Suryapet | ఘనమైన చరిత్ర గలిగినా దశాబ్దాల తరబడి వెనుకబాటుకు గురైన సూర్యాపేట స్వరాష్ట్రంలో ప్రగతి పరుగులు తీస్తున్నది. సమైక్య పాలనలో కనీస మౌలిక వసతులకు నోచని ఈ నియోజకవర్గం నేడు అన్ని రంగాల్లోనూ అభివృద్ధికి కేరాఫ్‌గా నిలుస్తున్నది. ఒకనాడు మూసీ మురికినీరే దిక్కయిన పేటవాసులకు నేడు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందుతున్నది. ఏండ్లకేండ్లు వెక్కిరించిన ఎస్పారెస్పీ కాల్వల్లో కాళేశ్వరం జలాలు పరవళ్లు తొక్కుకున్నాయి. మూసీ ప్రాజెక్టు ఆధునీకరణతో రైతులు రెండు పంటలు పండిస్తున్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో సూర్యాపేట కొత్త జిల్లాగా రూపాంతరం చెండడంతో ఈ ప్రాంతం రూపురేఖలే మారిపోయాయి. అరవైయేండ్లలో జరుగని అభివృద్ధిని స్థానిక ఎమ్మెల్యే, మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తొమ్మిదేండ్లలోనే చేసి చూపించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు కలిపి దాదాపు 7,500 కోట్ల లబ్ధిని సూర్యాపేట నియోజకవర్గానికి చేకూర్చారు.
సూర్యాపేట, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ) : ఘనమైన చరిత్ర ఉన్న సూర్యాపేటను గత పాలకులు సమస్యల వలయంగా.. అవినీతికి నిలయంగా మార్చారు. 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా గెలుపొందిన గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి రెండు సార్లు మంత్రి పదవి చేపట్టి సూర్యాపేటను అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా మార్చి కొత్త చరిత్రను సృష్టించారు. ఆరు దశాబ్దాల్లో జరుగని అభివృద్ధిని తొమ్మిదిన్నరేండ్లలోనే చేసి చూపించారు. సుమారు రూ.7500 కోట్లతో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది పలికి, ఉద్యమకారులకు పుట్టినిళ్లు.. గ్రంథాలయ ఉద్యమానికి ఊపిరి పోయడం వంటి అనేక ఉద్యమాలకు పురిటిగడ్డ అయిన సూర్యాపేట నియోజకవర్గం ఉమ్మడి రాష్ట్రంలో అథోగతి పాలు కాగా, 2014 తరువాత జరిగిన అభివృద్ధి నభూతో న భవిష్యత్ అని చెప్పుకొనేలా ఉన్నదని పట్టణ ప్రజలు గర్వంగా ఫీలవుతున్నారు.
సమైక్య రాష్ట్రంలో సూర్యాపేట నియోజకవర్గంలో వరి పండించడమే మహాగగనంగా ఉండేది. అసలు రావే రావనుకున్న గోదావరి జలాలు కాళేశ్వరం నుంచి రావడం, మూసీ ఆధునీకరణతో నేడు రాష్ట్రంలోనే అత్యధిక వరి పండించే జిల్లాగా సూర్యాపేట కీర్తికెక్కగా.. నియెజకవర్గంలో సాగు గణనీయంగా పెరిగింది. నాడు హైదరాబాద్ పాయకాన నీళ్లే పట్టణ ప్రజలకు తాగునీరు కాగా.. నేడు మిషన్ భగీరథతో ఇంటింటికీ స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నారు. కలలో కూడా ఊహించని విధంగా సూర్యాపేట జిల్లా కేంద్రమైంది. ఓవరాల్‌గా 2014కు ముందు, తరువాత.. మంత్రి జగదీశ్‌రెడ్డికి ముందు, తరువాత అనే రీతిన సూర్యాపేటను చెప్పుకొనేలా మార్చిన ఘనత మంత్రికి దక్కిందని ప్రతిపక్షాలు సైతం అంగీకరించక తప్పదు.
నాలుగింతలు పెరిగిన వరి సాగు
సూర్యాపేట నియోజకవర్గంలో 2014కు ముందు నీళ్లు లేక ఉన్న భూమిలో 20శాతం కూడా వరి సాగు కాలేదు. రైతులు సాగుపై ఆశలు వదులుకొని వలస కూలీలుగా మారారు. నేడు సీఎం కేసీఆర్ చేపడుతున్న కార్యక్రమాలతో దర్జాగా వ్యవసాయం చేస్తూ పంటలు పుష్కలంగా పండిస్తున్నారు. సూర్యాపేట నియోజకవర్గానికి కృష్ణా, గోదావరి, మూసీ నదుల నీళ్లు వస్తుండడంతో రికార్డు స్థాయిలో వరి పంట పండుతున్నది. నియోజకవర్గంలో 59,695 ఎకరాల భూమి ఉంటే గతంలో 15vవేల ఎకరాలకు మించి వరి సాగైన దాఖలాలు లేవు. నేడు వంద శాతం సాగులోకి వచ్చింది. గత కాంగ్రెస్ పాలనలో కమీషన్ల కోసం కాల్వలు తవ్వి రాజకీయాల కోసం రక్త తర్పరణలు చేశారు తప్ప.. నీటిని తీసుకురాలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రణాళికలతో కాళేశ్వరం జలాలను సూర్యాపేట జిల్లాకు తీసుకురాగా నియోజకవర్గం సస్యశ్యామలమైంది.
ఆత్మకూర్(ఎస్), చివ్వెంల, పెన్‌పహాడ్ మండలాల రైతులకు రెండు పంటలకు ఈ నీరు అందుతున్నది. సూర్యాపేట మండలంలో ఉన్న మూసీ ప్రాజెక్టు గేట్లకు తూట్లు పడి నీరు వృథాగా పోతున్నా గత పాలకులు పట్టించుకోలేదు. స్వరాష్ట్రంలో రూ.20కోట్లతో గేట్ల మరమ్మతులు, రూ.66కోట్లతో కాల్వల ఆధునీకరణ పనులు చేయించారు. దీంతో ఇప్పుడు మూసీ ద్వారా ఏటా రెండు పంటలకు నీరు అందుతున్నది. ఈ క్రమంలో నియోజకవర్గంలో దాదాపు పూర్తి ఆయకట్టు సాగులోకి వచ్చింది. మూసీ నది, ఇతర వాగులపై సుమారు రూ.160 కోట్లతో చెక్‌డ్యామ్‌లు నిర్మించడంతో పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. కాళేశ్వరం జలాలు వస్తుండగా శ్రీరాంసాగర్ కాల్వల మరమ్మతుల కోసం దాదాపు రూ.10 కోట్లు ఖర్చు చేశారు. అలాగే రూ.3 కోట్లతో 21 లిఫ్ట్‌ల మరమ్మతులు చేపట్టగా.. మిషన్ కాకతీయ ద్వారా రూ.72 కోట్లతో 231 చెరువులను ఆధునీకరించారు.
మారిన సూర్యాపేట రూపురేఖలు
సూర్యాపేట సమైక్య రాష్ట్రంలో కరువు కాటకాలకు నెలవుగా మారింది. సాగు నీరు రాక.. విద్యుత్ కోతలతో సతమతం.. గుంతల రోడ్లపై అవస్థల ప్రయాణాలు.. రోగం వస్తే ప్రైవేట్ ఆసుపత్రులే దిక్కయ్యేది. ఆ రోజులను తలుచుకుంటేనే ఓ పీడకల. అలాంటి సూర్యాపేటకు నేడు రాష్ట్రంలోనే మంచి గుర్తింపు లభించింది. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఈ నియోజకవర్గాన్ని మంత్రి జగదీశ్‌రెడ్డి సారథ్యంలో ఇతర నియోజకవర్గాలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దారు. జిల్లా కేంద్రంగా మారిన సూర్యాపేట పట్టణం అభివృద్ధిలో దూసుకుపోతున్నది. మంత్రి జగదీశ్‌రెడ్డి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేపట్టారు. సద్దుల చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చి ప్రజలకు అందుబాటులోకి తీసుకురాగా.. నేడు పుల్లారెడ్డి చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మారుస్తున్నారు. ఈ రెండింటికి దాదాపు రూ.42కోట్ల వరకు ఖర్చు చేశారు. మురుగు నీటి శుద్ధ్దికి రూ.120 కోట్లు, పట్టణ అంతర్గత రోడ్లకు రూ.220 కోట్లు, మురుగు కాల్వలకు రూ.85 కోట్లు, రాష్ట్రంలోనే మోడల్‌గా నిలిచిన మోడల్ మార్కెట్‌కు రూ.31 కోట్లు, శ్మశాన వాటికల అభివృద్ధికి రూ.15 కోట్లు, పట్టణ ప్రకృతి వనాలకు రూ.5కోట్లు, ముఖ్యమంత్రి ప్రత్యేక నిధుల్లో సుమారు రూ.80 కోట్లు వివిధ అభివృద్ధి పనులకు కేటాయించారు. రూ.95కోట్లతో జిల్లా కేంద్రంలో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు నిర్మించారు.
అభివృద్ధిని ఏదో ఒకవైపే పరిమితం చేయకుండా నలుదిక్కులా జరుగుతున్నది. ఓ వైపు కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయం, సద్దుల చెరువు మినీ ట్యాంక్‌బండ్, పుల్లారెడ్డి మినీ ట్యాంక్‌బండ్, మెడికల్ కళాశాల, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, పట్టణ నడిబొడ్డున ఇంటిగ్రేటెడ్ మోడల్ మార్కెట్ ఏర్పాటు చేయగా.. తాజాగా ఆటోనగర్, ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు జరుగుతుంది. గతంలో పట్టణంలో రెండు పార్కులు ఉండగా.. నేడు 65కు పైనే ఏర్పాటయ్యాయి. వీధుల్లో ఓపెన్ జిమ్‌లు, జిగేల్ మనిపించేలా విద్యుత్ వెలుగులు, చౌరస్తాల విస్తరణ, వాటర్ ఫౌంటెయిన్లు, వీధుల్లో గ్రీనరీని పంచుతున్న రకరకాల మొక్కలు.. ఇలా పట్టణ నడిబొడ్డు మొదలుకొని శివారు ప్రాంతాల వరకు రహదారులు, మురుగు కాల్వలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వంటివి ఎన్నో సమకూరాయి.
సూర్యాపేటకు తలమానికంగా మెడికల్ కళాశాల
ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ మేరకు సూర్యాపేటకు మెడికల్ కళాశాల రావడంతో పేద, మధ్య తరగతి ప్రజలతోపాటు ఆర్థికంగా ఉన్నవారు సైతం అత్యున్నత వైద్యాన్ని ఉచితంగా పొందుతున్నారు. గతంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు చికిత్స లక్షల రూపాయల్లో ఉండగా.. మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రత్యేక చొరవతో నేడు జిల్లాలో సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్‌లో డయాలసిస్ కేంద్రాలు రావడంతో ఉచిత చికిత్సలు అందుతున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆధునీకరించి వైద్యుల నియామకాలు చేపట్టడంతో పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రభుత్వ వైద్యం పొందుతున్నారు.
నాడు పయాకాన నీళ్లు.. నేడు శుద్ధి జలాలు
నాడు సూర్యాపేట పట్టణానికి హైదరాబాద్ పయాకాన నీళ్లను తాపించిన ఘనత సమైక్య పాలకులది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన మిషన్ భగీరథతో సూర్యాపేట నియోజకవర్గంలో దాదాపు రూ.285 కోట్లు ఖర్చు చేసి ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంతోపాటు 113 గ్రామ పంచాయతీలు, వాటి ఆవాసాలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడం జరుగుతుంది.
ప్రారంభోత్సవాలు ఇలా…
11:25గంటలు ప్రభుత్వ మెడికల్ కళాశాల
12:00 ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్
12:25 జిల్లా పోలీస్ కార్యాలయం
12:50 బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం
1:25 జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం
3:00 బహిరంగ సభ
4:50 సీఎం కేసీఆర్ తిరుగు ప్రయాణం