ఆకాశాన్ని అందుకోవాలనే ఉత్సాహం.. ఏది మంచో, ఏది చెడో తెలిసీ తెలియని అమాయకత్వం వెరసి టీనేజ్ ప్రాయం. మరో తరానికి ప్రతినిధులుగా మారేందుకు సన్నద్ధులవుతున్న ఈతరం పిల్లలను ఓ సైబర్ భూతం సైలెంట్‌గా కమ్మేస్తున్నది. వర్చువల్ వరల్డ్‌లో విశృంఖలంగా విజృంభిస్తున్న CSAM (child sexual abuse material) టీనేజ్ పిల్లలనే కాదు, అభం శుభం ఎరుగని పసి హృదయాలనూ కబళిస్తున్నది. ఇది చిన్నారుల భద్రతకు మాత్రమే కాదు, సమాజంలో నైతిక విలువలకూ పెనుముప్పుగా మారింది.
18 సంవత్సరాలలోపు పిల్లలపై లైంగిక పరమైన కంటెంట్‌ని ప్రయోగించడమే CSAM (Child Sexual Abuse Material). పిల్లలను భయపెట్టడం, వారిని లోబర్చుకోవడం కోసం సైబర్ కీచకులు పన్నిన ఉచ్చు ఇది. సెక్స్ బొమ్మలు, వీడియోలు, ఇతర డిజిటల్ కంటెంట్ అస్ర్తాలను పిల్లలపై ప్రయోగిస్తున్నారు. ఒకప్పుడు డార్క్‌నెట్‌లో చేతులు చాచిన చైల్డ్ పోర్నోగ్రఫీ అబ్యూజ్ మెటీరియల్ ఇప్పుడు సామాజిక మాధ్యమాలకూ విస్తరించింది. జుగుప్సాకరమైన కంటెంట్‌కు ఏఐ ద్వారా మార్ఫింగ్ చేసి పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. మెసేజింగ్ యాప్‌లు, డార్క్ వెబ్ వేదికలుగా CSAM విపరీతంగా విస్తరిస్తున్నది. వాట్సాప్, టెలిగ్రామ్, డిస్కార్డ్ లాంటి ప్లాట్‌ఫామ్‌లలో గ్రూపులుగా ఏర్పడి ఈ అబ్యూజ్ మెటీరియల్‌ని పంచుకుంటున్నారు. ముఖ్యంగా, AI ఆధారిత ఇమేజ్ జనరేషన్ టూల్స్‌తో ఫేక్ కంటెంట్ సృష్టించి భావితరంపై బలవంతంగా రుద్దుతుండటం గర్హనీయం.
ఇంట్లో ఎక్కడ చూసినా.. సెల్ఫోన్లు.. ట్యాబ్‌లు.. ల్యాప్‌టాప్‌లే. దీంతో పిల్లలకు చిన్న వయసులో ఇంటర్నెట్, సోషల్ మీడియా యాప్స్ పరిచయం అవుతున్నాయి. ఎవరికి వాళ్లే అకౌంట్లు క్రియేట్ చేసుకుని సోషల్‌గా యాక్టివ్‌గా మారిపోతున్నారు. ఇక్కడే ఈ CSAM చొరబడుతున్నది. పిల్లలు వాడే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్‌చాట్ అకౌంట్లను హ్యాక్ చేసి సైబర్ నేరగాళ్లు చైల్డ్ అబ్యూజ్కి పాల్పడుతున్నారు. చిన్నారులను తెలివిగా లోబర్చుకొని వారితోనే సెక్సువల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. దాన్ని అడ్డం పెట్టుకొని ఆ పిల్లల తల్లిదండ్రులను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అడిగినంత సొమ్ము ఇవ్వకపోతే.. ‘మీ పిల్లల కంటెంట్ వైరల్ చేస్తామ’ని బెదిరిస్తున్నారు. కొన్నిసార్లు.. ఆ మెటీరియల్‌ను పోర్నోగ్రఫీ సైట్స్‌లో అప్లోడ్ చేసి వికృతానందం పొందుతున్నారు. కొన్ని ప్రత్యేకమైన స్పై టూల్స్ ద్వారా పిల్లలు వాడే ఫోన్లు, కంప్యూటర్లలోకి చొరబడి వారి ఫొటోలు, వీడియోలు దొంగిలించి దోపిడీకి దిగుతున్నారు.
CSAM కారణంగా పిల్లలు పలురకాల మానసిక సమస్యలకు గురవుతున్నారు. తెలిసీ తెలియని వయసులో జరిగిన దుశ్చర్య వారి మనోవికాసాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నది. అసభ్యకరమైన కంటెంట్ చూసిన ఆ కళ్లు సమాజాన్ని సరైన దృష్టితో చూడలేకపోతున్నాయి. విపరీత అనుభవాల కారణంగా పిల్లలు ఆత్మవిశ్వాసం కోల్పోతారు. భయంతో మౌనం వహిస్తుంటారు. అంతేకాదు.. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్న కుటుంబసభ్యులు కూడా ఆ షాక్ నుంచి అంత త్వరగా కోలుకోలేకపోతున్నారు. బయటికి తెలిస్తే పరువు పోతుందని గుట్టుగా బతికేస్తున్నారు. ఈ భయం కారణంగానే చాలామంది బాధితులు కనీసం ఫిర్యాదు చేయడానికి సాహసించడం లేదు. ఈ బలహీనతను ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్లు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. ఒకరిద్దరు ధైర్యం చేసి ఫిర్యాదు చేసినా.. పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. సోషల్ మీడియా యాప్స్ ఎన్క్రిప్షన్, ఏఐ విపరీతంగా అందుబాటులోకి రావడం కారణంగా నేర పరిశోధన అనుకున్నంత వేగంగా జరగడం లేదు.
పిల్లలను ఇలాంటి నేరాల నుంచి రక్షించడానికి ఉద్దేశించిన చట్టమే దేశంలో POCSO (Protection of Children from Sexual Offences). అయితే, చాలామందికి ఈ తరహా చట్టాల గురించి అవగాహన లేకపోవడం వల్ల నేరస్తులు తప్పించుకుంటున్నారు. POCSO ప్రకారం.. CSAM కంటెంట్‌ని క్రియేట్ చేయడం, షేర్ చేయడం, సేవ్ చేయడం.. లాంటివి చాలా కఠినమైన నేరాలు! బాధితులకు అండగా ఉండటానికి సైబర్ పోలీసు విభాగాలు ప్రత్యేకంగా CSAMను ట్రాక్ చేస్తున్నాయి. అలాగే, AI ఆధారిత ట్రాకింగ్ టూల్స్‌ను కూడా ఉపయోగించి నేరాలను అదుపు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఫొటో డీఎన్ఏ వంటి సాంకేతికత ద్వారా అక్రమ కంటెంట్‌ను గుర్తించి తొలగిస్తున్నారు. అయితే, వ్యక్తిగత అప్రమత్తతే CSAM ఉచ్చులో చిక్కకుండా చేస్తుందని తల్లిదండ్రులు గుర్తెరగాలి. ‘నెట్టింట్లో పిల్లల భద్రత మన బాధ్యత’ అన్న నినాదంతో ముందుకుసాగాలి. ఏదైనా ఇబ్బంది ఎదురైనప్పుడు నిర్భయంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలి. సైబర్ క్రైమ్ పోర్టల్ cybercrime.gov.in ని ఆశ్రయించొచ్చు. పోర్టల్‌లోని Child Pornography/Child Sexual Abuse Material ఆప్షన్ లోకి వెళ్లి రిపోర్ట్ చేయెచ్చు. టోల్-ఫ్రీ నంబర్లు: 1930 (సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్), 1098 (చైల్డ్‌లైన్ ఇండియా) ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చు.