జరిగిన కథ
రోహా సీహాలు ఒక బాటసారిని రక్షించే ప్రయత్నంలో ఉంటారు. సిరిసత్తి కోడల్ని కాపురానికి తెచ్చుకోవడానికి తాను వస్తున్న సమాచారం కువిందునితో పంపుతుంది. అతణ్ని ఎవరో అడ్డుకుంటారు. తర్వాత…
అనయము ప్రేమ సీమల విహారము సేయుచు నుండు వాని జీ వన మొక చిత్రమైన వనవాటిక; అందలి పువ్వులన్నియున్ గన నొక తీరు దోచుచును కమ్మని సౌరభ మందనాకృతీ ప్రణయముగాగ నందుగల రంగులవెల్ల లయించు ప్రేమలో… (ఎల్లప్పుడూ ప్రేమ సీమల్లో విహారం చేస్తుండే వారి జీవితం ఒక విచిత్రమైన వనవాటిక. అందులోని పువ్వులన్నీ ఒకే తీరుగా అనిపిస్తాయి. ఆ పువ్వుల్లోని కమ్మని పరిమళమే ప్రణయం! అంటే ప్రేమ. ఆ పువ్వుల రంగులన్నీ ఆ ప్రేమలో లయిస్తాయి)
“మిత్రమా! ప్రేమ మత్తులో నీవు హత్యలు చేయడానికైనా వెనుకాడవు కదా!” ఆందోళన నటిస్తూ అన్నాడు వామదేవుడు. “సుమశరుని బాణాలతో గాయాలపాలై ఉన్నాను. నన్ను మరింత క్షోభ పెట్టకు మిత్రమా! నేను అంత దుర్మార్గుడిని కాను. అయినా మా ఇంటి నమ్మినబంటు కువిందుడిని నేను కడతేరుస్తానా…” నొచ్చుకున్నాడు జయసేనుడు.. స్పృహ కోల్పోయిన కువిందుని జాలిగా చూస్తూ. “ఏమో! తగలరాని చోటున తగిలితే ఈ పాటికి కువిందుడు స్వర్గంలో రంభతో సరసాల్లో మునిగి ఉండేవాడు కదా…” స్నేహితుని క్రీగంట చూసినాడు. “నేను నియతానియత యుద్ధనిపుణుడను. ఏ దెబ్బ ఎక్కడ కొట్టాలో తెలిసే కొట్టినాను. మరో ఎనిమిది
గడియల దాకా కువిందుడు లేవలేడు. ఈలోపు మనం మల్లికాపురి చేరుకోవాలి…” జయసేనుని మాట పూర్తి కాలేదు. “మనమా..? నీవు ఒక్కడివే వెళ్లాలి కదా! ఇద్దరమూ వెళ్తే కువిందుని గతి?… అతడు లేచి ఏమైనా చేయవచ్చు. అయినా వార్తాహరుడు ఒక్కడే వెళ్తాడు కదా! ఈ జంట వార్తాహరుల కథ ఏమని మీ మామగారు తీగ లాగితే…” వాస్తవాలను గుర్తు చేసినాడు వామదేవుడు.“ఈ సంగతి అంతా నాకు ముందే చెప్పలేదు ఎందుకు??” ఆలోచిస్తూ అన్నాడు జయసేనుడు.
“మన ఆలోచన అనుకున్నట్లుగా పూర్తి కాకపోతే మార్చుకోక తప్పదు కదా! కువిందుడిని నీవు ఇంత దారుణంగా కొడతావని నేను ఊహించినానా? ఇతణ్ని, మనం చేస్తున్న ఈ రహస్య ప్రయత్నాన్ని కాపాడుకోవాలంటే.. నేను ఇక్కడ ఉండక తప్పదు. నేను నీకు మల్లికాపురి దాకానైనా తోడుగా వచ్చేవాడిని. అయినా భార్యాభర్తల నడుమ నేనెందుకు? నీవు ఒక్కడివి వెళ్లడమే సబబు..” తప్పదన్నట్లు అన్నాడు వామదేవుడు.
ఆలోచనలో పడ్డాడు జయదేవుడు. “నీవు ఎంత ఆలోచిస్తే అంత సమయం కోల్పోవడం తప్ప మరొక ప్రయోజనం ఉండదు. అగుడువడ్డట్టు ఆలోచన లేకుండా ఇదే రూపంలో వెళితే భంగపాటు కూడా తప్పదు మిత్రమా! ఇప్పుడు నీవొక యాభైయ్యేళ్లు పైబడ్డ వార్తాహరుడవు. దారిలో ఏ గొర్రెల కాపరి వద్దనైనా కొంచెం ఉన్ని తీసుకొని మేడిపాలతో మీసాలు-గడ్డాలు అతికించుకో. నీ ప్రవర్తన కూడా కువిందుడిలా ఉండాలి. అప్రమత్తంగా ప్రవర్తించు. వెళ్లు…” తొందర పెడుతున్నట్లు అన్నాడు వామదేవుడు. హితుని సూచన పాటించడం తప్ప మరో గతికూడా కనిపించలేదు జయసేనునికి.
* * *
అడవిలో పాడుబడ్డ బావిలో ఉన్న అపరిచితుణ్ని అతికష్టం మీద బయటకు తీసినారు నలుగురు కలిసి. అతణ్ని చూసి ఉలిక్కిపడ్డారు రోహా-సీహ. అతని ఒంటినిండా గాయాలు ఉన్నాయి. ముఖం మీద రక్తం అలుముకొని గడ్డకట్టుకునిపోయి.. గుర్తించడానికి వీలులేకుండా తయారైంది. అతనికి కొంత సేవచేసి ఆ సన్యాసికి అప్పగించి వెళ్లాలని అనుకున్నారు వాళ్లు. కానీ, కుహిలుడు తొందర పెట్టడంతో బయలుదేరక తప్పలేదు. సూర్యాస్తమయ సమయం… పడమటి కొండలు సూర్యుని రాకకొరకు ఎర్రని లత్తుకను అలంకరించుకుంటున్నాయి. మరోపక్క నక్షత్రాలు ముసుగు తీసి తమ రేరాజును దర్శించుకునేందుకు తహతహలాడుతున్నాయి. రథం ఒక సరోవరం పక్కనుండి వెళుతున్నది. సీహ దృష్టి ఆ సరోవరం మీద నిలిచింది. పరవశంగా అటే చూస్తున్న చెల్లిని.. ‘ఏమి సంగతి?’ అన్నట్లు మోచేతితో పొడిచింది రోహా. అక్క వైపు తిరగకుండానే సీహ ఆ దృశ్యాన్ని పరవశించి చూస్తూ ఇట్లా అన్నది…
కమలహితుని బాసి కదలని కమలముల్ రమ్యమైన ఆ మరాళ మొకటి కదలకుండ యుంట గగనము బోర్లించి నట్లు దోచె నక్క! అదిగొ చూడు! నిజమే. ఎంత సుందర దృశ్యం! తమ ప్రియుడిని ఎడబాసి ఉండటం తలుచుకొని కదలక మెదలక ఉన్న పద్మాలు; వాటి మధ్యలో ఏదో తపోనిష్ఠలో ముడుచుకొని కదలకుండా ఉన్న హంస… ఆకాశాన్ని నేల మీద బోర్లించినట్లు ఉన్నది. పువ్వులన్నీ చుక్కలుగా, హంస చందమామలా ముద్దుగొలుపుతున్నది. గతంలో ఒకసారి వింధ్య పరిసరాల్లో విహరిస్తున్నప్పుడు వెన్నెలలో తడిసి ముద్ద అవుతున్న ఆ వింధ్యుణ్ని చూసినప్పుడు కూడా చెల్లి ఇలాగే చమత్కరించింది.
‘తెల్లగా మెరిసిపోతున్న వింధ్యుడు… పాలసముద్రాన్ని చిలుకుతున్న వేళ ఆ తుంపర్లతో తడుస్తున్న విష్ణుమూర్తిలా ఉన్నాడు కదా!’… అని అంది. అది తలుచుకోగానే నవ్వు వచ్చింది రోహకు. “ఎందుకు నవ్వుతున్నావ్?” అంది సీహ. “నువ్వు గొప్ప కవయిత్రివి అవుతావే. ఎంత తీయని కల్పన చేసినావు!” మెచ్చుకోలుగా చెల్లిని చూసింది. “అక్కా! నిన్ను చూసినా, ప్రకృతిని చూసినా కవిత్వం దానంత అదే తన్నుకొస్తుంది. అట్లా రాకపోతే వాళ్లలో భావుకత లేనట్లే. సీహ మాట పూర్తి కాలేదు. అప్పుడు ఠక్కున గుర్తుకొచ్చింది రోహకు.
“మీ బావ నిజంగా నన్ను చూసి ఉంటాడంటావా?” అని అడిగింది అమాయకంగా. “అయ్యో అక్కా! మళ్లీ మొదటికి వచ్చినావా? ఇంతవరకు ‘నాకోసం వస్తాడా’ అని అడిగే దానివి. ఇప్పుడు మరీ విచిత్రంగా ‘నన్ను చూసినాడా?’ అంటున్నావు. పిచ్చి కుదిరింది.. తలకు రోకలి చుట్టుమన్నట్లున్నది నీ వ్యవహారం. అసలు నిన్ను అక్కడనే అడవిలో వదిలేసి రావలసింది. ఇప్పుడు అర్థమైంది కదా.. రేపు ఆ జలపాతం దగ్గరే వదిలేసి వస్తాను. అలనాడు లక్ష్మణుడు సీతమ్మను వదిలి వచ్చినట్లు…” కోపం నటించింది సీహ.“ఎందుకు చెల్లీ, అట్లా విసుక్కుంటావు? నా బాధైనా, సంతోషమైనా పంచుకునేది నీతోనే కదనే!” అట్లా అంటుంటే రోహ కళ్లల్లో గిర్రున నీళ్లు తిరిగినాయి. అది చూడలేని సీహా.. అక్కను అక్కున చేర్చుకున్నది. ఆపై ఒడిలో పడుకోబెట్టుకున్నది.
“అక్కా! నీ మీదనే కదా నేను అలిగినా, ఆకతాయితనం చేసినా. రేపు నువ్వు వెళ్లిపోతే…” ఆ మాట తలచుకోగానే జలజలా కన్నీళ్లు రాలినాయి. “అయితే, ఆయన రేపు వస్తాడంటావా?” అదే అమాయకత్వం రోహ మాటలో, మనసులో, కళ్లలో… గట్టిగా ముద్దు పెట్టుకున్నది సీహ. మాటల్లో పడి ఇంటిదాకా వచ్చిన సంగతి మరిచిపోయినారు. రథం ఇంటి ముందు ఆగగానే అక్కడ సిద్ధంగా ఉన్న పరిచారకుడు.. ‘రథాన్ని వెనుక వైపు తీసుకునిపోయి అక్కడ ఆపమన్నారని, చిన్నమ్మ గార్ల నిద్దరినీ వెనుక నుంచే ఇంట్లోకి ప్రవేశింపజేయమని సమాచారం ఇవ్వమన్నా’రని కుహిలుడితో చెప్పినాడు. సోదరీమణులు ఇద్దరూ కనులతోనే ప్రశ్నించుకున్నారు. ఇద్దరికీ ఏ సమాధానం దొరికినట్లు లేదు. ఇంటి లోనికి వెళ్లిన మీదట తెలిసింది. పోదన నగరం నుండి.. అంటే రోహ అత్తగారి ఇంటి నుండి వార్తాహరుడు వచ్చినాడని. ఆ వార్త వినగానే అక్కాచెల్లెళ్ల ఆనందానికి అంతులేదు. రోహ చెల్లిని ముద్దులతో ముంచెత్తింది. “ఏం మనిషో… మహా ఘటికునిలా ఉన్నాడు. ఆరు గడియల పొద్దుండగా వచ్చినాడు. ‘అమ్మగారు రోహమ్మ గారిని చూసి మాట్లాడి రమ్మన్నారు. ఆలస్యమైనా ఆ పని పూర్తిచేసుకునే వెళతాను. అంతదాకా భోజనం కూడా చేయను!’ అని మొండి పట్టుపట్టి కూర్చున్నాడు” అంటూ ఆ వచ్చినవాని సంగతి వివరించింది రోహతల్లి రాయ హత్థి.
ఆ మాటలు విన్న మీదట వచ్చినవాడు భర్త కాదని కొంత నిరుత్సాహం కలిగినా, భర్త కుటుంబానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలిసినవాడు; పైగా నేను వచ్చేదాకా నాతో మాట్లాడటం కోసం ఎదురు చూస్తున్నాడు. గుడ్డి కన్నా మెల్ల మిన్న అన్నట్లు సరిపెట్టుకొని, నెమ్మదిగా తయారు కాసాగింది రోహ. సీహ కూడా తనమాట సగమే నిజమైందన్న అసంతృప్తితో అన్యమనస్కంగానే రోహ తయారవుతుంటే సహకరించ సాగింది.
మరొకపక్క అతిథి గృహంలో కువిందుని రూపంలో ఉన్న జయసేనునికి రాచమర్యాదలు లభిస్తున్నాయి. అయినా తను వచ్చిన లక్ష్యం నెరవేరకుండా అతనికి ఏవీ రుచించడం లేదు. ఎంతో ఆశతో రోహను చూడాలని వస్తే, సరిగ్గా తాను వచ్చిన సమయానికి ఆమె ఇంట లేకపోవడం అతణ్ని చాలా నిరుత్సాహపరిచింది. ‘అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈపాటికి తిరుగు ప్రయాణం కూడా సగం పూర్తయ్యేది. అక్కడ వామదేవుని పరిస్థితి ఎట్లా ఉన్నదో… కువిందుడు స్పృహలోకి వచ్చి ఉంటాడు. రోహ ఇంటికి వచ్చిన సంగతి తెలిసింది. కలవడానికి ఇంకా ఎంత సమయం పడుతుందో…’ ఆలోచనలో కొట్టుకుంటుండగానే పరిచారిక ఒకరు.. “చిన్న రాణి గారు పిలుస్తున్నారు” అని చెప్పింది. పరిచారిక మాటలు చెవుల్లో అమృతం పోసినట్లు అనిపించి ఆమెను అనుసరించినాడు కువిందుని వేషంలో ఉన్న జయసేనుడు. భవనం ప్రాంగణంలోని ఉద్యానవనంలో… ఒక పోక చెట్టును ఆనుకొని అటువైపు తిరిగి ఉన్నది రోహ. ఆమె ఒక్కతే ఉన్నది. “చిన్న రాణి గారికి వందనం!” ఆమెను చూడాలన్న కుతూహలాన్ని అంతరంగంలోనే సమాధి చేస్తూ, తనను తాను నిగ్రహించుకుంటూ అన్నాడు జయసేనుడు.
“వార్తాహరులకు మాతో పని ఏమి? నీవు వచ్చిన కార్యము పూర్తి అయినా ఇక్కడనే ఉండటానికి కారణమేమి?” అతనితో మాట్లాడాలని ఉన్నా, కుటుంబ గౌరవానికి తగ్గకుండా ఒక సేవకునితో మాట్లాడే ధోరణిలో ముభావంగా అన్నది రోహ. తనతో మాట్లాడటం ఆమెకు ఎంతమాత్రం ఇష్టం లేదన్న భావం ఆ మాటల్లో స్పష్టమయ్యింది. అది జయసేనుని తీవ్ర నిరాశకు గురిచేసింది. అయినా కార్యసాధకుడు ఇటువంటి విఘ్నాలకు చలించకుండా కడదాకా ప్రయత్నం చేయాలన్న సత్యాన్ని గుర్తు తెచ్చుకొని ఆమెతో సంభాషించడం మొదలుపెట్టినాడు.
“ఇంతదూరం వచ్చి నిన్ను చూడకుండా వెళ్లడం ఎట్లా సాధ్యమవుతుంది రాణీ!” అన్నాడు తన వేషం సంగతి మరచిపోయి. ఆ సంబోధనకు ఉలిక్కిపడింది రోహ. అది ఆమెకు ఆగ్రహం కూడా తెప్పించింది. వెంటనే…“ఏమి నీ అమర్యాద ప్రసంగం?” అంటూ గిరుక్కున వెనుకకు తిరిగింది. ఏ సౌందర్యాన్ని ఆరాధిస్తూ, అన్వేషిస్తూ తాను ఇంత దూరం సాహసం చేసి వచ్చినాడో.. ఆ అందం మునుపటి కంటే వెయ్యిరెట్లు అధికమై సాక్షాత్కరించింది అతనికి. ఆనాడు జలపాతం వద్ద కనిపించిన సౌందర్యం మనోహరం! ఇప్పుడు… సాలంకార భరిత అద్భుతానంద నందనం!! పరవశంతో రెప్పవాల్చకుండా చూస్తూ ఉండిపోయినాడు జయసేనుడు. అది ఆమెకు చిరాకు తెప్పించింది. ఆ అమర్యాద సహించలేక పోయింది. “ఎవరక్కడ?” బిగ్గరగా అరిచింది. ఆ పిలుపుతో అప్రమత్తమైన సాయుధపానులైన పాణులు పదిమంది పరుగెత్తుకొని జయసేనుని వైపు దూసుకుని రాసాగినారు…