సోమవారం 28 సెప్టెంబర్ 2020
Suryapet - Jul 27, 2020 , 00:08:20

జామ ఔష‌ధ‌ గ‌ని

జామ ఔష‌ధ‌ గ‌ని

  • l ఒక జామకాయ పది ఆపిల్స్‌తో సమానం
  • l చౌక ధరలో అందుబాటులో లభించే ఫలం
  • l ప్రస్తుతం జామ కాయల సీజన్‌
  • l హరితహారంలో జామ మొక్కల పంపిణీ

 జామపండు తింటే ఆరోగ్యం మీ వెంటే.. ఇది ఎవరో చెబుతున్నది కాదు. స్వయానా పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఒక కాయ తింటే పది ఆపిల్స్‌తో సమానమంటున్నారు. మన వద్ద విరివిగా తక్కువ ధరలో అందుబాటులో ఉండే జామకాయ అంటే మనం చిన్న చూపు చూస్తుంటాం. తినడానికి ఆసక్తిని చూపం. కానీ జామలో అద్భుత ఔషధగుణాలున్నాయి. ఎన్నో వ్యాధుల నివారణకు దోహదపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. వచ్చేది జామ కాయల సీజన్‌, విరివిగా మనకు అందుబాటులో ఉండనున్నాయి. హరితహారంలో కూడా జామ మొక్కలను పంచడానికి అధికారులు వేల మొక్కలను అందుబాటులో ఉంచారు. జామ మొక్కలో ప్రతి భాగం మనకు ఉపయోగపడేదే. జామ మొక్కలను నాటుకుని వచ్చిన ఫలాలను తిని ఆరోగ్యాన్ని కాపాడుకుందాం మరి.. 

- హుజూర్‌నగర్‌

శారీరక బలానికి..


బాగా పండిన జామ పండు గుజ్జులోంచి గింజలు తొలగించి పాలు, తేనె కలిపి తీసుకుంటే విటమిన్‌-సి, కాల్షియం మెండుగా లభిస్తాయి. పెరిగే పిల్లలు, గర్భిణులు దీనిని టానిక్‌లా వాడవచ్చు. క్షయ, ఉబ్బసం, బ్రాంకైటిస్‌, గుండె బలహీనత, కామెర్లు, హెపటైటిస్‌, జీర్ణాశయ అల్సర్లు, మూత్రంలో మంట లాంటి అనేక రకాల సమస్యల పరిష్కారానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. జామపండులో విటమిన్‌-ఈ, వగరుతనం కలిగి ఉండటంతో చర్మానికి రక్షణ కల్గిస్తుంది. సి-విటమిన్‌ అధికంగా ఉండటంతో తొందరగా చర్మకణాలు అతుక్కొని త్వరిత ఉపశమనాన్ని కలిగించేలా చేస్తుంది. వీటితోపాటు జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. విటమిన్‌-ఎ అధికంగా ఉండే జామపండులో కంటి సంబంధిత సమస్యలు దూరం అవుతాయి.  

మన ప్రాంతంలో ఇంటి ఆవరణలో, పంట చేలల్లో, రోడ్ల వెంట ఎక్కువగా జామ చెట్లను చూస్తుంటాం. జామ చెట్టు ఎక్కువగా అందుబాటులో ఉండటంతో సహజంగానే జామ కాయ అంటే చిన్న చూపు చూస్తూ వాటిని తినేందుకు అనాసక్తిని కనబరుస్తాం. కానీ జామ కాయ ద్వారా ఆరోగ్యానికి కలిగే లాభాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతాం. విటమిన్‌-ఎ, సి, ఈ పుష్కలంగా ఉన్న జామపండులో పోషక విలువలు మెండుగా ఉన్నాయి. కొన్ని కాయల్లో లోపల గుజ్జు తెల్లగా ఉంటే, మరికొన్ని కాయల్లో గుజ్జు లేత గులాబీ రంగులో ఉంటుంది. వీటిని అధికంగా తీసుకోవడం చాలా ముఖ్యం. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు జామ పండును తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.  

మలబద్ధకం నివారణలో..


ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, మారిన జీవనశైలి, ఒత్తిగి ఇలా రకరకాల కారణాలతో ప్రస్తుతం చాలా మంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. మలబద్ధకాన్ని నివారించకపోతే శరీరం వ్యాధుల మయంగా మారుతుంది. దీనికి పరిష్కారం జామ అని చెప్పుకోవచ్చు. ఒక జామకాయలో 688 మిల్లీ గ్రాముల పొటాషియం ఉంటుంది. అంటే అరటి పండుకన్నా 63 శాతం ఎక్కువ. బాగా పండిన జామ పండ్లను కోసి కొద్దిగా మిరియాల పొడిని చేర్చి నిమ్మరసం కలుపుకొని తింటే తరుచూ వేధించే మలబద్ధకం సమస్య దూరం అవుతుంది. అతిసార, జిగట విరేచనాలు, గర్భిణుల్లో వాంతులు ఉన్నప్పుడు జామకాయ కషాయం గాని, మజ్జిగలో కలుపుకుని తాగితే చక్కని ఫలితం ఉంటుంది. 

దంత సంరక్షణలో...


ప్రతిరోజూ జామకాయ తింటే ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ను అరికట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పచ్చి జామకాయ తింటే చిగుళ్లు, దంతాలు గట్టిపడతాయి. ఇందులో విటమిన్‌-సి అధిక మొత్తంలో ఉండటంతో చిగుళ్ల నుంచి రక్తస్రావం ఆగుతుంది. పచ్చి జామకాయ ముక్కలను కప్పెడు తీసుకుని బాగా ఎండబెట్టి దానికి అర చెంచా మిరియాలు, అర చెంచా సైంధవ లవణాన్ని వేసి మెత్తగా పొడిచేసి సీసాలో నిల్వ చేసుకోవాలి. దానిని ప్రతిరోజూ పళ్లపొడిలా వాడితే దంతాలు గట్టి పడడమే కాకుండా చిగుళ్ల సమస్యలు దూరం అవుతాయి. 

 తలనొప్పి, మైగ్రేన్‌ నివారణకు..


దోర జామపండును సానరాయి మీద గంధం చేసి నుదుటి మీద లేపనంలా రాస్తే తలనొప్పి తగ్గుతుంది. మైగ్రేన్‌(పార్శపు నొప్పి)తో బాధపడేవారు దీనిని సూర్యోదయానికి ముందు ప్రయోగిస్తే చక్కని ఫలితం ఉంటుంది. అలాగే జామ పండ్లను చిన్న సైజు ముక్కలుగా కోసి తాగేనీటిలో మూడు గంటల పాటు నానబెట్టి ఆ నీటిని తాగితే అధిక దప్పిక నుంచి ఉపశమనం లభిస్తుంది. 

జలుబు ఉపశమనానికి..


జామపండులో విటమిన్‌-సి అధిక మొత్తం లో ఉండటంతో వైరస్‌ కారణంగా వ్యాపించిన జలుబు నివారణకు బాగా పనిచేస్తుంది. కానీ జామలో ఉండే సహజమైన కవప్రకోవకర అంశాలతో కొంతమందికి జలుబు తగ్గాల్సింది పోయి పెరిగే అవకాశం ఉంది. ఈ సమస్యను అధిగమించేందుకు జామను కొద్దిగా నిప్పుల మీద వేడిచేసి సైంధవ లవణం, మిరియాల పొడిని కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

జీర్ణ శక్తికి దోహదం...


ఎన్నో పోషక విలువలు ఉన్న జామకాయ నిజంగా దివ్య ఔషధంగా చెప్పవచ్చు. ఆహారం తీసుకున్న తరువాత జామకాయ లేక పండిన జామను తీసుకున్నా ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. జామకాయలో అధికంగా ఫైబర్‌ ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థను శుభ్రపరిచి పేగుల కదలికను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. జామకాయను తీసుకోవడంతో గ్యాస్ట్రిక్‌ సమస్యలు, జలుబు దూరం అవుతాయి. మధుమేహం(షుగర్‌) వ్యాధిగ్రస్తులకు మంచి ఆహారంగా చెప్పవచ్చు.

logo