గురు పరంపరకు సంబంధించి ఇదొక విజ్ఞాన సర్వస్వం. అజ్ఞాన తిమిరచ్ఛేదమే సద్గురువుల అవతార రహస్యం. ఆ పరమసత్యాన్ని చంద్రభాను సత్పతి రచించిన ‘శ్రీ గురు భాగవతం’ సోదాహరణంగా చాటుతున్నది. ఇందులో ప్రాచీన గురు సంప్రదాయం మూలాలను వివరించారు. దత్తాత్రేయ, సాందీపని, యాజ్ఞవల్క్య, అష్టావక్ర, అగస్త్య.. తదితర మహర్షుల బోధనలను పరిచయం చేశారు. గాయత్రీ మంత్ర ఆవిర్భావ క్రమాన్ని విశ్లేషించారు. యజ్ఞయాగాదుల దివ్యత్వాన్ని ప్రకటించారు. కుటుంబ వ్యవస్థ కర్తవ్యాన్ని, తల్లిదండ్రుల బాధ్యతను, త్యాగాలను గుర్తుచేశారు. అతిప్రేమతో పిల్లలకు అడ్డుచెప్పనివారు అయోగ్య దంపతులనీ, చివరికి వారి మాటలను కన్నబిడ్డలు కూడా ఖాతరు చేయరని హెచ్చరించారు. ఓంకార వైశిష్ట్యాన్ని ఎరుకపకరిచారు. సరళమైన శైలి, సుబోధకమైన వ్యక్తీకరణ పుస్తకానికి వన్నె తెచ్చాయి.
శ్రీ గురు భాగవతం (సద్గురువుల పరంపర)
రచన: చంద్రభాను సత్పతి
అనువాదం: డాక్టర్ పి.జి.ప్రసూనాంబ
పేజీలు: 240; వెల రూ.250
ప్రతులకు: తెలుగు కల్చరల్ ఫౌండేషన్ ట్రస్ట్, హైదరాబాద్.
ఫోన్: 93968 05686
‘హెచ్చరిక చేసేవాడెవ్వడూ రాని జాతి ఏదీ లేదు’ అని దివ్య ఖుర్ఆన్ ప్రవచిస్తుంది. మానవాళి అధర్మ మార్గంలో పయనించకుండా, సన్మార్గంలో నడవడానికి భగవంతుడు ప్రవక్తలను పంపుతాడు. ఆ ప్రవక్తల పరంపర ముహమ్మద్(స)తో సమాప్తమైందని ముస్లింల విశ్వాసం. ఇలాంటి మహనీయుల రాక గురించి వివిధ ధార్మిక గ్రంథాల భవిష్యవాణులు వివరిస్తాయి. వేదాల్లో పేర్కొన్న ‘నరాషన్స్’ అన్న పదానికి ప్రశంసించబడిన మానవుడు అని అర్థం. ముహమ్మద్ అనే పదానికీ అదే అర్థం. ప్రపంచంలో క్రూరత్వం వ్యాపించి, పాపాలు పెరిగినప్పుడు కల్కి అవతరించి దుష్టుల్ని అణచి వేస్తారని హిందువుల నమ్మకం. ఏడో శతాబ్దం ప్రారంభంలో అరబ్ ప్రాంతంలో అలాంటి వాతావరణం నెలకొన్నప్పుడు ముహమ్మద్(స) భూమిపై అవతరించి ధర్మ పరిరక్షణ చేశారు. భాగవతం, మహాభారతంలో పేర్కొన్న కల్కి అవతారానికి ఉండే జ్ఞానం, ఆత్మనిగ్రహం, పరాక్రమం, దాతృత్వం మొదలైన దైవ ప్రసాదిత గుణాలు ముహమ్మద్(స)లోనూ ఉన్నాయంటారు రచయిత. సర్వమత ప్రవక్తల సందేశం ఒక్కటేనని, మనుషులు ముహమ్మద్(స) హితబోధను ఆచరిస్తూ సత్యమార్గంలో జీవించాలని ‘భారతీయ ధార్మిక గ్రంథాల్లో మహనీయ ముహమ్మద్(స)’ పుస్తక సందేశం.
భారతీయ ధార్మిక గ్రంథాల్లో మహనీయ ముహమ్మద్ (సల్లాల్లాహు అలైహి వసల్ల)
రచన : డాక్టర్ ఎం.ఎ.శ్రీవాస్తవ్
అనువాదం : అబుల్ ఫౌజాన్
పేజీలు : 64, వెల : ఉచితం
ప్రతులకు: 1800 572 3000