రామగిరి, ఏప్రిల్ 3 : ఈ నెల ఏడు నుంచి పదో తరగతి మూల్యాంకనం ప్రారంభం కానుండగా, స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియగా సజావుగా సాగానే అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే, పదో తరగతి ప్రశ్నాపత్రాల వాల్యూయేషన్‌కు హాజరు కావాలని సంబంధిత సబ్జెక్టు ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ ఉత్తర్వులు ఇవ్వడం… చాలావరకు ఉపాధ్యాయులు హాజరు కాకపోవడం.. దాంతో షోకాజ్ నోటీసులు ఇస్తామంటూ అధికారులు హెచ్చరించడం.. రిపోర్ట్ట్ చేయని ఉపాధ్యాయులను రప్పించేందుకు చర్యలు తీసుకోవడం.. నల్లగొండ జిల్లాలో ప్రతి సంవత్సరం జరుగుతూ వస్తున్నది. ఈసారి నల్లగొండ జిల్లా కేంద్రంలోని స్పాట్ వాల్యూయేషన్ కేంద్రానికి రెండు లక్షలకుపైగా జవాబు పత్రాలు వచ్చాయి. మూల్యాంకనం విధులకు హాజరు కావాలని 941 మంది టీచర్లకు డీఈఓ భిక్షపతి ఆదేశాల మేరకు సంబంధిత ఉత్తర్వులు అందించారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలోని లిటిల్ ప్లవర్ హైస్కూల్లో పదో తరగతి మూల్యాంకనం కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ నెల 7 నుంచి 16 వరకు 9 రోజులపాటు మూల్యాకంనం జరుగనుంది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి 2,21,667 జవాబు పత్రాలు వచ్చిన విద్యాశాఖ అధికారులు తెలిపారు. మూల్యాంకనం విధుల కోసం చీప్ ఎగ్జామినర్లు 106, అసిస్టెంట్ ఎగ్జామినర్లు 616, స్పెషల్ అసిస్టెంట్ 212, ఎసీఓలు ఏడుగురికి ఉత్తర్వులు అందజేశారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం, సాంఘిక శాస్త్రం సబ్జెక్టులు, భాషా పండిత్ స్కూల్ అసిస్టెంట్స్, లాంగ్వేజ్ పండిట్లను అసిస్టెంట్ ఎగ్జామినర్స్‌గా(ఏఈ)లుగా, సెకండరీ గ్రేడ్ టీచర్స్(ఎస్జీటీ)లను స్పెషల్ అసిస్టెంట్లుగా నియమించారు. ఇప్పటికే పలు మండలాల్లో ఎంఈఓలు, సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ద్వారా స్పాట్ ఉత్తర్వులను సంబంధిత ఉపాధ్యాయులకు చేరవేశారు. వారంతా శుక్రవారం ఆయా పాఠశాలలో రిలీవ్ అయ్యి ఈ నెల ఏడున ఉదయం 8గంటలకు స్పాట్ వాల్యూయేషన్ కేంద్రంలో రిపోర్టు చేయాల్సి ఉంది.
పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనంలో పాల్గొనే ఉపాధ్యాయులకు పదో తరగతి సబ్జెక్టులు, భాషల బోధనలో కనీసం మూడేండ్ల అనుభవం ఉండాలి. ఈ నిబంధనతో ఇటీవల పదోన్నతి పొందిన స్కూల్ అసిస్టెంటు, నూతనంగా ఉద్యోగంలో చేరిన స్కూల్ అసిస్టెంట్‌కు అవకాశం కల్పించ లేదు. కాగా, అత్యంత ముఖ్యమైన స్పాట్ ప్రక్రియకు ఏటా కొందరు ఉపాధ్యాయులు కనీస సమాచారం ఇవ్వకుండా గైర్హాజరవుతున్నది వాస్తవం. మరికొందరు ఏ విధమైన సర్దుబాట్లూ చేసుకోవడం లేదు. ఇంకొందరు అనారోగ్య కారణాలు చూపుతూ మూల్యంకన బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నారు. దాంతో 7న ప్రారంభమయ్యే పదో తరగతి స్పాట్ ప్రక్రియకు ఎంత మంది హాజరవుతారనేది సందిగ్ధంగా మారింది.
స్పాట్లో క్యాంపు ఆఫీసర్‌గా డీఈఓ వ్యవహరిస్తారు. అసిస్టెంట్ క్యాంస్ ఆఫీసర్లుగా (ఏసీవో)గా ఎంఈవోలతోపాటు సీనియర్ ప్రధానోపాధ్యాలను ఎంపిక చేశారు. చీఫ్ ఎగ్జామీనర్స్(సీఈ)గా ప్రధానోపాధ్యాయులు విధులు నిర్వహించనున్నారు. జిల్లా పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ యూసుఫ్ షరీఫ్ పర్యవేక్షణ చేస్తున్నారు. స్పాట్ పాల్గొనే ఉపాధ్యాయులకు రోజూ 46 జవాబు పత్రాలు ఇవ్వనున్నారు. ఉదయం 20, మధ్యాహ్నం 26 పేపర్లు మూల్యాకంనం చేయాల్సి ఉంటుంది.
పదోతరగతి స్పాట్ వాల్యూయేషన్‌కు సంబంధించి ఉత్తర్వులు అందిన ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయులందరూ విధిగా హాజరు కావాల్సి ఉంటుంది. ఏడో తారీఖు ఉదయం లిటిల్ ప్లవర్ పాఠశాలలో రిపోర్ట్ చేయాలి. విధులకు హాజరుకాని వారిపై విద్యాశాఖ నిబంధనలు, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు ఉంటాయి.
– బి.భిక్షపతి, డీఈఓ, నల్లగొండ