Talk Your Self | స్నేహితులతో మాట్లాడతారు, బంధువులతో మాట్లాడతారు. జీవిత భాగస్వామితో, పిల్లలతో మాట్లాడతారు. కానీ మీ కోసం అలుపెరుగక శ్రమించే గుండెతో, మీ తరపున ఆలోచించే మెదడుతో, మిమ్మల్ని నడిపించే కాళ్లతో, మీకు ప్రపంచాన్ని చూపించే కండ్లతో.. మొత్తంగా మీరు అపారంగా ప్రేమించే మీ శరీరంతో ఎప్పుడైనా మాట్లాడారా?
శరీరానికి కూడా ఒక భాష ఉంటుంది. తనదైన పద్ధతిలో అది భావాలను వ్యక్తం చేస్తుంది. బాధను వెల్లడిస్తుంది. అసంతృప్తిని వెళ్లగక్కుతుంది. అప్పుడప్పుడూ తిట్టిపోస్తుంది. ఈ విషయాన్ని న్యూరో సైంటిస్టులు కూడా ఆమోదించారు. పంటి నొప్పి ఒక హెచ్చరిక. కంటి సమస్య ఒక సంకేతం. భారంగా కదిలే శరీరం ఓ డేంజర్ సిగ్నల్. ఆకలి తగ్గినా, దప్పిక పెరిగినా.. దేన్నీ తేలిగ్గా తీసుకోలేం. జీవిత భాగస్వామితోనో, ఆత్మీయ మిత్రుడితోనో అభిప్రాయభేదాలు వచ్చినప్పుడు చర్చల ద్వారా అగాథాన్ని పూడ్చుకున్నట్టే.. శరీరంతో సంభాషించి లోపాలను సరిచేసుకోవాలి. ఆ సంభాషణను వివిధ దశలుగా వర్గీకరించారు నిపుణులు.
ప్రశాంత వాతావరణంలో, నిశ్శబ్ద ప్రదేశంలో సౌకర్యవంతమైన స్థితిలో కూర్చోండి. పడుకుంటేనే సౌకర్యంగా ఉంటుందంటే పడుకోండి. ఓ ఐదు నిమిషాలు ధ్యానస్థితిలోకి వెళ్లండి. గతం వద్దు. భవిష్యత్తూ వద్దు. కేవలం వర్తమానంలోనే ఉండండి.
రిలాక్స్.. రిలాక్స్.. రిలాక్స్! హాయిగా శ్వాస తీసుకోండి. మిత్రుడితో కబుర్లు చెప్పినట్టు, శరీరంతో చాటింగ్ ప్రారంభించండి. కుశల ప్రశ్నలు అడగండి. కృతజ్ఞతలు చెప్పండి. హృదయపూర్వకంగా అభినందించండి.
తల వెంట్రుకలు, మెదడు, కండ్లు, ముక్కు, చెవులు, మెడ, ఛాతీ, చేతులు, పొట్ట, నడుము, తొడలు, మోకాళ్లు, పాదాలు, కాలివేళ్లు.. ఇలా శరీరంలోని ప్రతి భాగం మీదా కొంతసేపు ఏకాగ్రత నిలుపుతూ.. వర్చువల్ శరీర యాత్ర కొనసాగించండి.
రైలుబండి ప్రతి స్టేషన్లో ఆగినట్టు, ఒక్కో అవయవం దగ్గరా ఫోకస్పెట్టాలి. ఊడుతున్న జుట్టు, ఉబ్బుకొస్తున్న పొట్ట, ఆకృతిని కోల్పోతున్న పిరుదులు.. ప్రతి మజిలీలో శరీరం ఏదో ఓ సమస్యను మీ దృష్టికి తెస్తుంది. వాటిని రాసిపెట్టుకోండి.
ఆ కాగితాలను ముందేసుకుని.. మిమ్మల్ని మీరు క్రాస్-ఎగ్జామినేషన్ చేసుకోండి. మీ శరీరాన్ని మీరు ప్రేమగా చూసుకున్నారా? లేదంటే, జీవనశైలి లోపాలతో వాటి సహజ శక్తిని, రోగ నిరోధక వ్యవస్థను విచ్ఛిన్నం చేశారా? ప్రతి జవాబూ కీలకమే.
తక్షణం నష్ట నివారణ చర్యలు ఆరంభించండి. ఆరోగ్యకరమైన జీవనశైలిని ఎంచుకోండి. పరిపూర్ణ వైద్య పరీక్షలు చేయించుకోండి. అవసరమైతే చికిత్సకో, శస్త్రచికిత్సకో సిద్ధంకండి.
మీలో వచ్చిన మార్పునకు శరీరం తప్పక సంతోషిస్తుంది.
Dengue Fever | డెంగ్యూ జ్వరమా..? వీటితో ప్లేట్లెట్ కౌంట్ పెంచుకోవచ్చు..!