పొడపత్రి తీగజాతికి చెందిన ఔషధ మొక్క. ఇది మన దేశంలోని అడవుల్లో ప్రకృతిసిద్ధంగా పెరుగుతుంది. దీని కాండం సన్నగా ఉంటుంది. కాయలు మేక కొమ్ము కారంలో ఉంటాయి. అందుకే దీన్ని ‘మేషశృంగి’ అంటారు. ఆకులు దీర్ఘవృత్తాకారంలో ఉంటాయి. ఎదురెదురుగా అమరి ఉండే ఈ ఆకులను చూసి పొడపత్రి తీగను గుర్తుపట్టవచ్చు. పొడపత్రి ఆకులను నమిలిన తర్వాత ఎంతటి తియ్యని పదార్థమైనా చప్పగా అనిపిస్తుంది! నాలుక ఓ అయిదు గంటలపాటు తీపి రుచిని గ్రహించలేదు. అందుకే దీనిని ‘మధునాశిని’ అంటారు.
సాధారణ వర్షాధార వాతావరణంలో పొడపత్రి ప్రకృతి సిద్ధంగా పెరుగుతుంది. అన్ని రకాల నేలల్లో సులభంగా ఎదుగుతుంది. దీనికి మార్కెట్లో డిమాండ్ ఉంది. కాబట్టి నీటి వసతి ఉన్నచోట రైతులు అధికంగా పండించవచ్చు. తీగలకు కొంచెం ఆధారం కల్పిస్తే అదే పెరుగుతూ ఉంటుంది. పువ్వు లేత పసుపు రంగులో గుండ్రని పూలు గుత్తులు గుత్తులుగా పూస్తాయి. పెరిగిన కొమ్మలను ఆకులతో సహా కత్తిరించి, నీడలో ఆరబెడతారు. ఎండిన ఆకులను సేకరించి, జాగ్రత్తగా ప్యాక్ చేసి ఆయుర్వేద ఔషధ తయారీదారులకు అమ్ముకోవచ్చు.
మిగతా పంటలతో పోలిస్తే పొడపత్రికి చీడపీడలు పట్టవు. మధుమేహ నివారణ మందుల తయారీలో పొడపత్రిని ఉపయోగిస్తారు. మూత్ర సంబంధ వ్యాధులు, మలబద్దకం నివారించేందుకు కూడా పొడపత్రి ఉపయోగపడుతుంది. పొడపత్రి ఆకులలో ‘జమ్నమిక్ ఆమ్లం’ ఉంటుంది. షుగర్ వ్యాధితో బాధపడుతుంటే రోజూ రెండాకులను తింటే వ్యాధి తగ్గుతుందంటారు. పీవీ వనంలో పడమటి కంచె వైపు ఈ పొడపత్రి తీగను చూడవచ్చు.
-ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, పీవీ కూతురు