Ramaayanam | మా ఇంట్లో చిన్నప్పుడు వేరే పండుగలు చేసినంత బాగా శివరాత్రి, వినాయక చవితి, రాఖీ పౌర్ణిమ, హోలీ లాంటి పండుగలు ఘనంగా చేసేవారు కాదు. మేము కొంచెం పెద్దయ్యాక మాత్రం వినాయకచవితి బాగా జరపడం మొదలుపెట్టి ఇప్పటికీ కొనసాగిస్తున్నాం.
ఓసారి గణేశ నిమజ్జనాలకు ముందు ఎందుకో హైదరాబాదుకు వెళ్లి అక్కడే నాలుగైదు రోజులున్నాం. గత పదేళ్ల కిందటికీ అప్పటికీ నగరంలో వినాయక మంటపాలు పెట్టడం చాలా పెరిగింది. ఒకప్పుడు బొంబాయిలో చాలా బాగా వినాయక చవితి వేడుకలు జరిగేవని చెబుతారు. కానీ హైదరాబాదులో కూడా అంతకంతకూ వినాయకులు పెరిగారు.
ఇంతకూ మా కజిన్స్ లక్ష్మి, హైమక్క పదేపదే ‘ ఒక్కసారన్న ఖైరతాబాద్ వినాయకుడ్ని చూడకుంటె దండుగ, పొయ్యి చూద్దాం రాండి. మస్తు ఉంటదట విగ్రహం’ అని చెప్పడంతో ఓ రోజు ఒక ఆటోలో వెళ్లాం. అప్పట్లో నలుగురం ఒకే ఆటో వెనుక సీట్లో పట్టేవాళ్లం. ఇంకా చెప్పాలంటే ఆటో వెనుక సీటుకు ఒక పక్క ఉండే రాడ్ మీద ఒకళ్లం. అలా అయిదుగురం ఒకే ఆటోలో వెళ్లేవాళ్లం. మొత్తానికి అయిదుగురం కజిన్స్ ఖైరతాబాదు చేరుకున్నాం. విగ్రహానికి కొంచెం దూరంలో దిగి నడిచి వెళ్లాం.
మొదటిసారిగా అంత పెద్ద వినాయకుడిని చూసి నేనెంత ఆశ్చర్యపోయానో చెప్పలేను. అసలు అంత పెద్దగా, అంత అందంగా ఆ విగ్రహాన్ని తయారు చేయడానికి ఎందరు ఎన్ని రోజులు కష్టపడ్డారో అనిపించింది. ఎన్నో అడుగుల ఎత్తులో ఉన్న ఆ వినాయకుడి ముందు మేమంతా చీమల్లా కనబడ్డాం. నా ధ్యాసంతా ఆ విగ్రహాన్ని చూడాలనే తప్ప భక్తి గురించి అప్పట్లో పెద్దగా తెలియదు.
ఆ తరువాత కొన్నేళ్లకే 1982లో అనుకుంటా కె.విశ్వనాథ్ కొత్త సినిమా కోసం కమలహాసన్‌తో ఒక డాన్స్‌ను ఖైరతాబాద్ వినాయకుడి ముందు చిత్రీకరిస్తున్నారని తెలిసి మళ్లీ వెళ్లాం. ‘ఏ.. మనను రానిస్తరా అక్కడికి? అందుల గూడ కమల్ హాసన్ ఆయే, ఎంత రష్ ఉంటదో ఏందో! దగ్గరికి పొయ్యి చూడనిస్తరో లేదో!’ అన్నది హైమక్క.
‘చూడనిస్తే చూద్దాం. లేకుంటె లేదు. అయినా ఇంట్ల ఎవ్వరికి చెప్పొద్దు. చెప్పితే పోనియ్యరు. సుల్తాన్ బజార్‌కు పోతున్నమని చెప్పి పోదాం.’ అంది లక్ష్మి. నాకూ, అక్కకూ హైదరాబాద్‌లో ఎటు పోతే ఏమొస్తుందో తెలియదు. ‘ఫాలో ద లీడర్’ అన్నట్లు వాళ్లు ఎటు తీసుకుపోతే అటు.. అంతే!
మొత్తానికి మళ్లీ ఓసారి ఖైరతాబాద్ వినాయకుడిని చూడ్డానికి వెళ్లాం. చాలా రష్‌గా ఉంది. వినాయకుడిని దర్శించుకున్నాం. ఎక్కడా కమల్ హాసన్ లేడు, విశ్వనాథ్ లేడు, షూటింగ్ హడావుడే లేదు. ఏమిటా అని తెలుసుకుంటే పగలంతా షూటింగ్ జరిగితే జనం డిస్టర్బ్ చేస్తారని రాత్రి పూట షూటింగ్ పెట్టుకున్నారని తెలిసింది. ‘అయ్యో! కమల్ హాసన్‌ను చూడలేకపోయామే!’ అనుకున్నాం. ‘సాగర సంగమం’ విడుదలయ్యాక కమల్ డాన్స్ చూసి ‘అరె! ఇది మనం నిలబడ్డ చోటే గదా!’ అని థ్రిల్ ఫీల్ అయ్యాం. తరువాత రోజుల్లో ఖైరతాబాద్ వినాయకుడి ఎత్తు మరింత పెరగడం, బాలాపూర్ లడ్డూకు ఎంతో ప్రాచుర్యం రావడం, ప్రతి గల్లీలో వినాయకుడిని పెట్టడం, చందాలు అడగడం, పాటలు, మైకులు హోరెత్తడం, నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు చేయడం, ట్రాఫిక్ జామ్, టీవీల్లో లైవ్ టెలికాస్ట్ వంటివన్నీ కాలానుగుణంగా జరిగాయి.
వినాయక చవితి అంటే ఒక సంఘటన గుర్తొస్తుంది. మా ఊర్లో ఎప్పుడూ అవుసలి వాళ్లే మట్టి వినాయకుడిని చేసి, ఆ రోజు ఉదయాన్నే తెచ్చేవారు. వాళ్లకు వంటకు సరిపడా వస్తువులన్నీ ఇచ్చి కొంత డబ్బు కూడా ఇచ్చేవారు. ఓసారి అవుసలి సత్యనారాయణ ఎప్పటిలాగే వినాయకుడి ప్రతిమ తెచ్చి మేము ఇచ్చిన పళ్లెంలో ఉంచి వెళ్లాడు. కాసేపయ్యాక మేము తలంట్లు పోసుకుని ఉన్నంతలో కొత్త బట్టలేసుకుని పాలవెల్లి సిద్ధమయ్యాక వినాయకుడిని పీట మీద ఉంచుదామని చూస్తే ఎలుక కనిపించలేదు. వాహనం లేకుండా వినాయకుడిని ఎట్లా ఉంచడం?! అక్కడికీ చుట్టుపక్కలంతా వెదికాం. ఎక్కడా కనిపించలేదు.
‘ఆ అవుసలోండ్ల పిలగాడు ఏ జాసల ఉన్నాడో ఏందో! ఒక్క వినాయకుని బొమ్మ ఇచ్చి ఎలుకను మర్చిపోయిండేమో! వాణియన్ని దాణిగె వేషాలు. ఎలుకను తెమ్మని ఎవరినన్న తోలుండి’ అన్నది నానమ్మ. సత్యనారాయణ వినాయకుడి ప్రతిమ తోబాటు ఎలుకను పళ్లెంలో ఉంచినప్పుడు అందరమూ చూసాం. అతడు తేలేదని ఎలా అంటాం?
మొత్తానికి నాన్న మరో ఎలుక ఉంటే పంపించమని సత్యనారాయణ దగ్గరికి ఒకతన్ని పంపాడు. అయితే సత్యనారాయణ ఇంట్లో లేడు. కనీసం ఓ పది ఇళ్లలో వినాయకుడి ప్రతిమలు ఇవ్వాలాయే! ఎవరింటికి వెళ్లినా ‘అరే! గిప్పుడే పోయిండు’ అనడం.. ‘ఎందుకు?’ అని వాళ్లు అడగడం.. ‘ఎలుక గావాలే!’ అని ఇతను చెప్పగానే.. ‘ఉత్త ఎలుకకు పూజ జేస్తవా?! వినాయకుడు లేకుండ ఎలుక ఎందుకు?’ అని వాళ్లు అనడం.. ‘ఎహె! నాగ్గాదు. మా దొరోళ్లకు’ అని చెప్పి మళ్లీ పరిగెత్తడం.. ఇలా జరిగింది.
చివరికి ఎట్లనో సత్యనారాయణను దొరకపట్టుకుని విషయమంతా చెప్పి ఒక ఎలుకను ఇవ్వమని అడిగితే.. ‘నాకు అన్నీ సెట్లే ఉన్నాయి. మళ్లా మీకు ఇస్తే ఒక ఎలుక తక్వబడ్తది కదా! ఇప్పటిదిప్పుడు చెయ్యాల్నంటే నా తాన ర్యాగడి మట్టి లేదు, సాంచా సుత లేదు’ అన్నాడట ఆయన.
మళ్లీ పరిగెత్తి వచ్చి నాన్నకు చెపితే.. ‘పాపం! ఆయినెకు కూడా కష్టమే గద! ఇంకొక సెట్టు ఇయ్యమను’ అంటూ డబ్బులిచ్చి పంపాడు. మా ఇంట్లో అప్పుడు ఎలుకలు ఎక్కువగా ఉండేవి. ‘మనింటి ఎలుకలు దోస్త్ ఒచ్చిందని తొర్రలకు గుంజుకపోయినయి గావచ్చు’ అని నానమ్మ అన్నది. మొత్తానికి ఇద్దరు వినాయకులు, ఒక ఎలుకతో పూజ ముగించాం ఆరోజు. ఏదేమైనా అప్పుడు వినాయకచవితి పండుగలో సంబరం, భక్తి కనిపిస్తే.. ఇప్పుడు ఎందుకో ఆడంబరం, ప్రదర్శన ఎక్కువ అనిపిస్తున్నాయి.
– నెల్లుట్ల రమాదేవి
రచయిత్రి