ఒంటరితనం అనేది ప్రపంచమంతటా కనిపించేదే. ఇకపోతే ఈ సమస్య యువతరంతోపాటు అన్ని వయసుల వారినీ వేధిస్తున్నది. అయితే, ఒంటరితనం మన శారీరక, మానసిక ఆరోగ్యం మీద తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందట. “ప్రస్తుతం సమాజంలో ఎవరితోనూ కలవకుండా ఉండటం, ఒంటరితనం ఎక్కువైపోతున్నాయి. దీంతో మన ఆరోగ్యం, వికాసం మీద తీవ్రమైన ప్రభావం పడుతున్నది.
బలమైన సామాజిక సంబంధాలు లేకపోతే… స్ట్రోక్, ఆందోళన, డెమెన్షియా, కుంగుబాటు, ఆత్మహత్యలు మొదలైన సమస్యల బారినపడే ప్రమాదం ఎక్కువ” అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అద్హనామ్ ఘెబ్రయెసస్ అభిప్రాయపడుతున్నారు. అందువల్ల, సామాజిక సంబంధాలు మెరుగుపర్చుకునేందుకు కృషిచేయాలి. ముఖ్యంగా యువతరానికి మిత్రుల ప్రాధాన్యాన్ని తెలియజేప్పాలి. వారిని తమకు తగిన దోస్తులను వెతుక్కోవడాన్ని ప్రోత్సహించాలి. దీనికి ఈ స్నేహితుల దినోత్సవమే తగిన సమయం!
ఉద్యోగాల్లో డెడ్లైన్లు, టీవీలు, స్మార్ట్ఫోన్లు తదితర కారణాల వల్ల ఆధునిక తరం సరైన నిద్రకు నోచుకోలేకపోతున్నది. కానీ, మెదడు పనితీరు సవ్యంగా ఉండాలంటే కంటినిండా నిద్ర తప్పనిసరి అంటున్నారు వైద్యులు. మంచి నిద్ర మన ఆరోగ్యం మీద సానుకూల ప్రభావం చూపుతుంది. అదే నిద్ర లేమి, వేళకు నిద్రపోకపోవడం మెదడు, గుండె, ఊపిరితిత్తుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి వయసు, వృత్తితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం ఏడు గంటల నాణ్యమైన నిద్ర పోవాలని సూచిస్తున్నారు. మెదడు ఆరోగ్యానికి, దాని పనితీరు సవ్యంగా సాగడానికి ఏకైక ప్రధాన కారణం నిద్ర అని చెబుతున్నారు.