Roman Saini | అతను.. రోగాల్ని నయంచేసే డాక్టర్. కానీ, సమాజానికి పట్టిన చీడను రూపుమాపేందుకు ఐఏఎస్ సాధించాడు. సబ్-కలెక్టర్‌గా చేస్తున్నప్పుడే తత్వం బోధపడింది. వ్యవస్థను మార్చాలంటే దేశవ్యాప్తంగా ఓ తెలివైన సమూహాన్ని తయారు చేయాల్సిందే అనే నిర్ణయానికొచ్చాడు. వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అట్టడుగు వర్గాల విద్యార్థుల దగ్గరినుంచి, ఆర్థికంగా ఏ లోటూలేని పిల్లల వరకు.. కాలంతో పోటీపడి చదివే ప్రతి ఒక్కరినీ ఓ వేదిక మీదికి ఆహ్వానించాడు. ‘అన్ అకాడమీ’ ఆరంభించాడు. ఆ కంపెనీ మార్కెట్ విలువ ఇప్పుడు వేలకోట్లు. ఆ వేదిక సాయంతో జీవితాలు మారినవారు లక్షలమంది.
2014, మే నెల. సివిల్స్ మెయిన్స్‌లో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. టేబుల్ చుట్టూ సీనియర్ ఐఏఎస్ అధికారులు, విద్యావేత్తలు. హాట్సీట్లో.. 22 ఏండ్ల రోమన్ సైని. తొలి ప్రయత్నంలోనే మంచి ర్యాంకు తెచ్చుకున్నాడు. ఇంటర్వ్యూను ఎదుర్కోవడం అదే మొదటిసారి.
మొదటి ప్రశ్న ఏం అడుగుతారో తనకు ముందే తెలుసు. అదే ప్రశ్న రానే వచ్చింది.
‘మీరొక డాక్టర్. ఐఏఎస్ ఎందుకు కావాలనుకుంటున్నారు?’.
‘నేను నా పనిలో మెరుగైన ప్రభావాన్ని చూపాలనుకుంటున్నాను. ఆ పనికి మెడిసిన్ అడ్డొస్తుందని భావించి, ఐఏఎస్ వైపు వచ్చాను’ అంటూ నిజాయతీగానే చెప్పాడు. ఇంతలోనే
‘ప్రతి వైద్యుడూ.. ఇలాంటి అర్థంలేని సమాధానాలే చెబుతారు. కొత్తగా ఏదైనా చెప్పు’ అంటూ అసహనంగా మాట్లాడాడు మరో అధికారి.
‘డాక్టర్‌గా సంపాదించింది చాలక.. అవినీతి అధికారిగా మారిపోయి, మరింత డబ్బు కూడబెట్టుకోవాలనే ఉద్దేశంతోనే ఇటువైపు వచ్చావు కదూ?’
తలపండిన ఇంకో పరీక్షకుడు పదునైన ప్రశ్న సంధించాడు. దీంతో తన సహనాన్ని పరీక్షించడానికి ఇదో మార్గమని ఆ యువ డాక్టర్‌కు అర్థమైపోయింది. ‘లేదండీ, నేను ప్రజా
సేవకే కట్టుబడి ఉన్నా. నా నిజాయతీని శంకించొద్దు’ అంటూ ప్రశాంతంగా సమాధానం ఇచ్చాడు.
ఆ తర్వాత కూడా ప్రశ్నల పరంపర కొనసాగింది. అన్నిటికీ చాలా ఓపికతో సమాధానాలు చెప్పాడు. కొద్దిరోజులకే ఫలితాలు వచ్చాయి. ‘తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌లో 18వ ర్యాంకు సాధించిన వైద్యుడు’ అంటూ వార్తా పత్రికలు మొదటి పేజీ కథనాలు ప్రచురించాయి. యువత దృష్టిలో హీరో అయ్యాడు సైని.
మెరుగైన విద్య, ఉద్యోగావకాశాలు, సరైన మార్గనిర్దేశం.. ఈ మూడూ యువతకు అవసరమని గ్రహించాడు రోమన్. పరిష్కార మార్గాలను అన్వేషించే క్రమంలో ఐఏఎస్ కొలువుకు రాజీనామా చేశాడు. ఉన్నత లక్ష్యాన్ని సాధించాలంటే ఒక ప్రాంతానికే పరిమితం కాకూడదు. అందుకు ఆన్లైన్ శిక్షణే సరైందని భావించాడు. వెంటనే తన స్నేహితులు గౌరవ్ ముంజల్, హేమేశ్ సింగ్‌తో కలిసి ‘అన్ అకాడమీ’ పేరుతో ఆన్లైన్ ట్యుటోరియల్ వెబ్‌సైట్‌ను ప్రారంభించాడు. ప్రచారానికి యూట్యూబ్, సోషల్ మీడియా సాధనాలను విరివిగా వాడేవాడు. ఇక్కడ సివిల్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఐబీపీఎస్ వంటి ఉద్యోగ నియామక పరీక్షల మెటీరియల్‌ను, టీచింగ్‌ను ఆన్లైన్లో ఉచితంగా అందిస్తున్నాడు. ఇప్పటివరకు దాదాపు మూడు లక్షల మందికిపైగా అన్ అకాడమీ ద్వారా శిక్షణ పొందారు. 20వేలకు పైగా బోధనా సిబ్బందితో కూడిన నెట్వర్క్ ఉంది.
రోమన్ సైని సామాజిక దృక్పథంతో ఐఏఎస్‌కు రాజీనామా చేసి మరీ ఆన్లైన్ ట్యుటోరియల్ను స్థాపించిన తీరుచూసి.. చాలామంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఫిదా అయ్యారు. కిరణ్ బేడీ సహా పలువురు నిపుణులు ఈ వేదిక ద్వారా స్వచ్ఛందంగా సేవలందిస్తున్నారు. సామాజిక దృక్పథం ఉన్న యువ సివిల్ సర్వెంట్లు సైతం ఉత్సాహంగా ముందు
కొస్తున్నారు. ‘మీరు మీ ప్రయాణాన్ని పూర్తిగా ఆస్వాదించండి. గెలుపు ఓటములపై అస్సలు దృష్టిపెట్టొద్దు. అప్పుడే లక్ష్యాన్ని చేరుకోగలరు’ అంటాడు రోమన్ సైని. అన్నట్లు, తను మంచి గిటారిస్ట్. పాటలు కూడా పాడతాడు.
జైపూర్‌కు చెందిన రోమన్ సైనీ కుటుంబంలో 12మంది డాక్టర్లు ఉన్నారు. చిన్నప్పుడు వాళ్లను చూసి తనూ స్ఫూర్తి పొందాడు. భారత్‌లోనే అత్యుత్తమ వైద్య సంస్థ అయిన ఎయిమ్స్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అతి పిన్నవయస్కుడిగా చరిత్రకెక్కాడు. సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో తొలి ప్రయత్నంలోనే ఐఏఎస్ సాధించాడు. శిక్షణ అనంతరం.. మధ్యప్రదేశ్ క్యాడర్లో జబల్పూర్ అసిస్టెంట్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టాడు. విధి నిర్వహణలో భాగంగా వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు యువత ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రత్యక్షంగా చూశాడు. చాలా ప్రాంతాల్లో యువతకు ఉద్యోగ అవకాశాల పట్ల అవగాహన తక్కువ. మార్గనిర్దేశం చేసేవారూ లేరు. కోచింగ్ ఖర్చులను భరించలేని ఆర్థిక పరిస్థితులే కనిపించాయి.
సాఫ్ట్వేర్ జాబ్ కాదనుకుని అరణ్య మార్గం పట్టింది.. అన్నీ తానై అడవికి ఆయువు పోస్తున్నది”
“నాసాలో జాబ్ వదిలేసి.. రైతుల కోసం కష్టపడుతున్నడు”
“Sai Chinmayi | ఐటీ జాబ్ వదిలేసి వ్యవసాయం చేస్తున్న తెలంగాణ ఆడబిడ్డ”