Memory | మనిషి జ్ఞాపకాల జీవి. జ్ఞాపకాలే అతణ్ని బతికిస్తాయి. జ్ఞాపకాలే అతణ్ని నడిపిస్తాయి. జ్ఞాపకాలు ఉంటేనే.. బంధాలూ అనుబంధాలు! జ్ఞాపకశక్తి మృగ్యమైన మనిషి శవంతో సమానం. శరీరానికి ఆరోగ్యాన్ని, మనసుకు వికాసాన్ని ప్రసాదించే యోగా.. జ్ఞాపకశక్తిని పెంపొందించుకోవడానికి అనేక మార్గాలను సూచించింది. యోగాసనాలు, ధ్యానం, ప్రాణాయామం, సంప్రదాయ జీవనశైలి.. బలమైన జ్ఞాపకశక్తిని ప్రసాదిస్తాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.
జీవితం అనుభవాలను ఇస్తుంది. అనుభవాలలోంచి జ్ఞాపకాలు పోగవుతాయి. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకూ.. చిన్నాపెద్దా జ్ఞాపకాల సమాహారమే జీవితం. పుస్తకంలో ఒక్కో పేజీ చిరిగిపోయేకొద్దీ.. పుస్తకం విలువ తగ్గిపోతుంది. జ్ఞాపకాలు తుడిచిపెట్టుకునిపోయిన కొద్దీ.. జీవన నాణ్యతా దెబ్బతింటుంది. మతిమరుపు ఓ ప్రమాద సంకేతం. జీవితభాగస్వామి పుట్టినరోజును గుర్తుపెట్టుకుని.. ఓ చిన్న గులాబీపువ్వును కానుకగా ఇచ్చినా, తను మురిసిపోతారు. అలాంటి చిరుచిరు జ్ఞాపకాలతోనే బంధం బలపడుతుంది. కెరీర్ విజయంలోనూ జ్ఞాపకశక్తి పాత్ర ఉండి తీరుతుంది. నివేదికల తయారీలో, జ్ఞాపకం పెట్టుకుని మరీ కీలక అంశాలను ప్రస్తావించకపోతే.. ఆ పత్రానికి సమగ్రత ఉండదు. వార్షిక పరీక్షలో, పోటీ పరీక్షలో విజయానికి కూడా జ్ఞాపకశక్తే ఆధారం. కాబట్టి, జ్ఞాపకశక్తిని నిలుపుకొందాం, పెంచుకుందాం, సానబెట్టుకుందాం. ఆ ప్రయత్నంలో యోగాతో ముడిపడిన జీవనశైలి తప్పక సహకరిస్తుంది.
విషయాలను గ్రహించడం, మెదడులో నిక్షిప్తం చేసుకోవడం, దీర్ఘకాలంపాటు అట్టిపెట్టుకోవడం, కావాల్సినప్పుడు బయటికి తీయడం.. ఇదే జ్ఞాపకశక్తి అంటే! మెదడు జ్ఞాపకాల్ని సంకేతాల రూపంలో భద్రపరుచుకుంటుంది. ఇదోరకమైన కోడింగ్ వ్యవస్థ లాంటిది. అవసరం రాగానే.. మళ్లీ డీకోడ్ చేసి జ్ఞాపకాన్ని యథాతథంగా అందిస్తుంది. మనిషి జ్ఞాపకశక్తి అపరిమితమే అయినా.. దానికి ఎన్నో అవరోధాలు. సాధారణమైన మతిమరుపు మొదలుకొని అల్జీమర్స్, డిమెన్షియా వరకు అనేకానేక రుగ్మతలు చుట్టుముడతాయి.
జ్ఞాపకశక్తికి సంబంధించి రిచర్డ్ ఆల్కిన్సన్, రిచర్డ్ షిఫ్రిన్ అనే శాస్త్రవేత్తలు ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.
› జ్ఞాపకశక్తికి సంబంధించిన తొలి స్థాయి.. సెన్సరీ మెమరీ. ఈ దశలో ఏ విషయమైనా స్వల్పకాలానికే మెదడులో నిక్షిప్తం అవుతుంది.
› స్వల్పకాలిక జ్ఞాపకశక్తి రెండో స్థాయి. ఇందులో కూడా సమాచారాన్ని వెంటనే మరిచిపోతాం.
› మూడో స్థాయి దీర్ఘకాలిక జ్ఞాపకశక్తి. ఇక్కడ సమాచారం అవసరమైనప్పుడు దానంతట అదే వెలుపలికి వస్తుంది. ఇందులో కూడా కొంత మాత్రమే స్ఫురణకు వస్తుంది. మిగతాది గుర్తుకుతెచ్చుకోవడం కష్టం.
జ్ఞాపకశక్తిని సంస్కృతంలో ‘స్మృతి’ అంటారు. మన అనుభూతికి వచ్చిన వస్తువు లేదా సంఘటన మెదడులో భద్రంగా ఉండటమే జ్ఞాపకశక్తి. ‘స్మృతి’ గురించి భగవద్గీతలో శ్రీకృష్ణుడు అనేక కోణాల్లో చర్చించాడు. కోపం నుంచి మోహం పుడుతుంది. మోహం కారణంగా స్మృతి భ్రంశం జరుగుతుందంటాడు. ఇక్కడ పరమాత్మ జాగరూకత కోల్పోవడం గురించి మాట్లాడుతున్నాడు. చివర్లో “నాలో మోహం నశించిపోయింది. జాగరూకత తిరిగి వచ్చింది” అంటాడు అర్జునుడు. ‘ఒక విషయంపై మనకు ఉండే ఆసక్తే.. జ్ఞాపకశక్తి’ అని విశ్లేషిస్తారు హిమాలయ యోగి స్వామి రామ. మనం దేన్నయినా మరిచిపోతున్నామంటే మనకు దానిపట్ల ఆసక్తి లేదని అర్థం. ‘దేనినైనా, ఎవరినైనా మనం ఇష్టపడితేనే … జీవితాంతం గుర్తుంచుకుంటాం’ అనేది స్వామి రామ ఉవాచ.
జ్ఞాపకశక్తి, భావోద్వేగాలు అతి దగ్గరగా అనుసంధానమై ఉంటాయి. మన గందరగోళాలన్నీ భావోద్వేగపరమైనవే. అవే ప్రశాంతంగా ఉన్న మనసును మంచుపొరలా కమ్మేస్తాయి. ప్రశాంతంగా, స్వచ్ఛంగా ఉండటాన్ని ‘ప్రసాదగుణం’ అంటారు. నాలుగు బ్రహ్మ విహారాలను సాధనచేయడం ద్వారా ప్రసాదగుణాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని చెబుతారు పతంజలి. ఈ సాధన మనసును స్థిరపరుచుకునేందుకు దోహదపడుతుంది. దాంతో ఏకాగ్రత మెరుగుపడుతుంది. జ్ఞాపకశక్తికి మూలమైంది ఏకాగ్రతే! నిజానికి ఏకాగ్రత అనేది ఒక ప్రయత్నం కాదు, భావోద్వేగపరమైన గందరగోళాల నుంచి మెదడును శుభ్రం చేసుకోవడం. ఒక్కసారి మంచుపొరలు తొలగిపోయాయంటే సూర్యుడు స్పష్టంగా ప్రకాశిస్తాడు. అలానే నిర్మలమైన మెదడే విషయాలను బాగా గుర్తుంచుకుంటుంది. గందరగోళంగా ఉన్న మెదడు ఏ విషయాన్ని అయినా ఇట్టే మరచిపోతుంది. అయితే మెదడు బలహీనపడటానికి కారణం మనలో గాఢంగా గూడుకట్టుకుపోయిన తమోగుణమే. ఇది ఎన్నో రూపాల్లో బయటపడుతూ ఉంటుంది. హద్దులు తెలియని కోపం జ్ఞాపకశక్తిని మింగేస్తుంది. ఎదుటి మనిషితో మన అనుబంధాన్ని మరిచి.. నోటికొచ్చినట్టు మాట్లాడతాం. మోహం విచక్షణను మింగేస్తుంది. ఆ మాయలో ఎదుటి వ్యక్తి సద్గుణాలు మన జ్ఞాపకాల అరలోంచి మాయమైపోతాయి.
› గర్భధారణ సమయంలో తల్లికి పౌష్టికాహార లోపం ఉంటే, పొట్టలోని పిండం ఎదగడానికి అవసరమైనన్ని పోషకాలను గ్రహించలేకపోతుంది. బిడ్డకు పాలుపట్టేటప్పుడూ ఇలాంటి సమస్యే ఉంటుంది. దాంతో గర్భస్థ, నవజాత శిశువుల వికాసం మందగిస్తుంది.
› సాంకేతికతపై ఎక్కువగా ఆధారపడటం వల్ల నిత్య జీవితంలో మెంటల్ మ్యాథమెటిక్స్కు చోటే ఉండదు. మన తాతముత్తాతలు రోజువారీ అవసరాల కోసం లెక్కలన్నీ మనసులోనే చేసేవారు. ప్రస్తుతం దేనినీ గుర్తుంచుకునే ప్రయత్నం చేయలేకపోతున్నాం. అన్నిటినీ కంప్యూటర్లలోకి ఎక్కిస్తున్నాం.
› మితిమీరి తినడం వల్ల మన శక్తి మొత్తం ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికే సరిపోతుంది. బుర్రకు పదును పెట్టుకోవడానికి సమయమే ఉండదు. దాంతో మెదడు మొద్దుబారిపోతున్నది, కొత్త విషయాలు నేర్చుకోనంటూ మొరాయిస్తున్నది. ఆధునిక జీవితంలో నిద్ర పట్టకపోవడం అన్నది ఓ సాధారణ సమస్యగా మారింది.
› మద్యపానం, మాదకద్రవ్యాలు కూడా జ్ఞాపకశక్తిని ప్రభావితం చేస్తాయి. ఆందోళన, విశ్రాంతి లేకపోవడం, రక్త సరఫరా వ్యవస్థలో లోపం.. తదితర కారణాల వల్ల మెదడు పోషకాలను తీసుకోలేదు. మెదడుకు కసరత్తు లేకపోవడం, ఆసక్తి తగ్గిపోవడం, సమాచారం పేరుకుపోవడం.. మొదలైన వాటివల్ల జ్ఞాపకశక్తి సామర్థ్యానికి చేటు కలుగుతున్నది.
జ్ఞాపకశక్తి లేదా ధారణాశక్తి అంటే తెలుగువాళ్లకు వెంటనే గుర్తుకువచ్చేది అవధానమే. ఇది దక్షిణ భారతీయుల, ప్రత్యేకించి తెలుగువారి వారసత్వ సంపద. అష్ట, శత, ద్విశత, సహస్ర, పంచమహాసహస్ర అవధానాలతో జ్ఞాపకశక్తితో అద్భుతాలు సృష్టించిన పండితులు తెలుగు రాష్ట్రాల్లో చాలామందే. అయితే, మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు ప్రాచుర్యంలోకి తీసుకువచ్చే వరకు అవధానం గురించీ, అవధానుల గురించీ ఉత్తర భారతదేశం వారికి అంతగా తెలియదు. అవధానంలో అవధాని, పృచ్ఛకులు ప్రధానంగా ఉంటారు. అవధాని ఆసనాన్ని అలంకరిస్తాడు. ఇంతలో ఒక పృచ్ఛకుడు అవధానికి ఒక ప్రశ్నవేస్తాడు. మరొకరు దత్తపది (ఇచ్చిన పదాలతో పద్యం చెప్పడం), ఇంకొకరు నిషిద్ధాక్షరి (పేర్కొన్న అక్షరాలు లేకుండా పద్యం అప్పజెప్పడం), మరింకొకరు గంటలు కొట్టి చివరికి ఎన్ని కొట్టారో అడగడం ఇలా ఏకాగ్రత, ధారణ ప్రధానంగా అవధానం సాగుతూ ఉంటుంది. తిరుపతి వేంకటకవులు, శేషాద్రిరమణ కవులు, వేంకటపార్వతీశ్వర కవులు, మాడుగుల నాగఫణి శర్మ, గరికపాటి నరసింహారావు, మేడసాని మోహన్ లాంటివారు తెలుగులో అవధానాలకు ప్రసిద్ధిచెందినవారు. ప్రతి అవధానీ తనలోని ధారణశక్తికి కారణం.. ధ్యానం, మంత్రం తదితర ఆధ్యాత్మిక సాధనలే కారణమని చెబుతారు. గాయత్రి, మేధా మంత్రం, సరస్వతీ మంత్ర, బృహస్పతి మంత్రం, టిబెట్ బౌద్ధ సంప్రదాయానికి చెందిన మంజుశ్రీ మంత్రం (ఇది సరస్వతీ మంత్రాలలో ఒకటి కావడం గమనార్హం) జపించడం ద్వారా తమకా శక్తి వచ్చిందని ప్రకటించినవారూ ఉన్నారు.
మెదడు జ్ఞాపకశక్తి విషయంలో అనేక అద్భుతాలు చేయగలదు. వేదాలను ఆ చివరినుంచి ఈ చివరివరకూ గడగడా అప్పజెప్పేవాళ్లు ఇప్పటికీ ఉంటారు. పుస్తకంతో పనిలేకుండా.. భగవద్గీత రోజూ పారాయణ చేసేవారూ అనేకం. సంస్కృత విద్యార్థులైతే.. పాణిని రాసిన నాలుగువేల వ్యాకరణ సూత్రాలనూ పొల్లుపోకుండా గుర్తుంచుకుంటారు. అమరకోశం, శబ్దరత్నాకరం నాలుక మీదే ఆడేవాళ్లు.. సంస్కృత విద్యాలయాల్లో తారసపడుతూనే ఉంటారు. మనం జానపదులు అనుకునే వాళ్లు కూడా సుదీర్ఘమైన రామాయణాన్ని గేయ రూపంలో గుర్తుంచుకుంటారు. కమ్మరి, కుమ్మరి… ఇలా వివిధ వృత్తుల వాళ్లు తమ పనికి సంబంధించిన పాటలు పాడుకుంటూ కష్టాన్ని మరిచిపోతారు. వీళ్లంతా జ్ఞాపకశక్తికి సంబంధించి శిక్షణ పొందలేదు. తమలోని నైపుణ్యానికి పదునుపెట్టారంతే. తమలోని ఆసక్తిని బతికించుకున్నారంతే.
కోపం, భయం, పశ్చాత్తాపం, అపనమ్మకం, అనిశ్చితి, ఈర్ష్య, అభద్రత లాంటి భావోద్వేగాలు మన మనసును పొరలా కమ్ముకొని ఉంటాయి. చీపురుతో ఇంటిని ఊడ్చుకున్నట్టు, మానసిక తపస్సుతో మనసును శుభ్రం చేసుకోవచ్చు. ఆలోచనల్లో ప్రశాంతత, మృదుత్వం, మౌనం, ఆత్మనిగ్రహం, ఆలోచనలలో పవిత్రత.. మానసిక తపస్సు కిందికి వస్తాయని భగవద్గీత 17వ అధ్యాయం వెల్లడిస్తున్నది. కొన్ని యోగాసనాలు, ప్రత్యేకించి శీర్షాసనం లాంటి మెదడు దిశగా ఎక్కువ రక్తాన్ని సరఫరా చేసే ఆసనాలు జ్ఞాపకశక్తిని పెంపొందించడానికి అనువుగా ఉంటాయి. పద్మాసనం, సర్వాంగాసనం, పశ్చిమోత్థానాసనం, హలాసనం మొదలైన ఆసనాలకు తోడుగా.. ప్రాణాయామం, ధాన్యం కూడా జ్ఞాపకశక్తిని పెంపొందిస్తాయి. ధ్యానం వల్ల ఆలోచనల మీద పట్టు వస్తుంది. ఏ ఆలోచనను మెదడులో నిక్షిప్తం చేసుకోవాలి, ఏ సంఘటనను రిసైకిల్ బిన్లో పడేయాలి అన్న విషయంలో స్పష్టత వస్తుంది. దీంతో, మెదడులో చెత్త పేరుకుపోయే సమస్యే ఉండదు.
జ్ఞాపకశక్తి బలహీనపడటానికి అనేక కారణాలు.
1. నిద్ర మందగించడం.
2. మగత.
3. అతిగా తినడం.
4. శ్వాస తక్కువగా తీసుకోవడం.
5. ఎక్కువగా మాట్లాడే అలవాటు.
6. తాజా గాలి లేకపోవడం
7. వ్యాయామం చేయకపోవడం.
8. నిరంతర భయం.
9. కోపం, ఆరాటం.
10. కుంగుబాటు.
వీటివల్ల దీర్ఘకాలంలో అల్జీమర్స్ లాంటి మెదడు సంబంధ వ్యాధులు కూడా వస్తాయి. ఇందులో కొన్నిటిని మనం సులువుగా నియంత్రించుకోవచ్చు.
వివిధ పదాలు, సంజ్ఞల ఆధారంగా వివిధ సంఘటనలను ముడిపెట్టి గుర్తుపెట్టుకోవచ్చు. మతిమరుపును అధిగమించడానికి ఇదో మార్గం. ఉదాహరణకు, మీరు ఒక వ్యక్తి పేరు గుర్తుంచుకోవాలని అనుకుంటున్నారు. మీరు ఆయనను తొలిసారిగా గులాబీల తోటలో కలుసుకున్నారు. గులాబీల తోటను గుర్తుకు తెచ్చుకుంటే అతని పేరూ గుర్తుండి
పోతుంది. కొంతమందికి కొన్ని విషయాల పట్ల తెలియని వ్యతిరేకత గూడుకట్టుకుని ఉంటుంది. దీంతో ఆ పాఠ్యాంశాలను తలుచుకోగానే భయమేస్తుంది. ఒక్కసారి ఆ వ్యతిరేకతను దూరం చేసుకుంటే జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేరు. అక్షపాద గౌతముడు తన న్యాయసూత్రాల్లో జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి కొన్ని మార్గాలను ఇచ్చాడు.
ప్రణిధానం: గుర్తుంచుకోవాలనే తపనను పెంచుకోవడం. అదే సమయలో మనసును ఏకాగ్రం చేసుకోవడం, ఆ వస్తువుకు సంబంధించిన కొన్ని చిహ్నాలను గుర్తుంచుకోవడం.
నిబంధ: కొన్ని వస్తువుల సముదాయాన్ని ఒక జాబితా రూపంలో రాసుకోవడం; ఆ జాబితాను వరసక్రమంలో గుర్తుంచుకోవడం లేదా వరసలోంచి కొన్ని వస్తువులను గుర్తుంచుకోవడం. ఈ ప్రక్రియ జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి ఓ కసరత్తులా పనిచేస్తుంది.
అభ్యాసం: ఒకే విషయాన్ని పదేపదే సాధనచేయడం.
సంయోగం: నిప్పులేనిదే పొగరాదు. ఇలా నిప్పు, పొగను అనుసంధానం చేసుకోవడం. ఒకదానితో ఒకటి ముడిపడిన అంశాలను ఈ పద్ధతిలో గుర్తుపెట్టుకోవడం పెద్ద సమస్య కాదు.
ఏకార్థ సమవాయినం: ప్రతి వ్యక్తి రూపం ఏదో ఓ వస్తువును గుర్తుకు తెస్తుంది. బొద్దుగా ఉంటే గుమ్మడికాయ, పొడుగ్గా ఉంటే పొట్లకాయ.. ఇలా అన్నమాట!
పరిగ్రహ: వస్తువును బట్టి యజమానిని, యజమానిని బట్టి వస్తువును గుర్తుంచుకోవడం.
ఏకకార్యం: ఒకే రకమైన పనులు చేసేవారు. ఉదాహరణకు ఒక కళ ప్రదర్శించే ఒక వ్యక్తిని చూసినప్పుడు, అదే కళతో ముడిపడిన మరొకరిని గుర్తుకు తెచ్చుకోవడం.
విరోధ: వ్యతిరేకమైంది. ఒక వ్యక్తిని చూసి అతని ప్రత్యర్థిని గుర్తుతెచ్చుకోవడం.
వ్యవధానం: కత్తి ఒరను చూడగానే కత్తి గుర్తుకు రావడం దీని కిందికి వస్తుంది. అలా ఒక వస్తువుకు, ఓ సంఘటనకు ముడిపెట్టడం.
ఇచ్ఛాద్వేషం: ప్రేమ, అయిష్టత. మనిషి తాను ప్రగాఢంగా కోరుకున్న వస్తువుతో పాటు, అయిష్టమైన దాన్నీ గుర్తుంచుకుంటాడు.
భయం: మనకు భయం కలిగించే వాటిని కూడా గుర్తుంచుకుంటాం.
అర్థిత్వ: మనకు ఇష్టమైన ఆహారం, లేదంటే దుస్తులను ముడిపెడుతూ గుర్తుంచుకోవడం.
క్రియ: పని లేదా నైపుణ్యం. ఏదైనా వస్తువును చూడగానే దానిని తయారుచేసిన వారిని గుర్తుకుతెచ్చుకోవడం.
రాగ: ఆకర్షణ, సాన్నిహిత్యం. మనకు ఇష్టమైన వారిని ఏ ప్రయత్నం లేకుండానే గుర్తుంచుకుంటాం.
..అలా అని అన్ని చిట్కాలనూ ఒకేసారి ప్రయోగించాలని కాదు. సందర్భాన్ని బట్టి వీటిలో ఏదో ఓ సూత్రాన్ని అన్వయించుకోవచ్చు. అవసరమైతే కొత్త సూత్రాలూ సృష్టించుకోవచ్చు. బాదంపప్పు, కుంకుమ పువ్వు మనో వికాసానికి సహకరిస్తాయని చెబుతారు. ఆవు నెయ్యి జ్ఞాపకశక్తిని ఇనుమడింపజేస్తుందని ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి. బ్రాహ్మి, జ్యోతిష్మతి, వాచ లాంటి మూలికలు ఆలోచనాశక్తికి పదునుపెడతాయి.
కొన్ని ప్రత్యేకమైన విషయాలను, టన్నులకొద్దీ సమాచారాన్ని గుర్తుంచుకోవడానికి ఉపయోగపడే సాధనమే.. న్యుమోనిక్స్. పాటలు, ప్రాసపదాలు, సంక్షిప్త పదాలు, వాక్యాల రూపంలో విషయాన్ని గుర్తుంచుకునే ప్రయత్నం ఇది. వరుస క్రమం ఉన్న సమాచారం విషయంలో న్యుమోనిక్స్ ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఉదాహరణకు ARITHMETIC అనే పదాన్ని తీసుకుంటే ఇది A rat in the house may eat the ice cream అనే వాక్యానికి న్యుమోనిక్ అవుతుంది. తెలుగు భాష విషయానికి వస్తే ఎనిమిది దిక్కులను ‘తూఆదనైపవాఉఈ’ అని సంక్షిప్తం చేసుకొని గుర్తుంచుకోవచ్చు. ఏకాగ్రంగా ఉండటానికి, జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి ఎన్నో సంక్లిష్టమైన మేధాపరమైన వ్యాయామాలు ఉన్నాయి.
పదాలకు సంబంధించినవి, ప్రత్యేకించి వేదాలను జ్ఞాపకం ఉంచుకునేందుకు ఎనిమిది రకాలైన పద ప్రస్తారాలు (పెర్ముటేషన్స్) ఉన్నాయి. అవి: జటా, మాలా, శిఖా, రేఖా, ధ్వజ, దండ, ఘన, రథ. వీటిని చాలావరకు వేద పండితుల దగ్గర నేర్చుకోవాల్సి ఉంటుంది. వీటి సాయంతోనే వేల సంవత్సరాల నుంచి వేదాలను బట్టీయం వేసి కాపాడుకుంటూ వచ్చారు. ఉదాహరణకు రుగ్వేదంలోని మొదటి మూడు పదాలైన ‘అగ్ని మీడే పురోహితం’ను కింది వరుసలో చదువుతారు.
అగ్ని- మీడే, మీడే- అగ్ని, అగ్ని- మీడే
మీడే- పురోహితం, పురోహితం- మీడే, మీడే- పురోహితం
అగ్ని- మీడే- పురోహితం, పురోహితం- మీడే- అగ్ని
మీడే- పురోహితం- అగ్ని
పురోహితం- మీడే- అగ్ని
అగ్ని- మీడే- పురోహితం
రుగ్వేదంలోని మొదటి మూడు పదాలకు సంబంధించిన అతి సులువైన ప్రస్తారం (పెర్ముటేషన్) ఇదే. సంప్రదాయ వేద పండితులు వేలాది మంత్రాలను ఇలాంటి అష్ట విధ ప్రస్తార పద్ధతిలోనే ఉచ్చరిస్తారు. ఇలా వేదాలను ఒక్క అచ్చు కూడా పొల్లుపోకుండా వేల సంవత్సరాల నుంచి మౌఖికంగానే భద్రపరిచారు.
ఏదైనా కొత్త విషయాన్ని ఆవిష్కరించగానే మహర్షులు దానిని శిష్యులకు వెల్లడించేవాడు. ఈ క్రమంలో శిష్యులు గురువుకు అభిముఖంగా (అభి+ ఆస= అభ్యాస) కూర్చునేవారు. అందుకే నేర్చుకోవడానికి ‘అభ్యాసం’ అనే పేరువచ్చింది. ఆ తర్వాత రుషి దగ్గర్నుంచి వెళ్లిపోయి ఏ నది దగ్గరో, చెట్టు కిందో, హోమ గుండం ముందో కూర్చుని పదేపదే వల్లె వేసేవారు. దీనిని స్వాధ్యాయం అంటారు. యోగసూత్రాల్లో మనసులో మంత్రాన్ని స్మరించడాన్ని ధ్యానం అని పేర్కొన్నారు. అలా పదేపదే వల్లెవేస్తుంటే విషయం నేరుగా మెదడులోకి వెళ్లిపోతుంది. జపమూ ఇలాంటి ప్రక్రియే. వినడం, మెదడులో నిక్షిప్తం చేసుకోవడం, ధ్యానం చేయడం, ఉచ్చరించడం, గుర్తుంచుకోవడం, ఏకాగ్రత కోసం, మనసును శుభ్రపరుచుకోవడం కోసం జపం చేయడం (ప్రసాదనం) అన్నీ కూడా ఒకే ఇంద్రధనుస్సులో వేర్వేరు రంగుల లాంటివి. అయితే ఆలోచన లేకుండా గుర్తుంచుకోవడం వృథా ప్రయాసగానే మిగిలిపోతుంది. ఇకపోతే ఆసియా దేశాల సంప్రదాయంలో పవిత్ర గ్రంథాలను గుర్తుంచుకోవడం అన్ని మతాల్లోనూ దాదాపుగా ఒకేలా కనిపిస్తుంది. అదే… పవిత్ర గ్రంథాన్ని అందమైన చేతిరాత రూపంలో పదేపదే రాయడం. దీనిని నెమ్మదిగా, అందంగా, ఇష్టంతో చేయాల్సి ఉంటుంది. దీని ఫలితంగా గ్రంథాలు సురక్షితంగా ఉంటాయి. జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. దేవుడి గురించి జపం చేసినట్లూ ఉంటుంది. అన్నీ జాగరూకత గురించి చేసే సాధనలే. ఇవన్నీ కలిసిన యోగాయే స్మృతియోగ.
విషయాన్ని అవగాహన చేసుకోవడానికి, గుర్తుంచుకోవడానికి తిరుగులేని ప్రక్రియ.. యోగనిద్ర. ఈ స్థితిలో జాగరూకతతో ఉంటూనే విశ్రాంతి తీసుకుంటాం. నిద్రను సమాధి దిశగా తీసుకువెళ్తాం. ఎంతో సంక్లిష్టమైన యోగనిద్రా క్రమంలో మొదటి మెట్లలో ఒకటి ‘ప్రయత్న శైథిల్యం’. అంటే ప్రయత్నానికి విశ్రాంతి ఇవ్వడం. శవాసనంలో ఉండిపోయి కొన్ని రకాలైన మానసిక సాధనలు చేయడమే.. ప్రయత్న శైథిల్యం. చాలామంది యోగా గురువులు శవాసనంలో ఏం చేయాలో తెలియక, తమ శిష్యులను కేవలం భంగిమ దగ్గరే ఆపివేస్తారు. హిమాలయ యోగుల సంప్రదాయం తెలిసిన వారు మాత్రం శిష్యులకు ప్రాణమయ కోశ సాధనలు, మనోమయ కోశానికి సంబంధించిన ప్రాథమిక సాధనలు నేర్పిస్తారు. ఈ రకమైన సాధనలను యోగనిద్ర అంటారు. అయితే నిజమైన యోగనిద్ర అంత సులువుగా సిద్ధించదు. దానిని కొన్ని స్థాయుల్లో, సాధనా మార్గాల్లో మాత్రమే నిర్వచించగలం.
› తమ నిద్రా స్థితి గురించి ఎరుకతో ఉండాలి. దానిని నిర్దేశించగలగాలి.
› మెదడు డెల్టా తరంగాలను విడుదల చేస్తున్నప్పుడు, ఇది నాన్ రెమ్ గాఢనిద్రను సూచిస్తుంది. యోగనిద్రలో ఉన్నవారు పరిసరాల గురించి ఎరుకతో ఉంటారు.
› ధ్యానం, నిద్ర ఒకేసారి జరిగితే, ఉపరితల మెదడు నిద్రలో ఉంటుంది. నిగూఢమైన మెదడు ధ్యానంలో ఉంటుంది.
యోగనిద్ర అనేది.. రోజులో కొన్ని నిమిషాలపాటు గాఢమైన విశ్రాంతిని పొందడానికి ఉపకరిస్తుంది. కుర్చీలో కూర్చొని కానీ, సోఫాలో పడుకొని కానీ సాధన చేయవచ్చును.
› కళ్లు మూసుకోవాలి. విశ్రాంత స్థితికి చేరుకోవాలి. తల నుంచి పాదాల దాకా- ఆపాదమస్తకం- శరీరం గురించి ఎరుకతో ఉండాలి.
› శ్వాస తల భాగం నుంచి పాదాల వైపు, పాదాల నుంచి తల భాగం వైపు ప్రవహించేలా శ్వాసించాలి.
› ఎరుకను కనుబొమల నడుమ ఉండే ఆజ్ఞాచక్రం వరకు తీసుకురావాలి. మూడుసార్లు ఉచ్ఛాస, నిశ్వాసలు చేయాలి.
› ఆ తర్వాత ఎరుకను విశుద్ధిచక్రం (గొంతు మధ్యలో ఉంటుంది) దగ్గరికి తీసుకురావాలి. అక్కడ నిర్మలమైన పున్నమి చంద్రుడిని దర్శించాలి. మళ్లీ మూడుసార్లు ఉచ్ఛాస నిశ్వాసలు చేయాలి.
› అక్కడినుంచి ఎరుకను అనాహత చక్రానికి తీసుకురావాలి (గుండె మధ్యలో ఉంటుంది). మళ్లీ మూడుసార్లు ఉచ్ఛాస నిశ్వాస క్రమం కొనసాగించాలి.
› అనాహత చక్రంలో గుహ ఉన్నట్లుగా భావించాలి. ఆ గుహలోకి శ్వాసిస్తున్నట్లుగా ఊపిరి పీల్చుకోవాలి. ఇక పాదాల నుంచి విడిచిపెడుతున్నట్లుగా నిశ్వాసించాలి.
› ఎలాంటి ఆలోచన, మంత్రం లేకుండానే శ్వాసించాలి. కానీ శ్వాసిస్తున్నట్లు, ప్రాణం ప్రవహిస్తున్నట్లు మాత్రం ఎరుకతో ఉండాలి.
› మీకు పరిపూర్ణ విశ్రాంతిగా అనిపించిన తర్వాత కళ్లు తెరవాలి. నెమ్మదిగా కూర్చోవాలి.
.. ఒకటి మాత్రం నిజం. తేలికైన పొట్ట, మానసిక ప్రశాంతత, సమత్వ సాధన ద్వారా భావోద్వేగపరమైన ఆటంకాల నుంచి విముక్తి పొందవచ్చు. మనసు గందరగోళం చెందకుండా చూసుకోవడమూ ముఖ్యమే. కడుపును తేలికగా ఉంచుకోవడం అన్నది మెదడు పొరలు కమ్ముకోకుండా ఉండటానికి దోహదపడుతుంది. కాబట్టి, శరీరం, మనసు అనే గుర్రాలను ఆలోచనలు అనే పగ్గాలతో నియంత్రించాలి.
మనిషి మెదడు అలవాటు ప్రకారం నడుచుకుంటుంది. మనకు బాగా అలవాటైన దానిని ‘సహజం’ లేదా ‘స్వభావం’గా పరిగణిస్తాం. సంకల్ప బలంతో ఏ అలవాటునైనా వదిలించుకోవచ్చు, ఓ కొత్త అలవాటును జీవితంలో భాగం చేసుకోనూవచ్చు. మెదడులో ఒక్కోభాగం ఒక్కో విధిని నిర్వర్తిస్తుంది. వాటిని కూడా మనకు కావల్సినట్లుగా మార్చుకోవచ్చు. దీనిని న్యూరోప్లాస్టిసిటీ సిద్ధాంతం అంటారు. అంతా అభ్యాసంతో సాధ్యమవుతుంది. అందుకే మన పెద్దలు ‘అభ్యాసం కూసు విద్య’ అన్నారు. దీనికోసం మనం చేయాల్సిందల్లా ఒకటే. ఒక దగ్గర కూర్చోవడం, మన లక్ష్యాన్ని నిర్ణయించుకొని సాధన చేయడం. మెదడుకు మనం పదేపదే చెప్పుకొన్నదే చివరికి మన అలవాటుగా మారిపోతుంది. పైన వివరించిన అన్ని ప్రయత్నాలు, పద్ధతులను ఆచరించడం మీద మన జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకోవడం ఆధారపడి ఉంటుంది. మనం ఎలా ఆలోచిస్తే మన మెదడు కూడా అలానే ప్రతిస్పందిస్తుంది. కాబట్టి, సానుకూలమైన ఆలోచనలతో మెదడుకు నిరంతరం పదునుపెట్టుకుని మంచి జ్ఞాపకశక్తిని సొంతం చేసుకుందాం. జీవితంలో విజయాలు సాధిద్దాం.
వృత్తి ప్రవాహ ఇతి మనః
మనసు ఒక ఆలోచనల ప్రవాహం. భవిష్యత్తు నుంచి గతానికి, గతం నుంచి భవిష్యత్తుకూ ప్రవహిస్తూ ఉంటుంది.
టాలెంట్ ఉండి.. కష్టపడితే సినిమాల్లో రేపటి స్టార్స్ మీరే.. అందుకు వీళ్లే ప్రూఫ్ !!
ఇవి గెలిచినోళ్ల సక్సెస్ స్టోరీస్ కాదు.. ఒక్క తప్పుతో బొక్కబోర్లా పడ్డ వ్యాపారుల కథలు!!
ఆఫ్రికాలో సెటిలై వివిధ రంగాల వారికి ఇన్స్పిరేషన్గా మారిన మన తెలంగాణ బిడ్డలు వీళ్లే
“To have a high level of memory | జ్ఞాపకశక్తి ఉన్నతస్థాయిలో ఉండాలంటే ?”