udChalo | అమ్మకు చూడాలనిపిస్తే సైన్యంలో ఉండే కొడుకు క్షణాల్లో రాలేడు. బిడ్డకు పెండ్లి కుదిరితే సైనికాధికారిగా ఉన్న నాన్న ఎక్కువ సమయం కేటాయించలేడు. అన్నీ తానై కుటుంబ అవసరాలను తీర్చడం సైనికోద్యోగులకు సాధ్యం కాదు. ఇవన్నీ నిన్నటి మాటలు. ఇప్పుడు సైనికుల ప్రయాణాలు, ఇంటి అవసరాలు చూసుకోవడానికి ‘ఉడ్చలో’ యాప్ వచ్చేసింది.
సైన్యంలో కొలువంటే .. ప్రతిక్షణం అభద్రతే, ప్రతి రోజూ మృత్యువుతో కరచాలనమే. ఇంట్లో ఎవరికైనా రాకూడని ఆపద వచ్చినా.. పరుగెత్తుకుని రాలేరు. ఇంట్లో వేడుక జరుగుతున్నా ఠంచనుగా పంచె కట్టుకుని వాలిపోలేరు. ఎన్నో సైనిక కుటుంబాల బాధల్ని రవికుమార్ అతి దగ్గరగా చూశాడు. దేశం కోసం పాటుపడే సైనికుల జీవితాలను ఆనందమయం చేయాలని భావించాడు. ఆ ఆలోచనలకు ప్రతిరూపమే.. ‘ఉడ్చలో’ యాప్. పుణె కేంద్రంగా పనిచేసే స్టార్టప్ ఇది. సైనిక కుటుంబాల కోసమే రూపొందించిన ఈ మొబైల్ అప్లికేషన్ వ్యక్తిగత ప్రయాణాల నుంచి కుటుంబ అవసరాల వరకు.. ఎన్నో విధాలుగా సాయపడుతుంది.
త్రివిధ సాయుధ బలగాల్లో దాదాపు 30 లక్షల ఉద్యోగులు ఉన్నారు. సరిహద్దుల్లోనో, సుదూర ప్రాంతాల్లోనో ఉండే సైనికులు అయినవాళ్లను కలుసుకునే అవకాశం ఎప్పుడొస్తుందో తెలియదు. ఆత్మీయులకు ఆపద ముంచుకొచ్చిందని తెలిసినా ఆగమేఘాల మీద వచ్చేయలేరు. కొన్నిసార్లు చివరి నిమిషంలో సెలవులు దొరుకుతాయి. కొన్నిసార్లు దొరికిన సెలవులను సద్వినియోగం చేసుకోలేక ఇబ్బందిపడతారు. రైలు ప్రయాణాల్లో సైనికుల కోటాలో టికెట్ దక్కించుకునేందుకు మూమెంట్ కంట్రోల్ ఆఫీస్ నుంచి చేసే ప్రయత్నాలు తరచూ విఫలం అవుతుంటాయి. దీంతో ఇంటికి చేరుకోవడానికైనా, విధుల్లో చేరడానికైనా ఎంతో ఇబ్బంది. అత్యవసర సమయంలో ప్రయాణాలను వాయిదా వేయలేరు. కానీ దేశ సరిహద్దులో మొదలైన ప్రయాణం గమ్యానికి చేరాలంటే కొన్నిరోజులు గడుస్తుంది. ఈ ప్రయాణంలో స్లీపర్ క్లాస్ టికెట్ లభించకపోతే కూర్చునో, నిలబడో ప్రయాణం చేయడానికి సైనికులు సిద్ధపడతారు. మనం ఎప్పుడో ఒకప్పుడు.. కాదు ఎప్పుడు రైలెక్కినా కిక్కిరిసిన కంపార్ట్మెంట్లలో ప్రయాణించేవారిలో సైనికులూ ఉంటారు.సైనికుల కష్టాలు ఇలా ఉంటే.. విమానయాన సంస్థల కష్టాలు మరోలా ఉన్నాయి.
విమాన సర్వీసుల్లో రోజూ 50 వేలకు పైగా సీట్లు ఖాళీగా ఉంటాయి. వాటిని సైనికుల అవసరాలకు వాడుకుంటే వాటి ఆదాయమూ పెరుగుతుంది. కాబట్టి ఉడ్చలో వ్యవస్థాపకుడు రవికుమార్ ప్రతిపాదనకు అవి అంగీకారం తెలిపాయి. రైలు ఏసీ బోగీ చార్జీలతో సమాన ధరలో టికెట్‌ను నిర్ణయించాయి. సైనికుడి గమ్యాన్ని బట్టి ఏయే మార్గాల ద్వారా ప్రయాణించవచ్చో ఉడ్చలో చెబుతుంది. ఆ మార్గంలో సర్వీసులు నడిపే విమానాల్లో సీట్లు బుక్ చేస్తుంది. మిలిటరీ క్యాంప్ నుంచి విమానాశ్రయానికి చేరుకోవడానికి, అక్కడినుంచి ఇంటికి.. వెళ్లాల్సిన చోటుకు వెళ్లేంతవరకూ అన్ని అవసరాలనూ ఈ యాప్ తీర్చేస్తుంది. విమానాలు, బస్సులు, రైళ్ల టికెట్లను దీనిద్వారా బుక్ చేసుకోవచ్చు. విమానాశ్రయాకి చేరుకోవడానికి అవసరమైన క్యాబ్ సర్వీసుల్ని కూడా ఉడ్చలో అందిస్తుంది. ఒకవేళ విమానం కోసం గంటలకొద్దీ వేచి ఉండాల్సి వస్తే కనుక, ఆ సమయంలో నిద్రపోవడానికి హోటల్ రూమ్ బుక్ చేయడం, భోజనం సమకూర్చడం కూడా ఈ స్టార్టప్ బాధ్యతే. సైనికోద్యోగులు, విమానయాన సంస్థల మధ్య ఉడ్చలో అనే వారధి ఉండటం వల్ల ప్రయాణ సమయం తగ్గుతుంది. ఫలితంగా కుటుంబంతో ఎక్కువ సమయం గడిపే అవకాశం వస్తుంది.
సెలవు రోజుల్లో కుటుంబసభ్యులతో కలిసి ఎక్కడికైనా వెళ్లాలని అనుకున్నా.. హోటళ్లు, క్యాబ్ సర్వీస్‌లు సిద్ధంగా ఉంటాయి. ఉడ్చలో యాప్‌లోనే బీమా సేవలు, ఇన్కమ్ ట్యాక్స్ ఈ-ఫైలింగ్ చేయవచ్చు. రియల్ ఎస్టేట్ బేరాలు కూడా చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. విద్యుత్ బిల్లులు, ఇంటి పన్నులు చెల్లించవచ్చు. గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. అన్నట్టు, ఉడ్చలోను ఉపయోగించే వారిలో 90 శాతం మందికి పైగా సేవలపట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నేషనల్ స్టార్టప్ అవార్డ్ గెలుచుకుందీ యాప్. 2022 చివరికి కోటిమందికి చేరువ కావాలన్నది రవి కుమార్ లక్ష్యం. వ్యాపారం ఎవరైనా చేస్తారు. కానీ దానికి సామాజిక బాధ్యతను జోడించడమే గొప్ప.