e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, November 29, 2021
Home News సైకిల్‌పై క‌న్యాకుమారి నుంచి ల‌ద్దాక్ దాకా చుట్టొచ్చిన వ‌రంగ‌ల్ బిడ్డ‌.. కార‌ణ‌మేంటంటే..

సైకిల్‌పై క‌న్యాకుమారి నుంచి ల‌ద్దాక్ దాకా చుట్టొచ్చిన వ‌రంగ‌ల్ బిడ్డ‌.. కార‌ణ‌మేంటంటే..

Ranjith on Wheels | తండ్రి అకాల మరణంతో కుంగిపోయిన ఆ యువకుడు.. ఆయన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చేందుకు పెద్ద సాహసాన్నే చేశాడు. సైకిల్‌పై 92 రోజుల్లో 8 వేల కిలోమీటర్ల యాత్ర చేపట్టాడు. ఈ సుదీర్ఘ ‘భారత్‌ యాత్ర’ను తండ్రితోపాటు హీరో సోనూసూద్‌కు అంకితమిచ్చాడు వరంగల్‌ బిడ్డ రంజిత్‌. వారం రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుడు చెప్పినా వినలేదు. ఆ రోజు రాత్రి పోలీస్‌ స్టేషన్‌లోనే పడుకొని, మరుసటి రోజు మళ్లీ యాత్రను కొనసాగించాడు రంజిత్‌ కుమార్‌.

Ranjith on Wheels
Ranjith on Wheels

రంజిత్‌కుమార్‌ది వరంగల్‌లోని గీర్మాజీపేట. పేద కుటుంబం. కష్టనష్టాల నడుమ ఎంఫార్మసీ చేశాడు. ఓవైపు చదువుకొంటూనే పార్ట్‌టైం జాబ్‌ చేసేవాడు. రంజిత్‌ తండ్రి రాములు
న్యాయవాది. సంపాదనంతా కొడుకు చదువు కోసమే ఖర్చు పెట్టాడు. దేశం మొత్తాన్నీ చుట్టిరావాలన్న తన చిరకాల కోరికను ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటూ వచ్చేవాడు. మంచి ఉద్యోగం సంపాదించి తన కోసం జీవితాన్నే త్యాగం చేసిన తండ్రి కోరికను నెరవేర్చాలనుకొన్నాడు రంజిత్‌. అయితే, 2020లో కరోనాతో రాములు కన్నుమూశాడు. ఆ సంఘటనతో రంజిత్‌ ఒక్కసారిగా కుంగుబాటుకు గురయ్యాడు. అదే సమయంలో తన ఆస్తులను అమ్మి మరీ కరోనా బాధితులకు అండగా నిలిచిన ‘రియల్‌ హీరో సోనూసూద్‌’ను చూసి స్ఫూర్తి పొందాడు. తన తండ్రి చిరకాల వాంఛను తీర్చడానికి సిద్ధమయ్యాడు. విభిన్నంగా ‘సైకిల్‌పై భారత్‌ యాత్ర’ చేపట్టాడు. తన ఎనిమిది వేల కిలోమీటర్ల యాత్రను తండ్రితోపాటు సోనూసూద్‌కూ అంకితమిచ్చాడు.

మొదటి రౌండ్‌.. వరంగల్‌ – కన్యాకుమారి!

- Advertisement -

2021 ఏప్రిల్‌ 5న సైకిల్‌ యాత్రను ప్రారంభించాడు రంజిత్‌. మొదటిసారి వరంగల్‌ నుంచి కన్యాకుమారి వెళ్లాడు. అయితే, సైకిల్‌ తొక్కడం అలవాటు లేక చాలా ఇబ్బంది పడ్డాడు. కర్నూలు జిల్లా డోన్‌ దగ్గర అనారోగ్యానికి గురయ్యాడు. కాళ్లు, పిక్కల నొప్పులతో అవస్థ పడ్డాడు. రంజిత్‌ ఇబ్బందిని గుర్తించిన స్థానిక ఎస్‌ఐ ఫిజియో థెరపీ చేయించాడు. వారంపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుడు చెప్పినా వినలేదు. ఆ రాత్రి పోలీస్‌ స్టేషన్‌లోనే పడుకొని, మరుసటి రోజు మళ్లీ యాత్రను కొనసాగించాడు. రోజుకు 100 నుంచి 110 కిలోమీటర్ల మేర సైకిల్‌ తొక్కాడు. అప్పటికి కరోనా సెకండ్‌ వేవ్‌ రావడంతో లాక్‌డౌన్‌ ప్రకటించారు. దీంతో రోడ్ల పక్కన పెట్రోల్‌ పంపులు, గుళ్లు, బళ్లలోనే పడుకొనేవాడు. హోటళ్లన్నీ మూసి ఉండటంతో భోజనానికీ ఇబ్బంది పడ్డాడు. రోడ్లవెంట కాసిన పండ్లు తింటూ ముందుకు సాగాడు. అలా 15 రోజుల్లో 1500 కిలోమీటర్లు ప్రయాణించి, కన్యాకుమారి చేరుకున్నాడు. అక్కడినుంచి గోవా మీదుగా తిరుగు ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. కన్యాకుమారి నుంచి గోవాకు 1232 కిలోమీటర్లు. అది పూర్తిగా అరేబియా సముద్రం పక్కనే ఉండే మార్గం. అందులోనూ ఎండాకాలం కావడంతో వీపరితమైన వేడి, ఉక్కపోతతో ఇబ్బంది పడ్డాడు. గోవా నుంచి కర్ణాటక మీదుగా జూన్‌ 11న వరంగల్‌ చేరుకున్నాడు. మొదటి దశలో భాగంగా 38 రోజుల్లో మూడు వేల కిలోమీటర్ల ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేశాడు.

రెండో రౌండ్‌.. లద్దాక్‌ – వరంగల్‌!

రెండో దశలో వరంగల్‌ నుంచి లద్దాక్‌ వరకు సైకిల్‌ యాత్ర చేయాలనుకున్నాడు రంజిత్‌. 2021 జులై 18న యాత్రకు శ్రీకారం చుట్టాడు. అయితే, ఇక్కడి నుంచి లద్దాక్‌ వెళ్లేసరికి చలికాలం మొదలయ్యే అవకాశం ఉన్నదని ఎవరో చెప్పారు. దీంతో యాత్ర సాధ్యం కాదనే ఉద్దేశంతో మనాలి వరకూ వాహనంలో వెళ్లాడు. అయితే, మొదటి దశలో ఎదుర్కొన్న ఇబ్బందులు పునరావృతం కాకుండా, రెండో దశలో ఆమెరికా నుంచి తెప్పించిన సైకిల్‌ను ఉపయోగించాడు. భోజన సమస్యలు తలెత్తకుండా గ్యాస్‌, చిన్న టెంట్‌ తదితర సామగ్రిని వెంట తీసుకెళ్లాడు. మనాలి నుంచి లద్దాక్‌ వరకు, అక్కడినుంచి కశ్మీర్‌, హరియాణా, పంజాబ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, మహరాష్ట్రల మీదుగా యాత్ర సాగింది. రెండో దశలో ఐదు వేల కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. హైదరాబాద్‌ చేరుకోగానే.. హైదరాబాద్‌ రిలీఫ్‌ రైడర్స్‌ అసోసియేషన్‌, హైదరాబాద్‌ సైక్లింగ్‌ గ్రూప్‌ (హెచ్‌సీజీ) రంజిత్‌కు ఘన స్వాగతం పలికాయి. ఆత్మీయంగా సన్మానించాయి. సెప్టెంబర్‌ 18న వరంగల్‌ చేరుకోగానే.. ‘వాహ్‌ వరంగల్‌’ ఆధ్వర్యంలో స్వాగతం లభించింది. చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌, వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణి తదితరులు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి రంజిత్‌ను కొనియాడారు.

Ranjith on Wheels
Ranjith on Wheels

ఎన్నెన్నో అనుభవాలు..

‘భారత్‌ యాత్ర’ సందర్భంగా ఎన్నో వింత అనుభవాలను ఎదుర్కొన్నాడు రంజిత్‌. కొన్ని సంఘటనలు ఇబ్బంది పెడితే, మరికొన్ని భయపెట్టాయి. ఒకసారి చావుకు దగ్గరగా వెళ్లినవాడు, మరోసారి ప్రకృతి రమణీయత నడుమ సేదతీరాడు. కొందరు సాయం చేస్తే, మరికొందరు మోసం చేయడానికి ప్రయత్నించారు. మొత్తానికి ఈ యాత్ర.. తనకు జీవితమంటే తెలియజెప్పిందని అంటున్నాడు. కన్యాకుమారి యాత్రలో భాగంగా ఓ రోజు తీవ్రంగా అలసిపోయి, తిండి కూడా లేకుండా ఒక గుడిలో పడుకొన్నాడు. అదే సమయంలో ఒక భిక్షగత్తె వచ్చి, రంజిత్‌ను తట్టిలేపింది. తన కోసం తెచ్చుకున్న ఇడ్లీలను ఇచ్చింది. ఆ సమయంలో తన కడుపు నింపిన ఆ భిక్షగత్తెను దేవతలా భావించాడు రంజిత్‌.

కేరళలో లాక్‌డౌన్‌ కఠినంగా ఉన్న సమయంలో సైకిల్‌ మొరాయించింది. చేతిలో డబ్బులు లేవు. తిండిలేదు. రంజాన్‌ మాసం కావడంతో దగ్గర్లోని మసీదుకు వెళ్లాడు. ఇద్దరు ముస్లిం యువకులు కష్టాన్ని అర్థం చేసుకొని, వాళ్ల ఇంట్లోనే ఆశ్రయం ఇచ్చారు. రెండు రోజులపాటు భోజనం పెట్టి, బాగా చూసుకొన్నారు. మెకానిక్‌ను పిలిపించి సైకిల్‌ బాగు చేయించారు.

కర్ణాటకలోని శివమొగ్గ వద్ద గెర్సొప్పా జలపాతాలను సందర్శించాడు రంజిత్‌. సైకిల్‌ పంక్చర్‌ కావడంతో.. అక్కడే ఉన్న ముగ్గురు యువకులు సాయం చేస్తామని నమ్మించారు. రంజిత్‌తోపాటు సైకిల్‌ను, ఇతర సామగ్రినీ తమ వ్యాన్‌లో ఎక్కించుకొన్నారు. వాహనంలోనే డ్రగ్స్‌, మద్యం తీసుకొంటూ.. ఎక్కడెక్కడో తిప్పారు. ఒక దగ్గర ఆపేసి.. రంజిత్‌, మరొకరు మినహా అందరూ దిగి వెళ్లిపోయారు. కొద్దిసేపటికి ఆ వ్యక్తి కూడా రంజిత్‌ ఫోన్‌ తీసుకొని ఉడాయించాడు. వెంటనే స్థానికుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు రంజిత్‌. వాహన వివరాలు ఇవ్వడంతో పోలీసులు వారిని పట్టుకొని, తన సైకిల్‌, సామగ్రిని ఇప్పించారు.

రెండో విడత యాత్రలో బారాలాచ్‌లా వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో రాత్రంత్రా అక్కడే ఉండాల్సి వచ్చింది. ఎత్తయిన ప్రాంతంలో ఆక్సిజన్‌ అందక, తీవ్రమైన చలిని తట్టుకోలేక.. చనిపోవడం ఖాయమనుకొన్నాడు. కుటుంబ సభ్యులు, బంధు మిత్రులందరికీ ‘థాంక్స్‌, బై బై..’ అంటూ వీడియో కూడా పెట్టాడు. వెంట తీసుకెళ్లిన గ్యాస్‌ సాయంతో నీటిని వేడి చేసి కొంచెం కొంచెం తాగుతూ, రాత్రంతా గడిపాడు. తెల్లవారి వాహనాలు రావడంతో అక్కడినుంచి బయటపడ్డాడు.

అత్యంత ఎత్తయిన పర్వతాల్లో ఒకటైన ఖర్దుంగ్లా (17582 ఫీట్లు)కు వెళ్లాడు. అక్కడి దాకా సైకిల్‌పై వచ్చిన వారు ఒక్కరు కూడా కనిపించలేదు. దీంతో ఒకింత గర్వంగా ఫీలయ్యాడు. ఇలాంటి యాత్రలు, సాహసాలు మరిన్ని చేయాల్సిందేనని అక్కడే నిర్ణయించుకొన్నాడు. అక్కడ దిగిన ఫొటోను సోనూసూద్‌కు ట్వీట్‌ చేశాడు. దానిని చూసిన సోనూ, తనను కలవాలని రంజిత్‌కు సమాచారం పంపించాడు.

కశ్మీర్‌లో తన సైకిల్‌కున్న జాతీయ జెండాను చూసి, కొందరు వాగ్వాదానికి దిగారు. జెండాను తీయమంటూ బెదిరించారు. ‘ఇంతకుముందు కశ్మీర్‌ గురించి మీడియాలో చూస్తే నమ్మలేదు కానీ, ఇప్పుడు స్వయంగా చూశాక అక్కడి పరిస్థితి చాలా ఇబ్బందికరంగా అనిపిస్తున్నది’ అంటాడు రంజిత్‌.

 Ranjith on Wheels
Ranjith on Wheels

ఈసారి ఈశాన్యానికి..

పర్యావరణం, వన్యప్రాణులు, జంతువుల సంరక్షణ, చిన్న పిల్లలపై అఘాయిత్యాలు.. తదితర అంశాల్లో ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి మరోయాత్ర చేపడతా. ఈసారి వరంగల్‌ నుంచి నేపాల్‌ మీదుగా ఈశాన్య రాష్ర్టాలన్నిటినీ చుట్టి రావాలనేది ప్రణాళిక. నా యాత్రకు ఆర్థికంగా సహకరించాలని మిమ్మల్ని కోరుతున్నా. ‘ రంజిత్‌ ఆన్‌ వీల్స్‌ ( ranjith on wheels ) ‘ పేరుతో యూట్యూబ్‌ చానల్‌ కూడా నిర్వహిస్తున్నా. ఇందులో నా యాత్రల విషయాలు, వీడియోలు ఎప్పుటికప్పుడు అప్‌లోడ్‌ చేస్తుంటా.

– దగర రంజిత్‌ కుమార్‌

సోనూసూద్‌ను కలిసి..

సోనూసూద్‌ను కలవడానికి ముంబై వెళ్లాడు రంజిత్‌. అయితే, అదేరోజు ఏదో పనిమీద హైదరాబాద్‌ వచ్చాడు సోనూ. రంజిత్‌ వచ్చిన విషయం తెలుసుకొని.. తాను ఆ రోజు రాత్రికే ముంబై వస్తాననీ, అక్కడే ఉండమనీ కోరాడు. దీంతో మరుసటి రోజు ఉదయాన్నే సోనూసూద్‌ను కలిశాడు రంజిత్‌. కరోనా సమయంలో నిస్వార్థంగా సేవలు అందించినందుకు ధన్యవాదాలు చెప్పాడు. సైకిల్‌పై చేపట్టిన 8 వేల కిలోమీటర్ల ‘భారత్‌ యాత్ర’ను సోనూకు అంకితమిచ్చాడు. దానికి సోనూసూద్‌ కూడా చాలా సంతోషపడ్డాడు.

-ఎన్‌.శ్రీనివాస్‌ రెడ్డి

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

floating breakfast | ఈ బ్రేక్‌ఫాస్ట్‌ తినాలంటే.. లక్షలు ఖర్చు చేయాల్సిందే. ఏంటి దీని స్పెష‌ల్‌.. సెల‌బ్రెటీల‌కు ఎందుకు ఇష్టం?

ఒక‌ప్పుడు స్కూల్ డ్రాప్ అవుట్.. ఇప్పుడు మ‌ల్టీ మిలియ‌నీర్‌.. ఇంత‌కీ ఆయ‌న ఎవ‌రో తెలుసా?

Real Life Ghajini : ప్ర‌తి 6 గంట‌ల‌కు ఒక‌సారి అన్నీ మ‌రిచిపోతాడు.. ఈ రియ‌ల్ లైఫ్ గ‌జినీ స్టోరీ ఏంటో తెలుసా?

ఆ ఐలాండ్‌లో మ‌హిళ‌ల‌దే రాజ్యం.. వాళ్ల‌దే పైచేయి.. మ‌రి పురుషులు ఏం చేస్తారు?

కార్పొరేట్ కొలువులు.. ల‌గ్జ‌రీ లైఫ్ వ‌దిలేసి అడ‌విలో కాపురం

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement