Captain America Actor Chris Evans | ఒకప్పుడు హాస్యానికి పరిమితమైన నటుడు. తర్వాత యాక్షన్ హీరో. ఇప్పుడు ఈ భూమ్మీద ఉన్నవారిలో సెక్సీయెస్ట్ పర్సన్. అతనే హాలీవుడ్ నటుడు క్రిస్ ఇవాన్స్. 41 ఏండ్లు నిండిన ఈ నడివయస్కుడు అంత అందగాడా? అంటే, అవుననే సమాధానం వస్తుంది. పీపుల్స్ మ్యాగజైన్ నిర్వహించిన పోల్ ఢంకా బజాయించి మరీ ఇవాన్స్‌ను అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తిగా తేల్చి చెప్పింది. ఈ సూపర్ హీరోను చూసినవాళ్లంతా కూడా ‘ఏం సక్కగున్నవ్రో..’ అని కండ్లప్పగించేస్తారు మరి.
అమెరికాలో మసాచుసెట్స్ రాష్ట్రం బోస్టన్‌లో పుట్టాడు ఇవాన్స్. చిన్నప్పుడే అతని కుటుంబం అదే రాష్ట్రంలోని సడ్బరీకి మకాం మార్చింది. ఇవాన్స్ తండ్రి దంతవైద్యుడు. తల్లి నాటకరంగ కళాకారిణి. అందంతోపాటు అభిరుచినీ తల్లినుంచి పుణికిపుచ్చుకున్నాడు అతను. చిన్నప్పుడు అమ్మతోపాటు నాటకాల రిహార్సల్స్‌కి వెళ్లేవాడు. ఆమె అభినయిస్తుంటే.. ఆటపట్టిస్తూ అనుకరించేవాడు. అద్దం ముందు నిలబడి తనూ నటించేవాడు. పైగా సంగీతం అంటే తగని మోజు. ఈ అర్హతలు చాలవా ఇవాన్స్ సినిమాల్లోకి రావడానికి. ఎలాగో గ్రాడ్యుయేషన్ పూర్తయ్యింది అనిపించాడు. మొదట్లో చిన్నాచితకా సినిమాల్లో నటించినా తన అదృష్టాన్ని తొలుత బుల్లితెరపై పరీక్షించుకున్నాడు. ‘ఆపోజిట్ సెక్స్’ టెలివిజన్ షోలో కనిపించి అందరినీ కట్టిపడేశాడు. ఇప్పటికీ టీవీ షోల్లో అడపాదడపా ప్రత్యక్షమవుతూనే ఉంటాడు ఇవాన్స్.
ఏవో కామెడీ తరహా వేషాలు వేసుకునే ఇవాన్స్ ఇమేజ్ను యాక్షన్స్టార్గా మార్చేసిన సినిమా ‘సెల్యులార్’. అదో వెండితెర సంచలనం. 2004లో వచ్చిన ఈ చిత్రం ఇవాన్స్ సత్తా ఏమిటన్నది హాలీవుడ్‌కు చాటిచెప్పింది. అప్పటి నుంచీ మనవాడు వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2005లో యాక్షన్ థ్రిల్లర్ ‘ఫన్టాస్టిక్ ఫోర్’లో హ్యూమన్టార్చ్గా నటించిన ఇవాన్స్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు తయారయ్యారు. అమెరికన్ కామిక్ పుస్తకాల్లోని సూపర్ హీరో ‘కెప్టెన్ అమెరికా’ పాత్రతో స్టార్డమ్ అమాంతం పెరిగిపోయింది. ‘అవెంజర్స్’ సిరీస్‌లోనూ ‘కెప్టెన్ అమెరికా’గా అదరగొట్టాడు ఇవాన్స్. పిల్లలైతే ఈ హీరో అడ్వెంచర్స్‌కు ఫిదా అయిపోయారు. ముఖ్యంగా యువతులు ఈ కండల వీరుడికి నీరాజనాలు పట్టారు. మొత్తానికి హాలీవుడ్లో సూపర్‌హీరోగా తనదైన ముద్రవేసుకున్న క్రిస్ ఇవాన్స్ తాజాగా సెక్సీయెస్ట్ పర్సన్‌గా కొత్త ఖ్యాతిని మూటగట్టుకున్నాడు.
Project-K Movie | నాలుగు సెట్లు 40కోట్లు.. ప్రాజెక్ట్-K కోసం నాగ్ అశ్విన్ భారీ ప్లాన్..!