e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, November 29, 2021
Home News ఆన్‌లైన్‌లో ఆర్డ‌రిస్తే ఇంటికే నాన్ వెజ్‌.. వీటితో లాభ‌మా? న‌ష్ట‌మా?

ఆన్‌లైన్‌లో ఆర్డ‌రిస్తే ఇంటికే నాన్ వెజ్‌.. వీటితో లాభ‌మా? న‌ష్ట‌మా?

online non veg delivery |ఇంటికి చుట్టాలొచ్చారు. దావత్‌ ఇయ్యాలె.బిడ్డకు కొలువొచ్చింది. సంబురం చేసుకోవాలె.పండగొచ్చినా, ఖుష్‌ ఖబర్‌ తెలిసినా పురుడైనా, చావైనా.. మాంసం ఉండాల్సిందే… మస్తుగా వండాల్సిందే.ఆ ఘుమఘుమలు… వాడకట్టంతా పాకాల్సిందే. భారతీయులకు, అందులోనూ తెలంగాణ ప్రజలకు మాంసం ఒకానొక ఆహారం మాత్రమే కాదు, జీవితాన్ని ఆస్వాదించేందుకు ఘనమైన మార్గం.

ఒకప్పుడు ధనవంతులకు మాత్రమే మాంసాహారం ధరలు అందుబాటులో ఉండేవి. సామాన్యుడు స్తోమతను బట్టి వారానికోసారో,నెలకోసారో రుచి చూసేవాడు. జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాక,ఉపాధి అవకాశాలు పెరిగిపోయాక, ప్రతి జేబూ ఎన్నో కొన్ని పెద్దనోట్లతో కళకళలాడటం మొదలుపెట్టాక … నాన్‌వెజ్‌ అనేది విలాసాల జాబితా నుంచి అవసరాల చిట్టాలోకి చేరిపోయింది. ప్రతిదినమూ ఆదివారమే. లంచ్‌ నుంచి డిన్నర్‌ వరకూ .. పళ్లెంలో ముక్క మోగాల్సిందే. పొయ్యి మీదో, ఫ్రిజ్‌లోనో మాంసాహారం ఉండి తీరాల్సిందే. మొత్తంగా మన దేశంలో మాంసం మార్కెట్‌ స్థిరంగా వృద్ధి చెందుతున్నది. అయిదు లక్షల కోట్ల దిశగా అడుగులు వేస్తున్నది. హైదరాబాద్‌ సహా అనేక నగరాల్లో కార్పొరేట్‌ సంస్థలు మాంసాహార విపణిలోకి వచ్చాయి. గడప దగ్గరికే మాంసాన్ని అందిస్తున్నాయి.

e non veg delivery
online non veg delivery
- Advertisement -

ఒకప్పుడు, ఇంటికి మాంసం తెచ్చుకోవడం అంటే ఓ పెద్ద పని. దుకాణానికి వెళ్లాలి. వరుసలో నిలబడాలి. మనవంతు వచ్చేసరికి మంచి ముక్కలు ఉండవచ్చూ, ఉండకపోనూవచ్చు. మనకు ఇస్తున్నదీ, మనం తింటున్నదీ నిఖార్సయిన మాంసమేనా? అన్న సందేహం ఒకటి. దుకాణం పరిసరాల్లోని అపరిశుభ్రత, దుర్వాసన కూడా ఇబ్బందికరంగానే అనిపించేవి. అలా అని, వాతావరణం పూర్తిగా ఏం మారిపోలేదు. ఇప్పటికీ, తొంభై శాతం మార్కెట్‌ పరిస్థితి దాదాపు అలానే ఉంది. 10 శాతం మాంసం విక్రయాలు మాత్రమే కార్పొరేట్‌ స్థాయిలో ఉన్నాయి. కాకపోతే, మార్పులు వేగంగా జరిగిపోతున్నాయి. దిగ్గజాలు కూడా మటన్‌ మస్తాన్‌ అవతారం ఎత్తుతున్నారు.

కాలం మారుతున్నది

ఉరుకుల పరుగుల జీవితంలో ఆన్‌లైన్‌ సేవలు సమయాన్నీ, సహనాన్నీ ఆదా చేస్తున్నాయి. మిగతా ఉత్పత్తుల్లానే మాంసమూ మినహాయింపు కాదు. పైగా మన దేశంలో మాంసాహారుల సంఖ్య తక్కువేం కాదు. భారత్‌లో కేవలం 40 కోట్ల మంది మాత్రమే శాకాహారులని ‘స్టాటిస్టికా’ గణాంక సంస్థ చెబుతున్నది. మరో సర్వే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోనే మాంసాహారులు ఎక్కువని తేల్చింది. ఈ పోటీలో పశ్చిమ బెంగాల్‌, కేరళ లాంటి రాష్ట్రాలు కూడా మనకంటే వెనుకబడ్డాయి. ఆహారపు అలవాట్లతో పాటు, ఇక్కడి వనరులు కూడా ఇందుకు కారణం. కోళ్లు, గొర్రెల పెంపకం తెలంగాణలో ఎక్కువ. ఈ గణాంకాలన్నీ ఆన్‌లైన్‌ మాంస విక్రయాలకు రాచబాటలా కనిపిస్తున్నాయి. అనేక సంస్థలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నాయి కూడా. 2019లో భారతీయ మాంస విపణి విలువ రూ. 3.3 లక్షల కోట్లు. అందులో రూ. 700 కోట్లు మాత్రమే ఆన్‌లైన్‌ వ్యాపారం ఉండేది. కొవిడ్‌ తర్వాత మాంసాహార ప్రియులు రెండున్నర నుంచి మూడు రెట్లు పెరిగారని
‘రెడ్‌సీర్‌’ సంస్థ అంచనా.

కొవిడ్‌కు కృతజ్ఞతలు

కొవిడ్‌ మన జీవితాల్ని మార్చేసింది. ఆహారపు అలవాట్లనూ ప్రభావితం చేసింది. అందులో ఆన్‌లైన్‌ మాంసం డెలివరీ వ్యవస్థ ఒకటి. బయటికి వెళ్లాలంటే సవాలక్ష నిబంధనలు. అవకాశం చిక్కినా, ఎక్కడ మహమ్మారి సోకుతుందో అన్న భయాలు. సకల జాగ్రత్తలూ తీసుకున్నా మాంసాహారం విక్రయించే చోట… రద్దీ, అపరిశుభ్రత ఎంతోకొంత కనిపిస్తుంది. చైనా మాంసాహార విక్రయశాల దగ్గర నుంచే కొవిడ్‌ ప్రబలిందన్న వాదనా ఉంది. ఈ భయాలన్నిటికి తోడు, కొవిడ్‌కు మాంసాహారాన్ని జోడిస్తూ రోజుకో పుకారు వినిపించేది. అది సద్దుమణిగేలోగా మరో వార్త షికారు చేసేది. కోళ్ల వల్ల కొవిడ్‌ వస్తుందనో, మాంసం కేంద్రాలు కొవిడ్‌ హాట్‌ స్పాట్స్‌గా మారుతున్నాయనో.. రకరకాల ‘ఫేక్‌ న్యూస్‌’ కంగారు పెట్టేవి. ఫలితం! చాలామంది ఆన్‌లైన్‌ సేవలకు మళ్లారు. ఈ సమయంలో ‘లీషియస్‌’ సంస్థ వ్యాపారం 300 శాతం అభివృద్ధి చెందింది. అందులో పనిచేసే ఉద్యోగుల వేతనాలూ భారీగా పెరిగాయి. కొవిడ్‌ నియంత్రణలోకి వచ్చాక కూడా ఆ మార్పులు స్థిరపడిపోయాయి. వాటిలో ఆన్‌లైన్‌ మాంస విపణి కూడా ఒకటి.

చాలా లాభాలు

ఆన్‌లైన్‌ మాంస విక్రయాల వల్ల వినియోగదారులకు ఎంతోకొంత మంచి జరుగుతున్నది. ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. ఎంచుకోవడానికి ఎన్నో రుచులు అందుబాటులోకి వచ్చాయి. ఇంట్లో చికెనో, మటనో వండుకోవడం అన్నది ఇప్పుడు అతి సులభమైన పని.

ఎంతోమందికి ఉపాధి

జాలర్లు, కోళ్లు మేకల పెంపకందారులు… ఇలా మాంసాహార విపణిలో చివరి మెట్టుమీద ఉండేవారికి మొదటి నుంచీ అన్యాయం జరుగుతున్నది. సరఫరాదారులకు, మార్కెట్‌కు అనుసంధానంగా నిలిచే దళారుల వ్యవస్థ సొమ్ము చేసుకుంటున్నదనే విమర్శ ఉంది. ఫలితంగా అతి సామాన్యులకు లాభాలు చేరడం లేదనే మాట వినిపిస్తున్నది. ఆన్‌లైన్‌ వ్యాపారంతో ఆ సమస్య లేదు. చాలా కార్పొరేట్‌ సంస్థలు నేరుగా ఉత్పత్తిదారుల నుంచే మాంసాన్ని సేకరిస్తున్నాయి. ఇది ఇరువర్గాలకూ లాభసాటి వ్యవహారమే. మాంసం కొట్టడమనేది ఓ శాస్త్రంగా అభివృద్ధి చెందుతున్నది. కొన్ని నాన్‌వెజ్‌ మాల్స్‌ తాజా పట్టభద్రులను నియమించుకొని శిక్షణ ఇస్తున్నాయి.

online non veg delivery

బలమైన వ్యవస్థ

ఏ ప్రాణి మరణించినా, తక్షణం జీవక్రియలు ఆగిపోతాయి. కణజాల విచ్ఛిన్నం మొదలవుతుంది. ఆ శరీరం బ్యాక్టీరియాకు ఆలవాలంగా మారిపోతుంది. ఇలా ‘కుళ్లి’పోవడాన్ని ఆపాలంటే శీతలీకరణ ఉండాలి. మాంసాన్ని సేకరించడం నుంచి వినియోగదారులకు అందించడం వరకూ ఎన్నో ప్రక్రియలు ఉంటాయి. ఇవన్నీ కూడా శీతలీకరణ నేపథ్యంలోనే జరగాలి. దీన్నే ‘కోల్డ్‌ చెయిన్‌’ అంటారు. ప్రతి దశలోనూ వ్యవస్థీ కృతంగా ఉన్న ఆన్‌లైన్‌ విక్రేతలు, ఈ విషయంలో చాలా జాగ్రత్తలే తీసుకుంటున్నారు.

విస్తృతమైన రుచులు

మాంసం అనే మాట ఒక్కటే. కానీ, ఆ నాన్‌వెజ్‌ మాల్స్‌లోకి అడుగుపెడితే కండ్లు తిరిగే రకాలు కనిపిస్తాయి. ఎంచుకోవడానికి అనేక ఉత్పత్తులు. బోలెడన్ని దేశీ విదేశీ రకాలు. దెబ్బకు జిహ్వా చాపల్యం తీరిపోవాల్సిందే.

పరిశుభ్రత

కొవిడ్‌ నేపథ్యంలో.. మాంసం విక్రయశాలల ముందు నిలబడినప్పుడు సవాలక్ష సందేహాలు. అక్కడ అంటువ్యాధులు ఉన్నాయా, చుట్టు పక్కల ప్రాంతాలు పరిశుభ్రంగా ఉన్నాయా, మాంసం నాణ్యతలో తేడా ఉందా, ముక్కలుకొట్టే వ్యక్తి ఆరోగ్యవంతుడేనా… ఇలా అనేకానేక అనుమానాలు! ఆన్‌లైన్‌ విక్రయంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటారు కాబట్టి, ఈ తరహా సందేహాలకు ఆస్కారం తక్కువ.

online non veg delivery
online non veg delivery

సాంకేతికత

మాంసాహార యాప్స్‌ను ఆధునిక టెక్నాలజీతో రూపొందిస్తున్నారు. కృత్రిమ మేధస్సు, బ్లాక్‌ చెయిన్‌ లాంటి సాంకేతికతలతో… వాటిని భద్రపరుస్తున్న ఉష్ణోగ్రతలు, ఉత్పత్తి అవుతున్న ప్రాంతం, వినియోగదారుడి అవసరాలు లాంటి ఎన్నో అంశాలను దృష్టిలో ఉంచుకొంటారు.

వాడకానికి సిద్ధం

చాలా సందర్భాల్లో మాంసం ఓ ముడిసరుకుగానే దొరుకుతుంది. దాన్ని వంటకానికి సిద్ధం చేసుకోవాలంటే చాలా శ్రమించాల్సిందే! ఆన్‌లైన్‌లో ఈ అసౌకర్యం ఉండదు. ఇష్టమైన ఉత్పత్తిని, కావల్సిన రీతిలో అందుకోవచ్చు. ఇంటికితెచ్చి వండుకోవడమే ఆలస్యం.

అరుదైన రుచులు

ఆన్‌లైన్‌ పోటీలో దూసుకెళ్లాలంటే నాణ్యత, ధర లాంటి విషయాలను గమనిస్తూనే.. వైవిధ్యమైన ఉత్పత్తులను కూడా అందించాలి. ఉదాహరణకు ‘మీటిగో’ అనే సంస్థ రెండేండ్ల పాటు పరిశోధన చేసి, ‘మోమో’ వంటకానికి అనువైన మాంసాన్ని రూపొందించింది. ‘థాయ్‌లాండ్‌లో నేను ఆరగించిన రుచులను ఇక్కడి ప్రజలకు అందించాలనే లక్ష్యంతోనే మీటిగో స్థాపించాను’ అంటారు సంస్థ యజమాని సిద్ధాంత్‌.

online non veg delivery
online non veg delivery

సమస్యలూ ఉన్నాయి

ఆన్‌లైన్‌లో గడప దగ్గరే మాంసాన్ని అందుకోవడం సౌకర్యమే. కానీ, కొన్ని సమస్యలూ లేకపోలేదు. ఓ మంచి పరిష్కారం చూపితే ఈ చిక్కూ వీడుతుంది. దళారి సాయం లేకుండా నేరుగా వినియోగదారుడికి ఉత్పత్తిని అందించడమే ఆన్‌లైన్‌ విక్రయానికి ఆలంబన. మరి తరాలుగా, దశాబ్దాలుగా రెక్కలుముక్కలు చేసుకుంటూ ఈ రంగం మీదే ఆధారపడిన చిరు వ్యాపారుల సంగతేమిటన్నది ప్రశ్న. వారికి కూడా తగిన శిక్షణ ఇచ్చి ఈ రంగంలోకి చేర్చుకోగలిగితేనే సమష్టి విజయం సాధించినట్టు. ఖరీదు కూడా ఓ ప్రతిబంధకమే. మాంసం విక్రయాన్ని వ్యవస్థీకృతం చేయడం అంత తేలిక కాదు. సేకరణ నుంచి వినియోగదారుడికి అందించే వరకూ ఎన్నో ఖర్చులు ఉంటాయి. వాటిని అంతిమంగా భరించాల్సింది వినియోగదారుడే. చాలామంది ఇప్పటికీ ఆన్‌లైన్‌ మాంసం జోలికి పోకపోవడానికి ఇదో కారణం. సందు చివర కొట్టులో కనిపించే మనిషి చికెన్‌ వ్యాపారో, మటన్‌ వ్యాపారో మాత్రమే కాదు… చిరకాల పరిచితుడు. డబ్బు లేనప్పుడు అరువు ఇస్తాడు. నమ్మకమైన ఉత్పత్తిని అందిస్తాడు. కాస్త కొసరు వేస్తాడు. ఈ సౌలభ్యాలు ఆన్‌లైన్‌లో దొరికేవి కావు. ఇప్పటి తరానికి మొబైల్‌ మరో చేయిలాగా కనిపించవచ్చు. కానీ పెద్దవాళ్ల పరిస్థితి ఏమిటి? నిరక్షరాస్యుల సంగతి ఏమిటి? ఉత్పత్తిదారులుగా ఆన్‌లైన్‌ వ్యాపారంలో భాగస్వాములు కావాలన్నా, వినియోగదారుడిగా ఆర్డర్‌ చేయాలన్నా సాంకేతిక నిరక్షరాస్యత అడ్డుగా నిలుస్తుంది.

online non veg delivery
online non veg delivery

కార్పొరేట్‌ సంస్థల అంతిమ లక్ష్యం లాభాలే. ఒక్కసారి మార్కెట్‌ మీద పట్టు సాధించాక వాళ్ల మాటే చెల్లుబాటు అవుతుంది. ధరలనూ ఆ శక్తులే నియంత్రిస్తాయి. ఆ పరిస్థితి వస్తే నష్టపోయేది మత్స్యకారులు, గొర్రెలూ మేకల యజమానులే. సగటు వినియోగదారుడు ఘొల్లుమనాల్సిందే. ఆన్‌లైన్‌లో మనం ఏదో ఆర్డర్‌ ఇస్తాం. ఇంకేదో చేతికి వస్తుంది. దాని నాణ్యత బాగుంటుందనే మన నమ్మకం. కానీ అక్కడా మోసం జరగదనే గ్యారెంటీ లేదు కదా! అన్ని సంస్థలూ నిజాయతీగా ఉంటాయనీ, ప్రతి ఉత్పత్తినీ గమనించుకుంటాయనీ, కల్తీ ఉండదనీ హామీ ఇవ్వలేం. తేడా వస్తే డబ్బు సంగతి అలా ఉంచితే… తీవ్రమైన అనారోగ్యం పాలైపోవడం ఖాయం. మొత్తానికి మాంసం విక్రయంలో ఆన్‌లైన్‌ విప్లవం మొదలైంది. అది ఏ స్థాయికి చేరుకుంటుంది అన్నది భవిష్యత్తే నిర్ణయించాలి. కొన్ని లాభాల కోసం తరాల అలవాటును కాదని… మార్పునకు పట్టం కడతారా లేక కొత్తను స్వీకరించి జీవనవిధానాన్ని మార్చేసుకుంటారా అన్నది చూడాలి! ఆన్‌లైన్‌ సంస్థలకూ, చిన్న వ్యాపారులకూ మధ్య జరిగే ఈ పోరు కోళ్ల పందెమంత తీవ్రంగానే మారబోతున్నది.

2024 నాటికి భారతదేశపు మాంసపు విపణి 4.6 లక్షల కోట్లకి చేరుకుంటుందని ‘రెడ్‌సీర్‌’ అనే సంస్థ అంచనా వేస్తున్నది. అందులో పావు వంతును పంచుకున్నా, ఆన్‌లైన్‌ సేవలు అనూహ్యమైన లాభాలు అందుకుంటాయి. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు ఎన్నో సంస్థలు ఈ రంగంలోకి అడుగుపెడుతున్నాయి. సరికొత్త ఆటగాళ్లతో పాటు ఇప్పటికే మార్కెట్‌లో స్థానం సుస్థిరం చేసుకున్న ‘బిగ్‌ బాస్కెట్‌’ లాంటి సంస్థలు కూడా తాజా తాజా మాంసంతో లాభాలు రుచిచూసే ప్రయత్నం చేస్తున్నాయి.

‘నాన్‌వెజ్‌’ ప్రెన్యూర్స్‌!

జనానికి నాన్‌వెజ్‌ పట్ల పెరుగుతున్న మక్కువనూ, విస్తరిస్తున్న మార్కెట్‌నూ దృష్టిలో ఉంచుకుని ఎంతోమంది ఆంత్రప్రెన్యూర్స్‌ రంగంలోకి దిగుతున్నారు. సరికొత్త ఆలోచనలతో సంచలనాలు సృష్టిస్తున్నారు.

online non veg delivery
online non veg delivery

లీషియస్‌ – పది లక్షల ఆర్డర్లు

బెంగళూరుకు చెందిన వివేక్‌ గుప్తా చార్టర్డ్‌ అకౌంటెంట్‌. ఆయన మిత్రుడు అభయ్‌ హంజురా బయో టెక్నాలజీ నిపుణుడు. ఇద్దరూ కలిసి ‘లీషియస్‌’ అనే స్టార్టప్‌ను స్థాపించారు. ఆన్‌లైన్‌ ద్వారా తాజా మాంసాన్ని అందించాలనే ఆలోచనే కొత్తగా అనిపించిన సమయం అది. కానీ, ఏటా 20 శాతం చొప్పున పెరుగుతున్న మాంసాహార విపణి ఈ నేస్తాలను ఆకర్షించింది. ఎంత కష్టపడినా, ఏడు కోట్ల రూపాయలు మాత్రమే సమీకరించగలిగారు. ఆశలు ఎదగడానికి ఆ కాస్త పట్టు చాలని అనుకున్నారు. ఆహార సేకరణ నుంచి వినియోగదారుడికి చేరవేసే వరకూ తగిన నాణ్యతను పాటిస్తే… వ్యాపారానికి తిరుగులేదని ఊహించారు. ‘మా కుటుంబాల కోసం ఎలాంటి మాంసం కొంటామో, అదే వినియోగదారులకూ అందిస్తాం. ఆ ప్రమాణమే మా విజయ సూత్రం’ అంటారు వివేక్‌. ఈ స్నేహితులు ఊహించినట్టుగానే వ్యాపారం ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. ప్రస్తుతం 3,500 మంది ఉద్యోగులతో నెలకు పది లక్షల ఆర్డర్లను చేరవేస్తున్నది. ఒక స్టార్టప్‌ వంద బిలియన్‌ డాలర్ల విలువను చేరుకుంటే దాన్ని ‘యూనికార్న్‌ స్టార్టప్‌’ అంటారు. ఉత్పత్తిదారుడి నుంచి వినియోగదారుడి వరకూ నేరుగా వస్తువులను చేరవేసే D2C విభాగంలో యూనికార్న్‌ స్టార్టప్‌గా ఎదిగిన తొలి భారతీయ కంపెనీ ‘లీషియస్‌’.

జైహో.. జాప్‌ఫ్రెష్‌

దీపాన్షు మన్‌చందా సేల్స్‌మెన్‌గా కెరీర్‌ ప్రారంభించాడు. మొదట్లో, కార్పొరేట్‌ సంస్థలకు కుర్‌కురే ప్యాకెట్లు అమ్మేవాడు. క్రమంగా అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌లో చేరాడు. క్రెడిట్‌ కార్డుల కోసం వినియోగదారులకు వలవేసే పనిలో పడ్డాడు. మంచి ప్రతిభ కనబరచడంతో త్వరత్వరగా పదోన్నతులు వచ్చాయి. కానీ ఆ విజయం సంతృప్తినిఇవ్వలేదు. బేకరీ ఉత్పత్తుల వ్యాపారం మొదలుపెట్టి చేతులు కాల్చుకున్నాడు. అయినా వెనక్కి తగ్గకుండా ఈసారి మాంసాహారంలోకి అడుగు పెట్టాడు. రూ. 30 లక్షలతో మొదలుపెట్టిన ఈ వ్యాపారం వంద కోట్లను దాటేసిందని అంచనా.

online non veg delivery
online non veg delivery

కత్తిలాంటి పీస్‌… టెండర్‌ కట్స్‌

చెన్నైకి చెందిన నిషాంత్‌ చంద్రన్‌ మొదట్లో ఇ-బిల్లింగ్‌ కంపెనీ స్థాపించాడు. ఆ విజయం పెద్దగా కిక్‌ ఇవ్వలేదు. మరో వ్యాపారం చేయాలనే ఆలోచనతో ఐడియా కోసం ప్రపంచ యాత్ర మొదలుపెట్టాడు. యూరప్‌ పర్యటనలో ఓ మార్పును గమనించాడు. అక్కడి మాంసాహార విపణికీ, మన దేశంలోని పరిస్థితులకూ మధ్య తీవ్రమైన వైరుధ్యం కనిపించింది. దీంతో, వస్తేగిస్తే మాంసం వ్యాపారంలోకి రావాలని నిశ్చయించుకున్నాడు. మరో కోణం కూడా నిషాంత్‌ దృష్టిని ఆకర్షించింది. జంతువుల బరువు పెంచడం దగ్గర నుంచీ, చేపలను నిలువ చేయడం వరకూ విచక్షణారహితంగా రసాయనాలను గుప్పిస్తుంటారు. వినియోగదారుల్లో వీటి మీద అవగాహన పెరుగుతున్నా… ఏమీ చేయలేని నిస్సహాయత కనిపించింది.దాంతో లగ్జంబర్గ్‌కు చెందిన ఓ పరిశోధనాశాల సాయంతో తాము సేకరించే సరుకును పరీక్షించాకే, నాణ్యతతో కూడిన మాంసాన్ని విక్రయిస్తున్నారు. ఆన్‌లైన్‌ సేవతో పాటు దుకాణాల ద్వారా కూడా వ్యాపారం చేస్తున్నారు. తాజాగా టెండర్‌ కట్స్‌ వంద కోట్ల టర్నోవర్‌ను దాటేసింది. ఏడాదిలోనే 300 శాతం వృద్ధిని సాధించింది. భవిష్యత్‌లో ఇలాంటి విజయ గాథలు మరిన్ని వినిపిస్తాయి. ఆ జాబితాలో మీ ఆత్మీయులూ ఉంటే, చికెన్‌ దావత్‌కు పిలుపు ఖాయం.

తాజాగా.. ఫ్రెష్‌ టు హోమ్‌

షాన్‌ కడవిల్‌ ‘సీ-టు-హోమ్‌’ అనే సంస్థలో పనిచేసేవాడు. చేపల ఎగుమతిలో నిలదొక్కుకునేందుకు ఆ సంస్థ అష్టకష్టాలూ పడేది. ఆ వ్యాపారానికి సాంకేతికతను కనుక జోడిస్తే.. మంచి విజయాలు సాధించవచ్చని అనిపించింది షాన్‌కు. వెంటనే ‘ఫ్రెష్‌-టు-హోమ్‌’ స్థాపించారు. తన మాజీ యజమాని మాథ్యూనూ భాగస్వామిగా చేర్చుకున్నాడు. షాన్‌ వ్యూహ రచనకు, మాథ్యూ అనుభవం తోడైంది. చిన్నపాటి పెట్టుబడితో మొదలైన ఈ సంస్థ ప్రస్తుతం నెలకు పదిహేను లక్షల ఆర్డర్లను సరఫరా చేస్తున్నది. వచ్చే ఏడాది నాటికి 1,500 కోట్ల రూపాయల ఆదాయాన్ని అందుకోవడమే తన లక్ష్యమని చెబుతున్నారు షాన్‌.

బలానికి బలగం!

గతంలో మాంసాహారం తీసుకునేందుకు చాలా ఆలోచించేవారు. సమయం, సందర్భంతో పాటుగా ఆర్థిక స్తోమత కీలకపాత్ర పోషించేది. కుటుంబాల దగ్గర నుంచీ ప్రాంతాల వరకూ… వీటి అలవాట్లు భిన్నంగా ఉండేవి. క్రమంగా అన్నివేళలా, అన్నిరకాల మాంసాహారాన్ని తీసుకునే అలవాటు పెరుగుతున్నది. దానికి కారణం, ప్రపంచీకరణ ఒక్కటే కాదు, పరిశోధకుల నుంచి వైద్యుల వరకు మాంసాహారంలో ఉండే పోషక విలువలను తరచూ గుర్తుచేయడం కూడా ముఖ్య కారణమే!

విటమిన్‌ బి-12

నాడీ వ్యవస్థకు, జన్యు నిర్మాణానికి, రక్తకణాల తయారీకి చాలా కీలకమైన ఈ పోషకాన్ని శరీరం తనంతట తాను తయారుచేసుకోలేదు. ఆహారం నుంచి రావాల్సిందే. అందుకు మాంసమే కీలకం. బి-12 లోపం తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తుంది. రక్తహీనత దగ్గర నుంచీ జ్ఞాపకశక్తి మందగించడం వరకూ ఎన్నో సమస్యలను సృష్టిస్తుంది. చేపలు, గుడ్లుతో పాటు కార్జం లాంటి జంతు అవయవాల్లో బి-12 సమృద్ధిగా ఉంటుంది. శాకాహారులకు చాలా అరుదుగా ఈ పోషకం అందుతుంది కాబట్టి… వారికి కృత్రిమ సప్లిమెంట్స్‌ ఇస్తుంటారు.

ఐరన్‌

రక్తం ద్వారా శరీరంలో అన్ని భాగాలకూ ప్రాణవాయువును అందించేది.. ‘హిమోగ్లోబిన్‌’. రక్తం ఎర్రగా కనిపించడానికీ కారణం ఇదే. ఇంత ముఖ్యమైన హెమోగ్లోబిన్‌ ఉత్పత్తికి ఐరన్‌ కీలకం. నీరసం, ఆయాసం లాంటి సమస్యలను వెంటతీసుకుని మరీ వచ్చే రక్తహీనతను గమనించగానే హిమోగ్లోబిన్‌ తక్కువగా ఉందని నిర్ధారించి… డాక్టర్‌గారు ఓ ఐరన్‌ టానిక్‌ చేతిలో పెట్టడానికి కారణం ఇదే. ముఖ్యంగా మహిళలు, అందునా గర్భిణులకు ఐరన్‌ లోపం వచ్చే అవకాశం ఎక్కువ. మాంసాహారంలో పుష్కలంగా ఉండే ఐరన్‌ వారిని రక్తహీనత నుంచి కాపాడుతుంది.ఇవి మాత్రమే కాదు… మాంసాహారంలో జింక్‌, అమైనో యాసిడ్స్‌, సెలీనియం, విటమిన్‌-డి లాంటి అరుదైన పోషకాలు చాలానే లభిస్తాయి. ఈ కారణంగానే… తగినంతగా మాంసం తినేవారిలో దృష్టి లోపాలు తక్కువగా ఉంటాయి, మానసిక దృఢత్వం కనిపిస్తుంది, రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. దృఢంగా, ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటారు.

ఒమేగా- 3 & ప్రొటీన్లు

తరచూ వినిపిస్తున్న పేరు ఇది. ALA, EPA and DHA అనే మూడు రకాల రసాయనాలను కలిపి ఒమేగా-3గా వ్యవహరిస్తారు. ఇవి రక్తంలో ఉండే కొవ్వును (ట్రైగ్లిజరైడ్స్‌) అదుపులో ఉంచుతాయి. తద్వారా గుండెజబ్బులు, పక్షవాతం లాంటి సమస్యలను అరికడతాయి. అంతేకాదు! వాపును కూడా అదుపు చేస్తాయి. అందుకే ఊపిరితిత్తుల వాపు వల్ల ఏర్పడే ఆస్తమా, అలాగే కీళ్లవాపులతో కలిగే ఆర్థరైటిస్‌ను ఒమేగా-3 సమర్థంగా ఎదుర్కోగలవు. గర్భంలో శిశువుల నాడీవ్యవస్థను బలపరచడం దగ్గర నుంచి వృద్ధాప్యంలో అల్జీమర్స్‌ను అరికట్టడం వరకూ… ఒమేగా -3తో ఎన్నో ఉపయోగాలున్నాయి. శాకాహారంలో ఇవి సోయాబీన్స్‌ లాంటి కొన్ని పదార్థాలలో మాత్రమే కనిపిస్తాయి. కానీ, చేపల్లో మాత్రం పుష్కలంగా లభిస్తాయి. వైద్యులు కూడా కొన్ని సందర్భాల్లో ‘కాడ్‌ లివర్‌ ఆయిల్‌’ తీసుకోమని చెప్పడానికి ముఖ్య కారణమూ ఇదే.

ప్రొటీన్లు : మన కణజాలాన్ని నిర్మించేందుకు సాయపడేవి ప్రొటీన్లు. కండరాలు, ఎముకలు దృఢంగా ఉండాలన్నా.. హార్మోన్ల ఉత్పత్తి సరిగా జరగాలన్నా ప్రొటీన్లు తప్పనిసరి. పప్పులు, పాల పదార్థాల్లో ప్రొటీన్లు దొరికినా మాంసాహారంలో మాత్రం సమృద్ధిగా లభిస్తాయి. చేపలు లాంటి సీ ఫుడ్‌, చికెన్‌, గుడ్లు, పోర్క్‌ లాంటి పదార్థాల్లో ప్రొటీన్‌ దొరుకుతుంది. ఆహారంలో ప్రొటీన్‌ తీసుకోలేని వారి కోసం ప్రత్యేకించి ప్రొటీన్‌ పౌడర్లను సూచించాల్సి వస్తుంది. మాంసాహారంతో ఆ సమస్య రాదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

Tiktok : టిక్‌టాక్‌పై బ్యాన్ ఎత్తివేత‌.. గ‌త 15 నెల‌ల్లో ఇది నాలుగో సారి

Shortcuts : వాట్సాప్‌ వెబ్ లో షార్ట్‌కట్స్‌ గురించి తెలుసా..? అవేంటంటే..?

మీకు డ‌యాబెటిస్ ఉందా? జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే.. లేదంటే..

ఆ టైంలో నా భ‌ర్త‌ వేరే అమ్మాయిల పేర్లు పిలుస్తుంటాడు? న‌న్నేం చేయ‌మంటారు?

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement