మహారాష్ట్ర సరిహద్దులో మహా నినాదం! గోదావరికి ఇవతల సస్యశ్యామలం. అవతల బీడువారిన పొలాలు. ఒకటి తెలంగాణ. ఇంకోటి మహారాష్ట్ర. సాగు, సంక్షేమంతో సుభిక్షంగా వర్ధిల్లుతున్న తెలంగాణలోతమ ఊర్లనూ కలుపుకోవాలన్న బలమైన డిమాండ్ అక్కడ రోజురోజుకూ బలపడుతున్నది.
మూడేండ్ల క్రితం.. మహారాష్ట్ర ప్రజలు సరిహద్దు దాటి తెలంగాణలోకి వచ్చి ఆందోళన చేశారు. ఆ ఆందోళన తెలంగాణకు వ్యతిరేకంగా కాదు. సొంత రాష్ట్రంపైనే తిరుగుబాటు. నాందేడ్‌లో నలిగిపోతున్నామనీ.. నాగలి కట్టి వ్యవసాయం చేయలేకపోతున్నామనీ.. తమను తెలంగాణలో కలిపేస్తే సంతోషంగా ఏరువాక చేసుకుంటామని మొరపెట్టుకున్నారు. ఆ డిమాండ్ ఊరూరా వ్యాపించి ఉద్యమం లేపింది.
బెల్లూర్ కథ..
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ తాలుకా బెల్లూర్ గ్రామం. ఆ ఊరు దాటితే గోదావరి నది. గోదావరిని దాటితే, తెలంగాణలోని కందకుర్తి గ్రామం. గోదావరికి ఇవతల ఏడాది పొడవునా పచ్చని పైర్లతో పరుచుకొని ఉంటుంది. అవతలి వైపు వ్యవసాయ భూములు యాసంగి కాలంలో బీడుగా కనిపిస్తాయి. పక్కనే గోదావరి పారుతున్నా ఆ నీటిని ఎత్తిపోసుకునే సదుపాయం లేదు. మోటార్లు బిగించుకునైనా సరే పొలాల్లోకి నీళ్లు మళ్లించుకుందామంటే కరెంట్ లేదు. గోదావరికి ఇవతలి వైపున తెలంగాణలో సుమారుగా 23 ఎత్తిపోతల పథకాలు చేపట్టింది తెలంగాణ సర్కార్. వానాకాలం, యాసంగి అనే తేడా లేకుండా ఏడాది పొడవునా నీరు పారుతున్నది. బెల్లూర్లోని 1,500 మందికి వ్యవసాయమే జీవనాధారం. చుట్టూ 5 వేల ఎకరాల భూములున్నాయి. కానీ రెండు పంటలూ వేయలేని పరిస్థితి. వానాకాలం పంట మాత్రమే తీస్తారు. అది కూడా.. పత్తి, శనగ, కందులు, సోయాబీన్. యాసంగిలో సాగు చేయాలంటే గుండెలో దడ. నీళ్ల పారకం లేని భూమిలో పంటలు వేసి నష్టాలు చూడలేక వెనుకడుగు వేస్తుంటారు. ఇదొక్క బెల్లూర్ కథనే కాదు. నాయగావ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజలందరి అనుభవం కూడా. నిజామాబాద్ జిల్లాతో దగ్గరి సంబంధాలు కలిగి ఉన్న నాయగావ్ నియోజకవర్గంలోని చాలా గ్రామాల ప్రజలు తెలంగాణలో కలవడానికి ఆసక్తి చూపుతున్నారు. మరాఠా బంధాన్ని తెంచుకునేందుకు సిద్ధపడుతున్నారు.
2019లో ఒక సమావేశం
నాందేడ్ జిల్లాలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటన్నిటినీ తెలంగాణలో విలీనం చేయడానికి అక్కడి ప్రజలు, నాయకులు ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి తమ ఆకాంక్షనూ తెలియజేశారు. ఈ మేరకు సెప్టెంబర్ 18, 2019న ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో నాయగావ్, భోకర్, దెగ్లూర్, కిన్వత్, హత్గావ్ అసెంబ్లీ నియోజకవర్గాల రైతులు, ప్రజలు పాల్గొని తెలంగాణలో కలిసేందుకు ఆసక్తి ఉన్నట్లు ముక్తకంఠంతో వివరించారు. బాబ్లీ సర్పంచ్ బాబురావు నేతృత్వంలో కేసీఆర్‌ను కలిశారు. 2019 ఎన్నికల్లో ధర్మాబాద్‌లో టీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు.
వ్యవసాయమే ప్రధాన ఆకర్షణ
తెలంగాణ అవతరణ తర్వాత రాష్ట్రంలో సేద్యం పండగలా మారింది. వ్యవసాయ, సంక్షేమ పథకాలు రైతుకు చింత లేకుండా చేస్తున్నాయి. సర్కారు పెట్టుబడి సాయంగా ఎకరానికి రూ.10వేలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నది. మహారాష్ట్ర ప్రజలను ఆకట్టుకుంటున్నది ఈ పథకమే. వాస్తవానికి మహారాష్ట్రలో రైతన్నది దయనీయ పరిస్థితి. పంట వేసినప్పటి నుంచి చేతికొచ్చే వరకు ప్రతీ దశలో దళారులదే రాజ్యం. రైతుకు లాభం చేకూరడం లేదు. కానీ, మన దగ్గర ప్రభుత్వమే నేరుగా పెట్టుబడి సాయం అందజేస్తుంది. ప్రమాదవశాత్తు రైతు చనిపోతే, బీమా రూపంలో కుటుంబానికి రూ. 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నది. తెలంగాణలో ఉన్నట్టే.. 24గంటల ఉచిత కరెంటు, నిరంతర సాగునీటి సౌలభ్యం తమకూ కావాలని కోరుకుంటున్నారు నాందేడ్ ప్రజలు. ఏ ఊర్లో చూసినా ఇదే చర్చ. నాయగావ్, దెగ్లూర్ నియోజవర్గాల్లోని రైతులు కూడా తెలంగాణ సంక్షేమం పట్ల ఆకర్షితులవుతున్నారు. ఈ గిరిజన గ్రామాలు జిల్లా కేంద్రం నాందేడ్‌కు 300 కి.మీ దూరంలో ఉన్నాయి. జిల్లా కేంద్రం నుంచి ముంబై మహానగరం 500 కిలోమీటర్లు. అదే హైదరాబాద్ అయితే 300 కిలోమీటర్లే. కాబట్టి, తెలంగాణలో విలీనమే పరిష్కారమని అనుకుంటున్నారు ప్రజలు. ప్రజలకు పాలకుడు, రాజధాని చేరువలో ఉండాలని చెబుతాడు చాణక్యుడు. నాందేడ్ ప్రజల ఆకాంక్ష కూడా ఇదే.
మంచిగా చేస్తున్నారు
మా చుట్టాలంతా తెలంగాణలోనే ఉంటారు. మేం నిత్యం ఏదో ఒక పనిమీద తెలంగాణకు వస్తూనే ఉంటాం. రైతాంగాన్ని బతికించేందుకు కేసీఆర్ సారు చేస్తున్న కృషిని చూసి, మేం కూడా తెలంగాణలో కలిస్తే బాగుంటుందని అనిపిస్తున్నది.