‘సొంత లాభం కొంత మానుకొని పొరుగువారికి పాటుపడవోయ్’ అన్నది గురజాడ మాట. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాకు చెందిన నకుల్ దత్తా ఈ మాటలకు ఉదాహరణలా కనిపిస్తాడు. ఎవరూ పట్టించుకోని తన పొరుగువారికి నేనున్నా అంటూ ఆయన అండగా నిలుస్తున్నాడు. ఈ సేవాభావానికి నేపథ్యం కొవిడ్ మహమ్మారి కావడం గమనార్హం. నాలుగేండ్ల కింద లాక్డౌన్ సమయంలో తన పొరుగున ఉండే ఒకాయన ఏదో వ్యాధితో బాధపడుతున్నాడు. కరోనా భయంతో ఎవరూ ఆయనను పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. కానీ, నకుల్ మాత్రం ‘ఎవరేమైతే నాకెందుకు…’ అనుకోలేదు. ఆ రోగిని దవాఖానలో చేర్పించాడు.
ప్రాణాలు కాపాడాడు. ఇక ఇబ్బందుల్లో ఉన్నవాళ్లు, స్తోమత లేనివాళ్లకు సాయం చేయడం కోసం నకుల్ 2013 నుంచి డండం మండలి అనే ప్రభుత్వేతర సంస్థ (ఎన్జీవో)ను నిర్వహిస్తున్నాడు. అవసరంలో ఆదుకున్నప్పుడే సమాజంలో ఒకరిపట్ల మరొకరికి నమ్మకం ఏర్పడుతుంది. అందుకే… “లాక్డౌన్ సమయంలో, మేం పేదలు, నిర్భాగ్యులైన పిల్లలకు ఆహారం సరఫరా చేశాం. అవసరమైన వారికి మందులు పంపిణీ చేశాం. డండంలోని వివిధ ప్రాంతాల కొవిడ్ రోగులను దవాఖానలకు చేరవేయడానికి దాదాపు 200 అంబులెన్సులను అందుబాటులో ఉంచాం” అని తన సేవాభావాన్ని నకుల్ వివరిస్తాడు. పదేండ్ల కింద మొదలైన నకుల్ సేవా ప్రస్థానం ఇప్పుడు ఓ స్థాయికి వచ్చింది. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం కోసం నకుల్కు వివిధ రంగాల వాళ్లు తమవంతు సాయం అందిస్తున్నారు.
కొంతమంది వృద్ధులు పిల్లలు పట్టించుకోకపోవడంతో ఒంటరిగా ఇండ్లలో మగ్గాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇలాంటివారికి నకుల్ బృందం తగిన సాయం చేస్తుండటం విశేషం. కోల్కతా ఎయిర్పోర్టులో గ్రూప్ డి ఉద్యోగిగా నకుల్ పనిచేస్తున్నాడు. 1962లో జన్మించిన నకుల్ చిన్నప్పటి నుంచే ఇతరుల బాధల పట్ల సానుభూతితో ఉండేవాడు. బడి రోజుల నుంచే అవసరమైన వారికి ఏదో ఒక సాయం చేయడం అలవాటు చేసుకున్నాడు. తన తల్లిదండ్రుల నుంచే తనకు బాల్యంలోనే సేవాభావం అలవడిందని చెబుతాడు నకుల్. కొవిడ్ 19 మహమ్మారి అనుభవాలను దృష్టిలో ఉంచుకున్న నకుల్ ఎన్ని కష్టాలు ఎదురైనా సరే తన సేవా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయని హామీ ఇస్తున్నాడు.
– కడలి ఒడిలో అవని