ఒక నటి ఏదైనా సినిమాలో నటించాలా? వద్దా? అనేది వేరొకరి నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని చెబుతున్నది
బాలీవుడ్ బ్యూటీ యామి గౌతమ్. అయితే, ఆ నిర్ణయం కూడా సదరు నటి శక్తిసామర్థ్యాలపై ఆధారపడి ఉండదనీ, అనేక ఇతర అంశాలు కూడా ప్రభావం చూపుతాయని పెదవి విరిచింది. ‘విక్కీ డోనర్’ సినిమాతో బాలీవుడ్లో స్టార్‌గా ఎదిగిన యామి.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే! విలక్షణ పాత్రలు పోషిస్తూ నటిగా సత్తా చాటుతున్న యామి పంచుకున్న కబుర్లు ఇవి..
సినీ నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చినా.. నేను ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. చాలామంది కొత్తవారిలాగే.. నాకూ అవకాశాలు త్వరగానే వస్తాయని ఆశించా. కానీ, సినిమాల్లో చాన్స్ మాత్రం అంత సులభంగా దక్కలేదు. 2010లో కన్నడ సినిమా ‘ఉల్లాస ఉత్సాహ’తో వెండితెరకు పరిచయమయ్యా. అయితే, ఈ సినిమాతో అంతపెద్ద గుర్తింపు దక్కలేదు. ఆ తర్వాత చాలా రోజులపాటు అవకాశాల కోసం ఎదురుచూశా.
‘ఉరి..’ చేస్తున్నప్పుడే దర్శకుడు ఆదిత్యతో పరిచయం ఏర్పడింది. ఆ సినిమా ప్రమోషన్స్ సమయంలోనే మా ఇద్దరికీ మాటలు కలిశాయి. మాది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదు. మంచి స్నేహితులుగా మేమిద్దరం ప్రయాణం మొదలుపెట్టాం. స్నేహం నుంచే మా ప్రేమ పుట్టింది. మోకాళ్ల మీద కూర్చుని లవ్ ప్రపోజ్ చేసుకోవడం, డ్రామాలు మా మధ్య జరగలేదు. అలాంటివి మాకు సెట్‌కావు కూడా. మేం పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం.. మా కుటుంబాలు కూడా ఒప్పుకొన్నాయి. అంతా చాలా సాఫీగా, సహజంగా జరిగిపోయింది.
మా నాన్న ముఖేష్ గౌతమ్ దర్శకుడు. మాడల్‌గా నా కెరీర్ మొదలైంది. 2008లో ‘చాంద్ కే పార్ చలో’తో టీవీ నటిగా బుల్లితెరపై కనిపించాను. తెలుగులో నువ్విలా, గౌరవం, యుద్ధం, కొరియర్ బాయ్ కళ్యాణ్ చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు నేను సుపరిచితురాలినే!
‘ఉరి: ది సర్జికల్ ్రైస్టెక్’, ‘బాలా’ వంటి హిట్ సినిమాలు చేశాక గానీ, నా కెరీర్ గాడీలో పడలేదు. నేను ఈ స్థాయికి చేరుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇందుకోసం నేను ఎంతో పోరాడాల్సి వచ్చింది.
‘ఉల్లాస ఉత్సాహ’ విడుదలైన రెండేళ్లకు ఆయుష్మాన్ ఖురానా సరసన 2012లో ‘విక్కీ డోనర్’తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాను. ఆ సినిమా సూపర్ హిట్ అయినా.. తర్వాత మళ్లీ రెండేండ్లకు గానీ నాకు మరో అవకాశం రాలేదు. తర్వాత వరుసగా తెలుగు, హిందీ సినిమాల్లో చేశాక కూడా.. ‘కాబిల్’ చిత్రం కోసం ఆడిషన్స్ ఇవ్వాల్సి వచ్చింది.