‘అవనిలో సగం… ఆకాశంలో సగం… అన్నిటా సగం సగం’ అంటూ నినదిస్తున్న కాలంలో మనం ఉన్నాం. ఈ నినాదం వెనుక యుగయుగాల ధీరోదాత్త చరిత్ర ఉన్నదన్న విషయం తెలిసిందే. అయినా పురుషాధిక్య ప్రపంచంలో స్త్రీ ప్రతిక్షణం పోరాడుతూనే ఉన్నది. ‘చారిత్రక విభాత సంధ్యల మానవ కథ వికాస మెట్టిది?’ అని శ్రీశ్రీ ప్రశ్నిస్తే… ‘మానవి కథ వికాస మెట్టిది?’ అన్న శోధనలో కొంతలో కొంత దొరికిన సమాధానమే ‘షీరోస్’!
‘షీరోస్’ అంటే యోధురాండ్రు. ‘ధీర వనితలు-స్ఫూర్తికాంతలు’ అనే ఉపశీర్షిక కలిగిన షీరోస్ పుస్తకంలో విభిన్న రంగాలకు చెందిన 256 మంది స్ఫూర్తిమంతమైన అతివల జీవితాలను రేఖా మాత్రంగా పరిచయం చేశారు. ఒక్కొక్కరికీ ఒక్కొక్క పుట (బొమ్మతో సహా) చొప్పున జీవిత చరిత్రలు నిక్షిప్తం చేశారు. దీనికి డాక్టర్ జాస్తి శివరామకృష్ణ, అయ్యల సోమయాజుల అహల, వంగపల్లి పద్మ (అనువాదం), దుండ్రవల్లి బాబు (బొమ్మలు) నడుంకట్టారు. ఈ షీరోస్ అందరికీ తెలియకపోవచ్చు. వారినుంచి స్ఫూర్తి పొంది, తమ ఆడపిల్లలను ఆ విధంగా పెంచాలనే కాంక్ష కలిగిన తల్లిదండ్రులు ఎందరో. అందుకే ఇది పిల్లల పుస్తకమే కాదు. పెద్దల పుస్తకంగానూ ఆదరణ పొందుతున్నది. ఈ షీరోస్ పుస్తకంలో తమకు నచ్చినవారిని ఓ రోల్ మోడల్‌గా తీసుకుని నర్సరీ, ప్రైమరీ పిల్లలు ఫ్యాన్సీ డ్రెస్‌లు వేసుకుని ముద్దుముద్దు మాటలతో అలరిస్తున్నారు.
హైస్కూల్ పిల్లలు చక్కగా ఏకపాత్రాభినయం చేస్తున్నారు. ఇంకొందరు ఎంచుకున్న ధీరవనిత చరిత్ర తీసుకుని కవితలు అల్లుతున్నారు. పాటలు పాడుతున్నారు. ఆమె పోస్టర్ చూపుతూ ఉపన్యాసాలు ఇస్తున్నారు. కథగా మలచి ఆకర్షణీయంగా చెబుతున్నారు. ఇంకొందరు పప్పెట్రీ షో (బొమ్మలాట) చేస్తున్నారు. కొంతమంది పిల్లలైతే షీరోస్ వేషధారణలో నటిస్తూ, నినాదాలు చేస్తూ.. ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. షీరోస్ పెద్ద ప్రాజెక్ట్. ఏడాదికిపైగా సాగుతున్న ఈ యజ్ఞంలో ఎందరో పిల్లలు, పెద్దలు, టీచర్లు నిమగ్నమై పని చేస్తున్నారు. తొలుత గుంటూరు శ్రీవేంకటేశ్వర బాలకుటీర్లోనూ, ఆ తర్వాత హైదరాబాద్ ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్లోనూ రెండు దఫాలుగా పెద్దపెద్ద సమ్మేళనాలు జరిగాయి. అనేక బాలోత్సవాల్లోనూ, పాఠశాలల్లోనూ, వేసవి శిబిరాల్లోనూ ఈ కృషి నిత్యకల్యాణంలా సాగుతూనే ఉన్నది. వివిధ ప్రాంతాల నుంచి రకరకాల పాఠశాలల నుంచి వచ్చి భిన్న రూపాల్లో దాదాపు 200 మంది బాలికలు షీరోస్ని ప్రదర్శిస్తుంటే అదో కోలాహలం. చూడటానికి రెండుకళ్లు చాలవు. ఇదో ఆధునిక వేడుక. కేవలం బాలికల కోసం సాగే వేడుక. రికార్డింగ్ డ్యాన్స్‌లకు భిన్నంగా సాగే అర్థవంతమైన వేడుక.
మనసులో గాఢమైన స్ఫూర్తి. అనుభూతి ఉన్నప్పుడే గాఢమైన అభివ్యక్తికీ మార్గదర్శకం అవుతుంది. పిల్లలకు ఆ విధంగా శిక్షణ ఇవ్వాలంటే ముందుగా పెద్దలు, తల్లిదండ్రులు, టీచర్లు ఆ స్ఫూర్తిని అందుకోవాలి. షీరోస్‌తో మమేకం కావాలి. అలా స్ఫూర్తిని అందుకున్న లోగిళ్లలోనే ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది. లేని పక్షంలో కేవలం గుర్తింపు, బహుమతుల కోసం పాకులాడే మరో యాంత్రిక తంతుగా మారుతుంది. చతుర్విధ అభినయాలు (ఆంగికం, వాచికం, ఆహార్యం, సాత్వికం) చిన్నప్పటి నుంచే క్రమశిక్షణతో అలవడితే జీవన నైపుణ్యాలు, సమాచార నైపుణ్యాలు పెంపొందుతాయి. మనోవికాసంతో జీవిత సత్యం బోధపడుతుంది.
‘మంచి పుస్తకం’ సంస్థ తన 20వ సంవత్సర ప్రచురణగా ప్రతిష్ఠాత్మకంగా షీరోస్ని ప్రచురించింది. ఈ పుస్తకంలో 13వ శతాబ్దంలో కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించిన రాణి రుద్రమదేవి నుంచి మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వరకు ఉన్నారు. సంగీత ప్రపంచంలో భారతరత్న ఎం.ఎస్.సుబ్బులక్ష్మి నుంచి ప్రస్తుతం యుట్యూబ్ చానెళ్లలో విరివిగా పాడుతూ ప్రజలను ఉర్రూతలూగిస్తున్న ఆధునిక గాయని వరకు కనిపిస్తారు. ఇలా అన్ని రంగాల్లో కీర్తిశేషులైన ప్రముఖులే కాదు మన మధ్యనే ఉంటూ విశేష ప్రతిభ కనబరుస్తున్న వర్తమాన ధీర వనితల చరిత్రను కూడా మన కళ్ల ముందుంచారు.
పోరాట యోధురాండ్రు సావిత్రీబాయి ఫూలే, చిట్యాల ఐలమ్మ, మల్లు స్వరాజ్యం వంటి వారున్నారు. రచయిత్రుల్లో బండారు అచ్చమాంబ నుంచి రంగనాయకమ్మ వంటి వారు కనిపిస్తారు. సేవా రంగంలో మదర్ థెరిస్సా, దుర్గాబాయి దేశ్‌ముఖ్, డొక్కా సీతమ్మ ఉన్నారు. రాజ్యాలేలిన వారిలో ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి అవంతీబాయి, రాణి చెన్నమ్మ ఉన్నారు. క్రీడా రంగంలో పీటీ ఉష, కరణం మల్లీశ్వరి, సానియా మీర్జా, పీవీ సింధు, మేరీకోమ్ తదితరులు దర్శనమిస్తారు. అంతరిక్ష రంగంలో కల్పనా చావ్లా, సినీ రంగంలో శ్రీదేవి, స్వాతంత్య్ర పోరాటంలో సరోజినీ నాయుడు… ఇలా అన్ని రంగాల వారున్నారు. కనుకనే బాలసాహిత్య పరిశోధకులు వి.ఆర్.శర్మ రచించిన ‘జయహో షీరోస్… జయజయహో షీరోస్… రాజ్యాలేలిన షీరోస్… రణరంగంలో నిలిచిన షీరోస్… జనం కోసమని నిరంకుశులతో తలపడి పోరిన షీరోస్’ గేయం థీమ్ సాంగ్‌గా ప్రతిధ్వనించింది.