భారతీయుల దృష్టిలో నది, ప్రవహించే నీరు మాత్రమే కాదు… జీవాన్నిచ్చే శక్తి!తాపం తీర్చే వనరే కాదు… ప్రాణం నిలిపే తల్లి కూడా! అందుకే నదిని దేవతగా పూజిస్తాం. ప్రతి భారతీయుడు తన జీవితకాలంలో ఏదో ఒక సమయంలో నదిని దర్శించుకోవాలని తాపత్రయపడతాడు. అనాదిగా తన తరాలను నిలబెడుతున్న నది పట్ల మనిషిది కృతజ్ఞత మాత్రమే కాదు, ఆరాధనా భావం కూడా! ఆ నదీ తీరానే పితృ దేవతలను తలుచుకుంటాడు, నదీ జలాలను అర్ఘ్యంగా సూర్యుడికి సమర్పిస్తాడు. ఆ నీటిలో తడిసి, వాటిని నెత్తిన జల్లుకుని మూడు మునకలు వేసి తరిస్తాడు. అందుకు కల్పించుకున్న ఓ అపురూప సందర్భమే పుష్కర స్నానం! ‘నర్మదా సింధు కావేరీ..’ అంటూ నీటిని పవిత్రం చేసే మంత్రం చెప్పుకొంటాం. ఆ నర్మదకు ఈ వారం నుంచీ పుష్కరాలు… ఈ సందర్భంగా ఆ విశిష్ట నదీ విశేషాలు…
మన దేశంలో ఉన్న ప్రతి నదికీ ఓ ప్రత్యేకత ఉంది. అది పారే విధానం, దిక్కు, సారం, ఆ తీరాన వెలసిన క్షేత్రాలు, నది వెంబడి సాగే జీవనం… వీటన్నిటి ఆధారంగా వాటికి ప్రత్యేకతలను ఆపాదించి కొలుచుకునే ఆచారం మనది. అందుకే మనవారు కేవలం సమీపంలో ఉన్న నదిని మాత్రమే పవిత్రంగానో, పుణ్యక్షేత్రంగానో భావించరు. బ్రహ్మపుత్ర నుంచి పంపా నది వరకు ప్రతి నదినీ దేవతగా గుర్తిస్తారు. ఏదో ఒక సమయంలో వాటిని దర్శించాలని కోరుకుంటారు. అందుకే ఒక నదికి వచ్చే పుష్కరాలు స్థానిక వేడుకగా కాకుండా, దేశమంతా పండుగలా భావించే వేదికగా మారతాయి. ఈ ఏడాది కూడా అలాంటి ఒక సందర్భం వస్తున్నది. నర్మదా నదికి పుష్కర ఘడియలు సమీపించాయి. మే 1 నుంచి 12 వరకు ఈ పుష్కరాలు జరుగుతాయి. ఈ సందర్భంగా పుష్కరాల విశేషాలు, నర్మదా నది వైభవాన్ని తలుచుకునే ప్రయత్నమిది!
పుష్కరాల సంప్రదాయం వెనుక ఉన్న కథలలో ఎక్కువగా వినిపించే గాథ ఇది. పూర్వం తుందిలుడు అనే రుషి ఉండేవాడు. ఆయన శివుణ్ని ప్రసన్నం చేసుకునేందుకు ఘోరమైన తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని అడిగితే… ‘నీలో నాకు శాశ్వత స్థానం లభించేట్లు అనుగ్రహించమ’ని వేడుకున్నాడు తుందిలుడు. అతని భక్తికి మెచ్చిన శివుడు తనలోని జలశక్తికి ప్రతినిధిగా మారమని తుందిలుణ్ని అనుగ్రహించాడు. అలా ఈ జగాన ఉన్న జలాలకు తుందిలుడు అధిపతి అయ్యాడు. జలం లేకుండా జీవం లేదు కాబట్టి, తుందిలుడికి పుష్కరుడు (పోషించేవాడు) అన్న మారుపేరు స్థిరపడింది. ఇదిలా ఉండగా బ్రహ్మదేవుడు తన సృష్టిని కొనసాగించడానికి జలశక్తి అవసరమైంది. దాంతో పుష్కరుణ్ని తనకు అండగా ఉండమని ఆహ్వానించాడు. శివుడి అనుజ్ఞతో పుష్కరుడు బ్రహ్మ దగ్గరికి వెళ్లి సృష్టికి సాయపడ్డాడు. బ్రహ్మ పని పూర్తయినప్పటికీ, పుష్కరుణ్ని వదులుకోవడం ఆయనకు ఇష్టం లేకపోయింది. అలా పుష్కరుడు బ్రహ్మ దగ్గరే ఉండిపోయాడు.
కొన్నాళ్లకు దేవగురువైన బృహస్పతి, భూమి మీద ఉన్న జీవులందరినీ తన జలశక్తితో పాపవిమోచనం చేయగలిగే పుష్కరుణ్ని తనతో పంపమని బ్రహ్మను అభ్యర్థించాడు. పుష్కరుణ్ని శాశ్వతంగా వదులుకోవడం ఇష్టం లేని బ్రహ్మదేవుడు ఓ మధ్యేమార్గాన్ని సూచించాడు. బృహస్పతి ఒక ఏడాదిలో ఏ రాశిలో అయితే ప్రవేశిస్తాడో, నాటి నుంచి 12 రోజుల పాటు ఒక నదిలో ఉండమని సూచించాడు. అలా 12 రాశులకు, 12 నదులను కేటాయించాడు. గంగానది (మేషరాశి), నర్మద (వృషభం), సరస్వతి (మిథునం), యమున (కర్కాటకం), గోదావరి (సింహం), కృష్ణ (కన్య), కావేరి (తుల), భీమా/తామ్రపర్ణి (వృశ్చికం), తపతి/బ్రహ్మపుత్ర (ధనుస్సు), తుంగభద్ర (మకరం), సింధు (కుంభం), ప్రాణహిత (మీనం).
నదుల గురించి చెప్పుకొనేటప్పుడు గంగ, యమున, కృష్ణ, గోదావరి లాంటి పేర్లు వినిపించినంతగా నర్మదను తల్చుకోరు. నిజానికి నర్మద కూడా అంతే అద్భుతమైన జీవనది. భారతదేశంలో ప్రవహించే నదులలో అయిదో అతిపెద్ద నది. పశ్చిమంగా ప్రవహించేవాటిలో అతి పొడవైనది. అందుకే మహానది అని కూడా పిలుస్తుంటారు. గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో ప్రవహించే ఈ నది తొలి రెండు రాష్ర్టాలకు అపారమైన జలరాశిని అందిస్తున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ర్టాల ఆర్థిక వ్యవస్థ, సామాజిక జీవనం లాంటి వాటిని నర్మద లేకుండా ఊహించలేం. సుమారు లక్ష చదరపు కిలోమీటర్ల నర్మద పరీవాహక ప్రాంతం చాలా వైవిధ్యమైంది, పురాతనమైంది కూడా. దాదాపు 16 కోట్ల సంవత్సరాల కిందట ఉత్తర భారతదేశం, ఇప్పటి ద్వీపకల్పం విడివిడిగా ఉండేవి. వాటిమధ్య ఏర్పడిన లోయలో ప్రవహిస్తున్నదే నర్మద. ఇంత వైవిధ్యమైన పరిస్థితుల మధ్య ఏర్పడింది కాబట్టే నర్మదలోయలో అపారమైన ఖనిజ వనరులు ఉన్నాయి. నర్మద చుట్టూ.. ఆ నదిలో భాగంగా పర్వతశ్రేణులు, జలపాతాలు, లోయలు లాంటి భౌగోళిక అద్భుతాలు కనిపించేందుకు కారణం… అది ఏర్పడిన తీరే. అత్యంత ప్రాచీనమైన జీవనది కాబట్టి ఇక్కడి తీరప్రాంతంలో డైనోసార్ల అవశేషాలూ కనిపించాయి.
హిందూ పురాణాలలో నర్మదది ఓ ప్రత్యేక స్థానం. స్కంద, కూర్మ, మత్స్య పురాణాలలో నర్మద వృత్తాంతం కనిపిస్తుంది. శివుడి దేహం నుంచి పుట్టినది కాబట్టి అయోనిజ అనీ, పరమేశ్వరుడికి ప్రీతికరమైనది కాబట్టి నర్మద అనీ, అలలతో ఎగురుతూ ప్రవహించేది కాబట్టి రేవా నది అనీ పిలుస్తారు. ఇవే కాకుండా పూర్వగంగ, సోమోద్భవ లాంటి చాలా పేర్లే కనిపిస్తాయి నర్మదకు. నాగులకు తమ రాజ్యాన్ని తిరిగి ఇప్పించే క్రమంలో, నర్మదాదేవి పురకుత్సుడనే రాజును ఆకర్షించి నాగలోకానికి రప్పించినట్టు ఒక కథ వినిపిస్తుంది. అమర్ కంటక్ దగ్గర పుట్టిన నర్మద మైదాన ప్రాంతాల గుండా కాకుండా రాళ్లు, కొండలను చీల్చుకుంటూ… అడవుల మధ్య ప్రవహిస్తూ సాగుతుంది. ఈ నది ప్రవహించే దారి పొడవునా ప్రతీ క్షేత్రం ఏదో ఒక పురాణ పాత్రతో ముడిపడి ఉండటం విశేషం. మాంధాత చక్రవర్తి తపస్సు చేసిన మాంధాత ద్వీపం, జాబాలి పేరు మీదుగా జబల్పూర్, భృగు మహర్షి తపస్సు ఆచరించిన బ్రోచ్ లాంటి స్థలాలు పురాణకాలంలో ఉన్న అనుభూతినిస్తాయి. ఈ నదిలో శివలింగాన్ని పోలిన బాణలింగాలు కనిపించడం మరో ప్రత్యేకత. ఇన్ని అబ్బురాలు ఉన్నాయి కాబట్టే నర్మద నదిని చూసినంతనే పుణ్యం లభిస్తుందని భావిస్తారు. ఆ నదీతీరాన జరిగే స్నానం, దానం, యాగం విశేష ఫలితాన్నిస్తాయని నమ్ముతారు.
41 ఉపనదులతో ప్రవహించే నర్మద దారి పొడవునా అనేక ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తూ సాగుతుంది. నర్మద పరీవాహక ప్రాంతంలో ఖనిజాలతో సమృద్ధిగా ఉండే నల్లరేగడి నేలలు ఎక్కువ. జబల్పూర్, దభోయ్, ధర్మపురి, హార్ధా తదితర నగరాలు, పట్టణాలు నర్మద తీరంలో ఉన్నాయి. ఇక నర్మద పొడవునా ఉన్న పుణ్యక్షేత్రాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
దట్టమైన అరణ్యాలలో కనిపించే అరుదైన పుణ్యక్షేత్రం అమర్ కంటక్. నర్మద జన్మస్థానం. అటు వింధ్య, ఇటు సాత్పుర పర్వత శ్రేణుల కూడలి. వేయి మీటర్లకు పైగా ఎత్తున్న ఈ ప్రదేశంలో నది ఉద్భవించే చోటే నర్మదా మాత గుడి ఉంది. ఓవైపు ప్రకృతి అందాలు, మరోవైపు అబ్బురపరిచే శిల్పకళ… ఈ స్థలాన్ని చూసి తీరాల్సిన పుణ్యక్షేత్రంగా మార్చేశాయి. దాదాపు 600కు పైగా అరుదైన జీవజాతులు ఇక్కడ ఉన్నాయని అంచనా. కాళిదాసు, కబీర్ లాంటి మహామహులు ఇష్టపడిన ప్రదేశమిది. వెయ్యేండ్ల క్రితం కామదేవ రాజు నిర్మించిన త్రిముఖి ఆలయం, జైన మందిరం, శంకరాచార్య ఆశ్రమం… లాంటి కట్టడాలెన్నో ఇక్కడ కనిపిస్తాయి. జీవితంలో చూసి తీరాల్సిన పుణ్యక్షేత్రాలంటూ ఉంటే, వాటిలో అమర్ కంటక్ ఒకటని ఒప్పుకొని తీరుతారు భక్తులు.
హైందవ పుణ్యక్షేత్రాలలో జ్యోతిర్లింగాలకు ఉన్న ప్రాముఖ్యాన్ని గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వాటిని చూస్తేనే జన్మ తరిస్తుందనే నమ్మకం. వాటిలో ఒకటి నదీ తీరాన, అందులోనూ ఓ ద్వీపం మీద ఉండటం విశేషం. అదే ఓంకారేశ్వరం. ఈ ప్రాంతం ఓంకార రూపంలో ఉండటమే ఆ పేరుకు కారణమని చెబుతారు. దానవులను శిక్షించేందుకు శివుడు ఓంకారేశ్వరుడిగా ఇక్కడ అవతరించాడని స్థల పురాణం. ఇదే ద్వీపం మీద అమలేశ్వరుని పేరుతో మరో శివాలయం ఉంది. శంకరాచార్యుడు తన గురువు గోవింద భగవత్పాదులను ఇక్కడే కలుసుకున్నారన్న నమ్మకానికి సూచనగా, ఆయన విగ్రహం కూడా కనిపిస్తుంది. ఈ ద్వీపానికి కేవలం 140 కిలోమీటర్ల దూరంలోనే మరో జ్యోతిర్లింగ క్షేత్రం ఉజ్జయిని ఉంది.
పురాణాలు, రాజులు, వలసపాలన, నగరీకరణ, భౌగోళిక వైవిధ్యం… జబల్పూర్ను తల్చుకోగాలనే ఇలాంటి ఎన్నో అంశాలు గుర్తుకొస్తాయి. నర్మద పాలరాళ్లను చీల్చుకుంటూ ఏర్పర్చిన మార్బుల్ రాక్స్, ధువందర్ జలపాతాలు, కొండ మీద కట్టిన మదన్ మహల్ కోట, కన్హా నేషనల్ పార్క్, బార్గి డ్యామ్… లాంటి పర్యటక ప్రదేశాలు చాలానే ఉన్నాయిక్కడ. ఇక ఆలయాల సంగతి సరేసరి. 64 యోగినులను ప్రతిష్ఠించిన చౌసట్ యోగిని ఆలయం ఓ మార్మిక ప్రదేశం. త్రిపుర సుందరి ఆలయం, తాల్ బడా జైన్ మందిర్ లాంటి గుడులు జబల్పూర్లో అడుగడుగునా కనిపిస్తాయి. ప్రపంచ ప్రసిద్ధ ఖజరహో ఆలయాలు ఇక్కడికి 250 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. ఇక్కడి చెరువులు, ఘాట్లు, బ్రిటిష్ కట్టడాలు కూడా చూసి తీరాల్సిందే!
చాలా చిన్న ఊరే. కానీ అడుగడుగునా అరుదైన ఆలయాలున్న చోటు. ఇక్కడున్న వెయ్యేండ్ల నాటి సిద్ధనాథ్ ఆలయం వాస్తు శిల్పంలో ఓ అద్భుతం. మారుమూలగా ఉండటం వల్ల, దండయాత్రలను తప్పించుకున్న ఈ ఆలయంలోని శిల్పాలను చెక్కారా, కరిగించారా అన్నంతగా మెలికలు తిరిగి ఉంటాయి. నెమావర్ దగ్గర నర్మద సరిగ్గా సగానికి ఉంటుంది కాబట్టి, దీన్ని నాభిస్థానం అని కూడా అంటారు. సూర్య దేవాలయం, రేణుక ఆలయం లాంటి ప్రాచీన ఆలయాలూ ఇక్కడ కనిపిస్తాయి.
ఆలయం చుట్టూ ప్రదక్షిణ గురించి విన్నాము, గిరి ప్రదక్షిణ గురించీ విన్నాము… కానీ ఒక నది చుట్టూ ప్రదక్షిణ చేసే అపురూప సంప్రదాయమే నర్మద పరిక్రమ. నర్మద చుట్టూ తిరుగుతూ దాదాపు 2,600 కిలోమీటర్లు సాగే యాత్ర ఇది. అరేబియా సముద్రంలో నర్మద కలిసే స్థానమైన భరూచ్ నుంచి మొదలుపెట్టి, అది ఉద్భవించే అమర్ కంటక్ వరకు వెళ్లి… అక్కడ తీరం మారి వ్యతిరేక దిశలో, తిరిగి భరూచ్ని చేరుకోవడంతో ఈ పరిక్రమ పూర్తవుతుంది. దారి పొడవునా ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ, వాటితో ముడిపడి ఉన్న ఇతిహాసాలను తలుచుకుంటూ, స్థానిక సంప్రదాయాలను పాటిస్తూ సాగే అరుదైన యాత్ర ఇది. సాధువులు కాలినడకన చేసే ఈ యాత్రను నేరుగా చేయలేనివారి కోసం, అక్కడి పర్యాటక శాఖ రవాణా
సౌకర్యాలు కల్పించింది.
ఒకనాటి మాహిష్మతి పట్టణమే నేటి మహేశ్వర్. అటు రామాయణం, ఇటు భారతంలోనూ ఈ నగరానికి సంబంధించి చాలా కథలు వినిపిస్తాయి. రావణుడికి గర్వభంగం కావడం, ఈ దేశ రాకుమారిని అగ్నిదేవుడు మోహించడం లాంటి ఆసక్తికరమైన ఘట్టాలు ఇక్కడ వినిపిస్తాయి. కార్తవీర్యార్జునుడి లాంటి పురాణ పురుషులతో ఇక్కడి ఇతిహాసం ముడిపడి ఉంది. ఇక్కడి ఆలయాలు, కోటలు, ఘాట్ల మీద ప్రాచీన కట్టడాలు చూసితీరాల్సిందే. వాటి వెంబడి గంభీరంగా పారే నర్మద మనసును సేదతీరుస్తుంది. ఇంత అందమైంది కాబట్టే ఈ మహేశ్వర్ తీరాన ఎన్నో సినిమా షూటింగులు కూడా జరుగుతుంటాయి. సఖి నుంచి గౌతమీ పుత్ర శాతకర్ణి వరకు చాలా సినిమాలకు ఇక్కడి దృశ్యాలు ప్రాణం పోశాయి. ఇవే కాదు భరూచ్, హోషంగాబాద్, బార్వా, నర్మదానగర్… ఇలా నర్మద తీరం వెంబడి ఎన్నో పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలు కనిపిస్తాయి. ఇవన్నీ కూడా ప్రత్యేకించి దర్శించదగ్గవే!
నది ఓ భౌగోళిక స్థితి మాత్రమే కాదు. నాగరికతకు వేదిక. ఆ నదీ తీరాన ఎన్నో సంస్కృతులు విరాజిల్లి ఉంటాయి. ఎన్నో అరుదైన వాతావరణాలు ఏర్పడి ఉంటాయి. నర్మదనే తీసుకుంటే.. కొన్ని లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేస్తున్నది. నర్మద కెనాల్ ద్వారా ఎడారి రాష్ట్రం రాజస్థాన్‌కు కూడా నీరు అందుతున్నది. దీని మీద నిర్మించిన సర్దార్ సరోవర్ డ్యామ్, ఇందిరా సాగర్ డ్యామ్ లాంటి ఆనకట్టల మీద పర్యావరణపరంగా అనేక వివాదాలు ఉన్నప్పటికీ… అవి అసాధారణ స్థాయిలో విద్యుత్తు, సాగుతాగు నీటిని అందిస్తున్నాయి.
నర్మద చలవతో ఏర్పడిన దట్టమైన అరణ్యాలు జీవవైవిధ్యాన్ని కాపాడుతున్నాయి. ఇలా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మన దేశ ఆర్థిక, సామాజిక వ్యవస్థకు ఆయువుపట్టులా ఉన్న నర్మదకు పుష్కరాలు రావడం అంటే… ఒకసారి తన గురించి తెలుసుకోమంటూ ఆ నదీమతల్లి అందిస్తున్న పిలుపుగా భావించవచ్చు. ఈ వంకతోనైనా ఓసారి అటువైపు ప్రయాణించవచ్చు. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లో ఈ పుష్కరాల సందర్భంగా ఎన్నో ఘాట్లు ఏర్పాటు చేశాయి ప్రభుత్వాలు. అక్కడ మునక వేసి… చుట్టూ ఉన్న ప్రకృతినీ, ఆలయాలనూ చూసి వద్దాం.
స్నానం
పుష్కర స్నానాన్ని ఓ పవిత్రకార్యంగా భావించాలే కానీ మురికిని వదిలించుకునే అభ్యంగనంగా కాదు. అందుకే శుభ్రమైన దుస్తులతో, సంకల్పం చెప్పుకొని మూడు మునకలు వేయాలి. నదిలో నలుగురూ స్నానం చేస్తున్న చోట బట్టలుతుకుతూ, సబ్బు రాసుకుంటూ ఉంటే అది పుష్కరస్నానం అనిపించుకోదు. స్నానం ఆచరిస్తున్న సమయంలో ఇష్టదైవాన్ని స్మరించుకోవాలి. జీవకోటి దాహార్తిని తీరుస్తున్న నదీమ తల్లికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. స్నానం పూర్తయిన తర్వాత నర్మదాదేవికి, త్రిమూర్తులకు, బృహస్పతికి, పుష్కరుడికి, సప్తర్షులకు, అరుంధతికి అర్ఘ్యాలు అందించడం విధి. పితృదేవతలకు కూడా నీరు వదిలి బయటికి వచ్చిన తర్వాత విభూది, కుంకుమలు అద్దుకోవాలి. ఆపై తీరం సమీపంలో ఉన్న ఆలయానికి చేరుకుని దైవదర్శనం చేసుకోవాలి.
దానం
పుష్కరాలు జరిగే 12 రోజులలో, రోజుకో తరహా దానం చేయాలని పెద్దలు సూచిస్తున్నారు. ఉదాహరణకు తొలి రోజు బంగారం, వెండి, ధాన్యం, భూమి దానం చేస్తే మహారాజయోగం దక్కుతుందనీ… రెండో రోజు వస్ర్తాలు, గోవులు, ఉప్పు, రత్నాలు దానం చేస్తే వసులోక ప్రాప్తి లభిస్తుందనీ ఇలా రోజుకొక దానాన్నీ, దాని వల్ల కలిగే ఫలితాలనూ సూచించారు. సాయం చేయాలనీ, సంపదను సాటివారితో పంచుకోవాలనీ సూచించే సంప్రదాయానికి ప్రతిరూపంగా ఈ విధులను భావించవచ్చు.
శ్రాద్ధకర్మలు
పెద్దలను తలుచుకునేందుకు, వారి పట్ల కృతజ్ఞత చాటేందుకు, వారి ఆశీస్సులు తీసుకునేందుకు పుష్కరాలు ఓ మంచి సందర్భం. పుష్కర సమయంలో గతించిన పెద్దలకు శ్రాద్ధకర్మలు చేస్తే వారికి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయనీ, వంశం వృద్ధి చెందుతుందనీ నమ్మకం. పిండప్రదానం చేయలేనివారు నువ్వులు, నీళ్లతో తర్పణాలు విడిస్తే సరిపోతుందని పెద్దల మాట. మాతాపితరులు మరణించిన తిథి రోజున శ్రాద్ధకర్మ చేస్తే మరీ మంచిది. కేవలం గతించిన మన పెద్దలకే కాదు… సమీప బంధువులకు, స్నేహితులకు, ఆత్మీయులకు కూడా పిండ ప్రదానం చేయవచ్చు.
అంతేకాదు! పుష్కరుడితోపాటు సకల దేవతలూ కొలువుండే ఈ సమయంలో… ఆ నీటిని కొంత ఇంటికి తెచ్చుకుని వాటిని సంప్రోక్షణ కోసం వాడుకోవడం ఆనవాయితీ. పుష్కరాలు జరిగే నదీతీరాన భజనలు, కీర్తనలతో భక్తులు నదీమతల్లిని కొలుచుకోవడమూ, నదికి వాయినాలు సమర్పించుకునే ఆచారమూ కొన్ని ప్రాంతాల్లో చూడవచ్చు.