రోహకు తన మగని గురించి భయంకరమైన కల వచ్చింది. పోటిసుడు రాలేదని ఆందోళనపడతారు జయసేనుడు, సిరిసత్తి. తన మనసులో అలసుద్ది ఉన్న విషయం అన్యాపదేశంగా ప్రకటిస్తాడు పోటిసుడు. తర్వాత…
మల్లసు పర్వతం… కళింగ రాజ్యంలోని నౌకాయాన తీరం. ఆ పర్వతం మీద ఒక గుడారంలో ఆలోచనామగ్నుడై కూర్చుని ఉన్నాడు మహా సార్థవాహుడైన కుసుమ శ్రేష్ఠి. లోకంలో సౌందర్యోపాసన తగ్గింది; కళారాధన అడుగంటింది; సుఖవంతమైన జీవితం పట్ల మనుషుల ఆసక్తి సన్నగిల్లింది. ఇదంతా బౌద్ధమత వ్యాప్తి ప్రభావం వల్ల సంభవించిన పరిణామం. ఈ మూడు లేనిచోట వ్యాపారం కొనసాగడం కష్టం. సుగంధ ద్రవ్యాలు, చీనాంబరాలు, విలాసవంతమైన వస్తు సామాగ్రి వినియోగం బాగా తగ్గిపోయింది. సముద్ర వ్యాపారానికి ముఖ్యమైన క్రయవిక్రయాలు జరిగేది వీటి ద్వారానే. ఏనుగులకు ప్రసిద్ధిగాంచిన కళింగ రాజ్యంలో ఏనుగులు, ఏనుగు దంతాలు విస్తృతంగా ఎగుమతి అయ్యేవి. వాటిని వేటగాళ్ల నుంచి కొనుగోలు చేసి, లాభసాటిగా అమ్ముకునే అవకాశం ఉండేది. వాటిమీద కళింగరాజులు సుంకాలు పెంచినారు.
అశోకుని దండయాత్ర వల్ల కలిగిన నష్టం కంటే బౌద్ధుల నాస్తిక వాదం, సర్వసమానత్వం, స్త్రీలకు అధికారం, కోరికల త్యాగం వంటి విధానాలు మానవ జీవితాన్ని కకావికలం చేసి సారహీనంగా మార్చేసినాయి. ఆ ప్రభావం వర్తక వాణిజ్యాల మీద విపరీతంగా పడింది. ‘వర్షాకాలం పూర్తిగా తగ్గిన మీదట వ్యాపారానికి వెళ్లడం మంచిది’ అని భార్య సిరిసత్తి చెవిన ఇల్లు కట్టుకొని చెప్పినా వినలేదు. ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నాను. రెండు మాసాలు గడిచింది. వెయ్యి కర్షాపణాల వాణిజ్యం కూడా జరుగలేదు. లాభం సంగతి దేవుడెరుగు! ఇది నష్టాలను తెచ్చిపెడుతున్నది. పైగా ఇక్కడ లంగరు వేసుకొని కూర్చున్నా సరే, సారంగులకు జీతాలు, భత్యాలు చెల్లించాలి. వెంట తెచ్చుకున్న సిపాయిలకు ఇంటి వద్ద చెల్లించే దానికంటే రెట్టింపు జీతభత్యాలు ఇవ్వాలి. ‘ఇటీవల సముద్రపు దొంగల దాడులు కూడా మొదలైనాయని వార్తలు అందుతున్నాయి. ఈ తలనొప్పులతో వ్యాపారం చేయడం కన్నా, కొన్నాళ్లపాటు విశ్రాంతి తీసుకోవడం మేలు…’ హఠాత్తుగా కుసుమ శ్రేష్ఠి ఆలోచనలు ఆగిపోయినాయి. గుడారం బయట ఏదో కలకలం… ఏం జరిగిందో తెలుసుకుందామని శయ్య మీద నుంచి లేవబోతుండగా పదిమంది సాయుధులు లోనికి చొచ్చుకొని వచ్చినారు. మంచం చుట్టూ నిలబడ్డారు. అందులో ఒకడు శ్రేష్ఠి ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నాడు.
“ఏమిటీ దౌర్జన్యం? ఎవరు మీరు?” గట్టిగా గద్దించినాడు యాభై ఏళ్ల కుసుమ శ్రేష్ఠి. వాళ్లలో నాయకుని వంటి వాడు.. “ఆందోళన పడవద్దు! మేము కళింగరాజు గంగాదిత్యుని సైనికులం. రాజాజ్ఞను అనుసరించి మిమ్ములను బంధిస్తున్నాం” అన్నాడు ప్రశాంతంగా. “మీరేదో పొరబడుతున్నారు. మేం మహారాజులకు అత్యంత సన్నిహిత మిత్రులం…” ఇంకేదో చెప్పబోయినాడు కుసుమ శ్రేష్ఠి. “మాకు తెలుసు! మేమేం పొరబడటం లేదు” అంటూ తన వద్దనున్న రాజపత్రం చూపించినాడు ఆ నాయకుడు. శ్రేష్ఠికి వాళ్లను అనుసరించక తప్పలేదు.
* * *
“ఈ అలసుద్ది ఎవరు బిడ్డా? నీ భార్యనా?” మనసులోని అలజడిని అణచి పెడుతూ అడిగింది రాయహత్థి. లోపల నుండి ఈ మాటలు వింటున్న చంద్రహత్థికి కాళ్లూ చేతులు వణుకుతున్నాయి. ‘అతని గుండెలో నేనుకాక మరొక ఆడది ఉన్నదా? అయితే నాకు తావుంటదా? ఆయనే సర్వస్వం అనుకొని సర్వమూ అర్పించాలనుకున్నానే! మనిషి చిన్న వయసు వాడే కదా.. అప్పుడే మనువైపోయిందా…?’ అంతం లేని ప్రశ్నలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఏ సంకోచమూ లేకుండా స్పష్టంగా అన్నాడు పోటిసుడు.. “అలసుద్ది మా రాజమందిరంలో పరిచారిక. నేను కూడా కుసుమ శ్రేష్ఠి వద్ద సేవకుడనే. దానిమీద నేను మనసు పడ్డాను కానీ, దాని మనసు ఇంకా ఎరుక పడలేదు” “అంటే… దానితో నీకు…” ఇంకా సందేహం తీరనట్లు అన్నది రాయహత్థి. “ఏ సంబంధమూ ఏర్పడలేదు. దాన్ని చూడటమే తప్ప, తాకి ఎరుగనమ్మా…” పోటిసుని మాట పూర్తి కానేలేదు, లోపలి నుండి సుడిగాలిలా వచ్చి అతన్ని చుట్టుకొని ముఖాన్ని ముద్దులతో ముంచెత్తింది చంద్రహత్థి. ఈ హఠాత్ పరిణామానికి నిశ్చేష్టురాలైంది రాయహత్థి. అంతలోనే తేరుకొని, “పిచ్చిపిల్లా! నా బిడ్డను కొరికి తినేస్తావా ఏందే?” అంటూ బలవంతంగా విడదీసింది. “వాడసలే పూర్తిగా కోలుకోలేదు” చివరి మాటతో వాస్తవం గుర్తుకొచ్చి, పోటిసుణ్ణి వదిలి, రాయహత్థిని అల్లుకొని, గట్టిగా బుగ్గన ముద్దు పెట్టుకున్నది చంద్రహత్థి. “నీ ప్రేమ మండ!” ముద్దుగా విసుక్కున్నది రాయహత్థి. “ఇంతకుముందు క్షణం దాకా మన్నుదిన్న పాములా ఉన్నావు కదనే! ఒక్కసారిగా కోడెనాగిని అయిపోయినావ్!?” అన్నది నవ్వుతూ.
లోపలొక్క మాట, చూపగా పైకొక్క మాట పలుకు చుండ్రు మగలు కాని రెంటనొక్క రీతి నుంట పోటిసునికి దక్కె ; నా కతండు దక్కె చాలు! (ఈ లోకంలో మగవాళ్లు మనసులో ఒకటి పెట్టుకొని, ఆడవాళ్లతో పైకి మరొకటి మాట్లాడుతుంటారు కానీ, నా పోటిసుడు లోపలా బయట ఒకే రీతిన ఉన్నాడు. ఇంతమంచి మొగుడు దక్కడం కంటే అదృష్టం ఏముంటుంది?)” అన్నది చంద్రహత్థి. వెంటనే రాయహత్థి.. “నీ ఉరుకుడు చల్లగుండ! నా మరది తనకు అలసుద్దితో సంబంధం లేదన్నాడు కానీ నిన్ను మనువాడుతానని అన్నాడా?” సూటిగా చూస్తూ అన్నది రాయహత్థి. ఆ మాటలతో చంద్రహత్థి ముఖం సూర్యోదయాన కలువ పువ్వులా మారిపోయింది.
* * *
క్రమక్రమంగా రోహకు దగ్గర కాసాగింది అలసుద్ది. ఆమెకు కావలసినవన్నీ అడగకుండానే సమకూర్చే దాని నేర్పరితనం రోహను ముగ్ధురాలిని చేసింది. దానిలో ఆమెకు సీహ కనిపించ సాగింది. ఆకారంలో, రూపంలో భేదం ఉన్నా… ఆత్మీయత మాత్రం చెల్లిదే! అచ్చంగా అట్లా భావిస్తున్నందు వల్ల అనుకోకుండా ఒకసారి… “అట్లా కాదే చెల్లీ! నా మాట విను…” అంది యథాలాపంగా. ఆ మాటతో అలసుద్దికి ప్రకృతి అంతా స్తంభించినట్లు అనిపించింది. అప్రయత్నంగా దాని కళ్లనుండి నీళ్లు జలజలా రాలినాయి. “అమ్మా!” అంది అలసుద్ది ఆర్ద్రంగా. అప్పుడు గ్రహించింది రోహ, తాను దాన్ని ‘చెల్లీ’ అని సంబోధించినానని. అయినా అందులో ఆమెకు ఏ దోషమూ కనిపించలేదు. “ఏమయ్యిందే?” నవ్వుతూ అలసుద్దిని చూసింది రోహ. “అవును! నీవు నా చెల్లివి కాకూడదా ఏం? ఇందులో తప్పేమున్నది?” సమర్థించుకున్నది. చప్పున కాళ్ల మీద పడిపోయింది అలసుద్ది. దాని కన్నీళ్లు ఆమె పాదాలను అభిషేకించినాయి. నెమ్మదిగా కూర్చుని అలసుద్ది కన్నీళ్లు తుడిచింది రోహ. ఆమె రెండు చేతులు గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టుకున్నది అలసుద్ది. కన్నీటి ప్రవాహం మాత్రం ఆగలేదు. “మమ్ములను తాకితే మైల పడిపోతారని, ప్రేమతో పిలిస్తే తలకెక్కుతామని అనుకుంటారమ్మా పెద్ద వాళ్లందరూ. అటువంటిది… ఏకంగా నీవు నన్ను చెల్లెలిని చేసుకున్నావు! ఈ ఒక్క మాట కోసం నా బతుకంతా నీకు ఊడిగం చేసేస్తానమ్మా!” అంది ఆనందం పట్టలేక.
అశోకుని దండయాత్ర వల్ల కలిగిన నష్టం కంటే బౌద్ధుల నాస్తిక వాదం, సర్వసమానత్వం, స్త్రీలకు అధికారం, కోరికల త్యాగం వంటి విధానాలు మానవ జీవితాన్ని కకావికలం చేసి సారహీనంగా మార్చేసినాయి. ఆ ప్రభావం వర్తక వాణిజ్యాల మీద విపరీతంగా పడింది. ‘వర్షాకాలం పూర్తిగా తగ్గిన మీదట వ్యాపారానికి వెళ్లడం మంచిది’ అని భార్య సిరిసత్తి చెవిన ఇల్లు కట్టుకొని చెప్పినా వినలేదు. ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నాను. రెండు మాసాలు గడిచింది. వెయ్యి కర్షాపణాల వాణిజ్యం కూడా జరుగలేదు? ఇది నష్టాలను తెచ్చిపెడుతున్నది. పైగా ఇక్కడ లంగరు వేసుకొని కూర్చున్నా సరే, సారంగులకు జీతాలు, భత్యాలు చెల్లించాలి.
“పిచ్చిదానా! బుద్ధదేవుడు మనుషులంతా సమానమేనని అన్నాడు కదా! ప్రేమతోనే ఎదుటివాళ్లను గెలువుమన్నాడు; దయను మించిన ధర్మం లేదన్నాడు. నీవు ఎంతో ప్రేమతో నాకు అన్నీ సమకూరుస్తున్నావు. ఇక్కడ నాకెవరున్నారు? అత్త మంచిదే! నిన్న ఇక్కడికి వచ్చినప్పటి నుండి నా వైపు మళ్లీ కన్నెత్తి చూడలేదు; పల్లెత్తి పలకరించలేదు. మొగుడు ఎంతో ఉన్నతుడు! అయినా ఏం లాభం? ఇంతవరకు నాకు దర్శనమే ఇవ్వలేదు. ఈ అందమైన పంజరం వంటి మందిరంలో నాకు నువ్వు ఒక్కదానివే తోడు! నీ సేవలో కల్మషం లేని ప్రేమ కనిపించింది. అదే నన్ను నీతో కట్టిపడేసింది. అన్ని లక్షణాల్లో నీవు అచ్చంగా నా చెల్లి సీహా లాగానే ఉన్నావు. నిన్ను నేను ప్రతిక్షణం అట్లానే భావిస్తున్నాను. అందుకే యాదృచ్ఛికంగా నిన్ను ‘చెల్లీ’ అని సంబోధించినాను. ఇది పొరపాటున ఈ ఒక్కసారికి అనేసి మరిచిపోవడం కాదు. ఎవరేమనుకున్నా, ఎప్పటికీ నీవు నా చెల్లెలివే!” అలసుద్దిని ప్రేమతో ముద్దు పెట్టుకున్నది రోహ. ఇదంతా స్వప్నమో, సత్యమో తేల్చుకోలేకపోతున్నది అలసుద్ది. కొంచెం సేపటి తర్వాత ఏదో ఒక నిర్ణయానికి వచ్చినట్లు అన్నది.. “అమ్మా! రాచకుటుంబ మర్యాదలు వేరుగా ఉంటాయని మీకు కూడా తెలుసును. ఏదో పుణ్యం వల్ల నన్ను ‘చెల్లీ’ అని పిలుస్తానంటున్నావు…” అలసుద్ది మాట పూర్తి కానేలేదు. “నీవు కూడా నన్ను అక్కా అనే పిలువు!” ఆజ్ఞాపిస్తున్నట్లే అన్నది రోహ. నోట మాట రాలేదు అలసుద్దికి. ఆ రాత్రికి వాళ్లు పిడుగుపాటు లాంటి వార్త వినవలసి ఉంటుందని ఆ క్షణం వాళ్లకు తెలవదు.