‘ముందు కొంటాను. ఆపై లాభానికి అమ్ముకుంటాను’ అని అతిగా ఆశపడి రియల్ ఎస్టేట్‌లో అడుగుపెట్టేవాళ్లే ఎక్కువ! కష్టాలు, నష్టాలు ఎదురైనప్పుడు నేర్చుకునేదీ ఎక్కువే!! చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు. రియల్ ఎస్టేట్ అంటే?… భూమిని అమ్మడం, కొనడం మాత్రమే కాదు. అందులో ఇంకెన్నో రియల్ ముచ్చట్లున్నాయ్. ఆస్థి చట్టాలు, అమ్మకాల ఒప్పందాలు, ఆర్థిక విధానాలు, మార్కెట్ రహస్యాలు, అభివృద్ధిని ఆసరా చేసుకునే భవిష్యత్ ప్రణాళికలు, పన్నుల నుంచి తప్పించే ఉపాయాలు ఇలా ఎన్నో కనిపిస్తాయి. ఇవి తెలియకుంటే కోటి నష్టాలు పలకరిస్తాయి. సొమ్మూ పోయి శని పట్టుకున్నదని కోర్టు మెట్లెక్కే పరిస్థితీ దాపురిస్తుంది. ఈ సమస్యలు చుట్టుముట్టకుండా రియల్ రంగంలో రారాజుగా ఎదగాలని కోరుకునేవారి కోసం వచ్చిందే START and GROW.
భూమితో అనేక ప్రయోజనాలున్నాయి. నచ్చినట్టుగా ఇల్లు కట్టుకోవచ్చు. మార్కెట్‌కి తగ్గట్టు కట్టి అమ్ముకుంటే.. డబ్బులు వెనకేసుకోవచ్చు. అద్దెకిస్తే బంగారు బాతు గుడ్లు పెట్టినట్టే! కాలు బయటపెట్టకుండానే బతికేయొచ్చు. కానీ, బంగారు బాతనుకుని బాయిలర్ కోడిని కొంటే.. బంగారు గుడ్లే కాదు కోడి, దానికి మేత కూడా దండగే. పెట్టుబడికి పదింతల లాభాల కోసం కలలు కనేవాళ్లు బంగారు బాతుని ఎలా పట్టాలో ఈ పుస్తకంలో సవివరంగా తెలియజేశారు రియల్టర్ వెంకట్ రాజ్. రియల్ ఎస్టేట్‌లోని అన్ని విభాగాలతోపాటు అనుబంధ రంగాల గురించి పూర్తిగా తెలుసుకుని, తన అనుభవాలను అందరికీ పంచుకోవాలని START and GROW పుస్తకం రాశారు.
తన ఇరవై ఏళ్ల అనుభవాల్లోని తప్పొప్పులు వడపోసి, మంచీచెడులను అందించారు. ఇందులోని ఎనిమిది అధ్యాయాలు చదివితే మిమ్మల్నెవరూ మోసం చేయలేరు! సరళమైన తెలుగులో అందరికీ అర్థమయ్యేలా రాయడంతోపాటు రెవెన్యూ, బ్యాంక్, మార్కెట్ పదాలను అనువాదం చేయకుండా ఆంగ్లంలోనే ఇవ్వడం వల్ల పాఠకులు మార్కెట్లో ఇబ్బంది పడకుండా జాగ్రత్త తీసుకున్నారు. రియల్ ఎస్టేట్‌రంగంలో పనిచేసేవాళ్లు కొని, ప్రతిరోజూ తిరగేయాల్సిన పుస్తకం ఇది.
రచన: వెంకట్ రాజ్
ప్రచురణ: షాజ్వల్ పబ్లిషింగ్ హౌస్
పేజీలు: 214 ధర: రూ.499
ప్రతులకు: 79977 01234
రచన: టి.ఎస్.ఎ. కృష్ణమూర్తి
పేజీలు: 156;
ధర: రూ. 200
ప్రచురణ: కళా ప్రచురణలు
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్: 94404 07381