కోదాడ, జూలై 30 : ఆర్యవైశ్యులు తమ హక్కుల సాధనలో పోరాటాలకు సిద్ధం కావాలని సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వెంపటి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆర్యవైశ్య హక్కుల సాధనకై ఆగస్టు 3న హైదరాబాద్లో జరగనున్న వైశ్య రాజకీయ రణభేరిని విజయవంతం చేయాలని కోరుతూ బుధవారం పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సామాజిక సేవలో అగ్ర భాగాన ఉండే ఆర్య వైశ్యులు రాజకీయంగా ఎదిగేందుకు సమాయత్వం కావాలన్నారు. రాజకీయంగా ఎదిగినప్పుడే సమాజంలో గుర్తింపు పొందడంతో పాటు అన్ని వర్గాల వారికి సేవ చేసే విస్తృత అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్ర జనాభాలో మూడు శాతంగా ఉన్న ఆర్యవైశ్యులకు ఎన్నికలలో సీట్లను కేటాయించేందుకు ఏ రాజకీయ పార్టీ కూడా అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆర్యవైశ్య జనాభా దామాషాలో అన్ని రాజకీయ పార్టీలు సీట్లను కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయ పక్షాలు సీట్లు కేటాయించనప్పటికీ ఆర్య వైశ్యులు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయాలని సూచించారు. దాంతో ఆర్యవైశ్యుల సత్తా ఏమిటనేది రాజకీయ పార్టీలకు తెలుస్తుందన్నారు. అన్ని రాజకీయ పక్షాలు స్థానాల కేటాయింపులో ఆర్యవైశ్యులకు ప్రాధాన్యత కల్పించేంతవరకు ఐక్యంగా పోరాటాలు చేయాలన్నారు. మేమెంతో మాకంత అనే నినాదంతో ఆగస్టు 3న వైశ్య వికాస వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు కాచం సత్యనారాయణ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించనున్న వైశ్య రాజకీయ రణభేరికి కోదాడ పట్టణం, మండలం నుండి అత్యధిక సంఖ్యలో ఆర్యవైశ్యులు హాజరై సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో వైశ్య సంఘం నాయకులు గరిన శ్రీధర్, పైడిమర్రి వెంకట్ నారాయణ, వంగవీటి రామారావు, పైడిమర్రి నారాయణరావు, వెంపటి మధు, ఓరుగంటి ప్రభాకర్, నూనె నాగన్న, పురుషోత్తం, జనార్ధన్, బండారు శ్రీనివాసరావు, ఇమ్మడి అనంత చక్రవర్తి, వంగవీటి భరత్ చంద్ర, యాదా కిరణ్ కుమార్, కొండే రవికుమార్, ఇరుకుల చెన్నకేశవరావు, గుండా ప్రవీణ్ పాల్గొన్నారు.