లలిత కళలు మనిషి సృజనాత్మక శక్తికి మచ్చుతునకలు. సంగీతం, నృత్యం, నాటకం, చిత్రలేఖనం తదితరాలు ఈ విభాగంలో ఉంటాయి. 20వ శతాబ్దంలో తెలుగు రాష్ర్టాల్లో ఎంతోమంది ప్రముఖులు కళారంగాన్ని పరిపుష్టం చేశారు. తమతమ రంగాల్లో వారి ప్రావీణ్యానికి స్థానికంగా ఆదరణతోపాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టారు. అలాంటి యాభై మంది జీవనరేఖలకు కళాదీపిక సంస్థ ‘తెలుగు దివ్వెలు’ పేరుతో పుస్తక రూపం కల్పించింది. ఇందులో ప్రస్తావించిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ, బాలాంత్రపు రజనీకాంతరావు, కొండపల్లి శేషగిరిరావు, మిద్దె రాములు, పి.టి.రెడ్డి, షేక్ నాజర్ మొదలైన వారి జీవితాల చిత్రణ నేటితరంతోపాటు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకం.
సంపాదకుడు: వి.ఎస్.రాఘవాచారి
పేజీలు: 136; ధర: రూ. 125
ప్రచురణ: కళాదీపిక
ప్రతులకు: ఫోన్: 99088 37451
సృష్టి సమస్త ప్రాణులకూ కోపం, సంతోషం, బాధ, దుఃఖం మొదలైన భావోద్వేగాలను సమకూర్చింది. కానీ, మనిషికి మాత్రం ఎదుటి మనిషిని చదివే అవ్యక్త శక్తిని అదనంగా ఇచ్చింది. అది తెలిసీ తెలియనట్టు ఉంటుంది. ఉమా మహేష్ ఆచాళ్ళ తాజా కథా సంకలనం ‘వ్యక్తావ్యక్తం’లో ఇదే పేరుతో సాగిన కథ మనిషికి ఉండాల్సిన ఈ లక్షణానికి పెద్దపీట వేసింది. ఈ కథలో భర్త అవ్యక్త ప్రేమ అతను పోయేవరకు భార్యకు తెలియదు. కాబట్టి ఎదుటి మనిషి అవ్యక్త శక్తిని గమనించి, గౌరవించాలని రచయిత పేర్కొంటారు. ఈ సంకలనంలోని ఇతర కథలు కూడా మనిషిలో ఉండాల్సింది మంచితనం మాత్రమే అని చాటుతాయి.
‘బతుకు విపంచి’ కథ చదువుల తల్లి సరస్వతి చేతిలో ఉండే వీణ తయారుచేసే వారి జీవితాల్లో బతకడానికి అవసరమైన లక్ష్మి లేకపోతే ఎలా ఉంటుందో కళ్లకు కడుతుంది. ‘అక్రోధేన జయేత్ క్రోధం’ కథ కోపాన్ని శాంతంతో, చెడును మంచితో, అసత్యాన్ని సత్యంతో జయించాలని సూచిస్తుంది. ప్రేమలోనూ, పోరులోనూ అంతా నైతికమే అనే ఇతివృత్తంతో ‘నైతికానైతికం’ కథ నడుస్తుంది. ‘ఇంకా తెలవారదేమి’ కథ యజమాని కొడుకు దుందుడుకు తనం వల్ల విధి వంచితుడైన ఓ శ్రామికుడి మానసిక సంఘర్షణను చిత్రిస్తుంది. గృహిణి అంటే వంటింటి కుందేలు కాదని, ఆమె అన్ని రంగాల్లో అందెవేసిన చేయి అని ‘ఆల్ రౌండర్’ కథ గుర్తుచేస్తుంది. ఇలా వ్యక్తావ్యక్తం సంకలనంలోని కథలన్నీ కూడా మనిషిని మంచి వైపు నడిపిస్తాయి.
రచన: ఉమా మహేష్ ఆచాళ్ళ
పేజీలు: 120; ధర: రూ. 120
ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్: 0866 2432 885