప్రవీణ్, అన్నారం హెడ్మాస్టర్ అల్వాల సునీత తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గీతారెడ్డి కూడా మరణించారు.
