పవిత్ర రమజాన్ మాసంలో నిష్ఠగా ఉపవాసాలు ఆచరిండం ప్రతి ముస్లిం ధార్మిక విధి. అయితే, ఆ ఉపవాసాలను విజయవంతంగా పూర్తి చేయాలంటే శారీరక, మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యం. స్వీయ నియంత్రణ(తఖవా) చాలా అవసరం. అలాగే తగిన ఆహార, ఆరోగ్య జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. లేకపోతే రోజాలు పాటించే సమయంలో అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ప్రముఖ యునానీ వైద్యులు డాక్టర్ హకీం మహమ్మద్ జఫర్ ఎంతో శ్రమకోర్చి తన జీవితానుభవాన్ని, వృత్తి అనుభవాన్ని, వైద్య పరిశోధనలను మేళవించి ‘మెడికల్ సైన్స్ వెలుగులో రమజాన్ ఉపవాసాలు’ అనే పుస్తకాన్ని రచించారు.
ఇందులో రమజాన్ ఉపవాసాల సందర్భంగా పాటించాల్సిన ఆహార, ఆరోగ్య నియమాలను వివరించారు. ఉపవాసం అంటే అల్లాహ్కు దగ్గర ఉండటమని… అలాగే చెడు పనులకు, చేటు చేసే ఆహారానికి దూరంగా ఉండటమని వివరించారు. రోజాల సమయంలో వివిధ వ్యాధుల రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరంగా తెలిపారు. సహరిలో ఏం తినాలి, ఇఫ్తార్ ఎలా ఆరగించాలో కళ్లకు కట్టారు. అంతిమంగా సాత్వికాహారమే అత్యుత్తమమని తేల్చారు.
మహమ్మద్ ప్రవక్త(స) సూచనలను ఇందుకు సాక్ష్యంగా చూపారు. వేసవిలో పాటించాల్సిన అదనపు జాగ్రత్తలు జత చేశారు. రమజాన్ మాసంలో చేయదగిన వ్యాయామాలను వివరించారు. పొట్టకు విశ్రాంతి కలిగించే రమజాన్ ఉపవాసం ఆరోగ్యాన్ని ప్రసాదించే అల్లాహ్ ఆశీర్వాదం. ఆ మాసంలో అలవరచుకున్న మంచి ఆహారపు అలవాట్లు, నియమబద్ధ జీవనం మిగతా 11 నెలలపాటు కొనసాగిస్తే ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పది కాలాల పాటు ఆస్వాదించవచ్చని సూచిస్తారు. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన కరదీపిక ఈ పుస్తకం.
రచన: డా. హకీం ముహమ్మద్ జఫర్ MD, Unani
పేజీలు: 100; ధర: రూ.160
ప్రతులకు: ఫోన్: 98852 34522
– ముహమ్మద్ ముజాహిద్
పరమశివుణ్ని నీటితో అభిషేకించి, మారేడుతో పూజిస్తే చాలు పొంగిపోతాడు. కోరిన వరాలిచ్చేస్తాడు. అలాంటి భోళా శంకరుడి గురించి చంద్ర ప్రతాప్ ‘శ్రీ మహేశ్వర శతకం’ రాశారు. గంగను తలపై, పార్వతిని తన పక్కనా కూర్చో పెట్టుకున్న శివుడు భక్త సులభుడు. అన్నీ తన అధీనంలోనే ఉన్నా, ఏమీ పట్టనట్టుంటాడు – అంటూ పది పద్యాల్లో అలవోకగా చెప్పేశారు. అంతేనా? శివుడు వేదాలకు అతీతుడు.
కపాలాన్ని చేత పట్టిన గరళకంఠుడు. మార్కండేయుని కాపాడిన వైనాన్ని మరో పది పద్యాల్లో వర్ణించారు. ఏక బిగిన శతకం మొత్తాన్నీ చదివించి, మరో మాటు చదవడానికి పురిగొల్పుతుంది ఈ శ్రీ మహేశ్వర శతకం. ఆయన రచించిన ‘శ్రీ కాళికాంబ శతకం’ గురించి చెప్పాలంటే, సమకాలీన సమస్యలను ఏకరువుపెడుతూ, ‘దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ నీ తక్షణ కర్తవ్యం తల్లీ!’ అంటూ అమ్మల గన్న అమ్మకు గుర్తుచేశారు. అమ్మవారి అవతార విశిష్టతను చాటుతూ ఈ శతకం చాలా హాయిగా సాగుతుంది.
రచన : చంద్ర ప్రతాప్ కంతేటి
పేజీలు : 105, వెల : ఒక్కోటి రూ. 140
ప్రతులకు : ఫోన్ : 8008143507
-డా. వి. వి. వేంకటరమణ