Rats | ఇదిగో ఇక్కడ కనిపిస్తుందే ఆ డ్యామ్ కట్టేసరికి తలప్రాణం తోకకి వచ్చిందనుకో… అన్నది తోకను నిమురుకుంటూ ఓ పెద్ద ఎలుక. ముఖ్యంగా పిల్లర్ల కోసం ఆ పెద్ద దుంగలు నరికే సరికి.. సారీ కొరికే సరికి దుంప తెగిందనుకో అంది మరో మధ్య వయసు నారింజ పండ్ల ఎలుక. ఏదేమైనా అందరం కట్టగట్టుకొని ఆనకట్ట కట్టడం భలే ఆనందం అబ్బా… ఇంక మన ఇండ్లకు ఏ కాలమైనా సమస్యే లేదు అంది ఓ చిట్టి ఎలుక. ఇదేం కార్టూన్ సినిమా కథ కాదండీ. నిజంగానే ఈ ఎలుకలు సమష్టిగా పనిచేసి నదుల దగ్గర డ్యామ్‌లు కడతాయి. జీవావరణ ఇంజినీర్లుగా వీటికి పేరుంది. ఇంతకీ ఇవి ఎందుకిలా చేస్తాయీ…
ఇక్కడి చిత్రాల్లో కనిపిస్తున్న ఎలుకలను బీవర్లుగా పిలుస్తారు. అమెరికాతో పాటు, యురేషియా ప్రాంతంలో అంటే ఉత్తరార్ధగోళంలో ఎక్కువగా నివసించే వీటి నైపుణ్యాలు అచ్చెరువొందిస్తాయి. పారే నదులు, నదీ పాయలు, సెలయేళ్లలో ఇవి నివసిస్తాయి.
డోమ్‌ల ఆకృతిలో ఉండే వీటి ఇండ్లను నిర్మించుకోవడం కోసం తామే ఆ ధారలో ఓ చోట మడుగులను ఏర్పాటు చేసుకొంటాయి. అందుకోసం నదీ ప్రవాహ వేగాన్ని తగ్గించేందుకు ముందుగా నీటి ప్రవాహం అంచున ఉన్న పెద్దచెట్లను తన బలమైన నారింజ రంగు పండ్లతో కొరికి నేల కూలుస్తాయి.
ఇవి తమ పళ్లతో 148 అడుగుల ఎత్తు, 45 అంగుళాల చుట్టుకొలత కలిగిన పెద్ద చెట్లను సైతం పడేసినట్టు రికార్డులున్నాయి. వీటి పళ్లలో ఇనుము ఎక్కువగా ఉండటం వల్ల వీటికా రంగు వస్తుందట. ఆ తర్వాత అన్నీ కలిసి ఆ దుంగలను నీటి ప్రవాహం వైపు నెట్టుకొస్తాయి.
దుంగలు నిలబడటానికి తమ రెండు చేతులతో గుండ్రాళ్లు, మట్టిని పోగుచేసి ఒక దగ్గరికి తెస్తాయి. అవన్నీ కుదురుకుని నీటి ప్రవాహం నెమ్మదించాక చెట్ల కొమ్మలు, గులక రాళ్లు, ఇసుక, పుల్లలు, గడ్డి ఇలా అన్నింటినీ వేస్తూ ఒక ఆనకట్టను నిర్మిస్తాయి. దీంతో ఆ భాగం ఇండ్లు కట్టుకోవడానికి అనుకూలంగా మారుతుంది.
ఇందులో పుల్లలు, రాళ్లూ ఏరుకొచ్చి బోర్లించిన గూడులా తమ ఇండ్లను కట్టుకుంటాయి. తినడానికి, ఉండటానికి, చలికాలం ఆహారం నిల్వ చేసుకునేందుకు వీలుగా విడివిడి భాగాలుగా నిర్మించుకుంటాయి.
వీటి ద్వారాలు మాత్రం నీటిలోపలి నుంచి వెళ్లగలిగేలా మాత్రమే ఉంటాయి. అంటే నేల మీది వీటి శత్రువుల నుంచి తప్పించుకోవడానికన్నమాట. ఇక, ఇలా ఆనకట్ట కట్టి నీటి కొలను ఏర్పరచుకోవడం వల్ల నీటి మట్టం నియంత్రణలో ఉంటుంది. దాంతో గడ్డకట్టే చలిలోనూ అడుగున నీరు ఉండి వీటి రాకపోకలకు ఇబ్బంది ఉండదు. ఇవి ఇలా ఆనకట్ట కట్టడం వల్ల ఆ ప్రాంతంలో చేపలు, కప్పలు, పురుగులతో చక్కటి జీవావరణ వ్యవస్థ కూడా ఏర్పడుతుందట. చలికాలం ముందు డ్యామ్ మెయింటెనెన్స్ పనులను చేసుకుంటాయట బీవర్లు. ప్రకృతిలో ఎన్ని వింతలో కదూ!