రోజంతా బడిలోనే బంధించకుండా, పిల్లలపై హోమ్ వర్క్ భారం వేయకుండా.. కొట్టకుండా.. కనీసం తిట్టకుండా.. ఆడుతూపాడుతూ చదువు చెప్పే బడి ఉంటే బాగుండు అనుకోవడం ఇంతకుముందు అత్యాశే! కానీ, ఇకముందు కాదు. రాబోయే స్కూళ్ల కాన్సెప్ట్ అదే! చిన్న కుటుంబం చింత లేని కుటుంబం అన్నట్టుగా ‘చిన్న బడి చింతలేని బడి’ అంటున్నారు అమెరికన్లు. రేపు మనమూ దానికే జై కొట్టాల్సిందే!
నతానియేల్ని కిండర్ గార్డెన్ స్కూల్లో చేర్పించారు. కొన్ని రోజుల తర్వాత బడిలో దింపగానే ఏడవడం మొదలుపెడుతున్నాడు. పాతిక మంది పిల్లల్లో తను మాత్రమే మారాం చేస్తున్నాడు. టీచర్ దారికి తేవడానికి ఎంత ప్రయత్నించినా నతానియేల్లో మార్పు రాలేదు. చివరికి బడికి పోనని మొండికేయడం మొదలుపెట్టాడు. వాళ్లమ్మ ఆ అబ్బాయిని ఈ ఏడాది మరో బడిలో చేర్పించింది. ఇప్పుడు సంతోషంగా స్కూల్‌కు వెళ్తున్నాడు.
ఏడుగురు విద్యార్థుల మధ్య తన చదువు సంతోషంగా సాగిపోతున్నది. ఈ ఏడుగురూ ఒకే తరగతి విద్యార్థులు అనుకుంటే పొరపాటు. ఆ పాఠశాలలోని మొత్తం విద్యార్థుల సంఖ్య ఇది. సాధారణ పాఠశాలలకు భిన్నంగా అతి తక్కువ మంది విద్యార్థులతో ప్రతి విద్యార్థి ప్రవర్తన, అభ్యసనను పరిశీలించే వెసులుబాటు ఉండేలా ఆ పాఠశాలను నిర్వహిస్తున్నారు. ఆ బడిలో పాఠ్యాంశాలు నతానియేల్కి అర్థమయ్యేలా టీచర్ చెబుతుంది. తనూ సులభంగా నేర్చుకుంటున్నాడు. తనలో వెనుకబడ్డాననే భయం పోయింది. అందరిలా చదువుకోగలననే ధైర్యం వచ్చింది.
ఆటపాటల చదువు
నతానియేల్ చేరిన కింగ్డమ్ సీడ్ క్రిస్టియన్ అకాడమీలో విద్యార్థికి చదువు భారంగా ఉండదు. టీచర్లు ఒకరోజు చర్చికి తీసుకుపోయి అక్కడ చిన్న సమావేశం ఏర్పాటుచేసి విద్యార్థులకు పాఠాలు చెప్పారు. కొత్త ప్రదేశం కావడం వల్ల విద్యార్థులు సంతోషంగా ఉన్నారు. పాఠాలతోపాటు కొత్త పరిసరాల గురించి తెలుసుకుని ఇంటికి వచ్చాడు. మరొక రోజు తెలిసిన వాళ్లింటికి తీసుకువెళ్లి ఇంకో పాఠం చెప్పారు. ఇలా కొత్త పరిసరాలే కాదు కొత్తకొత్త వ్యక్తుల్నీ కలుస్తూ సరదాగా పాఠాలు నేర్చుకుంటున్నాడు. బడికి పోనని హఠం చేయడం లేదు. చదువుల్లో వెనుకబడి ఉన్నానన్న బెంగా లేదు. నతానియేల్ వాళ్లమ్మ బాధ తీరింది. ఆ అబ్బాయి మాత్రమే కాదు చాలామంది చిన్నారులు అమెరికాలో ఇలా చిన్న బడుల్లోనే పెద్ద చదువులు చదివేందుకు సిద్ధమవుతున్నారు. కింగ్డమ్ సీడ్ క్రిస్టియన్ అకాడమీ లాంటి స్కూళ్లు అమెరికాలో పెరిగిపోతున్నాయి.

జార్జియా రాష్ట్రంలోని లిల్బర్న్లో ఉన్న చాయిస్ ప్రిపరేటరీ అకాడమీలో చదువుకుంటున్న ఏడో తరగతి విద్యార్థి
మైక్రో స్కూల్స్‌కి మైక్రో ఫైనాన్స్
పిల్లల ప్రవర్తన, నేర్చుకునే పద్ధతులు ఒకే విధంగా ఉండవు. కానీ, తరగతి గదిలోని పిల్లలందరికీ టీచర్ ఒకే పద్ధతిలో చెప్పడం వల్ల కొందరు చదువుల్లో వెనుకబడిపోతుంటారు. ఈ సమస్యకు మెగా స్కూల్ నుంచి మైక్రో స్కూల్‌కి మార్చడమే పరిష్కారంగా అమెరికాలోని విద్యార్థుల తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఆ దేశంలో ప్రాథమిక స్థాయి నుంచి హయ్యర్ స్కూల్ వరకు విద్య ఉచితం. అయినా ప్రత్యేక అవసరాలు, అభ్యసన పద్ధతుల కోసం తల్లిదండ్రులు మైక్రో స్కూల్స్‌ని ఎంచుకుంటున్నారు. వీటిలో ఫీజులు అయిదు వేల డాలర్ల నుంచి పది వేల డాలర్ల మధ్య ఉంటున్నది.
ఈ పాఠశాలలో చదివే పిల్లలను ఇంటి వద్ద చదువుకునే విద్యార్థులుగా ప్రభుత్వం గుర్తిస్తున్నది. వీటిలో సైన్స్, చరిత్ర, గణితంతోపాటు మత సంబంధమైన విషయాలను బోధిస్తున్నారు. అమెరికాలోని నేషనల్ మైక్రో స్కూలింగ్ సెంటర్ లెక్కల ప్రకారం ఆ దేశంలో 95,000 వరకూ మైక్రో స్కూల్స్ ఉన్నాయి. ఈ పాఠశాలల్లో పది లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. మైక్రో స్కూల్స్‌లో చదివే పది లక్షల మంది విద్యార్థుల్లో 40 శాతం మంది పబ్లిక్ స్కూల్స్ నుంచి వచ్చినవాళ్లు ఉండటం విశేషం. మిగతా విద్యార్థులు ఇళ్లలోనే విద్యాభ్యాసం మొదలుపెట్టిన వాళ్లు. ఈ పాఠశాలలకూ ప్రభుత్వాలు గుర్తింపునిచ్చాయి. అరిజోనా, వెస్ట్ వర్జీనియా, జార్జియా రాష్ర్టాల్లో మైక్రో స్కూల్స్‌కి రోజురోజుకీ ఆదరణ పెరుగుతున్నది.
గత ఏప్రిల్‌లో హోమ్ స్కూలింగ్ విద్యా విధానానికి అనుకూలంగా జార్జియా ప్రభుత్వం కొన్ని చట్టాలు రూపొందించింది. ‘తక్కువ మంది విద్యార్థులు ఉండే పాఠశాలల్లో సౌకర్యాలు ఉండవేమో?’ అన్న సందేహం లేదు. ప్రాథమిక విద్యాభ్యాసానికి కావాల్సిన బోధనోపకరణాలు, మౌలిక వసతులకు ఇక్కడ లోటు ఉండదు. మైక్రో స్కూల్స్‌కి సంపన్నులు, కంపెనీల నుంచి విరాళాల రూపంలో ఆర్థిక వనరులు సమకూరుతున్నాయి. గత విద్యా సంవత్సరంలో ఈ విరాళాలు 18 శాతం పెరిగాయి. అమెరికాలో సంపన్నులైన జెఫ్ యాస్, కొచ్ ఫ్యామిలీ వంటి దాతలు కూడా ఈ మైక్రో స్కూల్స్‌కి నిధులు సమకూరుస్తున్నారు.

ఓ ఇంటి ఆరుబయట విద్యార్థులకు సైన్స్ పాఠాలు బోధిస్తున్న కింగ్డమ్ స్కూల్ ఉపాధ్యాయులు
ఆసరా బళ్లు
వైకల్యం ఉన్న పిల్లలు, ఆటిజం బాధితులు మైక్రో స్కూల్స్‌లో చేరేందుకు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. మైక్రో స్కూల్స్ రోజుకు నాలుగు గంటల చొప్పున వారంలో అయిదు రోజులు పనిచేస్తాయి. విద్యార్థుల అభ్యసన సామర్థ్యానికి తగిన పాఠ్యాంశాలనే ఇక్కడ బోధిస్తారు. ప్రామాణిక పరీక్షలను కూడా నిర్వహిస్తారు. పెద్ద పాఠశాలల కంటే మైక్రో స్కూల్స్‌లోనే తమకోసం తగిన ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయని ఆ విద్యార్థులు సంతృప్తి చెందుతున్నారు.
భవిష్యత్ బడిబాట
మైక్రో స్కూలింగ్ విధానం మన దేశంలోకీ ప్రవేశించింది. ముంబయిలో ప్రియాంక రాయ్ ‘కోమిని’ మైక్రో స్కూల్‌ని స్థాపించింది. కర్ణాటకలో అజిల్ పాఠశాల విద్యార్థుల పాఠ్యాంశాన్ని బట్టి ప్రదేశాన్ని ఎంచుకుని పాఠాలు బోధించే ప్రయత్నం చేస్తున్నది. హైదరాబాద్‌లో డ్రీమ్‌టైమ్ లెర్నింగ్ హబ్ మైక్రో స్కూల్ రెండు నుంచి 16 ఏండ్ల లోపు పిల్లలకు చదువు చెబుతున్నది. ఇవన్నీ తాతల కాలం నాటి ఖానిగి బడి లాంటివే. కనుమరుగైపోయిన బళ్లు మళ్లీ పేరు మార్పుతో, కాలానికి తగ్గ హంగులతో కొత్తగా వస్తున్నాయ్!
నాటి ఖానిగి బళ్లే.. నేటి మైక్రో స్కూల్స్

ఊళ్లలో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువులు చెప్పే ఉన్నత పాఠశాలల్ని ‘పెద్దబడి’ అని పిలుస్తారు. అక్షరాభ్యాసం నుంచి మూడు లేదా అయిదో తరగతి వరకు చదువులు చెప్పే పాఠశాలల్ని ‘చిన్న బడి’ అంటారు. ప్రాథమిక తరగతులు చదివే విద్యార్థులు చిన్న వయసులో ఎక్కువ దూరం ప్రయాణం చేయలేరు. కాబట్టి తక్కువ జనాభా ఉండే ఊళ్లలో చిన్నబడిని ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి. ఒకప్పుడు ఇలా ఊరికో చిన్న బడి ఉండేది కాదు. పెద్ద పెద్ద పట్టణాల్లోనే పాఠశాలలు ఉండేవి. బడిలేని ఊళ్లల్లో ఖానిగి బడులు ఉండేవి.
ఒక పంతులు ఒక ఊరిలో పాఠశాలను ఏర్పాటు చేసుకుని వచ్చిన కొద్దిమంది పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించేవాడు. పంతులు ఒక్కడే అయినా చదువులో ఎందులోనూ తక్కువ కాదు. ప్రతి విద్యార్థికి ఇసుకలో అక్షరాలు దిద్దించడంతో మొదలుపెట్టి చదవడం, రాయడం నేర్పేవాడు. ఆ తర్వాత వ్యాకరణం, నాలుగు రకాల గణిత ప్రక్రియలు నేర్పించేవాడు. చిన్నబాల శిక్ష, పెద్దబాల శిక్షతో ఖానిగి బడిలో చదువు ముగిసేది.
అలాంటి బడులన్నీ మన దగ్గర కనుమరుగైపోయాయి. ఈ ఖానిగి తరహా బడులే ‘మైక్రో స్కూల్స్’ పేరుతో అమెరికా విద్యా వ్యవస్థలో ఆదరణ పొందుతున్నాయి. ‘మైక్రో స్కూల్’లో ఒకే తరగతి గది ఉంటుంది. అయిదారుగురు పిల్లలకు మించి ఉండరు. అనుభవపూర్వక విద్య, ఒత్తిడి లేని చదువు, ప్రతి విద్యార్థిపై ప్రత్యేకమైన శ్రద్ధ అని చెప్పుకొంటున్న ఈ మైక్రో స్కూల్స్ ఒకనాటి మన ఖానిగి బడుల్లాంటివే. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా చెప్పే చదువుల్లో మార్కులే ప్రతిభకు ప్రామాణికంగా ఉంటాయి. ఈ మైక్రో స్కూల్స్ మాత్రం జీవన నైపుణ్యాలు సాధించడమే నిజమైన చదువు అంటున్నాయి.

ఏడుగురు విద్యార్థుల పాఠశాల కింగ్డమ్ సీడ్ క్రిస్టియన్ అకాడమీలో ఆడుతూ పాడుతూ చదువుకుంటున్న నతానియేల్