కాలేజీలో నేను ఎదుర్కొన్న అతిపెద్ద సమస్య.. ఇంగ్లీషులో మాట్లాడ్డం. అప్పటిదాకా బడిలో ‘ఏందోయ్.. ఎట్లనోయ్’ అనుకుంటూ దిల్ ఖుషీగా తిరిగిన నాకు.. కాలేజీలో పెద్ద చిక్కే వచ్చి పడింది. ఇంగ్లీషు, హిందీనే కాదు.. ఆ్ంరధ్రా తెలుగుతోనూ తిప్పలు పడాల్సి వచ్చింది.
నాకు ఇంగ్లీషు రాయడం బాగానే వచ్చేది. మాట్లాడేటప్పుడే తెంగ్లీషు అయ్యేది. అంటే ఇంగ్లీషును తెలుగు లాగా మాట్లాడటం అన్నమాట. అక్కడికీ నేనేదో ఎచ్చులకు ఇంగ్లీషు మీడియంలో చేరిందీ లేదు! ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ అనే అనుకున్నాను. కానీ, మా కాలేజీలో ఇంగ్లీషు మీడియం కూడా ఉండటం వల్ల.. వాళ్ల ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. బాగా డబ్బున్న వాళ్ల పిల్లలు, ముందునుంచీ ఇంగ్లీషు మీడియంలో చదువుకున్న పిల్లలు ఆ బ్యాచులో ఎక్కువ.
చుట్టుపక్కల ఊర్లవాళ్లకు హిందీ అయినా వచ్చేది. నాకు అది కూడా మాట్లాడటం రాకపోయేది. ఇంకో సంగతేమిటంటే.. అందరూ ఆంధ్రావాళ్లే కావచ్చునేమో! ‘వచ్చాం.. వెళ్లాం..’ అన్నట్లు మాట్లాడేవాళ్లు. అదే అసలైన తెలుగేమో అనుకుని నేను మాట్లాడటానికే భయపడేదాన్ని. నాతోపాటు గంభీరావుపేట నుండి వచ్చిన మాధవీలత తప్ప.. తెలంగాణ యాసలో మాట్లాడేవాళ్లే లేరు.
ఇంగ్లీషు క్లాసులో అందరూ తప్పనిసరిగా ఇంగ్లీషులోనే మాట్లాడాలని ఓ రూల్ ఉండేది. ఓసారి రత్నాకరం మేడమ్ పాఠం చెప్పడం అయిపోయాక అందరి నోట్స్ పరిశీలించారు. నోట్స్ తేనివాళ్లని చేతులెత్తమంటే కొందరు ఎత్తారు. సుగుణ అనే అమ్మాయిని లేపి నోట్స్ ఎందుకు తేలేదని ఇంగ్లీషులో అడిగారు మేడమ్.
“నాట్ రైట్ మేడమ్” అన్నది సుగుణ. రాయలేదని ఆ అమ్మాయి ఉద్దేశం. “అంటే! నిన్ను నోట్స్ అడగడం సరియైనది కాదంటావా?” అన్నారు మేడమ్.. మళ్లీ ఇంగ్లీషులో. క్లాసంతా నవ్వారు. “నోనో! మేడమ్! నేను రాయలేదని చెప్పాను. అంతే!” అన్నది సుగుణ. అప్పటికే తనకు ఒళ్లంతా చెమటలు పట్టాయి. రత్నాకరం మేడమ్ నిజంగా సముద్రంలానే గంభీరంగా ఉండేవారు.
“ఎందుకు రాయలేదు చెప్పు? అది కూడా ఇంగ్లీషులోనే చెప్పాలి” అన్నారామె మళ్లీ ఇంగ్లీషులోనే. “మై ఫాదర్ నోట్‌బుక్ నాట్ కొనింగ్ మేడమ్!” అని జవాబిచ్చింది సుగుణ. మళ్లీ అందరూ నవ్వారు. మేడమ్ వెంటనే.. “స్టాప్ లాఫింగ్ ఎట్ హర్!” అని.. “అలా నవ్వకూడదు! నవ్వితే మాట్లాడటానికే భయపడతారు. తప్పులైనా సరే మాట్లాడండి. సరే! రేపు తీసుకురావాలి” అని ఇంగ్లీషులో చెప్పారు. అప్పుడు ఆ పిల్లే కాదు.. నేను కూడా ఊపిరి పీల్చుకున్నాను. ఆ తరువాత మా తెలుగు మీడియం ఆడపిల్లలంతా వచ్చీరాని ఇంగ్లీషు అయినా సరే మాట్లాడటానికే ప్రయత్నించేవాళ్లం. తప్పులు పోతే ఒకర్నొకరు సరిచేసుకుంటూ ఉండేవాళ్లం.
ఓరోజు కాలేజీ వదిలే సమయానికి వాన చినుకులు మొదలయ్యాయి. అందరం ప్రవేశ ద్వారం వద్ద ఉన్న హాలులో ఆగిపోయాం. అప్పటికే అక్కడ ఉన్న కొద్దిమంది ఇంగ్లీషు మీడియం విద్యార్థినులు మమ్మల్ని చూడగానే మాటలు మార్చి ఇలా మాట్లాడటం మొదలుపెట్టారు. “టుడే మై మమ్మీ సెడ్ కం హోమ్ జల్దీ. బట్ వాట్ టూ డూ! వాన పడింగ్!”; “ఓ మై గాడ్! ఆస్క్ రెయిన్ టు స్టాప్! ఇట్ విల్ ఆపింగ్!”; “అబ్బా! రెయిన్ ఈజ్ నాట్ స్టాపింగ్! నాకు హంగ్రీ అయ్యింగ్!”; “ఓకే! లెట్స్ బేకరీ పోయింగ్!”.. అంటూ బిగ్గరగా నవ్వడం మొదలుపెట్టారు. ఆ మాటలు మా గురించేనని ఆరేళ్ల బుడ్డోళ్లకు కూడా తెలుస్తుందిగా! మా బ్యాచ్‌లో రజనీ పద్మ కుమారికి, శ్యామలకు చాలా ఉక్రోషం కలిగింది. “మనం వెళ్లి ప్రిన్సిపాల్‌కి కంప్లయింట్ ఇద్దాం” అంది రజని ఆవేశంగా.
“ప్రిన్సిపాల్ గారి రూమ్‌లోకి మనల్ని రానిస్తారా? మన ఇంగ్లీష్ మేడమ్‌కే చెబుదాం. ఆవిడ చెబితేనే కదా మనం ఇంగ్లీషులో మాట్లాడుతున్నాం. లేకపోతే శుబ్బరంగా తెలుగులోనే మాట్లాడుకునేవాళ్లం” అని శ్యామల అంది. మొత్తానికి వీళ్లు ఇలా ఏడిపిస్తున్నారని రత్నాకరం మేడమ్‌కి ఆ మర్నాడే చెప్పాం. “వాళ్లను నేను మందలిస్తాను. కానీ, మీరందరూ ఇంటర్ అయిపోయేలోగా చక్కటి ఇంగ్లీషు మాట్లాడ్డం నేర్చుకోండి. అదొక్కటేగా మీ ఇబ్బంది! పరీక్షల్లో ఎవరైనా ఒకటే కదా రాసేది. మరి ఎగ్జామ్‌లో బాగా రాసి మీరే ఎక్కువ మార్కులు తెచ్చుకుని వాళ్లకు బుద్ధి చెప్పండి” ఇంగ్లీషులోనే అన్నారామె నవ్వుతూ.
“ఇంగ్లీషు లెక్చరర్ కదా! ఈమెకు కూడా ఇంగ్లీషు మీడియం పిల్లలంటేనే ఇష్టం. వాళ్లను కోప్పడరు.. ఏం అనరు. మనమే తేల్చుకుందాం” అంది రజనీ పద్మ కుమారి. “సరే! చూద్దాం.. మేడమ్ చెప్పారు కదా! గొడవలెందుకు?” అన్నాను నేను. అప్పటికి నేను కూడా తెలంగాణ భాషను ఇంట్లోనే వదిలి.. ‘చెప్పిన్రు’కు బదులు ‘చెప్పారు’ అనీ, ‘లొల్లి’కి బదులు ‘గొడవ’ అనీ మాట్లాడటం నేర్చుకున్నాను. మొదలే నాకు గొడవలంటే భయం. పైగా అనువుగాని చోటు! దీర్ఘాలు తీస్తూ ఆంధ్రా పలుకుబడి నేర్చుకోవడమే కష్టం అనుకుంటుంటే.. ఈ ఇంగ్లీషు చికాకు ఏమిటో నాకు అర్థం కాలేదు. తను వరంగల్‌లో చదువుకుంటున్నందున మా అక్కకు ఈ బాధే లేదు. స్థాన బలిమి కదా!
త్రైమాసిక పరీక్షలు అయ్యాక ఓరోజు క్లాసులో రత్నాకరం మేడమ్.. “మీలో ఎన్ రమాదేవి ఎవరు?” అని అడిగారు. నా గుండెలు గుబగుబమన్నాయి. లేచి నిలబడ్డాను. “అందరూ చప్పట్లు కొట్టండి. ఈసారి ఇంగ్లీషు సబ్జెక్టులో తెలుగు, ఇంగ్లీషు మీడియాల్లో కలిసి అత్యధిక మార్కులు తనవే! ఎనభై తొమ్మిది!” అన్నారు. అందరూ చప్పట్లు కొడుతుంటే కొంచెం గుండె దడ తగ్గింది. “వాడ్డూయూ సే?” అన్నారు మేడమ్. “థాంక్ యూ మేడమ్! మీ వల్లనే ఇదంతా. ఆరోజు మీరు చెప్పకపోతే ఇంత పట్టుదల వచ్చేదో కాదో!” అనాలని నా మనసు చెప్పింది. కానీ, సిగ్గుపడుతూ ముడుచుకుపోయి నిలబడ్డాను. “ఓకే.. సిట్” అన్నారు మేడమ్.
“భలే అయ్యింది కదోయ్! వాళ్ల రోగం కుదిర్చావు” అంది రజని. ఒక్క పరీక్షలో మంచి మార్కులొస్తే రోగం కుదర్చడం ఏముంటుంది గానీ, అందరూ సంతోషపడుతుంటే మన పక్కనున్నవాళ్ల ఆనందానికి మనం కారణమవడం ఇంత బావుంటుందా!? అనిపించింది.
ఆ తరువాత లాన్లో, మల్లె చెట్ల కింద బెంచీల మీద, బ్యాగుల్లో, క్లాసురూం డెస్కుల మీద.. ‘స్టాప్ బక్బాస్.. వీ ఆర్ ఆల్ ఇండియన్స్’ అన్న చీటీలు ఇంగ్లీషు మీడియం వాళ్లకు దొరకడం మొదలైంది. అది రజనీ గ్యాంగ్ పనేనని నాకు తెలుసు. ఆ తరువాత వాళ్లెవరూ మమ్మల్ని సతాయించలేదు. నేను కూడా ఓ మాదిరి ఇంగ్లీషునీ, రిక్షా, ఆటో, కూరగాయలు, పండ్ల బండ్ల వాళ్ల దగ్గర ఎంతో కొంత హిందీనీ నేర్చుకున్నాను.
నెల్లుట్ల రమాదేవి
రచయిత్రి