ఆదివారం 29 నవంబర్ 2020
Suryapet - Nov 13, 2020 , 02:30:03

ఫిబ్రవరి 28 నుంచి పెద్దగట్టు జాతర

ఫిబ్రవరి 28 నుంచి పెద్దగట్టు జాతర

  • ఐదు రోజులపాటు ఉత్సవాలు
  • తేదీలు ఖరారు చేసిన నిర్వాహకులు
  • కరపత్రాన్ని ఆవిష్కరించిన మంత్రి జగదీశ్‌రెడ్డి  

సూర్యాపేట టౌన్‌ : ప్రతి రెండేండ్లకు ఒకసారి కుంభమేళాను తలపించేలా జరిగే పెద్దగట్టు శ్రీలింగమంతుల స్వామి జాతర తేదీలు ఖరారయ్యాయి. జాతర నిర్వహణపై దేవాదాయ శాఖ అధికారులు, యాదవ కుల పెద్దలు, పూజారులు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో గురువారం రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి చేతుల మీదుగా జాతర కరపత్రాలను ఆవిష్కరించారు. ప్రతి ఏడు మాదిరిగానే జాతర ప్రారంభానికి 15 రోజుల ముందు 2021 ఫిబ్రవరి 14వ తేదీ ఆదివారం దిష్టి పూజ మహోత్సవం నిర్వహించనున్నారు. మాఘశుద్ధ తదియ తర్వాత వచ్చే రెండో ఆదివారం దిష్టి కుంభాన్ని ఉమ్మడి వరంగల్‌ జిల్లా చీకటాయపాలెం నుంచి దేవరపెట్టె తీసుకురావడంతోపాటు.. సూర్యాపేట నుంచి మకరతోరణం ఇతర ఆభరణాలు పెద్దగట్టుకు తీసుకొచ్చి అలంకరించనున్నారు. 2021 ఫిబ్రవరి 28 మాఘ బహుళ విదియ ఆదివారం రోజున పెద్దగట్టు లింగన్న జాతర ప్రారంభమై ఐదురోజుల పాటు జరుగనున్నది. గతంలో ఎన్నడూ ఇంత ముందుగా జాతర తేదీలు ఖరారు చేయలేదని యాదవ కుల పెద్దలు తెలిపారు. దేశ వ్యాప్తంగా పెద్దఎత్తున తరలి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని వసతులు కల్పించేందుకు మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రత్యేక చొరవతో ముందస్తుగా తేదీలను ఖరారు చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ..

తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరగా పేరుగాంచిన పెద్దగట్టు లింగన్న జాతరకు ముందస్తుగానే అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. కరోనాను దృష్టిలో పెట్టుకుని జాతర వేడుకలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. అప్పటి పరిస్థితులను బట్టి ప్రభుత్వం సూచించనున్న నిబంధనలు పాటిస్తూ జాతర వేడుకలకు అంతా సిద్ధం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ గోపగాని వెంకటనారాయణ, జడ్పీటీసీ జీడి భిక్షం తదితరులు పాల్గొన్నారు. 

పెద్దగట్టు లింగన్న జాతర కార్యక్రమాలు 

2021 ఫిబ్రవరి 14వ తేదీ : దిష్టి పూజ 

2021 ఫిబ్రవరి 28వ తేదీ : కేసారం గ్రామం నుంచి దేవరపెట్టె తీసుకువచ్చుట, గంపలతో గుడిచుట్టూ ప్రదక్షిణలు

2021 మార్చి 1వ తేదీ : బోనాలు సమర్పన, మద్దెరపాలు, మధ్యాహ్నం జాగిలాలు పోయుట 

2021 మార్చి 2వ తేదీ : చంద్రపట్నం  

2021 మార్చి 3వ తేదీ : నెలవారం, దేవరపెట్టె కేసారం తీసుకుపోవుట

2021 మార్చి 4వ తేదీ : జాతర ముగింపు, మకరతోరణం ఊరేగింపుతో సూర్యాపేటకు తీసుకుపోవుట