Bureaucrats | సామాజిక మాధ్యమాలు అంటే చాలామందికి ఆటవిడుపే. కానీ ప్రభుత్వ యంత్రాంగంలో కీలక బాధ్యతల్లో ఉన్న కొందరు అధికారులకు మాత్రం అవి ప్రజా సమస్యల పరిష్కారానికి సరైన వేదికలు. సోషల్ మీడియా సాయంతో కర్ణాటకలో ఓ ఐఏఎస్ అధికారి గ్రంథాలయాలను బాగుచేస్తే, ఉత్తరప్రదేశ్‌లో ఓ యువ రైల్వే అధికారి కార్మికుల శ్రమను ప్రపంచానికి వెల్లడిస్తాడు. మరో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి అడవుల అందాలను ఫొటోల రూపంలో పరిచయం చేస్తూ.. వాటి మనుగడ బాధ్యత మనదేనని గుర్తుచేస్తాడు.
లాక్‌డౌన్‌తో దాదాపు ప్రపంచమంతా స్తంభించిపోయింది. దానికి కర్ణాటక కూడా మినహాయింపు కాదు. ఈ సమయంలో ఆ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం గ్రామీణ గ్రంథాలయాలను డిజిటలైజ్ చేయాలనే ఆలోచనను అమలు చేసింది. అలా ఈ రెండేండ్ల కాలంలో జీర్ణావస్థకు చేరుకున్న భవనాలు, దుమ్ముపట్టిపోయిన తరగతి గదులు కొత్తకళను సంతరించుకున్నాయి. గోడల మీద రంగురంగుల చిత్రాలు అందంగా కొలువుదీరాయి. ఆ ప్రభావంతో 5,600 గ్రంథాలయాల్లో 15 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. దాదాపు 11 లక్షల పుస్తకాలు విరాళంగా వచ్చిచేరాయి. ఇదంతా పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఉమా మహాదేవన్ దాస్‌గుప్తా తీసిన ఫొటోలు, వీడియోల వల్లే సాధ్యమైంది. ఈ అధికారి ట్వీట్లు కర్ణాటకలో గ్రామ పంచాయతీలకు స్ఫూరి మంత్రాలు. ఉమా మహాదేవన్‌కు సోషల్ మీడియాలో 14,700 మంది ఫాలోవర్లు ఉన్నారు.
ఆహారం, సమయ పాలన, పరిశుభ్రత విషయంలో భారతీయ రైల్వే మీద ఫిర్యాదు చేయనివాళ్లు ఉండరు. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ యువ అధికారి సంజయ్ కుమార్ కొత్తదనానికి స్వాగతం పలికాడు. దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే జంక్షన్లలో ఒకటైన ఫిరోజాబాద్ జిల్లా టుండ్లా దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు తను. అయితే మిగిలిన వారికి భిన్నంగా రైల్వే క్రాసింగ్ దగ్గర భద్రతకు హామీనిస్తూ పట్టాల దగ్గర పహరా కాసే మహిళల పట్ల శ్రద్ధ చూపాడు. ఆ మహిళలు తాము విధులు నిర్వర్తించే ఆరు గంటల్లో కనీసం ఒక్కసారి కూడా శౌచా లయానికి వెళ్లలేని పరిస్థితి. ఇంత విలువైన పనిచేస్తున్నా, ఎలాంటి గుర్తింపునకూ నోచుకోకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తాడు సంజయ్. అంతేకాదు, ఆ శ్రమజీవుల ఫొటోలను ట్విటర్లో పోస్ట్ చేస్తుంటాడు. సంజయ్‌కు ట్విటర్లో 23,800 ఫాలోవర్లు ఉన్నారు.
గత నెల 90 సెకండ్ల నిడివి ఉన్న ఒక వీడియో వైరల్‌గా మారింది. అందులో ఉన్నది ఏ సినీ నటుడో, క్రీడా నిపుణుడో కాదు. తల్లి నుంచి వేరుపడిన ఒక చిన్నారి చిరుతపులి వీడియో అది. అయితే చిరుతకూన సంరక్షణ కోసం అటవీ శాఖ సిబ్బంది ఆ ప్రదేశాన్నంతా జల్లెడ పట్టారని చెబుతాడు ప్రవీణ్ కస్వాన్. అలా 24 గంటల అన్వేషణ తర్వాత ఆ చిరుతను తల్లి చెంతకు చేర్చామని ఆనందం వ్యక్తం చేస్తాడు. ప్రవీణ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి. తన సోషల్ మీడియా పోస్టుల్లో అడవులే ప్రధాన ఇతివృత్తం. రాజసం ఒలకబోసే రాయల్ బెంగాల్ బెబ్బులిని అడవుల్లోకి వదిలిపెడుతున్న చిత్రాలు, అంతరించిపోతున్న గిబ్బన్లను అక్రమంగా తరలిస్తున్న వేటగాళ్లను పట్టుకున్న వీడియోలు, సహ విహంగానికి ఆహారం తినిపిస్తున్న మగ హార్న్‌బిల్ పక్షుల ఫొటోలతో ప్రవీణ్ సెలెబ్రిటీ హోదా అందుకున్నాడు. ప్రవీణ్‌కు 3 లక్షల 88 వేల ఫాలోవర్లు ఉన్నారు.
దేశవ్యాప్తంగా ప్రజల్లో పోలీసుల పట్ల పేరుకుపోయిన భయం, అనుమానాలను సామాజిక మాధ్యమాల ద్వారా దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఒడిశా రాష్ట్రం క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం- క్రైమ్ బ్రాంచ్ (సీఐడీ- సీబీ) అధిపతి అరుణ్ బోత్రా. ఈ దిశగా ఆయన సహకారం ఆశిస్తూ వేలాది మంది ఆయన సోషల్ మీడియా ఖాతాను ఆశ్రయిస్తున్నారు. రాజస్థాన్‌కు చెందిన బోత్రా ‘ఇది నాకు ప్రజలతో ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పరుస్తుంది’ అంటారు. అంతేకాదు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య భావ ప్రసారం కొన్నిసార్లు అగాధాన్ని తలపిస్తుందనీ వాపోతారు. కాగా, ట్విటర్ ద్వారా తనకు అందుతున్న ఫీడ్‌బ్యాక్ వల్ల తన బాధ్యతలు మరింత మెరుగ్గా నిర్వర్తిస్తున్నానని బోత్రా నొక్కి చెబుతున్నారు. గత ఏడాది బోత్రా విద్యుత్ విభాగంలో పనిచేయాల్సి వచ్చింది. అప్పుడు ఓ గ్రామంలో నాలుగు రోజులుగా కరెంటు లేదని ఆయనకు ఫిర్యాదు అందింది. రాత్రికి రాత్రే సమస్య పరిష్కారమైంది. సోషల్ మీడియానే లేకపోతే తనకు ఆ సంగతి అసలు తెలిసేదే కాదంటారు బోత్రా. ఇక కొవిడ్ సమయంలో అవసరమైన వారికి మందులు, ఆహారం, ప్లాస్మా.. దేశంలో ఒకచోటు నుంచి మరోచోటుకు రవాణా చేయడానికి బోత్రా ట్విటర్‌ను ఆయుధంగా మలుచుకున్నారు. దీనికోసం ఆయన 4,200 మంది కార్యకర్తలతో ‘ఇండియా కేర్స్’ అనే స్వచ్ఛంద దళాన్ని ఏర్పాటుచేశారు. ఈ ఐపీఎస్ అధికారికి సోషల్ మీడియాలో రెండున్నర లక్షల ఫాలోవర్లు ఉన్నారు.
“మేడమ్ సర్.. బీహార్ నుంచి ఐపీఎస్‌కు ఎంపికైన తొలి మహిళ ఆత్మకథ ఇది”