శనివారం 19 సెప్టెంబర్ 2020
Suryapet - Apr 10, 2020 , 03:00:17

యాదాద్రిలో అదే వైభవం..

యాదాద్రిలో అదే వైభవం..

  • ద్విగుణీకృతమవుతున్న ఆధ్యాత్మిక శోభ
  • సుప్రభాతం మొదలుకొని పవళింపు సేవ వరకు కొనసాగుతున్న పూజలు 
  • కరోనాను కట్టడి చేయాలని  ధన్వంతరీ హోమం

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సుప్రభాతం మొదలుకొని పవళింపు సేవ వరకు నిత్యారాధనలు వైభవంగా జరుగుతున్నాయి. నియమానుసారం అన్ని రకాల కైంకర్యాలు సరైన వేళల్లోనే యథాతథంగా కొనసాగుతున్నాయి. ప్రపంచమంతటా కరోనా విజృంభించి విలయతాండవం చేస్తున్న వేళ జిల్లాలో ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాకపోవడం శ్రీలక్ష్మీనరసింహుడి కృప కారణమంటూ అర్చకులు వ్యాఖ్యానిస్తున్నారు. యాదాద్రిలో ఇటీవల నిర్వహించిన ధన్వంతరీ హోమం, శ్రీసుదర్శన నారసింహ హోమం వల్ల ఎంతో మేలు కలిగిందని, దాని వల్లనే జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాలేదని వారు వివరిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ తీసుకుంటున్న ప్రత్యేక చొరవకు శ్రీలక్ష్మీనరసింహుడి కృప తోడు కావడం వల్లనే రాష్ట్రంలో కరోనా కేసులు చాలా వరకు తగ్గుముఖం పట్టాయని వారు పేర్కొంటున్నారు.  కరోనాను అదుపు చేయమని కోరుతూ రోజూ శ్రీసుదర్శన నారసింహ హోమంలో స్వస్థత చేకూర్చమని వేడుకుంటూ ప్రత్యేక  వేదమంత్రాలు శ్రీవారికి అర్పిస్తున్నారు. 

ద్విగుణీకృతమవుతున్న ఆధ్యాత్మిక శోభ..

తెల్లవారు జామున జరిగే సుప్రభాతం మొదలుకొని నిజాభిషేకం, బాలభోగం, సహస్రనామార్చన  సుదర్శన నారసింహ హోమం వరకు అన్ని రకాల పూజలు నియమబద్ధంగా జరుగుతుండటంతో అదే ఆధ్యాత్మిక శోభ ద్విగుణీకృతమవుతున్నది. శ్రీలక్ష్మీనరసింహుడికి జరుగుతున్న ఏకాంత సేవల్లో అర్చకులు, వేదపండితులు, ప్రధానార్చకులు, స్థానాచార్యులు అందరూ పూజా కైంకర్యాల్లో పాల్గొంటున్నారు.  భక్తులకు అనుమతి లేదన్నదే గాని పూజా కైంకర్యాలకు ఎలాంటి మినహాయింపు లేకుండా నిర్వహిస్తున్నారు.  

సుదర్శననారసింహ హోమం..

కలియుగాంతం వరకు ఏ నక్షత్రంలో ఏ పూజలు జరుగాలో ఆదే రీతిలో ఆగమశాస్త్రం ప్రకారమే పూజలు జరుగుతున్నాయి. భక్తుల సంక్షేమం కోసమే రోజూ కరోనా ప్రాణినాం... ప్రజానాం.. భక్తనాం.. సర్వవిధ పరిరక్షణార్థం సుదర్శననారసింహ హోమం నిర్వహిస్తున్నారు. ధన్వంతరీ స్వరూపమైన శ్రీలక్ష్మీనరసింహస్వామి మూలమంత్రాలతో హోమం జరుపుతున్నారు.  

 ఆచార భంగం లేకుండా పూజలు..

లాక్‌డౌన్‌ ప్రకటించిన నాటి నుంచి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారికి అర్చకులు ఏకాంత సేవ నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రధానార్చకుడు నల్లందీగల్‌ లక్ష్మీనరసింహచార్యులు, కారంపూడి నరసింహాచార్యులు, స్థానాచార్యులు సందిగుల రాఘవాచార్యులు, ఉప ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, చింతపట్ల రంగాచార్యులు, బట్టర్‌ సురేంద్రచార్యులు స్వామి వారి సేవల్లో పాల్గొంటున్నారు. ఉదయమే స్వామి వారి సుప్రభాతం సేవలు నిర్వహించి వేకువజామునే స్వయంభూలకు, బాలాలయ కవచమూర్తులకు ఆరాధనలు జరిపి ఉత్సవ విగ్రహాలను పంచామృతాలతో అభిషేకించి, తులసి అర్చనలు, శ్రీ సుదర్శన హోమం, శ్రీలక్ష్మీనరసింహుల కల్యాణం, అలంకార సేవోత్సవాలు, అష్టోత్తర సేవలు నిర్వహిస్తున్నారు. పూర్వగిరి శ్రీలక్ష్మీనరసింహుడు కొలువుదీరిన పాతగుట్టలో కూడా శ్రీవారికి రాజోపచారాలు శాస్ర్తోక్తంగా జరుగుతున్నాయి. 

విశ్వాసం చెక్కు చెదరని రీతిలో నిత్యారాధనలు..

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి భక్తులకు శ్రీవారిపై విశ్వాసం చెక్కుచెదరని పద్ధతిలో నిత్యారాధనలు జరుగుతున్నాయి. ఉదయం 4 గంటల స్వామి వారి ఆలయం తెరిచి 4.30 గంటల వరకు సుప్రభాతం, 4.30 నుంచి 5 వరకు బాలభోగం, 5 నుంచి 7:15 వరకు సహస్రనామార్చన, 9 నుంచి 10 వరకు సుదర్శన నారసింహ హోమం, 10 నుంచి 12 వరకు నిత్యకల్యాణం, 12 నుంచి 12:30 వరకు స్వామి, అమ్మ వార్లకు నివేదన, 12:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్వామి వారి ఆరగింపు సేవ అనంతరం ఆలయాన్ని మూసేస్తున్నారు. అనంతరం రాత్రి 7 నుంచి 8:10 వరకు ఆరాధన, సహస్ర నామార్చనలు, రాత్రి 9 నుంచి 9:30 వరకు పవళింపు సేవ, దర్శనాలు నిలిపివేస్తారు. ఆలయ ముఖ మండపంలో నిత్యకల్యాణం నిర్వహిస్తున్నారు. ఉదయం 11.30 గంటలకు మహానివేదన నిర్వహించి ఆలయాన్ని మూసి, అనంతరం సాయంత్రం 5.30 గంటలకు తెరిచి రాత్రి 7 గంటలకు ఆరగింపు, తదుపరి పవళింపు సేవ జరుపుతున్నారు. 

నిష్ఠతో విధుల్లో పాల్గొంటున్న సిబ్బంది..

యాదాద్రి ఆలయ ప్రాంగణంలో పారిశుధ్య పనులు చేపడుతున్నారు. యాదాద్రి ఆలయానికి భక్తులు రాకపోవడంతో ఆలయ తిరువీధులు, విష్ణుపుష్కరిణి ప్రాంతంతోపాటు క్యూలైన్లు, క్యూకాంప్లెక్స్‌లు, కొండపై క్యూ కాంప్లెక్స్‌లో పారిశుధ్య పనుల్లో భాగంగా బ్లీచింగ్‌ పౌడర్‌, సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. ఉద్యోగులకు శానిటైజర్లు, మాస్కులు అందజేశారు. ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, అనారోగ్య పరిస్థితి కలిగితే వెంటనే వారిని హోం క్వారంటైన్‌కు పంపుతున్నారు. 

చెట్ల కింద గోవుల లాలన..

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి అనుబంధంగా ఉండే గోశాలలో గోవుల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. గోవులను కేవలం గోశాలలోనే కాకుండా ఆరుబయట చెట్ల కింద ఎక్కువ సమయం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. యాదాద్రి గోశాలలో 150 గోవులు ఉన్నాయి. వీటికి ఉదయం 10.30 గంటలకు వరిగడ్డి, 12 గంటలకు పచ్చిగడ్డి, సాయంత్రం వరిగడ్డిని వేస్తున్నారు. గోవులను సైతం సామాజిక దూరం పాటించేలా పశువుల కాపరులు జాగ్రత్త పడుతున్నారు.  ఉదయం 31 లీటరు పాలు, సాయంత్రం 32 లీటర్ల పాలను స్వామి వారి  కైంకర్యాలకు వినియోగిస్తున్నారు. గోవుల మేతకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ముందుగానే గడ్డి, పశుగ్రాసం, దాణా అందుబాటులో ఉంచారు. 

శాస్ర్తోక్తంగా పూజలు..   

భక్తుల క్షేమం కోసమే ప్రతి రోజు సుదర్శన నారసింహ హోమం నిర్వహిస్తున్నాం. ధన్వంతరీ స్వరూపమైన శ్రీలక్ష్మీనరసింహస్వామి మూలమంత్రాలతో హోమం జరుపుతున్నాం. సుప్రభాతం మొదలుకొని పవళింపు సేవ వరకు రాజోపచారాలు యథాప్రకారం జరుగుతున్నాయి. మూలస్థానమైన పాతగుట్టలో సైతం స్వామి వారి రాజోపచారాలు శాస్ర్తోక్తంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఈవో గీత, దేవాదాయ కమిషనర్‌ ఆదేశాలతో ధన్వంతరీ స్వరూప లక్ష్మీనరసింహస్వామి హోమం ప్రత్యేకమైన మంత్రాలతో జరుపుతున్నాం. 

- నల్లందీగల్‌ లక్ష్మీనారసింహాచార్యులు, ప్రధానార్చకుడు 

ఫలించిన ధన్వంతరీ హోమం..

కరోనాను కట్టడి చేయాలని దేశంలోని ప్రజలంతా స్వస్థతతో వర్ధిల్లేలా చూడాలని కోరుతూ ధన్వంతరీ, శ్రీసుదర్శన నారసింహ హోమం నిర్వహించాం. ప్రతి రోజు ఉదయం శ్రీసుదర్శన నారసింహ హోమంలో సర్వప్రాణులను రక్షించాలని కోరుతూ ప్రత్యేక వేదమంత్రయుక్తమైన పూజలు జరుపుతున్నాం. దాని వల్ల ఎంతో మేలు కలుగుతున్నది. 

- ఎన్‌.గీత, కార్యనిర్వహణాధికారి


logo