‘ఆకలిలో, ఆవేశంలో… తెలియని ఏ తీవ్రవ్యక్తులో… నడిపిస్తే నడిచిన మనుషులు’ అంటాడు దేశ చరిత్రలు కవితలో శ్రీశ్రీ. ఇప్పుడు అలాగే నడుస్తున్నాం. కానీ నడిపించే శక్తులేవో తెలుసు. కార్పొరేట్లు, ప్రభుత్వాలు ఆడే రాజకీయ క్రీడలు సామాన్యులకూ అర్థమవుతున్నాయి. రాజకీయాలే పత్రికల్ని శాసిస్తున్న రోజుల్లో రాజకీయార్థిక విశ్లేషణలు అనుకూల, వ్యతిరేక మలుపు తీసుకుని సత్యానికి దూరంగా జరిగాయి. అయినప్పటికీ ఒకరో ఇద్దరో నిజాన్ని పట్టుకునే రాస్తున్నారు.
అలాంటి విశ్లేషకుల్లో తెలుగు వారికి సుపరిచితులైన డి. పాపారావు ఒకరు. రెండు దశాబ్దాలకు పైగా ఆర్థిక, సామాజిక రంగాలపై ప్రపంచ దేశాలు, చట్టాల ప్రభావాన్ని నిశితంగా పరిశీలిస్తూ ఆయన వ్యాసాలు రాశారు. వివిధ పత్రికల్లో ప్రచురితమైన వ్యాసాలను ‘సమాధిలోకి సామ్రాజ్యవాదం’ పేరుతో పన్నెండేండ్ల క్రితం ప్రచురించారు. ఆ వ్యాసాలకు అదనంగా మరికొన్ని జోడించి ‘మానవాళికి మహోదయం’ పేరుతో మళ్లీ ప్రచురించారు. ప్రజల పోరాటాలకు ప్రేరణ, ఆరాటాలకు స్ఫూర్తినిచ్చే వ్యాసాలెన్నో ఈ వ్యాస సంకలనంలో ఉన్నాయి.
ప్రజల వాస్తవ ఆర్థిక స్థితిని ప్రతిఫలించని అంశాలు పతాక శీర్షికలుగా చూపి భ్రమలురేపే ప్రసారమాధ్యమాలు మార్కెట్ సూచీల పతనాల వెనక మతలబులను అనివార్యంగా మాట్లాడతున్నాయి. పులిని చూసి నక్క వాతపెట్టుకుంటున్నట్టు భారత మిశ్రమ ఆర్థిక వ్యవస్థ వడివడిగా అమెరికా ఆర్థిక నమూనా వైపుకు పయనిస్తోంది. కానీ, ఆ అమెరికా ఆర్థిక స్వరూపాన్ని ఎక్స్‌రే తీసి లెక్కకందని జబ్బులున్నాయని రచయిత బయటపెట్టారు.
నాలుగు దశాబ్దాల అమెరికా రుణభారం, నిరుద్యోగం, యుద్ధాల్లో ఓడిన అమెరికా సంక్షేమాన్ని చక్కగా విశ్లేషించారు. అమెరికా యుద్ధోన్మాదానికి బలైన అరబ్ ప్రజల స్వప్నాలే కాదు, సమస్త దేశాల పీడిత ప్రజలందరి తరపునా ఆయన మాట్లాడారు. రుణాల ఊబిలో డాలర్ నోట్లను ముద్రిస్తూ అమెరికా బతుకుతోంది. సామ్యవాదంపై విష ప్రచారం చేసిన అమెరికా చైనాకు అప్పు పడింది. అమెరికా జబ్బుపడిన దేశమని చెప్పడానికి ఇంతకన్నా రుజువులు ఏం కావాలి? బలుపు తగ్గి వాపు పెరిగిన అమెరికా ఆర్థిక జబ్బులకు రచయిత చూపిన పరిష్కార మార్గాలు వర్థమాన దేశాలకూ అనుసరణీయం.
మన జీవితాన్ని నడిపిస్తున్న అంతస్సారంలేని ఆర్థిక విధానాలను, డొల్ల రాజకీయాలను ఎండగట్టి, సారవంతమైన సూచనలెన్నో చేశారు. మానవాళికి మహోదయం ద్వారా ప్రభుత్వాలకు గుణపాఠాలు నేర్పిన సందర్భాలెన్నిటినో రచయిత ఆర్థిక పాఠాలుగా ప్రజలకు చెప్పదలిచారు. సమకాలీనమైన వ్యాసాల కంటే దశాబ్దం క్రితం నాటి వ్యాసాలే ఎక్కువగా ఉన్నా, ఇప్పటికీ ఇవి ప్రాసంగిత కోల్పోలేదు. పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్నంత కాలం ఈ వ్యాసాలకు సార్వజనీనత ఉంటుంది.
రచయిత: డి. పాపారావు
ప్రచురణ: సాహితీ మిత్రులు, విజయవాడ
పేజీలు: 400, ధర: 400,
ప్రతులకు: డి. పాపారావు,
విశాలాంధ్ర బుక్‌హౌస్, ప్రజాశక్తి బుక్హైస్,నవోదయ బుక్‌హౌస్, నవ తెలంగాణ
కొమ్ము (దళిత కథ-2023)
సంపాదకులు: డా॥ సిద్దెంకి యాదగిరి, గుడిపల్లి నిరంజన్, తప్పెట ఓదయ్య
పేజీలు: 166
వెల: రూ.180
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు