చెట్లు మోడుల్లా మారడానికి, ఒళ్లు భగ్గున మండటానికి గల కారణాలను ఇన్స్పెక్టర్ రుద్ర వివరించడంతో అందరూ ఊపిరి పీల్చుకొన్నారు. ఇంతలో హెడ్‌కానిస్టేబుల్ రామస్వామి కలుగజేసుకొంటూ.. ‘సర్.. మీరు చెప్పినట్టు వశీకరణం, మంత్రాలు లేవని అనుకొందాం. అయితే, మనం కారులో అప్పుడే మాట్లాడుకొన్న మాటలు ఆ నల్లమల వనరాచికి ఎలా తెలిశాయ్. తాటాకుపై రక్తాక్షరాల మర్మమేంటీ?’ అని అడగడంతో అందరూ ఒకరిముఖాలు ఒకరు చూసుకొన్నారు.
రామస్వామి ప్రశ్న పూర్తయ్యిందో లేదో.. దూరం నుంచి మరో తాటాకు పత్రం కొట్టుకొచ్చి రుద్ర ముందు పడింది. దాన్ని చేతిలోకి తీసుకొన్న రుద్ర చదవడం ప్రారంభించాడు. ‘రామస్వామి నీకున్న బుర్ర మీ సారుకు లేదని కచ్చితంగా తెలుస్తుంది. లేకపోతే, నా మంత్రశక్తులను కూడా సైన్స్ సూత్రాలకు అన్వయిస్తాడా? ఏదో అర్భకులు అని వదిలేస్తున్నా. ఇప్పటికైనా మీరందరూ వెనక్కి వెళ్లలేదో.. నిజంగానే అందర్నీ అమాంతం మింగేస్తా..’ అంటూ ఆ తాటాకు పత్రంలో రాసి ఉంది. దాన్ని రుద్ర చదవగానే.. రామస్వామి మళ్లీ కెవ్వుమన్నాడు. ‘సార్.. మనం ఇలాగే ఇక్కడే ఉంటే, ఆ వనరాచి అమాంతం మింగేయడం ఖాయం. వెనక్కి వెళ్లిపోదాం సార్’ అంటూ ప్రాధేయపడ్డాడు. ఇంతలో జయ కలుగజేసుకొంటూ.. ‘ఒరేయ్ రుద్ర.. ఈ వనరాచి గురించి నాకు మొదట్లో కొంత సందేహం ఉండే. కానీ, ఇక్కడ జరుగుతున్నవన్నీ అనుమానించదగినట్టే ఉన్నాయ్’ అని జయ అనగానే.. ‘అసలు మీకు వనరాచిపై వచ్చిన ఆ సందేహం ఏంటీ?’ అని అడిగాడు రుద్ర. ‘చెప్తానురా.. అసలు వనరాచి నిజంగా దుష్టాత్మ అయితే, చడీచప్పుడు కాకుండా మనల్ని అమాంతం మింగేయవచ్చు కదా! అలాకాకుండా ఏదో మనకు మేలు చేస్తున్నట్టు.. తాటాకు అక్షరాల్లో ‘నా మంత్ర వశీకరణ శక్తి’ చూస్తారా? అని ఒకసారి, అర్బకులని చంపేయకుండా వదిలిపెడుతున్నా’నని మరోసారి చెప్పడమేంటీ? నిజానికి దెయ్యాలు ఇలా కూడా ఆఫర్లు ఇస్తాయా?’ అంటూ జయ అనగానే.. ‘ఎగ్జాక్ట్‌గా నా డౌట్ కూడా అదే ఆంటీ.. ఇక్కడ ఏదో జరుగుతుంది. దాన్ని మనం కనిపెట్టాలి’ అంటూ మెరుస్తున్న కండ్లతో రుద్ర అంటుండగానే.. మరో తాటాకు పత్రం ముందుకొచ్చి పడింది.
‘ఏయ్ జయ.. నువ్వు ఇంకా పెద్ద మూర్ఖురాలిగా ఉన్నావేంటే?? అసలు మిమ్మల్ని చంపడానికి నాకు సెకను చాలు. ఏదో బతికిపోతారని హెచ్చరిస్తే.. నా శక్తినే శంకిస్తారా? ఇప్పుడు చూడండి. నా శక్తి ఏంటో..’ అంటూ రక్తాక్షరాలు రాసిన తాటాకు పత్రంలో హెచ్చరించింది వనరాచి. కాసేపటికే ఎక్కడినుంచో వచ్చిన ఓ బాణం శరత్ గుండెల్లో గుచ్చుకొంది. రుద్ర అంటూ గట్టిగా అరుస్తూ శరత్ కిందపడిపోయాడు. కంగారుగా అందరూ శరత్ దగ్గరికి పరిగెత్తుకొచ్చారు. ‘రుద్ర.. ఇది దుష్టశక్తి విడిచిన మంత్రించిన బాణం. ఇంతకు ముందు కూడా ఓసారి నాకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. దీనికి విరుగుడు ఆ గరళకంఠుడి తలమీద నాట్యమాడే గంగమ్మేనని తండాలోని పెద్ద దొర ఓసారి చెప్పారు. త్వరగా వెళ్లి కారులోంచి నీళ్లు తీసుకొచ్చి బాణం తగిలిన ఈ గాయంపై పొయ్యి.. ఆలస్యమైతే, మంత్ర బలమంతా విషంగా మారి నేను చనిపోతా..’ అని అనగానే.. శరత్ చెప్తున్న విషయాన్ని నమ్మకపోయినప్పటికీ పరిగెత్తాడు రుద్ర. కారులో ఉన్న నీళ్ల బాటిల్‌ను శరత్ దగ్గరకు తీసుకొచ్చి ఓపెన్ చేశాడు. ఒక్కసారిగా నీళ్ల నుంచి మంటలు రావడం ప్రారంభమయ్యాయి. దీన్ని చూసిన అక్కడున్న వారంతా ఒక్కసారిగా భయపడి దూరంగా పరిగెత్తారు. ఆ హఠాత్పరిణామానికి రుద్రకు ఏంచేయాలో తోచలేదు. వెంటనే తేరుకొన్న జయ కారులోంచి మరో బాటిల్‌ను తీసుకొచ్చింది. దాన్ని తెరవగానే.. అదులోంచి కూడా పెద్దయెత్తున మంటలు రావడం ప్రారంభమయ్యాయి. అసలేం జరుగుతుందో ఎవ్వరికీ అర్థంకావడంలేదు. ఇంతలో కంగారుపడుతూ శివుడు ‘సార్.. ఇక్కడికి దగ్గరలోనే ఓ చెరువు ఉంది. అక్కడి నుంచి నీళ్లు తీసుకొస్తా’ అని అన్నాడు. తాము కూడా వస్తామని స్నేహిల్, రామస్వామి అతని వెంట వెళ్లారు. పది నిమిషాలు కాగానే.. ముగ్గురూ భయపడుతూ.. ‘సార్.. సార్.. చెరువులోని నీళ్లన్నీ అగ్నిపర్వతం పేలినట్టు జ్వాలగా మారి మా మీదకు ఉరికొచ్చాయి. భయంతో పరిగెత్తుకొచ్చాం’ అంటూ భయపడుతూ కిందపడిపోయారు రామస్వామి, శివుడు. చేతిలో తాటాకు ప్రతిని పట్టుకొని అప్పటికే నిర్ఘాంతపోయిన రుద్రను చూసి షాక్ అవుతూనే.. ఆ ప్రతిని చదవడం ప్రారంభించాడు స్నేహిల్.
‘ఏయ్ రుద్ర. నీళ్లను తీసుకురావడానికి వెళ్లిన ఆ శివుడు, రామస్వామి, స్నేహిల్‌కు ఆ చెరువు ఉగ్రస్వరూపం ఏంటో తెలిసొస్తుంది. పదంటే, పది నిమిషాల్లోనే వాళ్లు భయంతో పరిగెత్తుకొచ్చి నీ దగ్గర పడతారు చూడూ.. ఎందుకంటే అది చెరువు కాదురా.. నా జ్వాలా తటాకం’ అంటూ ఆ తాటాకు ప్రతిలో రాసి ఉంది. ప్రతిలో వనరాచి చెప్పినట్టే జరుగడంతో స్నేహిల్ గుండెలు అదిరాయి. రుద్ర నిశ్చేష్టుడవడానికి కారణమేంటో స్నేహిల్‌కు అప్పుడు తెలిసొచ్చింది. ఇంతలో శరీరమంతా విషం పాకుతుందని విలవిల్లాడిపోతూ శరత్ స్పృహ కోల్పోయాడు. ఏంచేయాలో ఎవరికీ తోచడంలేదు. రెండు నిమిషాలు ప్రశాంతంగా ఆలోచించిన రుద్రకు కాసేపటి క్రితం మబ్బులు కమ్ముకొని జల్లులు కురిసిన విషయం గుర్తొచ్చింది. దీంతో అక్కడే ఓ డొప్పలో ఉన్న కాస్త నీటిని తీసుకొచ్చి శరత్ గాయంపై పోశాడు. ఆశ్చర్యం.. కాసేపటికే శరత్‌కు మెలకువ వచ్చింది. అంతా కాస్త తెరిపినపడ్డారు. ‘సార్.. ఇక ఆటలు చాలు. మనం వెళ్ళిపోదాం. ఈ వనరాచి శక్తి మామూలుగా లేదు’ అంటూ వణుకుతున్న గొంతుతో రామస్వామి అనగానే.. జయ, స్నేహిల్, శరత్, శివుడు, ఇతర పోలీసు సిబ్బంది దానికి వంత పాడారు. ‘బాబాయ్.. జ్వాలా తటాకం మాయేంటో? మన బాటిల్స్‌లోని నీళ్లు మంటగా ఎలా మారాయో నాకు తెలుసు’ అంటూ అసలు విషయాన్ని రుద్ర చెప్పాడో లేదో.. అప్పటికప్పుడు విసురుగా రుద్ర ముందుకు వచ్చిన మరో తాటాకు ప్రతిలో ఇలా రాసి ఉంది. ‘ఒరేయ్ పిచ్చోడా.. జ్వాలా తటాకం శక్తిని సైన్స్‌కు ముడి పెడదామనుకొన్నావా? అసలు నిజానికి అక్కడ ఇప్పుడు చెరువు ఉంటే కదరా??’ అంటూ వనరాచి రక్తాక్షరాలతో రాసింది. అది చదివిన రుద్ర అండ్ కో.. పరుగు పరుగున జ్వాలా తటాకం దగ్గరికి వెళ్లారు. ఆశ్చర్యం. అప్పటివరకూ నీటితో కళకళలాడిన ఆ ప్రాంతం తెల్లని ఇసుకతో ఓ మైదానంలా ఉండటాన్ని చూసి అంతా షాకయ్యారు. ‘ఇదీ నా శక్తి..’ అంటూ వనరాచి మరో ప్రతిని రుద్ర ముఖంపై విసిరేసింది. అది పక్కనబెడితే, బాటిల్లో మంటలు రావడానికి? జ్వాలా తటాకం నిప్పులు కురిపించడానికి రుద్ర ఏ కారణాలను చెప్పి ఉంటాడో కనిపెట్టారా??
సమాధానం : ప్రకృతిలో నీరు, నిప్పు విరుద్ధ స్వభావాలను కలిగి ఉంటాయి. అయితే, సోడియమ్ రసాయనాన్ని నీటిలో వేస్తే, నిప్పులు చిమ్ముతూ మంటలు వస్తాయి. ఇది తెలిసిన రుద్ర.. కారులోని తమ బాటిల్స్‌లో ఎవరో సోడియమ్‌ను వేసి ఉంటారని అనుమానించాడు. 100 గ్రాముల సోడియమ్‌ను చెరువు నీటిలో పడేసినా.. పెద్దయెత్తున పేలుడుతో మంటలు ఉబికివస్తాయి. జ్వాలా తటాకంలోనూ ఇదే రహస్యం దాగి ఉందని రుద్ర అందరికీ వివరించాడు. అయితే, అసలు ఆ జ్వాలా తటాకమే ఇప్పుడు లేదని తెలియడంతో రుద్ర సహా అందరూ షాకయ్యారు.