అంధకూపంలోని మనిషిని.. రోహా సీహాలు మిగతా ఇద్దరి సహాయంతో అతి కష్టం మీద బయటకి తీసినారు. తనను కలవడానికి మారువేషంలో వచ్చిన జయసేనుడిని గుర్తించలేక.. రోహా భటులను పిలిచింది. ఆ తర్వాత…
నెమ్మదిగా కళ్లు తెరిచినాడు కువిందుడు. తల దిమ్మెక్కినట్లుగా ఉంది. కొంచెం ప్రయత్నం మీద తనచుట్టూ పరికించి చూడగలిగినాడు. తాతా! కువిందు తాతా!” ఆత్మీయంగా పలకరించినాడు వామదేవుడు. వామదేవుని గుర్తించినాడు కువిందుడు. “అయ్యా! వామదేవా! తమరిక్కడ ఎందుకున్నారు? నేను మల్లికాపురికి వెళ్లాల్సినవాడిని కదా, ఇక్కడ ఎందుకున్నాను? అసలు మనం ఎక్కడ ఉన్నాం? ఏం జరిగింది?” అంటూ.. జరిగింది గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నించసాగినాడు కువిందుడు. “తాతా! లే! నీకన్నీ వివరంగా చెప్తా గానీ, నా వెంట రా!” అంటూ మెల్లగా పైకి లేవదీసినాడు వామదేవుడు. లేస్తుంటే గ్రహింపు అయింది కువిందునికి.. ఒళ్లంతా నొప్పులుగా అనిపిస్తున్నది. అతణ్ని మెల్లగా నడిపించుకుంటూ దగ్గరలో ఉన్న ఒక మర్రిచెట్టు నీడకు తీసుకొని పోయినాడు వామదేవుడు. అంతకుముందే తనవద్ద సిద్ధంగా ఉన్న చల్లని మంచినీళ్లు ఇచ్చినాడు. తర్వాత రొట్టెలు తినమన్నాడు.
“అయ్యా! నేను కార్యార్థినై వెళుతున్నవాణ్ని. నాకు ఈ ఆటంకం ఎందుకు కలిగింది? హఠాత్తుగా మీరు ఎందుకు ఇక్కడ ప్రత్యక్షమైనారు? నామీద దాడి చేసిన వారు ఎవరు? అన్ని సంగతులు వివరంగా తెలిస్తే గానీ నేను ఏమీ ముట్టను. ఇప్పటికీ ఇంకా ఆరు జాముల పొద్దున్నది. నేను మల్లికాపురికి వెళ్తాను” అంటూ లేచి నిలబడ్డాడు కువిందుడు.
తన దెబ్బలను సైతం లెక్కచేయకుండా ప్రభుభక్తిని ప్రకటిస్తున్న కువిందుని చూసి ఆశ్చర్యంతోపాటు ఆనంద పరవశుడైనాడు వామదేవుడు. కువిందుని వంటి సేవా పరాయణుల వల్లనే కదా కుసుమ శ్రేష్ఠి వంటి పెద్దలు ఆనందంగా, ప్రశాంతంగా జీవిస్తున్నారు. రాజులకు తీసిపోని వైభవాన్ని అనుభవిస్తున్నారు. ధనార్జనతోపాటు కీర్తిని సంపాదిస్తూ, తిరుగులేని జీవనాన్ని కొనసాగిస్తున్నారు. “వామదేవా! నా అశ్వం ఎక్కడ?”.. వామదేవుని మౌనం కువిందునికి మింగుడు పడటం లేదు. తాను చేయవలసిన పని గురించి అతని మనసు తహతహలాడుతున్నది. అతని కళ్లు గుర్రం కోసం అన్వేషిస్తున్నాయి.
ఇంకా ఆలస్యం చేస్తే కువిందుడు పరుగెత్తుకుంటూ అయినా వెళ్లి తన పని పూర్తి చేసుకునేటట్లు అనిపించింది వామదేవునికి. అందుకే ఎక్కువ తాత్సారం చేయకుండా విషయం చెప్పదలుచుకున్నాడు. ఎందుకంటే అది తెలిస్తే గానీ, ఈ పెద్ద మనిషి శాంతించడని అర్థమైంది. “నీవు వెళ్లవలసిన పనిమీద మరొకరు వెళ్లినారు లే తాతా! ముందు నువ్వు ప్రశాంతంగా రొట్టె తిను…” వామదేవుని మాట పూర్తి కాలేదు. “నేనుండగా మరొకరు వెళ్లినారా?” ఆశ్చర్యం, అపనమ్మకం, అయోమయం మనసును కుదిపేస్తుండగా… అది తనకు అవమానకరమైన విషయంగా భావించి, ఆవేదనతో అన్నాడు కువిందుడు. అందుకు వామదేవుడు చెప్పిన సమాధానం విని మరింత ఆశ్చర్యపోయినాడు.
మనసులో, వాక్కులో, చేష్టలో శుద్ధమైన ఏకత్వాన్ని జీవులలో పెంపు చేస్తే దుఃఖాలు తొలగిపోయి సౌఖ్యాలు తీగల్లాగా జీవితమంతా అల్లుకుంటాయి. దేవుడు, దయ్యం అంటూ ఈ దీక్షలు ఎందుకు? మనసులను చక్కజేసే ప్రయత్నం సక్రమంగా చేస్తే చాలు. దానివల్ల చాలా మేలు కలుగుతుంది.
“నీ పేరేమిటి?”
“ప్రణాళుడు”
“నిన్ను నూతిలో తోసిందెవరు?”
“నేనే పడ్డాను”
“ఎందుకు?”
“చావాలని”
“ఎందుకు చావాలనుకున్నావు?”
“బతకాలి అనిపించక…”
“ఎందుకు బతకాలనిపించలేదు?”
“అవమానం జరిగింది”
“ఎవరికి?”
“ఎవరికో అయితే నేనెందుకు చస్తాను? నాకే!” అంటూ చురుక్కున చూసాడు ప్రణాళుడు.
“అదే… నీకు అంటే, నీ మనసుకా లేక శరీరానికా?”
“మనసుకు”
“మనసుకు అయితే శరీరాన్ని ఎందుకు
శిక్షిస్తున్నావు?”
“మనసును శిక్షించలేక…”
“తప్పు కదా! మనసు తప్పు చేస్తే, మనసునే
శిక్షించాలి!”
ప్రణాళుని మత్తు పూర్తిగా వదిలింది.
“మనసుని ఎలా శిక్షిస్తావు? అసలు ఎవరు నీవు?”
“నా పేరు మాధవుడు. బుద్ధ దేవుని ప్రియ శిష్యుడైన ఆనందుని శిష్యుడను”
“మనం ఎక్కడ ఉన్నాం? అసలు నీవు నన్ను ఎందుకు రక్షించినావు?”
మాధవుడు నవ్వినాడు.. ప్రణాళుని చూసి. “హింసను వ్యతిరేకించడం; ఆపదలో ఉన్న వారిని కాపాడటం మా బౌద్ధులకు సహజ గుణాలు. నీవు ఇప్పుడున్నది మా ఆరామంలోనే” ప్రశాంతంగా బదులిచ్చినాడు మాధవుడు. ప్రణాళునికి కొంచెం అర్థం అయినట్లు, కానట్లూ అనిపిస్తున్నది. పూర్తిగా ఓపిక రాలేదు. మళ్లీ కళ్లు మూసుకున్నాడు. తృప్తిగా చిరునవ్వు నవ్వినాడు మాధవుడు.
“రోహా! నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని ఎంతో ఆశతో వచ్చిన నన్ను నీ భటులతో కొట్టించాలని చూస్తావా? నేను… స్వస్వరూపంలో రాలేక, ఇట్లా వార్తాహరుని లాగా వచ్చిన నీ భర్తను… జయసేను…” అతని మాట పూర్తికాకుండానే భటులు అతణ్ని చుట్టుముట్టినారు. జయసేనుడు మెరుపు వేగంతో కత్తి దూసి, క్షణాల్లో అందరినీ నిరాయుధులను చేసి, అంతే వేగంతో అవలీలగా ప్రాకారం దాటి, బయట సిద్ధంగా ఉన్న తన శ్వేతాశ్వాన్ని ఎక్కి… ఎవరూ అందుకోలేనంత వేగంగా అక్కడి నుంచి మాయమైనాడు. కొన్ని క్షణాల్లో జరిగిన పరిణామాలు… ఏం జరుగుతున్నదో గ్రహించే లోపునే అంతా జరిగిపోయింది. రోహా మ్రాన్పడిపోయింది. ఈ అలజడికి అంతఃపురం నుండి బయటికి వచ్చింది సీహ. కన్నీళ్ల పర్యంతమైన అక్కను అక్కున చేర్చుకొని, ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేసింది. జరిగిందంతా క్లుప్తంగా చెప్పింది రోహ. “ఇంతకూ ఆ వచ్చింది ఎవరు?” ఆశ్చర్యపడుతూ అడిగింది సీహ. “మీ బావ!” నిర్వేదంగా అన్నది రోహ. “అవునా!!! మరి ఆ వృద్ధుడు???” అతని రూపంలో వచ్చినవాడే జయసేనుడు…” కళ్లనిండా నీళ్లతో రోహ. ఉత్సాహం, విస్మయం, అపనమ్మకం, ఆశ్చర్యం.. సీహా మనసును ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా.. అర్థం కానట్లు మొహం పెట్టి..
“వివరంగా చెప్పక్కా! నాకు అంతా అయోమయంగా ఉన్నది” అన్నది. “ఇంకా చెప్పడానికి ఏం మిగిలిందే? కాళ్ల దాకా వచ్చిన అవకాశాన్ని అజ్ఞానంతో కాలదన్నుకున్నాను. ఆ వార్తాహరుని రూపంలో వచ్చింది మీ బావేనే. నేను గుర్తించక తొందరపడి భటులను ఉసిగొల్పినాను”
నిర్జీవమైన గొంతుతో అన్నది రోహ.
“అయ్యో పాపం! ఆయనకు దెబ్బలు ఏమైనా
తగిలినాయా?” ఆందోళనగా అడిగింది సీహ.
“ఉహూఁ… ఆయన ఇటువంటి చవటలను వేయి మందినైనా నిలువరించ గలిగేటట్లున్నాడు. క్షణాల్లో వీళ్ల ఆయుధాలు అన్నీ ఎగురగొట్టి, అలవోకగా అదృశ్యమైనాడు” ఒకింత బాధ, అంతకు మించిన గర్వం తొంగిచూసినాయి రోహ గొంతులో. “ఈ సమయంలో నేనున్నా బాగుండేది. బావను కనిపెట్టి యుక్తాయుక్తంగా ప్రవర్తించేదాన్ని. ఎంత పనిచేసినావక్కా! ఇంతదాకా బావను కలవరించినావు. తీరా దగ్గరికి వస్తే గుర్తించలేక మంచి అవకాశం చేజార్చుకున్నావు” నొచ్చుకున్నది సీహ. ‘నేను ఆయనను చూసి చూడక ముందే, మాట్లాడీ ఆడక ముందే మనసును ఇంతటి గాయాలపాలు చేస్తున్న ఆ దైవం మమ్మల్ని ఏం చేయ దలచుకున్నాడో కదా!?”… అని మనసులో బాధపడుతూ.. “సీహా! ప్రతిసారీ ఇట్లాగే అవుతున్నది. ఎందుకంటావు?” అన్నది దిగులుగా. “నిరాశపడకక్కా! మరొక మూడు రోజులు ఓపిక పడితే పంచమి. అప్పుడు పగలూ రేయీ… నీకు బావ; బావకు నీవు. ఇక మీరున్న లోకంలోకి గాలి కూడా చొరబడే సాహసం చేయదు” నవ్వుతూ అన్నది సీహ. “ఏమోనే… నాకా యోగం ఉందో లేదో అని భయం కలుగుతున్నది…” శూన్యంలోకి చూస్తూ అన్నది రోహ. “అంత నిరాశ పనికిరాదు అక్కా! నేను చెప్తున్నాను కదా. అన్నీ నీవు అనుకున్నట్లే జరుగుతాయి. నా మాట అబద్ధం కాదు. ఆరోజు జలపాతం వద్దకు వెళుతున్నప్పుడు కూడా నీకు ఇష్టమైన వారిని కలుస్తామన్నాను. కలిసినాము. ఈరోజు కూడా నేను చెప్పినట్లే బావగారు వచ్చినారు కదా!” అన్నది సీహ.
రోహకు అర్థం కాలేదు. ‘ఇంతకూ సీహ ఏమన్నది? నేను అనుకున్నట్లు ఆయనను కలుసుకోవడం ఎప్పటికీ సాధ్యం కాదనా? లేక కలగంటున్నట్లు ఎప్పటికీ ఆయనతో కలిసే ఉంటాననా?’ మనసు నిండిన సందేహాలతో, చెల్లితో కలిసి మౌనంగా అంతఃపురంలోకి నడిచింది రోహ. కానీ, ఆమె మనసు జయసేనుని కలిసిన పరిసరాలను వదిలి ముందుకు సాగడానికి ఇష్టపడలేదు. ఒకసారి వెనుకకు తిరిగి తదేకంగా చూసింది… నీవు గదిలినట్టి నేల భాగ్యము చూడు నవ్వుచున్న దంత దవ్వు నుండి నిన్ను గనగ లేని నెమ్మనంబును చూడు కుందుచున్న దెంత కురుచ నగుచు. (నీవు కదలాడిన నేల ఎంత అదృష్టవంతురాలు. అంతదూరం నుంచి కూడా సంతోషంగా నవ్వుతున్నది. నిన్ను చూడలేకపోయిన అమాయకమైన నా మనసు కుంగిపోతూ బాధపడిపోతున్నది…) అనుకున్నది దిగులుగా.
జయసేనుడు మెరుపు వేగంతో కత్తి దూసి, క్షణాల్లో అందరినీ నిరాయుధులను చేసి, అంతే వేగంతో అవలీలగా ప్రాకారం దాటి, బయట సిద్ధంగా ఉన్న తన శ్వేతాశ్వాన్ని ఎక్కి… ఎవరూఅందుకోలేనంత వేగంగా అక్కడి నుంచి మాయమైనాడు. కొన్ని క్షణాల్లో జరిగిన పరిణామాలు… ఏం జరుగుతున్నదో గ్రహించే లోపునే అంతా జరిగిపోయింది.