పెండింగ్ కేసులతో పొద్దంతా బిజీగా ఉండటంతో కాసేపు పడుకొందామని మొబైల్ ఫోన్ సైలెంట్లో పెట్టి మంచంపై ఒరిగాడు ఇన్స్పెక్టర్ రుద్ర. అలా ఓ గంటసేపు కునుకు తీశాడో లేదో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు. మనసంతా అల్లకల్లోలం.. తన ఆప్తులకు ఏమైందోనన్న ఆందోళన.. ఎందుకిలా అనిపిస్తుందోనని ఆలోచిస్తూనే మొబైల్ అందుకొన్నాడు.
‘స్నేహిల్ బాబు.. ఫోన్ చేస్తేనే మేం అక్కడికి వెళ్లాం సార్. డోర్లు లోపల నుంచి లాక్ చేసి ఉన్నాయి. స్నేహిల్ బాబే తలుపులు తెరిచాడు. అక్కడ డెడ్‌బాడీ, స్నేహిల్ బాబు తప్ప ఇంకెవ్వరూ లేరు. ముందు ఆమె సూసైడ్ చేసుకొందని అనుకొన్నాం. అయితే, ఉరేసుకోవడానికి ఎలాంటి టేబుల్, కుర్చీ సాయం తీసుకోలేదు. ఆ రూమ్‌లో అవి లేనేలేవు. స్వతహాగా అంత ఎత్తు ఫ్యాన్‌కు ఒక్కతే ఉరేసుకోవడం కుదరదు. అందుకే, స్నేహిల్
బాబుని అదుపులోకి..’ భయపడుతూనే చెప్పాడు రామస్వామి.
కజిన్ బ్రదరైన స్నేహిల్ నుంచి ఐదారు మిస్డ్ కాల్స్. స్టేషన్ నుంచి నాలుగైదు మిస్డ్ కాల్స్ ఉన్నాయి. రుద్ర గుండె వేగం పెరిగిపోయింది. ఏమైందో తెలుసుకొందామని స్నేహిల్‌కు ఫోన్ చేయబోతుండగా.. బెడ్ రూమ్ తలుపును బయటనుంచి రూప గట్టిగా తడుతున్నది. ‘రుద్ర.. డోర్ తియ్యరా’ అటునుంచి తల్లి అరుపులు. వెంటనే డోర్ తీశాడు రుద్ర. ‘బాబూ.. మన స్నేహిల్ను పోలీసులు అరెస్ట్ చేశారటరా.. ’ బావురుమంది రూప. ఒక్కసారిగా షాక్ అయ్యాడు రుద్ర. తల్లికి ధైర్యం చెప్పి.. ఏమైందోనని స్టేషన్‌కు కారుతీశాడు.
బెంచీపై ఆందోళనగా కూర్చున్నాడు స్నేహిల్. హెడ్ కానిస్టేబుల్ రామస్వామి, ఇతర సిబ్బంది అంతా ముభావంగా ఉండిపోయారు. స్టేషన్‌కు వచ్చీరాగానే స్నేహిల్ను హగ్ చేసుకొన్నాడు రుద్ర. ఇంతలో డీఎస్పీ సత్యనారాయణ రుద్ర దగ్గరికి వచ్చి ధైర్యం చెప్పి ఇలా అన్నాడు. ‘రుద్ర.. స్నేహిల్ అంటే ఏంటో నాకు కూడా తెలుసు. అయితే, క్రైమ్ సీన్లో మనోడు తప్ప ఎవ్వరూ లేరు. దీంతో అరెస్టు చెయ్యక తప్పలేదు. ఏది ఏమైనా.. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ నువ్వే చెయ్యి. ఈ కేసును నీకు ఇవ్వొద్దని పైనుంచి కొందరు ఒత్తిడి చేశారు. అయితే, దాన్ని నేను చూసుకొంటా. నీ బ్రదర్ తప్పు చేయలేదని సాక్ష్యాలతో నిరూపించడం ఇక నీ వంతు’ అంటూ వెళ్లిపోయాడు సత్యనారాయణ.
ముఖమంతా వాడిపోయి నీరసంగా కూర్చున్న స్నేహిల్ దగ్గరికి వెళ్లాడు రుద్ర. అసలేమైందన్నయ్యా.. అంటూ గద్గద స్వరంతో ఆరా తీశాడు. స్నేహిల్ కండ్లలో నీళ్లు తిరిగాయి. ఏడుస్తూ తమ్ముడి భుజంపై వాలిపోయాడు. స్టేషన్లో ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణం. అందరి ముఖాల్లో ‘అయ్యో.. పాపం’ అనే భావనే. ఇంతలో రుద్రతో రామస్వామి.. ‘సార్.. మన స్నేహిల్ బాబు ఆ మర్డర్ చేసి ఉండరు. ఎవరో కావాలనే ఇరికించారు. ఇదైతే నిజం’ అన్నాడు. అసలేంటి కేసు అని అడిగాడు రుద్ర.. ఇంతలో కలగజేసుకొన్న స్నేహిల్ చెప్పడం ప్రారంభించాడు.. ‘ఆఫీసులో నా కొలీగ్ తేజస్విని ఉందిగా. నేనంటే ఇష్టమని వెంటపడేది. నీకు కూడా రెండుమూడు సార్లు చెప్పానుగా’.. అవునన్నట్టు తలూపాడు రుద్ర.
‘ఇప్పుడు చనిపోయింది ఆమెనే’.. షాక్ తిన్నాడు రుద్ర. చెప్తూపోయాడు స్నేహిల్. తేజస్విని టార్చర్ రోజురోజుకూ పెరిగిపోవడంతో మొన్నామధ్య వార్నింగ్ ఇచ్చా. ఇంతలో ఈరోజు మార్నింగ్ ఎరౌండ్ 8 గంటలకు ఫోన్ చేసింది. తన ఫ్లాట్‌కి రాకపోతే చస్తా అని బెదిరించింది. గతంలోనూ సూసైడ్ ఎటెంప్ట్ చేసుకొన్న ఘటనలు గుర్తొచ్చి భయపడిపోయి వెళ్లా. కాసేపు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ఏమైందో ఏమో వెంటనే తను కూల్ అయిపోయింది. ఇకపై ఇలాంటి పనులు చేయనని చెప్పింది. తనను క్షమించినట్లయితే, కూల్‌డ్రింక్ తాగాలని బలవంతపెట్టింది. తాగా.. అంతే, సాయంత్రం ఏడింటికి మెలకువ వచ్చింది. చూస్తే, ఫ్యాన్ సీలింగ్‌కు ఉరేసుకొని తేజస్విని ఉంది. వెంటనే ఏం చేయాలో తెలీక నీకు ట్రై చేశా. నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి స్టేషన్‌కి కాల్ చేశా’ అంటూ ఏడ్చినంత పనిచేశాడు స్నేహిల్.
‘స్నేహిల్ బాబు.. ఫోన్ చేస్తేనే మేం అక్కడికి వెళ్లాం సార్. డోర్లు లోపల నుంచి లాక్ చేసి ఉన్నాయి. ఆయనే తలుపులు తెరిచాడు. అక్కడ డెడ్‌బాడీ, స్నేహిల్ బాబు తప్ప ఇంకెవ్వరూ లేరు. ముందు ఆమె సూసైడ్ చేసుకొందని అనుకొన్నాం. అయితే, ఉరేసుకోవడానికి ఎలాంటి టేబుల్, కుర్చీ సాయం తీసుకోలేదు. ఆ రూమ్‌లో అవి లేనేలేవు. స్వతహాగా అంత ఎత్తు ఫ్యాన్‌కు ఒక్కతే ఉరేసుకోవడం కుదరదు. అందుకే, స్నేహిల్ బాబుని అదుపులోకి..’ భయపడుతూనే చెప్పాడు రామస్వామి.
అన్నకు ధైర్యం చెప్పిన రుద్ర.. క్రైమ్ సీన్‌కు వెళ్లాడు. రామస్వామి చెప్పినట్టే అక్కడి పరిస్థితులు అన్నీ అలాగే ఉన్నాయి. గదిలో ఫ్లోర్ కార్పెట్ పచ్చిగా ఉంది. రుద్రకు మతిపోయినంత పనైంది. ఇటు చూస్తే తేజస్వినిది సూసైడ్‌గా కనిపించట్లేదు. అటేమో తానేమీ చేయలేదని స్నేహిల్ చెప్తున్నాడు. బయటినుంచి ఎవరో లోపలికి వచ్చి తేజస్వినిని చంపిన ఆనవాళ్లు క్రైమ్‌సీన్‌లో అసలే లేవు. రుద్ర బుర్ర వేడెక్కిపోయింది. అన్నను ఎలాగైనా ఈ కేసు నుంచి బయటపడేయాలని అనుకొన్నాడు రుద్ర. ఫ్లాట్ ఎదురుగా ఉన్న టీ స్టాల్లో చాయ్ తాగుతూ ఈ కేసు గురించే దీర్ఘాలోచనలో మునిగిపోయాడు. ఇంతలో ఇద్దరు పిల్లలు ఒకరినొకరు ఆటపట్టించుకొంటూ ఏదో గేమ్ ఆడుతున్నారు. ‘నా గుప్పిట్లో ఒక వస్తువును పెట్టుకొని.. నీ ముందే దాన్ని మాయం చేస్తా’ అన్నాడు మొదటి పిల్లాడు. ‘ఐస్ పెట్టుకొని నాకు ఐస్ పెట్టొద్దు’ అన్నాడు రెండో పిల్లాడు. ఈ మాట వినగానే రుద్ర కండ్లు ఒక్కసారిగా మెరిశాయి.. తన అన్న స్నేహిల్ ఏ హత్య చెయ్యలేదని, తేజస్వినే సూసైడ్ చేసుకొన్నదన్న నిర్ధారణకు వచ్చాడు. ఎలా?
తేజస్వినీనే సూసైడ్ చేసుకొన్నది. తనను నిరాకరిస్తున్న స్నేహిల్ను ఈ కేసులో ఇరికించాలని అతని డ్రింక్‌లో మత్తుమందు కలిపింది. అలా తాను సూసైడ్ చేసుకొన్నాక కూడా అదే రూమ్‌లో స్నేహిల్ ఉండేలా చేసింది. ఇక, కుర్చీ, టేబుల్ సాయంతో ఉరేసుకొంటే సూసైడ్ అని తెలిసిపోతుందని పెద్ద ఐస్‌క్యూబ్‌ను ఆర్డర్ చేసింది. మెడకు ఉరి బిగించుకొంది. ఐస్ కరిగిపోయాక.. మెడకు ఉరిపడటంతో మరణించింది. ఐస్ కరగడంతోనే గదిలో ఫ్లోర్ కార్పెట్ పచ్చిగా మారింది. కాగా, తేజస్విని ఐస్ ఆర్డర్ చేసిన రసీదు కూడా ఆమె గదిలో దొరకడంతో స్నేహిల్ బయటపడ్డాడు.