సూర్యాపేట టౌన్, డిసెంబర్ 24 : ఉమ్మడి పాలనలో కులమతాల గొడవలతో భయానక వాతావరణంలో పండుగలు జరిగేవని, స్వరాష్ట్రంలో ఆ పరిస్థితిని రూపుమాపి ఐక్యతను పెంపొందించి అన్ని మతాల పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకొనేలా చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. క్రిస్మస్ను పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా కేంద్రం చర్చి కంపౌండ్‌లోని సెయింట్ బాప్టిస్టు చర్చిలో శనివారం సాయంత్రం నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం పేదలకు చీరెలు, దుప్పట్లు పంపిణీ చేసి మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన తరువాత అన్ని మతాల పండుగలకు నిధులు కేటాయించి, ప్రత్యేక విందులు ఏర్పాటు చేసి అందరిలో ఐక్యతను పెంపొందించారన్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి జిల్లాలోని దేవాలయాలు, మసీదులు, చర్చిల అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి జరుగాలంటే సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్‌రెడ్డి వంటి మహా నాయకులకు ప్రజలందరి ఆశీర్వాదం, ప్రేమ ఉండాలని కోరారు. క్రిస్మస్ వేడుకల్లో ముస్లీములు పాల్గొనడం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కౌన్సిలర్ జ్యోతి శ్రీవిద్య కరుణాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, చర్చి పాస్టర్ డాక్టర్ ప్రభుదాస్, బీఆర్ఎస్ నాయకులు జ్యోతి కరుణాకర్, బొమ్మిడి ఉపేందర్, ముజీబ్, కొండల్, పాషా, అనుదీప్, దానియేలు, ఎలియేజర్, సఫియా, పర్వీన్ పాల్గొన్నారు.