నా యనా, ఎవరి బలహీనతలకు, ఎవరి అజ్ఞానానికి వాళ్ళే బాధలు పడాలి. నీ చర్యల ఫలితం నువ్వే అనుభవించాలి. ఇతరులను నిందించిన ప్రయోజనం ఏముంది? ఒకళ్లను చూసి ఈర్ష్యపట్టం, నీ కష్టాలకు ఇతరుల సంకుచిత స్వభావం కారణం అనుకోవటం! నీ బలహీనతలను, నీ పొరపాట్లను సమర్థించుకోవటానికి కారణాలు వెతకడం, నీ అసమర్థత మూలంగా వొచ్చిన కోపానికి ఇతరులను గురిచెయ్యటం, నీబోటి చదువుకున్నవాడు, విశాల హృదయుడు, కీర్తికాముడు చెయ్యవలసిన పనికాదు. నీ వంశ ప్రతిష్ఠకు, నీ కుటుంబ గౌరవానికి భంగం.
జీవితం ప్రవాహం ప్రచండ వేగంతో వెళ్ళిపోతూ ఉంది. అందులో ఎవరెవరి సంస్కారాన్ని బట్టి వాళ్ళు తమ సుఖం కోసం పోట్లాడుకుంటున్నారు. ఇదొక మహా సంగ్రామం. ఈ సంగ్రామంలో పిరికివాళ్లకు, అసమర్థులకు చోటులేదు. టిక్కట్లు ఇచ్చే కిటికి దగ్గర జనం విరగబడి నేను ముందు టిక్కట్టు తెచ్చుకోవాలంటే, నేను ముందు తెచ్చుకోవాలని తొక్కిసలాడుతూ ఉంటారు. చూడు జీవిత సంగ్రామాన్ని తలుచుకున్నప్పుడల్లా ఆ దృశ్యం కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది నాకు. ప్రతివాడూ తను ముందు టిక్కట్టు తెచ్చుకోవాలని తాపత్రయపడే వాడే గాని, మిగిలిన వాళ్ల సంగతి ఏ ఒక్కడూ ఆలోచించడు, కాళ్లు నలుగుతయ్, చొక్కాలు చిరుగుతయ్, ఒక్కడూ ఇలా చెయ్యడం తప్పనుకోడు. చేయించుకోవటం అవమానం అనుకోడు. ప్రతివాడి దృష్టి టిక్కట్టు మీదే! ఒకడు ఇనుప పాదాలతో వొస్తాడు. జనాన్ని కసాపిసా తొక్కుకుంటూ కిటికి దగ్గరకు వెళ్తాడు. అందరికంటే వెనుక వచ్చినా, అందరికంటే ముందే టిక్కట్టు తెచ్చుకుంటాడు.
అసమర్థులు, భీరువులు ఆ సంఘర్షణలోకి దిగలేక దూరంగా నిలబడి చూస్తూ ఉంటారు. వాళ్లూ రైలుకి వెళ్లవలసినవాళ్లే. వాళ్లకూ టిక్కట్టు కావలసిందే. కాని, అందుకు ప్రయత్నించలేరు. పైగా టిక్కట్టు కోసం తాపత్రయపడేవాళ్లను చూచి, “నీచులు”, “స్వార్థపరులు”, “మోసగాళ్లు” అని ఏమోమో అనుకొని తృప్తిపడతారు. వాళ్లు ఎవరన్నా గానీ, వాళ్ల స్వభావం ఎటువంటిదైనా గానీ, టిక్కట్టు దొరికేది వాళ్లకే. రైలు అందేదీ వాళ్లకే. రైలుకు వెళ్లటం ముఖ్యం అయినప్పుడు అందుకు అవసరం అయిన పనులన్నీ చెయ్యవలసిందే. ఆ పనులన్నీ మంచిపనులే అవుతాయి. అలా చెయ్యవలసిందే. వాళ్లు, వచ్చే పొయ్యేవాళ్లని చూస్తూ, టిక్కట్టు తెచ్చుకునేవాళ్ళని చూస్తూ ఈర్ష్యపడుతూ, రైలువాళ్లను విమర్శిస్తూ అలా నుంచోవలసిందే!