జరిగిన కథ
స్పృహలోకి వచ్చిన కువిందునికి అతని
పనిమీద మరొకరు వెళ్లినారని
చెబుతాడు వామదేవుడు. తనను
వెతుక్కుంటూ వచ్చిన భర్తను గుర్తించలేని
అజ్ఞానానికి బాధపడుతుంది రోహ.
ఆ తర్వాత…
పోటిసుడు. కండలు తిరిగిన శరీరంతో, కోర మీసంతో, కోడెనాగులా మిసమిసలాడే 20 ఏళ్ల నవ యువకుడు. కుసుమ శ్రేష్ఠి అంతఃపురంలోని జయసేనుని సేవకుడు. ఇప్పుడిప్పుడే అతనికి శరీరం మీద శ్రద్ధ పెరుగుతున్నది. అలసుద్దిని చూసినప్పుడల్లా వాని అంతరంగం కల్లోలితమవుతున్నది. అంతఃపుర నియమాలు అతణ్ని కట్టిపడేస్తున్నాయి. కానీ, అంతకుమించి ఆ పిల్లను ఏదో చేసేయాలన్న కోరిక అతనిలో తరచూ బుసకొడుతూనే ఉన్నది. అందుకు తగ్గట్లు అలసుద్ది కూడా అప్పుడప్పుడూ వాణ్ని ఓరకంట చూడటం, ఏదో అర్థం వచ్చేటట్లు నవ్వడం అతణ్ని నిలువనీయడం లేదు. అయితే, ఈ వ్యవహారం అంతా ఒక కంట కనిపెడుతున్న సిరిసత్తి.. సాధ్యమైనంతవరకు ఇద్దరూ ఎదురుపడని పనులు అప్పజెప్తున్నది. ఇప్పుడు పోటిసుణ్ని కొంచెం దూరంగా ఉంచే అవకాశం వచ్చింది. భర్త కుసుమ శ్రేష్ఠిని తీసుకొని రావడానికి పోటిసుణ్ని కళింగదేశానికి పొమ్మని పురమాయించింది. పోటిసుడికి అది ఒకరకంగా ఇష్టమే. మరొక రకంగా ఇష్టం లేదు. ఇష్టం ఎందుకంటే.. రెండు వారాలు పక్షిలా బాహ్య ప్రపంచంలో స్వేచ్ఛగా విహరించవచ్చు. ఇక అయిష్టానికి కారణం.. అలసుద్దిని చూడకుండా అన్ని రోజులు ఉండటం. అంతఃపురంలో అయితే పనిలేకున్నా ఏదో మిషతో దాన్ని పలకరించడం, అది కుదరకపోతే దాని వెన్నెల వంటి చిరునవ్వు చూడటం, అదీ సాధ్యం కాకపోతే కనీసం దూరం నుండి చూడటం తప్పనిసరిగా జరిగేది. కానీ, సుమారు రెండు వారాలు దాన్ని చూడకుండా గడపడాన్ని మనసు జీర్ణించుకోలేక పోతున్నది.
పోటిసుడు బంటు. అతనిట్లా తలపోయ సాగినాడు. బంటుకు అనుసరించుడే గానీ ఆలోచించి సొంతంగా వ్యవహరించే అవకాశం లేదు. ఇంకా తన యజమాని ఉత్తముడు కాబట్టి హింసించడు, అవమానించడు. వేరే దేశాలలో సేవకులను చాలా నీచంగా చూస్తారని విన్నాడు. గుర్రం ఎక్కి కళింగ దేశం వైపు సాగిపోతున్నాడు వాడు. అశ్వం వేగాన్ని అనుసరించి అతని ఆలోచనలు పరిభ్రమిస్తున్నాయి. అది వేగం పెంచితే ఉద్వేగభరితంగా; నెమ్మదిగా నడిస్తే శాంత శృంగారభరితంగా ఆలోచనలు మనసును ముసురుకుంటున్నాయి. పోటిసుని మనసు హఠాత్తుగా ధనం గురించి ఆలోచించ సాగింది…
మనిషికి ధనం, మృత్యువు లభిస్తాయి. మృత్యువు కోసం ఎవడూ ప్రయత్నించనవసరం లేదు. కానీ, ధనం కోసం తప్పక ప్రయత్నం చేయాలి. ధనమున్నవాడు ఈ లోకంలో భోగి; ధనహీనుడు తనలా బానిసలా బతుకును ఈడ్చక తప్పదు కదా! అని ఏదో ఆలోచిస్తున్న పోటిసుని ఊహలు హఠాత్తుగా చెదిరిపోయినయ్… దారికి అడ్డంగా దొంగల గుంపు ఒకటి ఆడవాళ్లని ఎత్తుకుపోతున్నది. నలుగురు ఆడవాళ్లు హాహాకారాలు చేస్తున్నారు. అందులో ఒక ధైర్యశాలిని ఉన్నట్లు ఉన్నది. “మీరు ఎవరూ భయపడకండి. అదిగో నా మొగని వింటి నారి ధ్వని వినిపిస్తున్నది. అతడు మహావీరుడు. నాతోపాటు మిమ్ములను కూడా రక్షిస్తాడు!” అని అందరికీ వినిపించేలా గొంతెత్తి అరుస్తున్నది. ఆ మాటలను ఒక దొంగ సహించలేక పోయినాడు. “ఏయ్ ఊరపందీ! ఒళ్లు కొవ్వెక్కిన మాటలు మాట్లాడకు! అది నీ మొగని అల్లెతాడు శబ్దం కాదు. ఆకాశంలో ఉరుముల చప్పుడు. మరికొన్ని ఘడియల్లో మీ వీరాలాపాలన్నీ ఆర్తనాదాలుగా మారుతాయి.
పద పద!” అంటూ వికటాట్టహాసం చేసినాడు. పోటిసుడు చూస్తుండగానే ఆ బృందం ముందుకు సాగిపోయింది. అప్పుడప్పుడూ దొంగలు ఇట్లా ఆడవాళ్లని ఎత్తుకొని పోతుంటారని విన్నాడు. అటువంటి ఆడవాళ్లను ‘కరిమరి’ అంటారని కూడా పోటిసునికి తెలుసు. కానీ, పట్టపగలు ఇట్లా పొలాల్లో పనులు చేసుకుంటున్న ఆడవాళ్లను ఎత్తుకొని పోతారని ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తే అతని ఒళ్లు గగుర్పాటుకు లోనయ్యింది. అంతలోనే ఒక విలుకాడు వింటి నుండి వదిలిన బాణంలా వచ్చినాడు. నిజంగానే అతడు ధనుష్ఠంకారం చేస్తున్నాడు. ఆడవాళ్ల శబ్దాలను అనుసరిస్తూ అశ్వం పైన రివ్వున దూసుకుని పోయినాడు. ‘మంచివాళ్లకు అపకారం జరుగుతుంటే అడ్డుకోవాలి. దుర్మార్గులను ఎదుర్కొనాలి. మంచి పనులు చేస్తున్న వాళ్లకు సాయం చేయాలి’ అనే అమ్మ మాటలు గుర్తుకు వచ్చినాయి పోటిసునికి. అంతలోనే… తాను ప్రభు కార్యార్థినై వెళుతున్నాడు, ఈ తనకు మాలిన ధర్మం వల్ల తన విధ్యుక్త ధర్మం
పరోపకారం గొప్పదే కానీ.. తానిప్పుడు చేసేపని సేవక ధర్మం. సొంతపని కాదు. ఈ పనికి విఘ్నం కలిగితే అది తాను ప్రభుద్రోహం చేసినట్లు అవుతుంది… అని ద్వైవీ భావనలో కొట్టుకుంటున్న పోటిసునికి ఆ కరిమరి మాటలు చెవిలో ప్రతిధ్వనించినాయి. బేలతనము వలదు ప్రియభామ లార! నా మగని మగతనమ్ము మనల గాచు! వినుడి అతని రాక వింటి నారి ధ్వని కుందవలదు దుఃఖ మందవలదు! (ఓ ప్రియ స్నేహితురాండ్లారా! వినండి. నా భర్త వీరత్వం మనలను తప్పక కాపాడుతుంది. అదిగో అతని వింటినారి ధ్వని అతని రాకను సూచిస్తున్నది. బాధపడవద్దు. ఏడవవద్దు) మృత్యుముఖంలో కూడా ధైర్యం వీడని ఆడవాళ్ల కంటే తాను హీనుడా? అనుకోగానే కర్తవ్యం స్ఫురించింది అతనికి. ఒంటరిగా తమను వెన్నంటి వస్తున్న ఒక విలుకాణ్ని చూసి దొంగలు మొదట ఆశ్చర్య పోయినారు. ‘వాడు ఒక్కడు; మనం నలుగురం. వాణ్ని తుదముట్టిస్తే గానీ ఈ రొద తగ్గదు’ అనుకున్నట్లున్నారు వాళ్లు. ఆడవాళ్లను గుర్రాల జీనులకు బిగించి కట్టేసి, నలుగురూ తమ దగ్గర ఉన్న కత్తులతో చెట్ల చాటున దాక్కున్నారు.
అది గమనించని విలుకాడు వేగంగా దూసుకుని వచ్చినాడు. వాని గమనానికి అడ్డుగా దొంగలు పెట్టిన అడవి తీగలను చూసుకోలేదు. గుర్రం మీద నుంచి అల్లంత దూరాన ఎగిరి పడ్డాడు. అతను తేరుకునే లోపే దొంగలు నలుగురూ విచ్చుకత్తులతో విరుచుకుపడ్డారు. వాళ్ల కత్తిపోట్ల నుంచి అతను తప్పించుకుంటూనే వాళ్లని ఎట్లా దెబ్బతీయడమా అని ఆలోచిస్తున్నాడు. అతని వద్ద విల్లు ఉన్నా, సంధించేంత సమయం లేదు. మొదటిసారిగా అతని మనసును భయం ఆవహించింది. నలుగురు దొంగల్లో ఒకడు కరుడుగట్టిన పాషాణంలా ఉన్నాడు. కత్తిని సరాసరి ఆ విలుకాని గుండెలో దింపబోయినాడు… సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చిన పోటిసుడు.. తన ఖడ్గంతో ఆ దొంగ చేతిలోని కత్తిని ఎగురగొట్టినాడు. దాంతో మిగతా దొంగల్లో కసి పెరిగింది. వీళ్లిద్దరూ – వాళ్లు నలుగురు; అయినా దొంగలు వీళ్లని ఎదుర్కోలేక పోయినారు. కాలికి బుద్ధి చెప్పడమే తరుణోపాయంగా అనిపించి, అక్కడి నుంచి పరుగు లంకించుకున్నారు. వాళ్లు వెళ్లిపోయినారన్న ధీమాతో.. వీళ్లిద్దరూ గుర్రాల మీద ఉన్న మహిళల కట్లు విప్పే ప్రయత్నంలో పడ్డారు. చెప్పబోతున్నంతలో దొంగల్లో నుంచి ఒకడు బాణంలా వెనుకకు తిరిగి వచ్చి, అతని వీపులో కత్తి దింపి, వచ్చినంత వేగంగా పారిపోయినాడు. పోటిసుడు కుప్పకూలినాడు.
ఒంటరిగా తమను వెన్నంటి వస్తున్న ఒక విలుకాణ్ని చూసి దొంగలు మొదట ఆశ్చర్య పోయినారు. ‘వాడు ఒక్కడు; మనం నలుగురం. వాణ్ని తుదముట్టిస్తే గానీ ఈ రొద తగ్గదు’ అనుకున్నట్లున్నారు వాళ్లు. ఆడవాళ్లను గుర్రాల జీనులకు బిగించి కట్టేసి, నలుగురూ తమ దగ్గర ఉన్న కత్తులతో చెట్ల చాటున దాక్కున్నారు.
* * *
ఇతరుల ధనాన్ని చూస్తూ కాలం గడపటం; వైద్యానికి లొంగని రోగంతో బాధపడటం; భవ బంధాలు తెంచుకోవాలనుకుంటూనే ఎప్పుడూ బంధువర్గంలో తిరగడం; ప్రేయసీ ప్రియుల విరహం… భరింపరానివి. జయసేనుడు వచ్చి వెళ్లిపోయినప్పటి నుండి రోహలో విరహ బాధ అధికమైంది. సీహ ఎంత ప్రయత్నించినా అది అధికమవుతున్నదే గానీ తగ్గడం లేదు. అది శరీరం మీద కూడా ప్రభావం చూపించ సాగింది. ఆమె పెదవులు నల్లబారినై; కండ్లు లోతుల్లోకి పోయినయి; శరీరం బరువు తగ్గి, బలహీనమైంది; నిద్ర కరువైంది; ఆకలి మందగించింది. మూడు రోజుల్లో మనిషి- మనిషేనా అన్న చందాన తయారయింది రోహ. “అక్కా! నీవు ఇట్లా ఉంటే అత్తగారు నిన్ను చూసి, నీకేదో తీరని జబ్బు ఉన్నదేమోనని అనుమానిస్తారు. ఏదో సరిపెట్టుకొని ఇక్కడి నుంచి నిన్ను తీసుకొని పోయినా, బావ నిన్ను ఇట్లా చూస్తే నీ దగ్గరికి కూడా రాడు” అన్నది సీహ.
చెల్లెలి చివరి మాట.. రోహలో చలనం తెచ్చింది. “ఏమీ… ఆయన నన్ను చూడరా?” అన్నది ఆందోళనగా. తన అస్త్రం సత్ఫలితాన్ని ఇస్తున్న వెలుగు సీహలో ప్రతిఫలించింది. ఆ అవకాశాన్ని జారవిడుచుకో దలచుకోలేదు ఆమె. “అవునక్కా! ఎలాంటి దానవు ఎట్లా మారిపోయినావు! నీకు తెలియడం లేదు, ఒక్కసారి అద్దంలో చూసుకో నీకే తెలుస్తుంది. నువ్వు మునుపటిలా తయారు కాకపోతే నిన్ను ఎవరూ ఆదరించరు. ముఖ్యంగా బావ నిన్ను ఇట్లా చూస్తే చీదరించుకుంటాడు”.. కాల్చిన కడ్డీ మీద దెబ్బ వేసినట్లు మాట్లాడింది. “చెల్లీ….!” సీహను గట్టిగా ఆలింగనం చేసుకొని కంటతడి పెట్టింది రోహ. “అక్కా! నీవు దుఃఖిస్తే మరింత చిక్కి పోతావు. నీ అందం ఆవిరైపోతుంది. నా మాట విని, మంచిగా తిని, విశ్రాంతి తీసుకుంటేనే కొంతలో కొంత బాగవుతావు. లేదంటే నీ అత్తగారి ఇంట్లో నీవు అనుకున్న సుఖాలను ఏవీ అందుకోలేవు” మందలించింది సీహ. అప్పుడు రోహ తన మనసులో ఇట్లా అనుకున్నది… ‘నన్నే నమ్ముకొని వచ్చిన భర్త ఆశలను కాల్చి పంపిన అడవిలా అయిపోయినాను నేను. పేదరికం కన్నా, పరదేశంలో ఉండటం కన్నా ఇది అత్యంత దుఃఖాన్నిస్తుంది’..
తనలో తాను కుమిలిపోతున్న అక్కను చక్కని దారిలో నిలిపి, ఎప్పటిలాగా చేసేందుకు సీహ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. తలార స్నానం చేయించి, నీరెండలో నిలబెట్టి, ఆపై జుట్టుకు వట్టివేళ్ల పొగబట్టి, తాగడానికి దానిమ్మ రసం ఇచ్చి కొంత సాంత్వన కలిగించింది. “చెల్లీ! నువ్వు పక్కనుంటే ధైర్యంగా ఉంది. ఏదో నమ్మకం కలుగుతున్నది. ఆశలు చిగురిస్తున్నాయి. ప్రతిక్షణం నీవు నాకు తోడుగా ఉంటావు కదా!” దీనంగా అడిగింది రోహ. మనసులోనే నవ్వుకున్నది సీహ. ‘అక్కా! నా అవసరం నీవు నీ పెనిమిటిని చేరే దాకనే. ఆపైన నన్ను నీవు కలనైనా స్మరింపవు కదా!’ అనుకున్నది. ఆపై అక్కకు ఉపశమనం కలిగే మార్గం ఉపదేశించింది… అతడు నిలిచినట్టి అవనిని తాకుము అతడు తిరుగు గాలి నాడుకొనుము అతని మాటలన్ని అనుకుంద మిరువుర మదియె నీకు గూర్చు ముదము నిపుడు! (బావ నిలబడ్డ స్థలాన్ని నీ చేతితో తాకు; ఆయన తిరిగిన గాలిలో ఆడుకో; ఆయన మాటల్ని ఇద్దరము కలిసి చర్చించుకుందాం. అది నీకు ఎంతో సంతోషాన్ని చేకూరుస్తుంది) సీహ మాటలు రోహలో కొత్త ఆశలను నింపినాయి. మెరిసే కళ్లతో చెల్లిని అనుసరించింది రోహ.