Dengue Fever | వాతావరణంలో మార్పుల కారణంగా ప్రస్తుతం వైరల్ ఫీవర్లతోపాటు వివిధ వ్యాధులు మనల్ని చుట్టుముడుతున్నాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డెంగ్యూ జ్వరం. డెంగ్యూ వైరస్ వల్ల వచ్చే దోమల వల్ల కలిగే ఈ జ్వరం లక్షణాలు సాధారణంగా సంక్రమించిన తర్వాత 3-14 రోజుల అనంతరం ప్రారంభమవుతాయి. హైఫీవర్, తలనొప్పి, వాంతులు, కండరాలు కీళ్ల నొప్పులు, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. డెంగ్యూ జ్వరం నుంచి బయటపడేందుకు రెండు నుంచి వారం రోజులు పడుతుంది. డెంగ్యూ వ్యాధి నివారణకు ప్రస్తుతం ఎలాంటి మందులు అందుబాటులో లేవు. కేవలం వ్యాధి రాకుండా చూడటం ద్వారానే దాన్ని నివారించవచ్చు.
డెంగ్యూ వచ్చిన వారిలో ముఖ్యంగా రక్తంలోని ప్లేట్లెట్ల సంఖ్య పడిపోవడం అనేది ముఖ్యలక్షణంగా చెప్పుకోవాలి. ఇది ప్రాణాంతకంగా భావించాలి. ప్లేట్లెట్ల సంఖ్యను పెంచుకోవడం ద్వారా ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చు. డెంగ్యూ వైరస్ రక్త కణాల లోపల పునరుత్పత్తి చేస్తుంది. ఎముక మజ్జితో పాటు ఇతర అవయవాలకు హాని కలిగిస్తుంది. ఫలితంగా ప్లేట్లెట్ల సంఖ్య తగ్గేందుకు దారితీస్తుంది. కొన్నిసార్లు తీవ్రమైన రక్తస్రావం జరిగి మరణానికి దారి తీస్తుంది. ప్లెట్లెట్ల సంఖ్య పెంచడానికి కొన్ని ఆహారాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం పొందవచ్చు.
బొప్పాయి ఆకులు
బొప్పాయి ఆకులు ప్లేట్లెట్ కౌంట్‌ను పెంచడానికి సహకరిస్తాయి. వీటిలో అసిటోజెనిన్ అనే ఫైటోకెమికల్ ఉండి ప్లేట్లెట్లను వేగంగా వృద్ధి చేయడంలో ప్రభావవంతంగా ఉంటుంది. బొప్పాయి ఆకుల్లో ఉండే కెరోటిన్, ఫ్లేవనాయిడ్లు యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ స్వభావం కలిగి ఉంటాయి. తాజా బొప్పాయి ఆకుల రసాన్ని 3-4 రోజులు లేదా ప్లేట్లెట్స్ సాధారణ స్థాయికి వచ్చే వరకు తీసుకోవాలి. ఆకులను కొద్దిగా నీళ్లతో గ్రైండ్ చేసి, ఆపై రసాన్ని వడకట్టి తీసుకోవచ్చు.
రెండో పద్ధతిలో నాలుగైదు బొప్పాయి ఆకులను నీటిలో వేసి 10 నిమిషాలు మరిగించి ఆ ద్రవాన్ని వడకట్టి త్రాగాలి.
గోధుమ గడ్డి రసం
ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ యూనివర్సల్ ఫార్మసీ అండ్ లైఫ్ సైన్సెస్‌లో ప్రచురించిన పరిశోధన ప్రకారం గోధుమ గడ్డి రసం తాగడం వల్ల ప్లేట్లెట్స్ సహజంగా పెరుగుతాయి. డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నవారిలో ప్లేట్లెట్ల సంఖ్యను పెంచడానికి ప్రతిరోజూ గోధుమ గడ్డి రసాన్ని తీసుకోవాలి. మంచి రుచి, మరిన్ని ప్రయోజనాల కోసం గోధుమ గడ్డి రసంలో కొంత నిమ్మకాయ రసాన్ని చేర్చాలి.
కివి పండ్లు
కివి పండ్లు యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉండి డెంగ్యూ రికవరీకి ఉత్తమంగా పనిచేస్తుంది. వీటిలో ఉండే సీ విటమిన్, పొటాషియం ప్లేట్లెట్ కౌంట్‌ను పెంచడంలో సహాయపడతాయి. ప్లేట్లెట్స్ తగ్గకుండా ఉండాలంటే డెంగ్యూ పాజిటివ్ అని తేలిన వెంటనే కివీ పండ్లను తినాలి.
దానిమ్మ
రక్తంలోని ఎర్ర రక్త కణాలను పెంచడంలో దానిమ్మ గ్రేట్‌గా ఉపయోగపడుతుంది. వీటిని తినడం వల్ల ప్లేట్లెట్ కౌంట్‌ను కూడా పెంచుకోవచ్చు. డెంగ్యూ వ్యాధిగ్రస్తులు ప్లేట్లెట్స్ పడిపోకుండా ఉండాలంటే రోజూ దానిమ్మపండు తీసుకోవాలి. దానిమ్మపండ్లలో ఐరన్ సమృద్ధిగా ఉండి రోగనిరోధక శక్తిని పెంచడానికి, ప్లేట్లెట్లను పెంచడానికి సహాయపడతాయి.
మెంతి గింజల నీరు
ప్లేట్లెట్స్ వేగంగా పడిపోతున్న వ్యక్తులకు ఇది మంచి ఫలితం ఇస్తుంది. కొన్ని మెంతి గింజలను నీటిలో 10 నిమిషాలు ఉడకబెట్టి త్రాగడం వల్ల ప్లేట్లెట్ కౌంట్ రికవరీకి సహాయపడుతుంది. మెంతి గింజలను 3-4 గంటలు లేదా రాత్రిపూట నీటిలో నానబెట్టి ఈ మిశ్రమాన్ని తీసుకోవాలి. గోరువెచ్చగా తాగడం చాలా మంచిది.
బీట్రూట్ రసం
బీట్రూట్ రక్త నష్టాన్ని భర్తీ చేయడానికి, హిమోగ్లోబిన్‌ను పెంచడానికి సహాయపడుతుంది. డెంగ్యూ ఇన్ఫెక్షన్ కారణంగా పడిపోయే ప్లేట్లెట్లను తిరిగి నింపడానికి ఇది చాలా తోడ్పడుతుంది. తాజా బీట్రూట్ రసాన్ని తయారు చేసి రోజుకు రెండుసార్లు త్రాగడం ఉత్తమ మార్గం.
విటమిన్ సీ ఆహారాలు
డెంగ్యూ రికవరీకి సీ విటమిన్ అధికంగా ఉండే ఆహారాలు చాలా ముఖ్యమైనవి. ఈ ఆహారాలలో లభించే సీ విటమిన్, యాంటీఆక్సిడెంట్లు రెగ్యులర్‌గా తీసుకుంటే ప్లేట్లెట్ కౌంట్‌ను పెంచుతుంది. డెంగ్యూ వ్యాధిగ్రస్తులు త్వరగా కోలుకోవడానికి నిమ్మరసం, నారింజ, ఉసిరి, ఇతర బెర్రీలు తింటూ ఉండాలి.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్యకైనా వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.