తెలంగాణలో నిజాం నవాబుల పాలనలో కొడిగడుతున్న తెలుగు భాషా సాహిత్యాలకు ఇంధనం సమకూర్చి, వెలుగులు నిలబెట్టిన సంస్థ తెలంగాణ సారస్వత పరిషత్తు. 80 ఏండ్ల కింద స్థాపించిన ఈ సంస్థ హైదరాబాద్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ప్రత్యేక తెలంగాణ ప్రస్థానంలో తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యం అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. ఎన్నెన్నో పుస్తకాలను వెలువరించింది. ఈ క్రమంలో అత్యాధునిక 21వ శతాబ్ది బాలల్లో తెలుగు భాషపట్ల మమకారం పెరగడానికి, పిల్లలు జీవితంలో అన్ని రంగాల్లో సమగ్రంగా ఎదగడానికి, విజ్ఞాన రహస్యాలు తెలుసుకోవడానికి తనవంతు కానుకలుగా మూడు పుస్తకాలను తెలంగాణ సారస్వత పరిషత్తు వెలుగులోకి తీసుకువచ్చింది. వీటిలో మొదటిది ‘బాల కథా సౌరభం’.
113 పేజీల ఈ పుస్తకంలో పురాణాలు, పంచతంత్రం, మహనీయుల జీవితం, తెలుగు జాతీయాలు మొదలైన అంశాలకు సంబంధించిన కథలను తగిన బొమ్మలతో తీర్చిదిద్దారు. రెండోదైన ‘విజ్ఞానం వికాసం’లో పిల్లలకు అవసరమైన సాధారణ విజ్ఞాన, చారిత్రక, సాంస్కృతిక అంశాలను అందించారు. 150 పేజీల ‘పిల్లల పాటల పరిమళం’ పుస్తకంలో చిన్నారి పాపలకు ఎన్నో ఏండ్లుగా అనుశ్రుతులుగా వస్తున్న ఇష్టమైన బాలగీతాలను గుదిగుచ్చారు. స్మార్ట్ఫోన్లతో కుస్తీ పడుతూ ఆపసోపాలు పడుతున్న తెలుగు బాలలకు ఈ మూడు పుస్తకాలు మెదడుకు పదునుపెట్టే పసందైన విందంటే అతిశయోక్తి కాదు.
బాల కథా సౌరభం:
పేజీలు: 118; ధర రూ.120
విజ్ఞానం-వికాసం:
పేజీలు: 147; ధర రూ.165
పిల్లల పాటల పరిమళం:
పేజీలు: 164; ధర రూ.180
ప్రతులకు: 90002 73224
నిత్య జీవిత వాస్తవాలను కథా వస్తువులుగా తీసుకుని రచయిత జాలాది రత్నసుధీర్ వెలువరించిన 15 కథల సంకలనం ‘మనసు పలికిన…’. ఇందులో మొదటి కథ ‘స్వర్గానికి వెయ్యో వ్యక్తి’. సృజనాత్మక శక్తిని బాధ్యత లేకుండా వినియోగించుకుంటున్న సీరియల్ రచయితల మీద అధిక్షేప ధోరణితో రాసిన కథ ఇది. దాంపత్యం నూరేళ్ల పంట అని చాటిన కథ ‘వందవ వివాహ వార్షికోత్సవం’.
ఓ సాధారణ మహిళ, ఆర్థిక స్వాతంత్య్రం కారణంగా అహం కారంతో కండ్లు మూసుకున్న ఓ ఆధునిక యువతి కండ్లు తెరిపించిన వైనం ‘పనిమనిషి’లో కనిపిస్తుంది. ‘రీసౌండ్’, ‘గవర్నమెంట్ జాబ్’, ‘రాజుగారి ఏడుచేపల కథ’ ప్రభుత్వ వ్యవస్థల్లో మేటవేసిన అవినీతి ప్రధానంగా సాగుతాయి. ‘ఖర్చులుంటాయి కదా!’ అనే మాట అర్థం మూడు తరాల్లో ఎలాంటి మార్పు సంతరించుకుందో ‘మాకూ ఖర్చులుంటాయి కదా!’ కండ్లకు కడుతుంది. రత్నసుధీర్ కలం నుంచి జాలువారిన ‘మనసు పలికిన…’ సంకలనంలోని కథలు ఆధునిక జీవితాల్లో సానుకూల మార్పును ఆశిస్తూ సాగుతాయి.
మనసు పలికిన…
రచన: జాలాది రత్నసుధీర్
పేజీలు: 103, ధర: రూ. 100
ప్రతులకు: ఫోన్: 98494 18009
– హర్షవర్ధన్