ఇల్లలకగానే పండుగ కాదని అందరికీ తెలుసు. కొందరు ఇల్లలికి పండుగే మర్చిపోతారు. అలా మరచిపోకుండా జీవితాన్ని పండుగ చేసుకోవాలని కలలుగనేవాళ్లు, కష్టపడేవాళ్లు కొందరే!ఆ కొందరిలోనూ అందరి బతుకూ పండుగ కావాలనుకునే మంచివాళ్లు బహు అరుదు. ఈ ఎన్నారైలు ఇలాంటి కోవకే చెందుతారు. పల్లెదాటి అమెరికా చేరినా నడిచొచ్చిన దారిని, పుట్టి పెరిగిన ఊరినీ మర్చిపోలేదు.‘మన తెలంగాణను బాగుచేసుకోవాలె’ అని అమెరికా నుంచే ఉద్యమం నడిపిస్తున్నారు! ‘తెలంగాణ కోసం కొట్లాడినం. రాష్ట్రం వచ్చింది. ఇగ మన ఇల్లు మనం మంచిగ చేసుకోవాలె’ అని పాటు పడుతున్నారు. ఊరి బాగుకోసం, పల్లె చదువు కోసం సేవా కార్యక్రమాలతో పేద విద్యార్థులకు అండగా నిలిచిన అమెరికాలోని తెలంగాణ బిడ్డల పల్లెబాటే.. మనకు వెలుగు బాట!
మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన సంస్థల్లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఒకటి. మధు కె.రెడ్డి, సుధీర్ కోదాటి, విమల కటికనేని సహా మరెంతోమంది తెలంగాణ బిడ్డలు దీనిని ఏర్పాటు చేశారు. పుట్టిన నేలమీద మమకారంతో ప్రవాసంలో ఉద్యమం మొదలుపెట్టారు. మన బిడ్డల కోసం, మన రాష్ట్రం కోసం అమెరికాలో తెలంగాణ వాదాన్ని వినిపించారు. ముక్కోటి గొంతుకల పోరాటం ఫలించింది. తెలంగాణ సిద్ధించింది. రాష్ట్రం కోసం రాజకీయ పోరాటం ముగిసింది. ఇక ఉద్యమ ఆకాంక్షల కోసం కూడా మనం పనిచేయాలని కొంతమంది తెలంగాణ ఎన్నారైలు చేయిచేయి కలిపారు. రాజకీయాలకు అతీతంగా తెలంగాణ అభివృద్ధి కోసం పరిశ్రమకు పూనుకున్నారు. సుధీర్ కోదాటి, మేరెడ్డి రవిప్రకాశ్ రెడ్డి, రమేశ్ నల్లవోలు, మాధవ మొసర్ల, వినయ్ మేరెడ్డి మరికొంతమంది ఎన్నారైలు కలిసి ‘తెలంగాణ రాష్ట్రం కోసం మనవంతు ప్రయత్నం చేసినట్టే. తెలంగాణ బాగు కోసం పని చేయాలె’ అని లక్ష్యంగా పెట్టుకున్నారు.
డయల్ యువర్ విలేజ్
తెలంగాణ అభివృద్ధి కావాలంటే ముందు మన సమస్యలేమిటో తెలుసుకోవాలనుకున్నారు. వాటిని చర్చించడానికి, పరిష్కారాలు వెతకడానికి ‘డయల్ యువర్ విలేజ్’ కార్యక్రమం ప్రారంభించారు. పల్ల్లెను దాటి అమెరికా చేరినా తమకు జన్మనిచ్చిన పల్లె గుండె చప్పుడు వినడం మొదలుపెట్టారు. అమెరికాలో ఉండి పల్లెను పలకరించే ‘డయల్ యువర్ విలేజ్’తో వారానికి ఒక ఊరి బాగు కోసం చర్చ జరిపేవాళ్లు. మొదట సర్పంచ్‌లతో మాట్లాడేవాళ్లు. ఒకేరోజు ఒక సర్పంచ్‌తో మొదలుపెట్టి ఒకేసారి పదిమంది సర్పంచ్‌లతో మాట్లాడేదాకా ఈ కార్యక్రమం విస్తరించింది. వినేవాళ్లు, మాట్లాడేవాళ్లు పెరిగారు. ఈ మాటల మధ్య పల్లె సమస్యలే కాదు, అక్కడ పనిచేసే వ్యవస్థల గురించీ ఎన్నారైలకు అర్థమైంది. కొంతకాలానికి వారానికి ఒక శాఖకు చెందిన అధికారి, ఉద్యోగితో మాట్లాడటం మొదలుపెట్టారు. అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, టీచర్లు, వ్యవసాయశాఖ అధికారులు, సామాజిక కార్యకర్తలు పల్లె ప్రగతికి సలహాలిచ్చారు. ఇలా వారంవారం పల్లెతో జరిపే సంభాషణ నాలుగేండ్లపాటు సాగింది. గ్రామాల్లో విద్య, గ్రంథాలయాలు, ఆరోగ్యం కోసం కొన్ని సందర్భాల్లో ప్రత్యేకంగా చర్చించేవారు. వీటి సారాంశాన్ని ప్రజలందరికీ చేరవేసేందుకు రంగాల వారీగా నివేదికలు రూపొందించారు. ప్రజల సమస్యలను, వాటి పరిష్కారానికి మార్గదర్శకాలు రూపొందించి సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చేశారు.
చేంజ్ లీడర్స్
‘మాటలు సరే.. మార్పు సంగతేమిటి’ అన్న చర్చ వచ్చిన తర్వాత డయల్ యువర్ విలేజ్ ఆధ్వర్యంలో ‘పీపుల్స్ మ్యానిఫెస్టో’ని విడుదల చేశారు. తెలంగాణ పల్లెల ప్రగతి కోసం వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో ఎలాంటి మార్పులు తెస్తే బాగుంటుందో తెలియజేస్తూ రాజకీయ పార్టీలకు ప్రజల పక్షాన నివేదిక సమర్పించారు. గ్రామాల ప్రగతికి పార్టీల తోడ్పాటు కోరుతూ విన్నవించారు. ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని ఎదురుచూస్తూ ఉండిపోకుండా తమవంతు ప్రయత్నంగా పల్లెల్లో విద్యాభివృద్ధికి నడుం కట్టారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు పట్టణాల్లో ఉండే విషయాలు తెలియవు. రూరల్ ఇంజినీరింగ్, అర్బన్ ఇంజినీరింగ్ విద్యార్థుల్లో ఎంతో వ్యత్యాసం ఉంది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన బీటెక్ విద్యార్థులకు బయటి ఉద్యోగావకాశాలు, నైపుణ్యాల గురించి పెద్దగా అవగాహన ఉండటం లేదని గుర్తించారు. ఆ లోపాలను అధిగమించేలా అవగాహనా కార్యక్రమాలను చేపట్టాలని ఎన్నారైలు మెంటరింగ్ ప్రోగ్రామ్ మొదలుపెట్టారు. మహబూబ్‌నగర్‌లోని జయప్రకాశ్ నారాయణ్ ఇంజినీరింగ్ కాలేజ్‌తో ఈ క్రతువుకు శ్రీకారం చుట్టారు. తర్వాత వాగ్దేవి, కిట్స్, బాసర ట్రిపుల్ ఐటీ మరెన్నో కాలేజీల్లోని ఇంజినీరింగ్ విద్యార్థులకు స్కిల్స్, టెక్నాలజీ రంగంలో ఉద్యోగావకాశాలు, విదేశాల్లో పరిస్థితుల పట్ల అవగాహన కల్పిస్తూ వచ్చారు. ఈ కార్యక్రమానికి ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. అమెరికాలోని ప్రఖ్యాత సంస్థల్లో ఉద్యోగాలు చేసే సాంకేతిక నిపుణులతో గ్రామీణ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు అవకాశాలు, సాంకేతిక నైపుణ్యాలపట్ల అవగాహన కల్పించే ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది ఉన్నత స్థితికి చేరుకున్నారు.
విద్యా వారధి
పెద్ద చదువులు చదివాక చాలామంది ఇంటిదారి పడుతున్నారు. విశాలమైన ప్రపంచంలో అవకాశాలు విస్తృతంగా ఉన్నా.. ఆశలు లేకపోవడమే దీనికి కారణం. ఇది ఎంతోమంది తెలివైన విద్యార్థులకు శాపం. ఈ దుస్థితి పోవాలంటే ఆశలు రేకెత్తించాలి. అందుకోసం అమెరికాలో ఉండే పిల్లలతో ఇక్కడి గ్రామీణ విద్యార్థులను మాట్లాడించడం మొదలుపెట్టారు మన తెలంగాణ ఎన్నారైలు. ఆన్లైన్లో సాగే ఈ పరిచయ కార్యక్రమంలో అమెరికాలో చదువు ఎలా ఉంటుంది. అక్కడ చదువుకునే పద్ధతుల గురించి ఇక్కడి విద్యార్థులతో పంచుకునేలా చేశారు. ఇక్కడి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఎలా చదువుతున్నారో అమెరికా విద్యార్థులు తెలుసుకుంటున్నారు. ఇలా మాట్లాడటం వల్ల తెలంగాణ పల్లె జీవితం, ఇక్కడి బాల్యాన్ని ఎన్నారై విద్యార్థులు అర్థం చేసుకుంటారు. తమ పూర్వికులు, గ్రామీణ జీవితం మీద వాళ్లకు అవగాహన ఏర్పడుతుంది. అమెరికా విద్యాలయాల్లో ఉండే ఎక్స్ట్రా కరికులమ్ గురించి, ఆటపాటల గురించి కూడా ఇందులో చర్చిస్తున్నారు. ఇలా ఇరు దేశాల విద్యార్థులు మాట్లాడుకోవడం వల్ల ‘నేనూ గొప్పగా చదవాలి, ఉన్నత స్థితికి చేరుకోవాలి’ అనే పట్టుదల విద్యార్థుల్లో పెరుగుతుందని అంటున్నారు నిర్వాహకులు. అక్కడి పిల్లలు, ఇక్కడి పిల్లల మాటల మధ్య భాషా సమస్య రాకుండా అమెరికా విద్యార్థులకు వారి తల్లిదండ్రులు, తెలంగాణ విద్యార్థులకు ఉపాధ్యాయులు సహకరిస్తూ జూమ్ మీటింగ్‌లో మాట్లాడిస్తున్నారు. మూడేండ్లుగా వారంవారం నడుస్తున్న ఈ విద్యా వారధిలో వేలాది మంది పిల్లలు పాల్గొని కొత్త సమాజాన్ని, వాళ్ల జీవితాన్ని తెలుసుకుంటున్నారు.
నిన్ను నువ్వు మార్చుకో..
‘ఎదగాలనే కలలు కనడం నేర్పడంతోనే ఆగిపోవద్దు. ఆ కలలను రాసుకోండి. వాటి కోసం ప్రణాళికాబద్ధంగా నడుచుకోండి. మిమ్మల్ని మీరు సరిదిద్దుకోండి. అందుకోసం రోజూ డైరీ రాయండి’ అని విద్యార్థుల చేతికి డైరీలు ఇచ్చింది ఫిలడెల్ఫియా తెలంగాణ అసోసియేషన్. 50 పాఠశాలల్లో చదివే పదివేల మంది చిన్నారుల చేతికి డైరీలు ఇచ్చారు. ప్రతిరోజూ విద్యార్థులు చేయాల్సిన పనులను ఈ డైరీలో మొదటి పేజీల్లో రాశారు. అలాగే డైరీ ఎలా రాయాలి? ఏ ఏ విషయాలను ప్రస్తావించాలో ప్రశ్నల రూపంలో మొదటి పేజీలో ఇచ్చారు. ఈ ప్రశ్నలకు సమాధానాల్లా డైరీ రాయడం మొదలుపెడితే కొన్నాళ్లకు సొంతంగా రాసుకునే సామర్థ్యం వస్తుంది. అలాగే ప్రతిరోజూ ఒక సూక్తిని నేర్చుకోవాలని కొన్ని సూక్తులు డైరీలో ముద్రించారు. దినచర్య, ఇతరులకు చేసిన సాయం, చదువు, ప్రయాణం, స్నేహాలు, నేర్చుకున్న విషయాలను డైరీలో రాయడం అలవాటు చేస్తున్నారు. ఈ డైరీలోని దినచర్య ఆధారంగా ఎక్కడ తప్పు చేస్తున్నారు, ఎన్ని మంచిపనులు చేస్తున్నారో విద్యార్థి తనకు తానుగా తెలుసుకుని, తనను తాను మలుచుకోవాలన్నది నిర్వాహకుల ఉద్దేశం. వాళ్ల ఆశలు వమ్ము కాకుండా ప్రభుత్వ పాఠశాలల పిల్లలు క్రమశిక్షణతో డైరీ రాస్తున్నారు.
పేద చదువుకు పెద్ద భరోసా
డయల్ యువర్ విలేజ్ విజయం అమెరికా ఎన్నారైలకు ఉత్సాహాన్నిచ్చింది. ఇక్కడి విద్యార్థుల బాధలు వినడమే కాదు వాళ్ల కష్టాలను కలిసి పంచుకుందామని ఫిలడెల్ఫియాలోని తెలంగాణ ఎన్నారైలు నిర్ణయించుకున్నారు. ప్రతిభకు పేదరికం అడ్డుకారాదని గ్రామీణ, పేద విద్యార్థులకు భరోసా ఇచ్చారు. చదవాలనే ఆశ, పేదరికాన్ని గెలవాలనే పట్టుదల ఉన్న పేద వైద్య విద్యార్థులకు ఆర్థిక సాయం చేయడానికి ముందుకొచ్చారు. వైద్య కళాశాలలో సీటు వచ్చిన పేద వైద్య విద్యార్థి ఫిలడెల్ఫియా ఎన్నారై అసోసియేషన్‌కు దరఖాస్తు చేసుకుంటే వాళ్లకు బ్యాంకులు రుణం ఇచ్చిన విధంగా (ఆస్తుల తనఖా లేకుండా) రుణం ఇస్తారు. ‘చదువు పూర్తయ్యాక ఉద్యోగం చేస్తూ మీ రుణం తీరుస్తాను’ అని విద్యార్థితో బాండ్ రాయించుకుంటారు. వాళ్లు తర్వాత కాలంలో అప్పు తీర్చేందుకు ఇచ్చిన డబ్బుల్ని మరో పేద విద్యార్థి చదువుకునేందుకు సాయంగా అందిస్తున్నారు. ఇలా చేయడం వల్ల మరింత మందికి మద్దతుగా నిలవొచ్చని ఫిలడెల్పియా తెలంగాణ అసోసియేషన్ ఉద్దేశమని మేరెడ్డి రవిప్రకాశ్ చెబుతున్నారు. ఈ విద్యా లక్ష్యానికి పాలమూరు ఎన్నారై ఫోరం కూడా చేదోడుగా నిలుస్తున్నది. అలా ఈ ప్రవాసుల సంకల్పం తెలంగాణ పల్లెలకు కొత్త వసంతాన్ని తీసుకొస్తున్నది.
ఆపదకాలంలో ‘ఆప్తా’
జీవిక కోసం ఖండాలు దాటిన ఎన్నారైలు తెలంగాణ పల్లె కష్టాలు వింటున్నారు. కరోనా రాగానే ఎక్కడివాళ్లు అక్కడే ఉండిపోయారు. అప్పుడు వాళ్ల దిగులంతా తమ కన్నవాళ్ల గురించే! అమెరికాలో ఉన్నవాళ్లే కాదు, ఒకే దేశంలో ఉన్నా.. పట్నంలో ఉన్నవాళ్లు పల్లెల్లో ఉన్న తమ తల్లిదండ్రులను చేరుకోలేని పరిస్థితులు అవి. ఆ సమయంలో తమ తల్లిదండ్రుల కోసం బిడ్డల్లాగే సేవచేసే వలంటీర్లను తయారు చేసేపని ఫిలడెల్ఫియా తెలంగాణ అసోసియేషన్ చేపట్టింది. కేర్ టేకర్, నర్స్, అటెండెంట్స్ ఏర్పాటుచేసి అయినవారికి కావాల్సిన సాయం అందించే పని మొదలుపెట్టింది. కేర్ టేకర్స్‌కు ఈ సంస్థ శిక్షణ అందించింది. పెద్దల యోగక్షేమాలు చూసుకోవడం, వాళ్ల సమస్యలను అర్థం చేసుకోవడంలో శిక్షణ పొందిన సిబ్బందితో ‘ఆప్తా ఎల్డర్ కేర్’.. హైదరాబాద్‌లో ఇప్పటికీ కొనసాగుతున్నది. అమ్మానాన్నలకు దూరంగా ఉన్న బిడ్డలు ఈ సేవలు వినియోగించుకోవచ్చు.
ముఖ్యమంత్రికి ఓ లేఖ
‘శ్రీయుత గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారికి నమస్కారములు, మా ఇప్పటూర్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలకు పక్క గ్రామాల నుంచి విద్యార్థులు వస్తారు. వారికి బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. కావున మా ఊరికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతున్నాము. మా సమస్యలను వీలైనంత తొందరగా పరిష్కరించాలని కోరుతూ…’ అయిదో తరగతి చదువుతున్న నవీన్ రాసిన లేఖ ఇది. ఇప్పటూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న నవీన్ ఒక్కడే కాదు… మరెందరో విద్యార్థులు తమ పాఠశాలల్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రికి ఇటీవల లేఖలు రాశారు. దాదాపు ఇరవైవేల మంది విద్యార్థులు బాగా చదువుకోవడానికి సరైన వసతులు కల్పించాలని కోరుతూ ఉత్తరాలు పంపించారు. విద్యార్థుల పట్ల సానుభూతి ఉన్నవాళ్లకు ఇది మంచి పనే అనిపిస్తుంది. ప్రభుత్వంపట్ల అభిమానం, భక్తి ఉన్నవాళ్లు ఈ పని చేయిస్తున్నవాళ్లు ఉత్తగా ఉత్తరాలు రాయడమేనా, ఏదైనా చేసేదుందా అని రాజభక్తిని చాటుకునేందుకు ప్రయత్నిస్తారు. డయల్ యువర్ విలేజ్ ఈ ఉత్తరాలు రాయించింది. ఇది పల్లె గుండె చప్పుడు వినే సంస్థ. పేద విద్యార్థికి అండగా ఉండే సంస్థ. విద్యార్థుల్లో ఆశలు రేకెత్తించి, చదువులో ఉరకలెత్తించాలని భావించే సంస్థ. విద్య కోసం, విద్యాహక్కు కోసం విద్యార్థుల్లో చైతన్యం కలిగిస్తూ 20 వేల మందితో పోస్టుకార్డులు రాయించింది. ఆ ముఖ్యమంత్రి వస్తాడని, ఏదో చేస్తాడని ఎదురుచూడకుండా ఆ విద్యార్థులకు అవసరమైన చేయూతను అందిస్తున్నారు అమెరికాలో ఉండే తెలంగాణ ఎన్నారైలు.
పల్లెకు పోదాం
మాది వనపర్తి జిల్లాలోని ఖిల్లా ఘన్పూర్ మండలం, మానాజీ పేట. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదివాను. పీహెచ్డీ చేశాను. చెల్లె పెళ్లి తర్వాత అప్పులయ్యాయి. ఆసక్తి లేకున్నా ఆ అప్పులు తీర్చడం కోసం 1992లో అమెరికాలో అడుగుపెట్టాను. రెండేండ్లు చాలా కష్టపడాల్సి వచ్చింది. అక్కడ నిలదొక్కుకున్న తర్వాత నా తెలంగాణ కోసం మాట్లాడిన, కొట్లాడిన. వచ్చిన తెలంగాణ కోసం ఇప్పుడూ మాట్లాడుతున్న. సాటి ఎన్నారైలతో కలిసి తెలంగాణ పల్లెల కోసం పనిచేస్తున్నం. ఇది తెలంగాణ ఎన్నారైల సమష్టి కృషి. ఇప్పుడు ఊళ్లను చూస్తే బాధేస్తున్నది. ఒకప్పటి ఊళ్లు కావు. ఆశల్లేవు. ఆశయాల్లేవు. తాగుబోతులు పెరిగారు. కొట్లాటలు పెరిగాయి. చదువుకున్నవాళ్లు ఊళ్లను వదిలిపెడితే వచ్చిన సమస్య ఇది. పట్నాలకు పోయినా మనం పల్లెను పట్టించుకోవాలె. పోయిన ఏడాది వచ్చి ఊళ్లో ఉన్న. స్కూల్లో పడుకున్న. ఊరి కష్టాలు తెలిసినయి. పోయిన ఆగస్టులో వచ్చి పది రోజులు నారాయణపేట, గద్వాల్ సమీప గ్రామాల్లో పదమూడు రోజులు యాత్ర చేసిన. సీడ్ పత్తి ఏరడం కోసం విద్యార్థులు రెండు నెలలు బడికి పోవడం లేదు. ఇంత దయనీయ స్థితిలో చదువులు ఉన్నాయి. ఈ పరిస్థితులు మార్చాలన్నదే మా ఆశ. ఆశయం.
– మేరెడ్డి రవిప్రకాశ్ రెడ్డి,తెలంగాణ ఎన్నారై
-నాగవర్ధన్ రాయల